Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 14

   

    "అవును మీరూటే వేరు నేనే వెళతాలే" అనుకుంటూ ముందుకు వెళ్ళబోయిన మయూషకు వదిన అడ్డుగా వచ్చింది. అప్పుడే కిచెన్ రూమ్ లోంచి శర్మ బయటకు వెళ్ళిపోయాడు.
   
    "నువ్వు ఒక్కదానివే ఏం వెళతావ్ పిల్లా ఒక్కసారి రోడ్డుమీద కెళ్ళి వంటరిగా నిలబడు మా తమ్ముడెవరో ఒకడు ఏ స్కూటర్ మీదో నువ్వెక్కడకు వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేసేస్తాడు" జోగ్గా అందావిడ.
   
    "అ....లా....గా...." దీర్ఘం తీస్తూ వెక్కిరించింది మయూష.
   
    "అవునే అమ్మడూ అందాల బొమ్మ, మా మరదలంటే మజాకా మరి" మయూషను పొగిడిందావిడ.
   
    "అవునుగానీ వదిన నేను అందంగా ఉంటానా? చాలా అందంగా ఉంటానా?" రహస్యంగా వదిన చెవి దగ్గరకెళ్ళి అడిగింది మయూష. ఆమె మయూషవేపు ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయంగా చూసి.
   
    "నీకేం? నిన్ను బంగారు బొమ్మదగ్గర పెడితే ఆ బొమ్మే వెలవెల పోతుంది నిన్ను మా తమ్ముళ్ళలో ఏ తమ్ముడు కట్టుకుంటాడో గానీ ఆ యింట్లో నువ్వు దీపంలా వెలిగిపోవూ"
   
    నిజానికి వదిన మాలతికి తమ్ముళ్ళెవరూ లేరు.
   
    "మా వదిన బంగారం" అని ఆమె బుగ్గమీద ముద్దుపెట్టి "వస్తా" అని ఆ రూమ్ లోంచి మధ్యహాల్లోకి వెళ్ళింది మయూష. రెండునిమిషాల క్రితమే శర్మ హీరో హోండామీద వెళ్ళిపోయాడు.
   
    "అమ్మా వెళుతున్నా" అని గట్టిగా కేకేసి వరండాలో కెళ్ళిన మయూష సర్ర్ మని వీధి మలుపు తిరిగి ఇంటిముందుకొచ్చి వరసగా ఆగిన రెండు జీపుల్ని ఆ జీపుల్లోని మనుషుల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
   
    మొదటి జీపులోంచి ఒక వ్యక్తి బయటకు దిగి "పీతాంబర శర్మ వున్నారా?" అని అడుగుతూ జేబులోంచి ఐడింటిటీ కార్డు తీసి చూపించాడు.
   
    యాన్టీ కరెప్షన్ బ్యూరో ఆఫీసర్!
   
    "మీ ఇల్లు సోదాచేయాలి" ఆ మాటకు పైకప్పు నెత్తిమీద కూలినట్టుగా అయిపోయింది మయూషకు.
   
    వరసగా నలుగురు ఆఫీసర్లు ఇంట్లోకి బిలబిలా వెళుతుండడంతో "నాన్నగారూ" అంటూ లోనికి పరుగెత్తింది మయూష.
   
    అపరిచితుల మాటలకు మెలకువ వచ్చిన పీతాంబరరావు వంటి మీద బనీన్ వేసుకుంటూ బెడ్ రూమ్ లోంచి బయటికొచ్చాడు.
   
    మయూష తల్లి శారదాంబ వదిన మాలతి పరుగు పరుగున వచ్చి మధ్య గది గుమ్మం దగ్గర అయోమయంగా నిలబడిపోయారు.
   
    అవినీతి నిరోధకశాఖ అధికారులు తన ఇంటిని సోదా చేయడానికి వచ్చారని తెలియగానే పీతాంబరం ఆశ్చర్యపోయాడు.
   
    "నామీద....నామీద....అవినీతి ఆరోపణా...నేనెవరో మీకు తెలుసా? ఏ ఇడియట్ మీకు కంప్లయింట్ ఇచ్చాడు?" ఆవేశంగా ప్రశ్నించాడాయన.
   
    "డోన్ట్ ఇరిటేట్ మిస్టర్ పీతాంబరం ప్లీజ్ కోపరేట్ విత్ అజ్" అని "సెర్చ్ ద రూమ్స్" సిబ్బందిని ఆదేశించాడు చీఫ్.
   
    సిబ్బంది తలో రూమ్ లోకి వెళ్ళారు.
   
    "సెక్రటేరియట్లో ధర్టీ ఇయర్స్ నుంచి సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాను. నా గురించి ఏ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ నయినా అడగండి. లేదా మాజీ చీఫ్ సెక్రటరీల్ని అడగండి. ప్రెజెంట్ చీఫ్ సెక్రటరీని అడగండి. ఇంతకీ న ఆమీద కంప్లయింట్ ఏమిటి?" పీతాంబరం గొంతు బొంగురుపోయింది.
   
    ఒక పక్క శారదాంబ కనుగుడ్లలో నీళ్ళు దారాపాతంగా వర్షిస్తున్నాయి.
   
    ఆమెకు చటుక్కున క్రితంరోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
   
    తన భర్తకు క్రితం రాత్రి చెప్పలేకపోయిన విషయం అప్పుడు గుర్తుకొచ్చిందామెకు.
   
