ఆముద ప్రమిద దీపాలు. ఎక్కడో తప్ప కిరసనాయిలు లాంతర్లు ఉండేవి కావు.
అన్నీ మనుషులు కాని, జంతువులు కాని కష్టించి చేయవలసిన పనులే. 'మర' పేరు తెలియదు.
మేరు బసవయ్య ఊళ్లోకి సింగర్ మిషను తెచ్చాడు. అదొక పెద్ద వింత! ఊళ్లకు ఊళ్లు వచ్చి చూచారు. నేనూ, మా అన్నయ్య గంటల తరబడి నుంచోని చూచాం. అదొక వింత అనుభూతి! ఇలా తొక్కగానే చక్రం తిరుగుతుంది. లయబద్ధ ధ్వని, బట్టను కుట్టడం. బహుశః ఇప్పుడు చంద్రుని మీద దిగినా అలాంటి అనుభూతి రాదు.
ముల్కరాజ్ ఆనంద్ అనే మహా రచయిత - ఊరికి కుట్టుమిషన్ రావడం - ఊళ్లో సంచలనం, గురించి ఒక మంచి కథ ఆంగ్లంలో వ్రాశాడు.
`వినోదాలకు సంబంధించినంతవరకు వ్యక్తిగా టిక్కెట్టు కొనడం తెలియదు. తోలు బొమ్మలాట - వీధి భాగవతం - పగటివేషాలు - హరికథ - బుర్రకథ వంటివి అన్నీ ఎవరో చెప్పిస్తారు. అంతా వింటారు.
ఊళ్లో రామాలయం ఉంది. ఉత్సవాలు - ఊరేగింపులు - జాతరలు - ముత్తాలమ్మకు బోనాలు - పురాణాలు - సంగీత కచ్చేరీలు - ఇవన్నీ భక్తిపరములయిన ఉచిత వినోదాలు.
పండుగలు కూడా వినోదాలే. నా నవలలు అన్నింటిలో ఒక్కొక్కదానిలో ఒక్కొక్క పండుగను గురించి వ్రాశాను.
వీటన్నింటిపై మహాభూతం దొర! అతని దయాధర్మాలమీద ఊరు బతుకుతుంది. సంపద - అధికారం - రెండూ కలిస్తే ఇక పట్టపగ్గాలు ఉండవు.
భూస్వామ్య విధానపు ప్రథమ లక్షణం ఏమంటే - ప్రజలు దొరను తమ ప్రభువుగా గుర్తించడం. వాస్తవంగా దొరలకు శాసన ప్రకారం ఎలాంటి అధికారాలూ లేవు. పట్వారి అంటే కారణానికి ఉన్నాయి. అయినా దొరపెత్తనమే చెల్లుతుంది.
దొరతనపు ముఖ్య లక్షణం ఊళ్లో ఉన్న మంచి వస్తువులన్నీ గడీలోనే ఉండాలి. బయట ఉంటే గడీలో తెచ్చిపెట్టుకోవాలె.
తెలంగాణా పల్లెలో దొరపోలిక పిల్లలు ఉండేవారు. అందుకోసామెత ఏమంటే "దొరకు పుట్టినోడు దొరికాడు. దొర్సానికి పుట్టినోడు దొర."
ఆడ బాపలనేది ఒక దుర్భరం అయిన ఆచారం! తరతరాలుగా వారు వేశ్యల అన్న హీనం అయిన జీవితం గడుపుతారు. దొర బంధువుల గదుల్లోకి పోవాలి. వారి కామ తృష్ణను తీర్చాలి. ఈ అమానుషం అయిన వ్యవస్థను తెలుగుసాహిత్యంలో తొలిసారిగా నా "చిల్లర దేవుళ్లు" నవలలో చిత్రించాను. నేను కల్పించిన పాత్ర నాకు గర్వం కలిగేంతగా ఎదుగుతుంది! రచయితకు అంతకంటె పరమానందం ఏముంటుంది? వనజ కల్పిత పాత్ర! అయినా, ముద్దొస్తుంది నాకు. అంత అందంగా నేను వనజను చెక్కాను.
"జోనతర్వేతో పత్థర్ థే - జో తర్వేతో ఖుదా బన్ బైదే"
తరచుకున్న రాళ్లు - తరచిన దేవుళ్లు!
వనజ మస్తిష్కంలో ప్రభవించడానికి స్ఫూర్తినిచ్చిన ఒక ఉదంతం వివరిస్తాను.
