Previous Page Next Page 
సంకల్పం పేజి 14

  

        "అలాంటివాడు నాతో ఎందుకు ఛాలెంజ్ చేశాడు? మనిషిలో గర్వం వుండొచ్చు. టాలెంట్ వుండొచ్చు. అతిశయం వుండొచ్చు అపారమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వుండొచ్చు. కానీ నాలాంటి వాడితో మాట్లాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నువ్వు చెప్పి పంపించాల్సిందిగా" ఆయన మాటల్లో వ్యక్తమైన కోపాన్ని గమనించింది లిఖిత.
   
    "అతను ఛాలెంజ్ చెయ్యలేదు..... మీరే అతని చేత ఛాలెంజ్ చేయించారు" విసురుగా అంది లిఖిత.
   
    "నో ఫరదర్ డిస్కషన్స్..... ఆస్క్ హిమ్ టు కమ్ బాక్..... ఓ.కె. ఆర్యూ హేపీ నౌ..." చేతి గడియారం చూసుకుంటూ అన్నాడాయన.
   
    ఒకసారి ఆర్గనైజేషన్ లోంచి బయటకు వెళ్ళిపోయిన వాణ్ణిగాని, బయటకు పంపించేసిన వాణ్ణిగానీ, మళ్ళీ లోనికి రమ్మని పిలవడం జింఖానా చరిత్రలో లేదు. కూతురు కోసం చిన్న సడలింపు చేశాడాయన.
       
    "అయామ్ నాట్ హేపీ..." చిన్నబుచ్చుకుంటూ అంది లిఖిత.
       
    భానోజీరావు మాట్లాడలేదు.
   
    లేచి, ఆ ఛాంబర్ లోంచి గబగబా బయటికొచ్చేసింది.
   
    లిఖితకు కోపం ఎంత త్వరగా వస్తుందో, అంత త్వరగా పోతుందన్న విషయం తండ్రిగా భానోజీరావుకి తెల్సు.
   
    ఆ రోజు రాత్రి డైనింగ్ టేబిల్ దగ్గర కూడా తండ్రితో మాట్లాడలేదు లిఖిత.
   
    కానీ -
   
    చాలా చిన్న విషయంగా తీసుకున్న ఈ సంఘటన భవిష్యత్తులో ఒక చరిత్రకు నాందీ గీతం పలుకుతుందని భానోజీరావుకు తెలీదు!
   
    లిఖిత, ఆ సృష్టించబోయే చరిత్రకు కేంద్ర బిందువవుతుందని తెలీదు.       
    భానోజీరావుకి సరిగ్గా రాత్రి తొమ్మిదిగంటలకు నిద్రపోవడం అలవాటు.
   
    బెడ్ మీద పడుకొంటున్న సమయంలో అతనికెందుకో వికాస్ జ్ఞాపకానికొచ్చాడు.
   
                                    *    *    *    *    *
   
    చాపమీద దొర్లుతున్నాడు వికాస్. రాత్రి రెండు గంటలైంది. నిద్ర పట్టటం లేదు.
       
    అతనికెందుకో భానోజీరావు గుర్తుకొచ్చారు. ఆయనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి.
   
    లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు.
   
    మోటార్ ఇండస్ట్రీలో విశ్వవిజేత హోండా..... హోండా ఆటోబయోగ్రఫీ కనిపించింది. ఎన్నిసార్లు చదివినా క్రొత్తగా అనిపించే సువర్ణ లిఖిత జీవిత చరిత్ర.
   
    Soichiro Honda : The man who loved machines.
   
    టోక్యోకి 270 కిలోమీటర్ల దూరంలో వున్న కోమ్యో అనే చిన్న కుగ్రామం అది. సాయిచిరో హోండా తండ్రి కమ్మరి పని చేసేవాడు. దాంతోపాటు పాత సైకిళ్ళను బాగుచేయడం సైడ్ బిజినెస్. సాయిచిరో పుట్టిన వెంటనే చూసింది సైకిల్ చక్రాన్ని - పాత సైకిళ్ళను తండ్రెలా బాగు చేస్తుండేవాడో ఆసక్తిగా గమనించేవాడు చిన్నారి సాయిచిరో స్కూలు నుంచి రాగానే తండ్రికి సైకిల్ రిపేర్ లో సహాయం కూడా చేసేవాడు.
   