    "మీమీద కంప్లయింట్ ఏంటో అయిదు నిమిషాల్లో మీ కళ్ళతో మీరే చూస్తారు" కరకు గొంతుతో అంటున్న ఆ ఆఫీసర్ వేపు అర్ధంకానట్లు చూసాడాయన.
   
    సరిగ్గా పది నిముషాల తర్వాత-
   
    ఒక ఆఫీసర్ లోపలనుంచి ఒక బ్రీఫ్ కేసుతో వచ్చాడు.
   
    ఆ బ్రీఫ్ కేసును చూడగానే "ఓపెన్ ఇట్" అని ఆఫీసర్ ఆర్దరివ్వగానే దానిని ఓపెన్ వేసారు.
   
    ఆ బ్రీఫ్ కేసులో వరసగా పేర్చి వున్నా కొత్త కరెన్సీ నోట్లు.....రెండునోట్ల కట్టల్ని తీసి ఆ ఆఫీసర్ వెరిఫై చేసి-
   
    ఓరకంట గంభీరంగా పీతాంబరంవేపు చూసాడు ప్రశ్నార్ధకంగా.
   
    ఎపుడూ అంత కరెన్సీ అలాంటి ఖరీదయిన బ్రీఫ్ కేసుని కూడా చూసి ఎరుగని పీతాంబరం షాక్ తిన్నాడు. అయినా క్షణాల్లో తేరుకున్నాడు.
   
    "నో....నో....మిష్టర్ ఆఫీసర్ నాకేం తెలీదు ఇది మా ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు పీజ్ బిలీవ్ మి"
   
    "మిష్టర్ పీతాంబరం మీకేం తెలుసో మాకు బాగా తెలుసు. మీలా అమాయకంగా నటించేవాళ్ళని చాలామందిని మేం చూసాం యూ ఆర్ అండర్ అరెస్ట్" అని ఆ అధికారి అంటుండగానే ఓ పోలీస్ ఆఫీసర్ బేడీలతో ముందుకొచ్చాడు.
   
    "గుట్టుగా నిజాయితీగా బతుకుతున్న కుటుంబం మాది నాకే పాపం తెలీదు. మా పిల్లలమీదొట్టు. ఆ ఏడుకొండల వాడిమీద ఒట్టు అయామ్ నాట్ కరెప్టెడ్ బిలీవ్ మీ సర్ బిలీవ్ మీ ప్లీజ్" ఏడుస్తూ ఆ ఆ ఆఫీసర్ కాళ్ళమీద పడ్డాడు.
   
    ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తున్న మయూషకు ఒక్కసారిగా ఏడుపొచ్చింది.
   
    "నాన్నా" అంటూ దగ్గరికి వెళ్ళిపోయినా మయూషకు అడ్డంగా ఒక ఆఫీసర్ వచ్చి నిలుచున్నాడు.
   
    "మిస్టర్ పీతాంబరం డ్రెస్ వేసుకోండి. పెండింగ్ లో వున్న జైకిసాన్ కన్ స్ట్రక్షన్ ఫైలుమీద నిన్న మధ్యాహ్నం మీరు సంతకం చేసారు చట్టవిరుద్దంగా సదరు పార్టీకి అనుకూలంగా మీరు చేసిన పనికి ఈ అయిదు లక్షల రూపాయల్ని లంచంగా తీసుకున్నారు. కరెన్సీ నోట్స్ మీద నెంబర్స్ అన్నీ టాలీ అయ్యాయి మీరిక చెప్పుకోవాల్సింది ఏమైనా వుంటే అది కోర్టులోనే. ప్లీజ్ కోపరేట్ విత్ ఆజ్" చెప్పాడు ఆ ఆఫీసర్ సీరియస్ గా.
   
    క్రితంరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన అంతా క్షణకాలం జ్ఞాపకానికొచ్చిన పీతాంబరం కళ్ళు గిర్రుమని తిరిగాయి.
   
    "పచ్చిమోసం ట్రాప్ లో ఇరికించారు సార్. ప్లీజ్ సార్. ఒరేయ్ సూర్యారావ్ ఒరేయ్....." గట్టిగా అరిచి కుప్పకూలిపోయాడు పీతాంబరం.
   
    "ఏమండీ" కేకలేస్తూ ఏడుస్తూ ముందుకు పరుగెత్తుకు రాబోయింది శారదాంబ.
   
    ఆమెనికూడా ఓ అధికారి ఆపేసాడు. ఈలోపు ఆ షాక్ ని జీర్ణించుకోలేని పీతాంబరం హార్ట్ రిథమ్ బ్రేక్ అవటంతో హార్ట్ ఎటాక్ వచ్చేసింది. దాంతో బాధతో విలవిలలాడసాగాడు పీతాంబరం.
   
    "కాల్ ద అంబులెన్స్ ఇమ్మీడియట్లీ" ఓ ఆఫీసర్ ఆజ్ఞాపించాడు ఆయన్ని చూస్తూ.
   
    సరిగ్గా పది నిమిషాల తర్వాత అంబులెన్స్ రావడం, పీతాంబరాన్ని అందులో ఎక్కించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    పీతాంబరంతోపాటు ఇంటికి తాళంవేసి శారదాంబ, మాలతి, మయూష కూడా అంబులెన్స్ ఎక్కారు. గుండెలోతుల్లోంచి తన్నుకు రాబోతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంబులెన్స్ ఆ ఇంటిముందునుంచి కదిలింది. ఆ వెనక జీపులు అనుసరించాయి.
   
    అప్పటికే ఇంటిచుట్టూ జనం మూగిపోయారు.

 Previous Page Next Page