యస్య నిః శ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
పవమాన కాండ
అయిదవ అధ్యాయము
మొదటి ఖండము
ఋషులు : 1,4. అమహీయుడు. 2. మధుచ్చందుడు. 3. భృగుర్వారణి. 5. త్రితుడు. 6. కశ్యపుడు. 7. జమదగ్ని. 8. దృఢచ్యుతి. 9. అసిత, దేవలలు. 10. కవిర్మేధావి.
1. సోమమా! నీ యొక్క రాసపు జన్మ ఉన్నతము. నీవు ద్యులోకమున విరాజిల్లు దానవు. ప్రభావశాలివి. అన్నవంతవు. సుఖవంతవు. భూమి మీద ఉన్న మేము నిన్ను పొందుచున్నాము.
2. సోమమా! నీవు ఇంద్రుని పానమునకు గాను సముపార్జించబడినావు. రుచికర, హర్షదాయక ధారగా స్రవింపుము.
3. సోమమా! నీవు వరములిచ్చుదానవు. ధారలుగా కలశమున చేరుము. మరుత్వంతుడగు ఇంద్రుని కొరకు సకల బలకారివి అగుచు మదకారివి అగుము.
4. సోమమా! నీ యొక్క రసము దేవతలను వర్ధిల్ల చేయునది. రాక్షసులను నాశము చేయునది. పరమ శ్రేష్టము. ఆనందదాయకము. నీవు సాదరముగ కలశమున చేరుము.
5. ఋత్విజులు మువ్విధస్తుతులు ఉచ్చరింతురు. పాడియావులు పాలిచ్చుటకు అంబారావములు చేయును. హరిత సోమము శబ్దాయమానమై కలశమున చేరును.
6. సోమమా! నీవు మధురతమావు. పూజనీయమగు యజ్ఞ స్థానమునకు ఇంద్రుడు విచ్చేయనున్నాడు. నీవు కలశమున ప్రవేశించుము.
7. సోమము పర్వతమున పుట్టినది. ఆనందము కొరకు తేబడినది. నీటిలో పెరిగినది. శ్యేనము గూటికి వలె తన స్థానమగు కలశమునకు చేరుచున్నది.
8. పాపహారి! బలవర్ధక మాదక సోమమా! ఇంద్రాదులు, మరుత్తుల కొరకు కలశమున నిండుము.
9. సోమమా! నీవు పర్వతమున పుట్టినావు. పరిశుద్ద పాత్రలందు నిండినావు. స్తోతల సమస్త కోరికలు తీర్చుచున్నావు.
10. అభ్యుదయము కలిగించు సోమము అభిషవణ ఫలకముల మీద నిలిచి స్వర్గ ప్రియులై, స్వర్గమునకు సాగువారికి లభించుచున్నది.
(సోమరసము తీయుటకు ఉపయోగ పడు ఫలకములు అభిషవఫలకములు.)
రెండవ ఖండము
ఋషులు :- 1. శ్యావాశ్వుడు 2. త్రితుడు. 3,8, అమహీయుడు. 4. భ్రుగువు. 5,6. కశ్యపుడు. 7. నిద్రువి. 9,10. కాశ్యప అసితుడు.
1. సోమము ఆనందము రాల్చునది. అభిషుతమగును. హవివంతులమగు మా యజ్ఞమునాకు చేరును. మాకు కీర్తి కరమగుచు పాత్రలందు ప్రవేశించును.
2. సోమము బుద్దిని వర్ధిల్ల చేయును. జలతరంగముల వంటి సోమము పశువులు అరణ్యమునకు వలె పాత్రలందు చేరును.
3. అభిషుత సోమము కోరికలు తీర్చునది అగును. ధారలుగా పాత్రలకు చేరును. అది మాకు లోకమున కీర్తి కలిగించునుగాత. మా శత్రువులను నాశము చేయును గాత.
4. సోమమా! నీవు వరములిచ్చుదానవు. పావనము చేయుదానవు. సర్వద్రష్టవు. తేజోమయవు. నిన్ను ఆహ్వానించుచున్నాము. "త్వాహవామహే"
5. చైతన్యవంతమును, ప్రియమును అగు సోమము ఋత్విజుల మంత్రములకు రథమునులాగు అశ్వముల వలె పాత్రలకు స్రవించును.
6. బలవంతము, వేగవంతమును అగు సోమమును ఋత్విజులు గోవులు, అశ్వములు, పుత్రుల కొరకు ఏర్పరతురు.
7. సోమమా! నీవు ప్రకాశవంతమవు. ధారగా పాత్రలకు చేరుము. ఆనంద రసమవై ఇంద్రుని చేరుము. ధారా రూపమువై వాయువును చేరుము.
8. పవమానము బృహత్తరమగు వైశ్వానర జ్యోతిని ఆకాశము నందు విచిత్రమగు వజ్రముగా సృష్టించినది.
9. అభిషుతమై, దీప్తమై, స్తుతియుక్తమగు సోమము మాదకమై దశాపవిత్రమునుండి రాలుచున్నది.
(జల్లించు లేక వడకట్టు ఉపకరణము దశాపవిత్రము.)
10. బుద్ది వర్దనమగు సోమము స్తోతలచే స్తుతించబడుచు సాగర తరంగముల వలె పాత్రలందు ప్రవేశించుచున్నది.
