క్రితంరోజు సాయంత్రం ఆరుగంటల తర్వాత ఒక కుర్రాడు వచ్చి ఏదో అర్జెంట్ ఆఫీస్ ఫైల్ మేడమ్__సార్ ఇమ్మన్నారు అని ఆ బ్రీఫ్ కేసును ఇవ్వగా ఏ మాత్రం ఆలోచించకుండా తను తీసుకోవడం, ఆ విషయం చెప్దామానుకొని ఏవో పనుల్లోపది భర్తతో చెప్పలేకపోవడం అన్నీ గుర్తుకువచ్చి జరిగిన సంఘటనను కోడలికి, కూతురికీ వివరించి నిస్తేజంగా మిగిలిపోయింది శారదాంబ.
అంతా విన్న మయూషకు విషయం అర్ధమైపోయింది.
ఎవరో తన తండ్రిని ప్లాన్డ్ గా ట్రాప్ చేసారు. ఎవరు? ఎందుకు? తన తండ్రికి శత్రువులున్నారంటే నమ్మలేక పోతోందామె.
"దేవుడా! మా నాన్నగారికేమీ కాకుండా కాపాడు" అని ఆ రోజంతా ఎన్నోసార్లు భగవంతుడ్ని ప్రార్ధించింది మయూష.
దాదాపు ఇరవైనాలుగ్గంటల సేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు పీతాంబరం.
ఆ తర్వాత__
ఆయన ప్రమాదంనుంచి క్రమంగా బయటపడ్డాడు.
"ప్రస్తుతానికి ఆయన ప్రాణాలకేం ప్రమాదంలేదు. కానీ వర్రీ అయ్యే విషయాలేవీ ఆయనకు చెప్పకండి" డాక్టర్ చెప్పిన మీదట కొంతలో కొంత రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నారందరూ తండ్రికి ప్రమాదం తప్పిపోయిందని రిలాక్స్డ్ గా ఫీలయిన మయూష తన తండ్రి చుట్టూ పన్నబడిన ట్రాప్ గురించి-దాని వెనుక దాగిన వ్యక్తుల గురించి ఆలోచించటం మొదలు పెట్టింది.
* * * *
పీతాంబరం పనిచేసే సంబంధిత మినిస్టర్ ఛాంబర్ లోంచి బయటకు వచ్చాడు కాళహస్తి శర్మ. ఆ వెనక మయూష వుంది.
"విన్నావ్ గదా ఆ మినిష్టర్ ఏమన్నాడో. సెక్షనంతా నాన్న సిన్సియార్టీని పొగుడుతుంటే మనం వ్యక్తుల్ని కాకుండా చట్టాన్ని కూడా నమ్మాలి. తప్పదని ఆ మినిస్టర్ డొంక తిరుగుడుగా ఎలా మాట్లాడుతున్నాడో చూసావుగా" కోపంగా అన్నాడు కాళహస్తి శర్మ.
"సెక్షన్ వాళ్ళు చెప్పిందాని ప్రకారం ఆ సూర్యారావ్ ని పట్టుకుంటే మనకు అసలు విషయమంతా తెలుస్తుంది" మయూష అంది ఏదో ఆలోచిస్తూ.
"సూర్యారావ్ సెలవ్ పెట్టాడట. అయినా ఇది అతగాడు చేసిన కుట్రకాదు ఎవరో పెద్ద ఎత్తున నాన్నమీద కక్షతో చేయించిన పని అని అందరూ వప్పుకుంటున్నారు"
హీరో హోండా స్టార్ట్ చేసాడు కాళహస్తిశర్మ.
"ముందు తప్పు వప్పుకుంటే కొంత శిక్షయినా తగ్గుతుందంటా డేమిటి లాయరు? అక్కడికేదో నాన్నగారు నిజంగానే తప్పుచేసినట్లు. మన దేశంలో సామాన్యులకు న్యాయస్థానాలు దగ్గిరగానే వుంటాయి. న్యాయమే దూరమై పోతోంది"
"అదే నాకూ అర్ధం కాకుండా వుంది. ఏ ఒక్కరూ ఎక్కడ ఏం జరిగిందో కనీసం చెప్పలేకపోతున్నారు" అన్నాడతను.
"ఇప్పుడు నాన్న పరిస్థితి ఏమిటి?" ఒకింత భయాన్ని వ్యక్తం చేస్తూ అంది మయూష. జైలుచువ్వల వెనక తండ్రిని ఊహించుకుంటుంటే ఆమెకు చాలా బాధగా వుంది.
మూడోరోజు సాయంత్రం అయిదు గంటలకు-
అంతవరకూ పీతాంబరాన్ని కనిపెట్టుకుని ఉన్న శారదాంబ ఆయనకు రాత్రి భోజనం తీసుకురావడానికి కొడుకు కాళహస్తి సాయంతో ఇంటి కెళ్ళింది. తండ్రి పక్కన మయూష మాత్రమే వుంది.
బాధనంతా దిగమింగుకుని ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు.
"టాబ్లెట్లు వేసుకుని నోరంతా అదోలా అయిపోయిందమ్మా. సిగరెట్ కానీ, వక్కపొడి కానీ తెస్తావా?" అడిగాడాయన.
"నువ్విప్పుడు సిగరెట్ తాగడం మంచిదికాదు. వక్కపొడి తెస్తాను సరేనా"
"ఒక్క సిగరెట్ ఆలోచించు" నవ్వుతూ అన్నాడాయన.