నేను చిన్నవాణ్ణి. బహుశా నాలుగేళ్లుంటాయి. గూడూరులో మా ఇంటి పక్కన "అమృతపాణి" అని ఆడబాప ఉండేది. ఆమె చాల అందమైంది. స్త్రీలు మోహించేంత అందం ఆమెది. ఆమె చేతి మీద "అమృతపాణి" అని పచ్చపొడుపు ఉండేది. ఆమెకు ఒక కూతురు. పేరు పిచ్చి. చింతచెట్టు కింద మాతో ఆడుకోవడానికి వచ్చేది. అమాంతంగా మానేసింది. అంతగా పట్టించుకోలేదు. అమృతపాణిని - అమృతవాణిగా "జనపదం"లో పాత్రను చేశాను.
ఒకనాడు చింతకింద ఆడుకుంటున్నాం. దొర మనుషులు వచ్చారు. మేము ఆటలు మానాం. నిలుచున్నాం. చూచాం.
దొరమనుషులు అమృతపాణి ఇంట్లో చొరపడ్డారు. వారిని చూచి పిచ్చి ఉరుకుతున్నది. అమృతపాణి బ్రతిమాలుతున్నది. పిచ్చి వినడం లేదు. తుదకు దొర దొర మనుషులు పిచ్చిని పట్టుకున్నారు. కాళ్లు చేతులు పట్టుకొని గుంజుకొని వచ్చారు. పిచ్చిని కాళ్లు చేతులు పట్టుకొని గడీలోనికి తీసికెళ్తున్నారు.
నా చిన్న మనసుకు ఏదో అన్యాయం జరుగుతున్నదని అనిపించింది. "దౌర్జన్యం" అనే పదం అప్పటికి తెలియదు. నేనూ పిచ్చిని లాక్కుపోయే మనుషుల వెంట వంటరిగా వెళ్ళాను. అందరూ చూస్తున్నారు ఒక్కడూ కదల్లేదు. నేను గడీదాకా వెళ్లాను. ఇంకా పిచ్చి గుంజుకుంటున్నది. ఏడుస్తున్నది.
పిచ్చిని గడీ గేట్లోకి తీసికెళ్ళారు.
గడీగేటు మూసివేశారు.
నేను వంటరిగా అక్కడ నుంచున్నాను. కాస్తసేపు ఉన్నాను. ఆశక్తుడను అయినట్లు తిరిగి వచ్చాను.
ఒకనాడు గడీకి వెళ్ళాను. దొర్సానికి పిల్లలు లేరు. నేనంటే ఇష్టపడేది. అప్పుడప్పుడూ వెళ్లేవాణ్ణి. పండ్లు మాత్రం తినేవాణ్ణి. ఇంకేం పెట్టినా 'కులం చెడుతుంది 'అనేవాణ్ణి. నా నోట ఆ మాట ముద్దుగా ఉండేది ఆమెకు. అందుకోసం ఏదో పెడ్తానంటుండేది.
ఆరోజు గడీముందే భయంకరం అయిన దృశ్యం కనిపించింది. ఒకణ్ణి గొలుసులకు కట్టారు. దొర అరుగు మీదినుంచి పురమాయిస్తున్నాడు. మనుషులు కొడ్తున్నారు. వాడు దెబ్బలకు తాళలేకపోతున్నాడు. మొత్తుకుంటున్నాడు. రక్తం కూడా వస్తున్నది.
మళ్లీ అది అన్యాయం అనిపించింది.
దొర నన్ను పిలిచాడు, లోపలికి రమ్మని.
నేను వెనక్కు తిరిగి మా ఇంట్లో పడేదాకా పరిగెత్తాను.
ఇదే నా "చిల్లరదేవుళ్లు" నవలలో పేరిగాని ఉదంతం అయింది.
దొరల దౌర్జన్యాలు, ప్రజల పోరాటాలు ఇతివృత్తంగానే "చిల్లరదేవుళ్లు" మోదుగుపూలు" "జనపదం" నవలలు వ్రాశాను.
చిన్నగూడూరు దొర రామరెడ్డిని సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కాల్చి చంపారు.
నా బాల్యంలోనే బ్రిటిషిండియాలో పరిశ్రమలు మొదలయినాయి. పల్లెలనుంచి వలసపోవడం ప్రారంభం అయింది. చిన్నగూడూరునుంచి ఒకటి రెండు పద్మశాలి కుటుంబాలు షోలాపూర్ వెళ్లిపోయాయి.
మేము కూడా చిన్ననాటి చిన్నగూడూరు వదిలే పరిస్థితి వచ్చింది.