మూడవ ఖండము
ఋషులు :- 1,2,8,9. అమహీయుడు. 3. జమదగ్ని. 4. ప్రభూవసుడు. 5. మేధ్యాతిథి. 6,7. నిధ్రువి. 10. ఉక్ధ్యుడు.
1. సుజాతము జల ప్రేరకము, శత్రు నాశనము, గోఘ్రుతాది మిశ్రితమగు సోమము దేవతలకు లభించును.
2. సోమము ద్రష్ట అది సకల శత్రువులపై దండెత్తును. ఆ మేధావి సోమమును శుద్ది చేసి అలంకరింతురు.
3. అభిషుతమై, కలశమున ప్రవేశించిన సోమము సకల సంపదలను వర్షించునదై ఇంద్రుని కొరకు స్థాపించబడును.
4. అభిషవ ఫలకముల మీద పిండబడిన సోమము పవిత్రమై యజ్ఞమునందు విడువబడిన రథాశ్వము వలె, యజ్ఞమును యుద్దమును వలె ఆక్రమించును.
5. త్వరపడునదియు, ప్రకాశవంతమును, గమన శీలమును అగు సోమము చీకట్లను ధ్వంసము చేయుచు గోవులు గోష్టమునకు వలె యజ్ఞమందు ప్రవేశించుచున్నది.
6. బలవర్ధక సోమమా! శత్రువులను హతమార్చుచు, మాకు జ్ఞానము ప్రసాదించుచు పాత్రలందు నిండుచున్న నీవు దేవతలను నమ్మనివారిని దూరము చేయుము.
7. మానవ హితకారిణి, జలప్రేరకవగు నీవు ఏధారతో సూర్యుని ప్రకాశింపచేసినావో - ఆ ధారతో ఈ పాత్రయందు ప్రవేశించుము.
8. మహా జలములను బంధించిన వృత్రాసురుని వధించిన ఇంద్రుని రక్షించిన నీవు ధారగా ఈ పాత్రయందు నిండుము.
9. సోమమా! నీ రసమును సేవించిన ఇంద్రుడు శంబరుని తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేసినాడు. అట్టి నీవు ఇంద్రార్ధము ఈ కలశమున రాలుము.
10. సోమము దీప్తము. దాత. అది మాకు సర్వ ప్రకార దానములను, బలములను అన్నములను ఇచ్చునుగాత. అభిషుతమై సకల దిశలనుండి పాత్రలందు వర్షించును గాత.
నాలుగవ ఖండము
ఋషులు :- 1. మేధ్యాతిథి. 2,7. భ్రుగువు. 3. ఉచథ్యుడు. 4. అవత్సారుడు. 5,6. నిధ్రువి. 8,9. కశ్యపుడు. 10. అసితుడు. 11. కవి. 12. జమదగ్ని. 13. అయాస్యుడు. 14. అమహీయుడు.
1. సోమము వర్షిణి. హరిత వర్ణ పూజ్య. మిత్రసమ. దర్శనీయం. అది సూర్య సమ తేజమున ద్యులోకమున వెలుగుచున్నది.
2. సోమమా! నీవు సుఖ ప్రధావు. ధనదాతవు. శత్రు నాశకమవు. అనేక జనాభిలాషివి. ఈ యజ్ఞమున నీ బలమును ఆరాధించుచున్నాము.
3. అధ్వర్యులారా! రాళ్ళతో దంచి సోమ రసము తీయండి. కలశమున నింపండి. ఇంద్రుని కొరకు దానిని పవిత్రము చేయండి.
4. అభిషుత సోమ ధారలు ఇంద్రునకు ఉత్సాహము కలిగించును. పాపములను ప్రక్షాళనము చేయును. ఊర్ధ్వ దిశకు చేరును.
5. సోమమా! సహస్ర సంఖ్యాక ధనములను మా ముందు కురిపింపుము. మమ్ము అన్నములందు స్థాపించుము.
6. ప్రాచీనములు, గమన శీలములగు సోమములు నవీన స్థానములను ఆక్రమించినవి. అవి సూర్యుని వంటి తేజస్సులను సృష్టించినవి.
7. సోమమా! దీప్తివంతవమగుము. చప్పుడు చేయుచు కలశమున పడుము. యజ్ఞ ప్రదేశమున తొలుత నిలుచుటకు విచ్చేయుము.
8. వరములిచ్చుసోమమా! దీప్తివంతమగుము. దివ్యసోమమా! నీవు వర్షము కలిగించు వ్రతము కలదానవు. వరద సోమమా! దేవతలకు, మానవులకు హితకరములగు పనులు చేయుము.
9. సోమమా! ఋత్విజులచే శుద్ది చేయబడుము. అన్నము కలిగించుటకు ధారగా కలశమునకు విచ్చేయుము. రుచికర పదార్ధములనిచ్చు గోవులను ప్రసాదించుము.
10. సోమమా! నీవు కోరికలు తీర్చుదానవు. మేము దైవభక్తులము. మమ్ము రక్షించుము. బలము కలిగించు నీవు ఆనందదాయనివై స్రవించుము.
11. సోమమా! నీవు నీ సత్కార్యముల వలన పూజనీయవు అయినావు. దేవతలను ప్రసన్నము చేయుము వాన చప్పుడు చేయుము.