'అన్నీ ఒకేరంగులైతే బాగుండదని రంగురంగులవి తెచ్చానండి.' బంగారు రంగుది .." అంటూంటడగానే బంగారురంగు బిందెలు తెచ్చినవాడు ఒకటి బల్లమీదపెట్టి, మరొకటి బల్లమీదపెట్టబోయి చేయిజారడంతో విడిచిపెట్టాడు.
ధన్ మని పగిలి ముక్కలు ముక్కలైంది గాజుబిందె.
రెడ్డిగారి గుండెసైతం ముక్కలు ముక్కలైంది.
ఉగ్రలైపోయారు రెడ్డిగారు.
లాగి చెంపమీదకొట్టారు జారవిడిచినవాణ్ణి.
ఆ దెబ్బకే క్రిందపడిపోయాడు వాడు.
రెడ్డిగారు కోపంతో ఉగ్రులై ఒక్క తన్ను తన్నారు.
ఫుట్ బాల్లా రెండుగజాలన్నర అరుగునుంచి క్రిందపడ్డాడు మనిషి.
వెంటనే లేచాడు. 'దొర! పిల్లలుగలోన్ని, బత్కనీరి' అని వెనక్కు తిరిగి పరిగెత్తాడు వాడు.
అక్కడ నుంచున్నవారంతా బొమ్మలైపోయారు. పాణిలో ఉత్సాహం చచ్చి, ఉద్రేకం పొంగి మాయం అయింది. బుసలుకొడుతూ గడీలోనికి వెళ్ళిపోయారు రెడ్డిగారు. గోడకు ఆనుకొని నుంచున్నదల్లా నిట్టూర్పువిడిచి వెళ్ళిపోయింది వనజ. సారంగపాణి తన గదికి వెళ్ళిపోయాడు తలవంచుకొని. ఎంకటి మనుషుల్తో ఒక్కొక్క పెట్టె, ఒక్కొక్క సామాను మోయించుకొని కెళ్ళి సారంగపాణి గదిలో కొన్ని, గడీముందున్న వసారాలో కొన్ని పెట్టించాడు. గడీ మొత్తంలోనూ చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది. పట్నం నుంచి పాణి వచ్చాడంటే, సామానులు తెచ్చాడంటే గడీ మొత్తం ఉత్సాహంతో పొంగిపొర్లింది. పాణి సహితం తానెలా గాజుబిందెలు ఎన్నుకున్నదీ, చీరల కోసం ఎక్కడెక్కడ తిరిగిందీ రెడ్డిగారికి వివరించి చెప్పాలనుకున్నాడు. అతని ఉత్సాహం చచ్చి ఊరుకుంది. తువ్వాలు తీసుకొని స్నానాలగదికి వెళ్ళాడు. తిరిగి వచ్చేవరకు, ఉపాహారపు పళ్లెమూ, మీగడ పాలగ్లాసూ కావిడిపెట్టెమీదపెట్టి వెళ్ళిపోయింది వనజ. అది తినడం కూడా ఇష్టం లేకపోయింది పాణికి. మంచంమీద మేనువాల్చాడు. అతని మెదడులో ఏవేవో మసలసాగాయి. బండమనిషి, ఈ దెబ్బలు తిన్న మనిషీ మనుషులేనా? వట్టి రాతి మనుషులా? అసలు ఈ దొరకు ఎక్కడైన పిసిరంత మనసుందా? ఇతడూ రాతిమనిషేనా? గాజుబిందె అందమైంది. రెడ్డిగారికి చాల ఇష్టమైంది. పట్నం నుంచి తెప్పించాడు. అవి చూసి మురిసిపోయారు. అలాంటిది పగిలిపోతే కోపం వచ్చేది నిజమే. రౌద్రం పొంగేది నిజమే. కాని, ఎదుటివాడు మాత్రం చెయ్యాలని చేశాడా? చేయిజారి పడిపోయింది. అబ్బ, ఎంతదెబ్బ కొట్టాడు! ఇంత ముసలితనంలోనూ ఎంతబలం వుందీ! ఏనుగులూ తిని, ఏనుగంత బలం గలవాని దెబ్బ భరించగలడా తిండికిలేక డొక్కమాడేవాడు? ఈ క్రౌర్యం సంపదతో వస్తుందేమో! లేక అధికారాన్ని అంటిపెట్టుకొని వుంటుందో?
'శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే'
సంపదలు యోగభ్రష్టుడైన వానికి అబ్బుతాయట. యోగభ్రష్టుడు ఇంత క్రూరుడు కాగలడా? కృష్ణభగవానుడు చెప్పింది తప్పనుకున్నాడు పాణి.
ఈ ఊళ్ళో ఉండేవాళ్ళలో ఇద్దరు ముగ్గురు మాత్రమే మనుషులనీ మిగతావారంతా దొరవారి దొడ్లోవున్న పశువులనీ నిశ్చయించుకున్నాడు పాణి.
అడుగుల చప్పుడు విని లేచి కూర్చున్నాడు.
రామారెడ్డిగారు గదిలో ప్రవేశిస్తూ "పంతులూ! బలే బిందెలు తెచ్చినవయ్యా. అయిదురంగు బిందెలు ఒక్కచోట పెట్తే ఎంతబాగుంటుందనుకున్నౌ! ఒక మంచిబిందె పగలకొట్టిండు లంజకొడుకు. మళ్ళీ పట్నం పోయినప్పుడు తెస్తలె ఇంకొకటి" అని అక్కడే తగిలించి ఉన్న కెమేరాను చూచి, "ఓ! తస్వీర్లు గుంజెడిది తెచ్చినావు? నీకు తస్వీర్లు(ఫోటోలు) తియ్యస్తదా?" అని అడిగాడు.