తండ్రి ముఖంలో నవ్వుని చూసిన మయూష మనసు కూడా తేలికపడింది.
"ఇప్పుడే వస్తాను" అనుకుంటూ ఆ రూమ్ లోంచి బయటికెళ్ళి లిఫ్ట్ దిగి నర్సింగ్ హోమ్ లోంచి బయటికెళ్ళింది.
రోడ్డుకి కుడివేపుచివర పాన్ షాపు కనిపిస్తే అటువేపు నడుస్తోంది.
సరిగ్గా అదే సమయంలో-
నర్సింగ్ హోమ్ కి ఎదురుగా చాలా సేపటినుంచి పార్క్ చేసి వున్నా మారుతీకారు ఫ్రంట్ డోర్ గ్లాస్ కిందకు దిగింది. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న భుజంగపతి డోర్ తెరచుకుని కిందకు దిగి వడివడిగా నర్సింగ్ హోమ్ మెయిన్ గేట్ కేసి నడిచాడు.
* * * *
డోర్ చప్పుడయితే న్యూస్ పేపర్ చదువుతూన్న పీతాంబరం తల తిప్పి భుజంగాపతిని చూసి షాక్ తిన్నాడు.
"నువ్వా? నువ్వెందుకొచ్చావ్. గెటవుట్ ఫ్రమ్ హియర్" ఒక పక్క ఉద్రేకాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూనే అరవబోయాడు పీతాంబరం.
"నేనెందుకొచ్చానో తెల్సుకాకుండానే అరిస్తే ఎలాగయ్యా సావధానపడు. నేనెందుకొచ్చానో విను. ఇప్పుడు కూడ నువ్వు మొన్నటి లాగా అజాగ్రత్తగా ప్రవర్తించావనుకో శాశ్వతంగా జైలు ఊచలు లెక్క పెడతావ్" సాధ్యమైన నెమ్మదిగా చెప్తూ అతని కెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు భుజంగపతి.
"నువ్వేం మాట్టాడవద్దు. నువ్వు సెక్షన్ లోకి అడుగు పెట్టాకే అరిష్టమంతా జరిగింది. నన్నెవడూ రక్షించాల్సిన అవసరంలేదు. నువ్వు ముందు ఇక్కడనుంచి వెళ్ళిపో" లేచి కూర్చుంటూ అన్నాడు పీతాంబరం.
"వెళ్తానయ్యా! వెళ్ళిపోతాను. నీ రోజులు బాగులేనప్పుడు నేనేం చేస్తాను. ఏదో మా విశ్వమోహనరావు ఫ్రెండ్ వి కదా నీ వల్ల నీ భార్యా పిల్లలు బాధపడకూడదని నేనొస్తే మంచికి అస్సలు ఇవి రోజులు కావయ్యా అసలు ఆ జరిగినదానికి నేను కారణమని నువ్వు అనుకుంటుండొచ్చు. కానే నేనుకాదు. ఆ విషయం నీకు చెప్పి నిన్ను ఈ గొడవ నుంచి తప్పించే మార్గముందని చెప్పడానికే వచ్చాను. తర్వాత నీ యిష్టం."
"నువ్వుకాకపోతే మరెవడు ఆ ఎకౌంటెంట్ ఆ సూర్యారావు అందరూ నే మనుషులు. నీ మనుషుల్తో అస్సలు నేను నీకేం అన్యాయం చేసానయ్యా చెప్పు" పీతాంబరం గొంతు బొంగురుపోయింది.
"పీతాంబరం పిల్లాడిలా ఆలోచించకు. ఎందుకు జరిగిందో, ఏమిటో ఆ తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వు ఈ ఉచ్చు నుండి బయటపడి నీ పరువు ప్రతిష్టల్తో పాటు ఉద్యోగాన్ని కూడా కాపాడుకుంటావా లేదా చెప్పెయ్-వద్దంటే వెళ్ళిపోతాను."
పరువు, ప్రతిష్ట, ఉద్యోగం ఆ మూడుమాటలూ వినబడేసరికి పీతాంబరంలో ఆవేశం తగ్గింది.
"నేను ఈ కేసునుంచి బయటపడగలనంటావా?" ఆ మాటకు మెల్లగా నవ్వాడు భుజంగపతి.
"చిటికెలో బయటపడతావ్. ఒక్క గంటలో నువ్వు ఇంటికెళ్ళి పోతావ్" అని కుర్చీని లాక్కుని గొంతు తగ్గించి "అసలు నీ మీద ఈ కేసును రుద్దడానికి నేను గానీ, ఆ ఎకౌంటెంట్ గానీ, సూర్యారావుగానీ కారణంకాదు. అసలు పెద్దలు వేరే వున్నారు. ఆ పెద్దలెవరో నేను తరువాత చెప్తాను గానీ ఈ కేసునుంచి నిన్ను రక్షిస్తే నాకేమిస్తావ్ చెప్పు?"
"ఎ. సి. బీ వాళ్ళు కేసేమీ లేకుండా నన్ను వదిలేస్తారంటావా" అనుమానంగా అడిగాడు పీతాంబరం.
"నీమీద పెట్టింది నిజమయిన కేసయితే ప్రాబ్లమ్. ఇది ప్రేమస్ కేసు. కావలిస్తే నీ చెవుల్తో నువ్వే విను" అని ఫోన్ వేపు నడిచాడు భుజంగపతి ఏదో నెంబర్ కు డయల్ చేసాడు.