    సాయిచిరోకి పదహారో సంవత్సరం వచ్చింది. కొడుకులోని ఉత్సాహాన్ని గమనించిన తండ్రి, టోక్యోలోని ఓ చిన్న ఆటో మోబైల్ షాపులో ఎప్రంటేస్ షిప్ కి చేర్పించాడు. అతి తక్కువ జీతం. ఆరేళ్ళు అలవోకగా గడిచిపోయాయి. ఎలాంటి దాన్నయినా క్షణాల్లో బాగు చేసేయడం హోండాకి అబ్బింది. షాపు యజమాని, హోండాలోని పనితనాన్ని కనిపెట్టాడు.
   
    అంతే....
   
    హోండా స్వంత గ్రామమైన కోమ్యోలో ఆ రిపేరింగ్ షాపు బ్రాంచ్ ఆఫీసు పెట్టడానికి ధనసహాయం చేశాడు. హోండా సారధ్యంలో రిపేరింగ్ షాపు వెలిసింది.
   
    కష్టపడడంలో ఎంత సుఖం వుందో హోండా తెలుసుకుంటున్నాడు. రాత్రింబవళ్ళు యంత్రాల మధ్య యంత్రంలా గడిపాడు. సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు మరమ్మత్తు చేసే హోండా దృష్టి కార్లమీద పడింది- కారుని స్పీడ్ గా నడపడమంటే సరదా హోండాకి. అద్భుతమైన డిజైన్లతో 'రేస్ కార్లను' తయారు చెయ్యడంలో పడ్డాడు హోండా. ఆల్ జపాన్ స్పీడ్ ర్యాలీ'లో కూడా ఉత్సాహంతో పాల్గొన్నాడు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారుని పరుగెత్తించాడు. అదే సమయంలో ఇంకో కారొచ్చి ఢీ కొనడంతో హోండా తీవ్రంగా గాయపడ్డాడు. హోండాకి పూర్తిగా కోలుకోవడానికి పద్దెనిమిది నెలలు పట్టింది.
   
    అప్పట్నించీ భార్య సలహాతో 'రేసింగ్' ఉత్సాహాన్ని ప్రక్కకు పెట్టేసి, కార్ల వ్యాపారం వేపు దృష్టి మరల్చాడు.
   
    ఆటో రిపేరింగ్ షాపులు ఒకటికి రెండయ్యాయి.
   
    ఎన్నాళ్ళీ మరమ్మత్తులతో జీవితం? రిపేరింగ్ షాపులవల్ల ఒకచోటే వుండిపోవడం తప్ప మరేం జరగదు. అదే 'మాన్యుఫాక్చరింగ్' చేబడితే, దూర ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరించడానికి బాగుంటుందనుకున్నాడు.
   
    1937 లో కొంతమంది బంధువులు, స్నేహితుల ఆర్ధిక సహాయంతో 'పిస్టరింగ్' (చిన్న ఇనపగొట్టం) ఫాక్టరీని ప్రారంభించాడు. ఆ చిన్న ఫ్యాక్టరీని పెద్ద ఎత్తున తయారు చెయ్యాలని హోండా తాపత్రయం. ఇరవై నాలుగ్గంటలూ ఫ్యాక్టరీలోనే గడిపేవాడు. ఫ్యాక్టరీలో అలిసిపోయి, నేలమీద నిద్రపోయేవాడు. భార్య చేత భోజనాన్ని అక్కడకు తెప్పించుకునేవాడు.
   
    ఓ రోజు ఓ ఫ్రెండ్ హోండాకి చిన్న సలహా చెప్పాడు.
   
    "ఇప్పటివరకూ నువ్వు నీకు తోచిందేదో చేస్తున్నావు..... కానీ అదే తెలుసుకొని, నేర్చుకొని చేస్తే ఇంకా బాగుంటుంది కదా..." అని అనగానే వెంటనే ఆ స్నేహితుడి సలహాను పాటించాడు హోండా. చుదువుకోవాల్సిన వయసులో ఎప్పుడూ స్కూలుకెళ్ళని హోండా ఒక ప్రక్క వ్యాపారం చేస్తూనే టెక్నాలజీ స్కూలు కెళ్ళేవాడు. అందర్లా నోట్స్ రాసుకోలేక పోయినా, హోండాకి స్కూల్లో చెప్పినవన్నీ జ్ఞాపకం వుండేవి. కానీ ఏ ఒక్క పరీక్షకూ వెళ్ళేవాడు కాడు. ఓ రోజు స్కూలు హెడ్మాష్టర్ పిల్చి "పరీక్షలు రాయకపోతే డిప్లమో రాదని" చెప్పాడు.
   
