సంజీవ్ వెళ్ళాడు. ఎవడో ఏజెంట్ వచ్చి 'సెంట్స్' కొనమనీ ప్రైజెస్ వస్తాయనీ, అరగంటసేపు వాదించి లాభంలేక వెళ్ళిపోయాడు.
మున్సిపాలిటీ భవిష్యత్తును చూపిస్తో ఎలక్ట్రిక్ దీపాలు ఆరిపోయి అరగంటవరకూ వెలగలేదు. ఆ సమయంలోనే ఒకాయన భోంచేస్తూ, ప్రక్కాయన విస్తట్లో కూరకాస్తా నాకేసినట్లు చెప్పుకొంటూ ఒకటేనవ్వు.
కొత్తగా పెంగ్విన్ వాళ్ళు ప్రకటించిన 'న్యూరైటింగు' చదువుతూ పడుకొన్నాను.
గది అవతల మూలుగు వినపడింది. తలుపు తెరచి చూశాను. అతను- ! మూల్గుతో, దగ్గుతో, హాలులో పడుకొన్నాడు.
కిటికీలోంచి ఆకాశంకేసి చూస్తున్నాను. నల్లగా దట్టంగా మబ్బులు ఒకటిపైన ఒకటి షేక్స్పియరు ట్రాజెడిల్లాగ, పడుతూ గంతులు వేస్తున్నాయి.
నా ప్రక్కగదిలో కొంతుకలు వినపడ్డాయి. ఎవరా అని చూస్తును గదా., ఆ ముగ్గురు మనుష్యులూ, ఆ స్త్రీన్నీ! కొన్ని మాటలిలా వినపడ్డాయి.
"సగంరాత్రి నువ్వూ, సగం రాత్రి నేనూ, రేపు రాత్రివాడూ! దాంతో ఋణం తీరిపోతుంది"
మానవుడిలో ఉండే పశుత్వం నల్లని వాసనతో హోటలు నంతా ఆవరించింది.
గాలి జోరుగా వీస్తోంది. వాన కూడా వచ్చింది. హోటలు తలుపులు 'ఠక్ -ఠక్' మని కొట్టుకుంటున్నాయి.
తలుపు గడియ వేసుకొని ఒక విధమైన భయంతో నిద్రపోయాను.
24-5-41
ఉదయం లేవగానే, తలుపు తీయగానే, 'అతనూ ఆ స్త్రీ దూరంగా నుంచొని కళ్ళతో మాట్లాడుకొంటున్నారు'
"అయిందా" అన్నాడు అతను.
"ఈవేళ కూడా ఉంది" అని జవాబు. పెద్ద నిట్టూర్పు.
ఆమె చాలా అందమైనదే.
కృష్ణా పత్రికా ఆఫీసుకి వెళ్లాను. మౌనముద్రాలంకారునీ, పింగళి రావూరినీ, ప్రతిభావిశేషంతో 'భరతమునిని' చిత్రించిన యువకచిత్రకారుణ్ణి కలుసుకొన్నాను. ఒక విధమైన నిశ్శబ్ద చైతన్యంతో, నీరవగానంతో యీవలకి వచ్చాను. హోటలుకి వస్తూంటే మేనేజరు సెర్వరుని పట్టుకు కొట్టుతున్నాడు. కప్పు ఒకటి పగలగొట్టినందుకు. ఆ సమయానే మేనేజరు కూతురు టేబులుమీద వున్న గ్లాసుని పరధ్యానంగా పగలగొట్టింది. మేనేజరిల్లా అన్నాడు.
"అయ్యో, అమ్మాణి! గాజుపెంకుదా గుచ్చుకొందీ. భయమిల్లే!" యేరా ఫైత్ కారీ, ఆ గ్లాసు ఎందుకలా పెట్టావు" అంటూ సెర్వర్ ని తిరిగి రెండు దెబ్బలు కొట్టాడు.
నా గదిలోకి వెళ్ళి భోంచేసి కూర్చున్నాను.
'అతను' -గదిముందు!
"ఏం" అన్నాను.
"కోప్పడకండి! నేను ముష్టికిరాలా!" అంటూ గదిలోకి వచ్చి, గోడనానుకుని కూర్చొని ఇలా అన్నాడు!
"మీతో చెప్పుకొందామని వచ్చాను. మీరు మంచివారనిపిస్తోంది" అన్నాడు.
"ఏమిఁటీ" అన్నాను.
"పాపం ఉందా" అన్నాడు.
"ఉంది"
"ఏమవుతుంది"
"నరకకూపంలోకి తోస్తారు."
అతను వణికాడు. "ఆ పాపం రక్తంలో కలిసిపోయి. ప్రతీ అణువులోను 'భగ్గు'మంటూ మండి బ్రతుకును అంటించివేస్తుంది కాదూ" అన్నాడు.
"అవును" అన్నాను. అతనిలా చెప్పుకురావటం మొదలు పెట్టాడు.