మా నాయనగారి సంపాదన గూడూరులో లేదు. ఉన్నపొలం సాగు చేయడం చేతకాదు. వారు పురాణాలు - కాలక్షేపాలు చెప్పి ఆచార్యత్వంగా అర్జించేవారు. గూడూరు నుంచి ప్రయాణ సౌకర్యం లేదు. బండ్లు కట్టుకొని మానుకోటకు రైలుకు వెళ్లాలి. అది వారికి కొంత ఇబ్బంది కలిగించింది.
మా అన్నయ్యకు గూడూరు చదువు అయిపోవచ్చింది. అప్పటికి మా కులం వాళ్లతో సంప్రదాయ విద్యలోనే ఉన్నారు. కాని మనాయన కాలగమనం కనిపెట్టినట్టున్నారు. మా అన్నయ్యకు "మ్లేచ్ఛవిద్య" చెప్పించడానికి నిర్ణయించారు.
ఈ సమయంలో మా తాతలకు, నాయనకు ఘర్షణ జరిగినట్లున్నది. మా నాయన మా మాతామహులు భట్టరాచార్యుల వారిని బహిష్కరించారు.
మాతామహులకు మా అమ్మ వేంకటమ్మ పుట్టగానే భార్యా వియోగం జరిగింది. తరువాత సీతమ్మగారు మా అమ్మమ్మ అయింది. ఆమెకు సంతానం లేదు. మేమంటే ఎంతో ప్రేమగా చూచేది. ఒకప్పుడు మా అన్నయ్యను పెంపుడు తీసుకోవడానికి కూడా ప్రతిపాదించారు. ఎందుకో తెలియదు. బద్ధవైరం ఏర్పడింది.
మా అన్నయ్యా, నేనూ అమ్మమ్మ ఇంట ముందుపడి ఏడ్చేవాళ్లం. మా తాతయ్య, అమ్మమ్మ లోపల ఏడ్చేవారు. మా నాయన భయానికి తలుపు తీసేవారుకాదు. మా నాయన మా ఇద్దరినీ లాక్కుపోయేవాడు.
బహుశా ఊరు మండడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
మా తాతలు ఇద్దరూ బావ - బావమరదులు - వారు సఖ్యంగా ఉండేవారు. తనవాళ్లకోసం లక్ష్మణాచార్యులవారు మద్రాసు వదలి వచ్చారు. వారికి గూడూరు వదలడం ఇష్టంలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకులకు ఘర్షణ. మా నాయనమ్మ కొడుకు పక్షం. మా అమ్మను అడగడం లేదు సరే తల్లిగారింటికీ పోనియ్యడం లేదు!
లక్ష్మణాచార్యులవారు వృద్ధులు అయినారు. కొడుకు మీద ఆధారపడవలసిన దశకు చేరుకున్నారు. వారిమాటకు విలువలేకుండా పోయింది! తాను కొడుకు కోసం చేసినవన్నీ ఏకరువుపెట్టవలసి వచ్చింది. ఇది దయనీతిస్థితి!
అయినా, మా తండ్రిగారు గూడూరు వదలడానికి నిశ్చయించుకున్నారు. ఖమ్మం చేరాలనుకున్నారు.
చిన్నగూడూరుకు వీడ్కోలు చెప్పేరోజు రానేవచ్చింది.
మా నాయన్ను రక్షించుకోవడానికి తరలివచ్చిన ఊరు, మా నాయనను కాపాడిన ఊరు, మా తాతయ్యకు గ్రాసవాసములు సమకూర్చిన ఊరు, వారికి అనేక అనుబంధాలు పెనవేసిన ఊరు, మా అమ్మకూ నాయనకూ పెళ్లి జరిగిన ఊరు, మా నాయనను మద్రాసు పంపి విద్వాంసుని చేసిన ఊరు, మా నాయనమ్మ తల్లిగారి ఊరు, మా అమ్మ పుట్టిన ఊరు, మా అన్నయ్యా, నేనూ పుట్టిన ఊరు, మా బంగారు బాల్యం కొంత గడచిన ఊరు, మా అమ్మమ్మగారి ఊరు, ముత్తాలమ్మకుంటలో తామరల ఊరు, మా నర్సిగాని ఊరు, మా సీత ఊరు, నా బాల్యపు చందమామలోని పొన్నచెట్టు కింద ఆడుకున్న ఊరు, కంటికి దూరం దూరం కానున్నది. మనసులో కాపురం పెట్టింది. కదలనంటున్నది.