    అయితే ఏం? డిప్లమో నాకేం అవసరం లేదనుకున్నాడు హోండా.
   
    "ఒక సినిమా టిక్కెట్ చేతిలో వుంటే మూడు గంటలు సిన్మా హాల్లో కూర్చునే అవకాశం వుంది. కానీ ఒక డిప్లమో చేతిలో వుంటే ఉద్యోగం వచ్చే అవకాశం మాత్రం లేదు...." అని అంటున్నా ఆ టెక్నాలజీ చదువులు చదివే వాళ్ళని మాత్రం గౌరవించేవాడు హోండా!
   
    శాస్త్రీయంగా పిస్టిన్ రంగుల్ని వుత్పత్తి చెయ్యడం ప్రారంభించాడు. రెండేళ్ళు తిరిగేసరికి జపాన్లో నెంబర్ వన్ ఆటో తయారీ సంస్థ 'టయోటా' కంపెనీకి 'పిస్టన్ రంగుల్ని' సరఫరా చేసే కాంట్రాక్ట్ లభించింది.
   
    కాగా రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన సంమయంలో బాంబుల దాడికి హోండా పిస్టన్ ఫ్యాక్టరీ ధ్వంసమైపోయింది. ఆ తర్వాత విధి కూడా వెక్కిరించింది హోండాని. భూకంపానికి గురై వున్న వ్యాపారం కూడా మట్టిలో కలిసి పోయింది.
   
    అయినా చలించలేదు హోండా. సర్వశక్తుల్నీ కేంద్రీకరించాడు.
   
    1946లో హోండా టెక్నికాల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ని ప్రారంభించాడు. రెండేళ్ళలోనే అది ఎదిగిపోయింది. ఇంజన్లను వుత్పత్తి చేసే స్థాయి కొచ్చింది. మరో రెండేళ్ళకు హోండా ఇన్ స్టిట్యూట్ హోండా మోటార్ కంపెనీగా మారింది. ఇవాళ హోండా కంపెనీ సాధించిన విజయం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కన్పిస్తుంది.
   
    ఒక వ్యక్తిలోని సజీవమైన శక్తికి అపురూప నిదర్శనం హోండా. చదవడం ఆపాడు వికాస్.
   
    చాలా థ్రిల్లింగ్ గా వుంది అతనికి.
   
    అత్తా మీదున్న హోండా ఫోటోని చూశాడు.
   
    ఆలోచనలు, ఆలోచనలు, ఆలోచనలు. భానోజీరావుతో ఛాలెంజ్ చెయ్యడం ఒకందుకు మంచిదే.
   
    కానీ.... ఎలా? ఎలా? ఎలా?
   
    ఒక్క పైసా లేదు.
   
    సైకిల్ రిపేర్ షాపు పెట్టాలన్నా కనీసం వంద రూపాయలు కావాలి.
   
    ప్రస్తుతం వికాస్...
   
    ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న లక్షలాది మన నిరుద్యోగ యువతకు ప్రతినిధి.
       
    సాహసముంది- చొరవవుంది- లక్ష్యముంది- ఆలోచన వుంది.
   
    కావలసింది కనీస పెట్టుబడి.
   
    గింజుకుంటున్నాడు వికాస్.
   
    అంతలోనే ఉత్సాహం... మరి అంతలోనే వైరాగ్యం.
   
    ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
   
    క్షణాలు నిమిషాలవుతున్నాయి. నిమిషాలు గంటలవుతున్నాయి.   
   
    గంటలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి.
       
    మనిషిని నిలువునా తిని నడుస్తున్న కొండ చిలువలా వుంది ఎంతకూ కదలని ఆ రాత్రి....
   
    ఉక్కిరి బిక్కిరౌతూ...
   
    వికాస్....
   
                                        *    *    *    *    *

 Previous Page Next Page