"ఏ.సి.బి. చీఫ్ కివ్వమ్మా" అని చెప్పి రూమ్ లో ఉన్న ఎక్స్ టెన్షన్ ని తీయమని పీతాంబరానికి సంజ్ఞ చేసి అంతలో ముకుందరావు లైన్లోకి రాగానే మాట్లాడడం మొదలుపెట్టాడు భుజంగపతి.
"పాపం ఆ పీతాంబరం అమాయకుడు. అమాయకుడ్ని ఇరికించారు గదయ్యా బాబు. మీ డిపార్ట్ మెంట్ కి తగదయ్యా" అని చనువుగా అన్నాడు భుజంగపతి.
"ఆ పీతాంబరం అమాయకుడని మాకు తెలుసు ఎవరో ట్రాప్ చేశారు మా డ్యూటీ మేం చేశాం ఈ రాజకీయం ఉంది చూసారూ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మీ చేస్తుంది"
"ఆ సూత్రాలూ స్లోగన్లూ మాకు తెల్సుగానీ పీతాంబరం ఈ ఉచ్చు లోంచి బయటపడాలి. దానికి మార్గం చెప్పు"
"నేను చెప్పేదేవిటి? పొలిటికల్ పవర్ ముందు అన్నీ దిగదుడుపే గదా. ఎవరు చెప్తే ఎవరు వింటారో మీకు తెలుసు గదా. నన్నడుగుతారేం. ఒక్క ఫోన్ చేయించండి చాలు. అరగంటలో కేసు విత్ డ్రా చేసుకుంటాం"
"అయితే మీ మాట మీద మీరుండాలి. ఓ.కే. ఉంటాను" ఫోన్ పెట్టేసాడు భుజంగపతి.
"ఇప్పుడు అర్ధమైందా పీతాంబరం"
"నన్ను విడిపించటానికి ఎవరు రికమెండ్ చేస్తారు" ఒక పక్క ఆశ, యింకో పక్క సంశయంతోనూ అడిగాడు పీతాంబరం.
"నా మాట వింటానంటే నేను చేయిస్తాను"
"అంటే?"
"ప్రజలు పొలిటికల్ పార్టీలకు ఒట్లిస్తే ఇండస్ట్రియలిస్టులు నోట్లు ఇస్తారు. ఎందుకూ ఇలాంటి అవసరాల కోసమే కానీ ఇందులో చిన్న లిటిగేషన్ వుంది పీతాంబరం. ఒక రకంగా చూస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. ఆ అదృష్టం ఏంటో తర్వాత చెప్తాను. ముందు విడిపించాలి గదా"
మళ్ళీ ఫోన్ అందుకున్నాడు భుజంగపతి. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసాడు.
"మరో అరగంటలో నిన్ను సగౌరవంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు పోలీసులు. పొరపాటున మీ ఇంటి మీద దాడి చేసామని రేపు పేపర్ లో ప్రకటన ఇస్తారు ఎ సి.బి.వాళ్ళు"
భుజంగపతి చెపుతున్నది అంతా ఓ కలలాగా వుంది పీతాంబరానికి.
"అంతా జరుగుతుందంటారా?" ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగాడాయన.
"జరిగాక చూడు. కానీ ఇదంతా ఒక ఒప్పందం మీద జరుగుతోందని మాత్రం మరిచిపోకు"
"ఛఛ.... ఈ కేసు నుంచి నన్ను రక్షించండి చాలు. మీరేం చెయ్యమన్నా చేస్తాను. ప్రామిస్"
"ఇవాళ నువ్వు విడుదలైపోతావ్. రేపు మధ్యాహ్నం నేను మీ ఇంటికొస్తాను. మిగతా విషయాలు మనం అక్కడ మాట్లాడుకుందాం. నేను మీ ఇంటి కొచ్చినప్పుడు ఇంటిలో నువ్వు తప్ప ఎవరూ వుండకూడదు"
"ఏం?" మరింత ఆశ్చర్యంగా అడిగాడు పీతాంబరం.
"నేను రేపు మీ ఇంటికొచ్చింది పెళ్ళి సంబంధం గురించి-అంతే- వివరాలు రేపు చెప్తాను. కానీ ఈ విడుదలకు సంబంధించి నా పేరు మాత్రం ఎక్కడా బయటకు రావడానికి వీలులేదు. అర్ధమయిందా, మరి నే వస్తాను"
రెండు నిముషాలు తర్వాత ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళి లిఫ్టు వేపు నడిచాడు.
పై ఫ్లోర్ కి వెళ్ళిన లిఫ్టు కిందకు రావడం భుజంగపతి లోనికి వెళ్ళడం, లిఫ్టు డోర్ మూసుకోవడం జరిగాక-
సరిగ్గా అదే సమయంలో మెట్లెక్కి పైకి వచ్చింది మయూష.
ఒకక్షణం ముందు ఆమె అక్కడికి వచ్చివుంటే భుజంగపతిని ఆమె గుర్తుపట్టి ఉండేది! అప్పుడు కథ మరో మలుపు తిరగడానికి అవకాశ ముండేదేమో.
రూమ్ డోర్ తెరచుకుని లోనికి అడుగుపెట్టిన వెంటనే కూతురు చేతిలోని వక్కపొడి ప్యాకెట్ ను అందుకుని ఆనందంగా ఒక పలుకును నోట్లో వేసుకుని "అమ్మా మయూష! నువ్వు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా?" అని నవ్వుతూ అన్నాడు పీతాంబరం.
తన తండ్రిలో అంత అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఆ ఆనందానికి ఆ మార్పుకి ఎక్కడా కారణం కనపడలేదు ఆమెకు.
"అమ్మను రాత్రికి భోజనం తీసుకుని రావద్దని చెప్పు. మనం అందరం ఇవాళ కలిసి ఇంటి దగ్గరే భోంచేస్తాం" అని ఎంతో ఆనందంగా చెపుతున్న తండ్రి వేపు అయోమయంగా చూసింది మయూష.
"తన తండ్రికి ఏవైంది! కొంపదీసి మతి తప్పలేదు కదా! ఆ ఆలోచన రాగానే షాక్ తిన్నాననుకుంటున్నావ్ కదమ్మా. నో.....చూడు.... ఇప్పుడు టైం ఐదూ నలభయ్ ఐదు నిముషాలు. సరిగ్గా ఆరూ నలభయ్ ఐదు నిముషాలకు యువర్ పాదర్ విల్ బీ ఫ్రీ.....దట్సాల్" అని అంటుండగా శర్మలోని కొచ్చాడు.
అన్నయ్య వేపు బేలగా చూసింది మయూష.
* * * *
సరిగ్గా ఆరూ నలభయ్ ఐదు నిమిషాలయింది.
ఎ.సి.బి. చీఫ్ మరో ఇద్దరు ఆఫీసర్లు పీతాంబరం రూమ్ లోకి వచ్చారు.
"సారీ మిస్టర్ పీతాంబరరావ్. పొరపాటు పడ్డాం. ఎ.జి. ఆఫీసులో ఆర్. పీతాంబరరావ్ ఇంటిమీద దాడిచేయమని ఇన్ఫర్మేషన్ వస్తే పొరపాటున సెక్రటేరియట్లో పనిచేసే మీ ఇంటిమీద దాడి చేసాం. మీ మీద కేసు విత్ డ్రా చేసుకుంటున్నాం" ఆ మాటకు ఆనందంగా కూతురి వేపు, కొడుకు వేపూ చూసాడు పీతాంబరరావు. అంతా ఒక డ్రామాలా జరిగిపోతున్న ఆ దృశ్యాన్ని చూసి శర్మ, మయూష విస్తుపోయారు. ఆ క్షణంలోనే ఆమె మదిలో ఓ అనుమానం చోటుచేసుకుంది. ఏదో కుట్ర జరిగింది దానిలో తన తండ్రి ఇరుక్కుపోయాడు. మరేదో జరిగి తన తండ్రి విడుదల కాబోతున్నాడు ఆ మరేదో ఏమిటి? ఎవరి ద్వారా జరిగింది? ఎందుకు జరిగింది!?
"మిమ్మల్ని సగౌరవంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం రండి" ఏవో కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాక అన్నాడు ఓ ఆఫీసర్.
"నో థాంక్స్.... పిల్లల్తో కలిసి నేను ఆటోలో వెళతాను" ఆనందంతో అన్నాడు పీతాంబరరావు.
మరో పదిహేను నిమిషాల తర్వాత....
ఆటోలో తండ్రి, ఆ పక్కన మయూష కూర్చున్నారు. ఆటో వెనక శర్మ హీరోహోండా మీదున్నాడు.
"ఒకగంటలో ఇంటికెళిపోతున్నామని నువ్వంటే నేను నిజమనుకో లేదు నాన్నా. ఇంతకీ ఏం జరిగింది?" అడిగింది మయూష ఎక్కడో ఆలోచిస్తూ.
"తర్వాత చెప్తానుగానీ దారిలో స్వీట్ షాపు దగ్గర ఆగి స్వీట్ కొందాం" అన్నాడు తండ్రి. తండ్రి ఉత్సాహాన్ని చూసి మయూష మనసు తేలికపడింది. అయినా ఆమె ఏదో ఆలోచిస్తూనే వుండిపోయింది.
* * * *
రోజులు బాగాలేకపోతే తాడే పామై కరుస్తుందంటారు లోకంలో పాపం నిండిపోయింది వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లు ప్రళయం తప్పదు. ముందు ఆయనమీద దొంగకేసు పెట్టినవాళ్ళందరూ నిలువునా నాశనమైపోతారు" క్యారేజీ సర్దుతూ తనలో తాను గొణుక్కుంటున్న శారదాంబ మాటలకు అంత బాధలోనూ నవ్వుకుంది కోడలు మాలతి.
అదే సమయంలో ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలోంచి దిగిన భర్తని చూసి శారదాంబే కాదు మాలతి కూడా ఆనందోద్వేగానికి లోనయింది.