ఇంతకుముందే రుద్రుడైన రామారెడ్డిగారు గడియ తరువాత సౌమ్యమూర్తిగా మాట్లాడుతుంటే ఆశ్చర్యమనిపించింది పాణికి. తాను తన్నింది ఒక జంతువును అన్నంత ఇదిగా మరిచిపోయాడాయన.
"అవునండీ, ఫోటోలు తీయగల్గుదు" జవాబు చెప్పాడు.
"ఏదీ ఇట్లతే" అని తిప్పి చూచి "ఎంతైంది?" అని అడిగాడు.
"నూటాయాభై."
"శానబాగున్నది. గాజుబిందెల తస్వీర్లు గుంజుతావు?"
"తీస్తా"
"అయితేరా" అని ముందు నడిచారు రెడ్డిగారు.
ఆయన బంగళాలోంచి వెళ్ళేమెట్లు దిగుతుంటే అనుసరించడానికి సంకోచించాడు పాణి. అతడు ముందా మెట్లు దిగలేదు. పాణి రావడం లేదని గమనించి వెనక్కు తిరిగి "రావయ్యా పంతులూ" అని పిల్చుకొని వెళ్ళారు రెడ్డిగారు.
మెట్లుదిగితే పెద్దహాలుంది. ఒక్కసారి 100, 200 మంది కూర్చోగల హాలది. క్రింద చలవరాయి పరచివుంది. మూడుచోట్ల ఫరష్ మీద పూలమొక్కల నగిషీలున్నాయి. గోడకు అంటి ఒక అడుగువరకు నల్లరాయి పరచి ఉంది. గోడలు నున్నగా ఎత్తుగా ఉన్నాయి. కప్పుకు తగిలించి నాలుగు రంగు రంగుల గాజుబుడ్లున్నాయి. నిలువెడు నిలువెడు చిత్రపటాలున్నాయి పది. వాటిలో చాలా పురాణగాథలకు సంబధించినవే ఉన్నా అర్ధనగ్నమైన అతివల చిత్రాలూ లేకపోలేదు. దర్వాజామీద శకుంతల దుష్యంతునికి తామరాకుమీద ప్రేమలేఖ వ్రాస్తున్నట్లూ, ప్రక్కన చెలికత్తెలున్నట్లూ ఉన్న రవివర్మ చిత్రం ఉంది. పటం క్రింద అందుకు సంబధించిణ శ్లోకం 'తవనజానే మృదయం'ఉంది వెనక్కు తిరిగి చూస్తే ఆ దర్వాజాకు ఎదురుగా ఉన్న దర్వాజామీన శాకుంతలానికి సంబందించిన మరొక రవివర్మ చిత్రం వుంది. అది విశ్వామిత్రుడు మేనకను వదిలిపోవడానికి సంబధించింది. ఆ హాలుమాత్రం చూచినవారికి రెడ్డిగారు గొప్ప కళా ప్రియులని, రసికులనీ, అర్ధం అవుతుంది. ప్రతి చిత్రాన్ని సాంగోపాంగంగా చూడాలనుకున్నాడు పాణి. కాని రెడ్డిగారు వెళ్ళిపోయారని గమనించి బ్యాంకులోకి వెళ్ళిపోయాడు.
బల్లపీటమీద రంగురంగుల గాజుబిందెలు తొమ్మిది ఉన్నాయి. నేలమీద పగిలిపోయిన గాజుబిందె బాపతు ముక్కలు పడివున్నాయి.
'తొమ్మిదొద్దు. ఒకటి తీసేసి ఎనిమిదింటి తస్వీరు గుంజు' అన్నారు రెడ్డిగారు.
ఎంకటి అది విని బంగారు రంగు గాజుబిందెను రెండుచేత్తుల్తోనూ జాగ్రత్తగా పట్టుకొని మరొబల్లమీద పెట్టాడు. రెడ్డిగారు చూస్తూ నుంచున్నారు. పాణి పోజ్ చూసి క్లిక్ మనిపించాడు. ప్లాష్ చమక్కుమంది. మెరుపు మెరిసినట్లనిపించింది రెడ్డిగారికి.
"అయిపోయినాది?"
"ఆ, అయిపోయింది."
"ఏదీ తస్వీరు?' చేయి చాచారు రెడ్డిగారు.
'అప్పుడే ఎట్లా? ఇందులో ఒక రీలుంటుంది. దానిమీద పన్నెండు బొమ్మలొస్తాయి. అన్నీ అయిపోయింతర్వాత కడుగుతే బొమ్మలొస్తాయి.'
'అయితే, పన్నెండు గుంజు.'
'మీరు నుంచోండి, ఫోటో తీస్తా.'
'ఇట్లనా? పోషా (దుస్తులు) కేసు కాస్త' అని లోనికివెళ్ళిపోయారు రెడ్డిగారు.
ఇంతలో వనజ వచ్చింది 'గిదేంది?' అంటూ.
'నుంచో బొమ్మతీస్తా' అన్నాడు పాణి.
నుంచుంది వనజ. కెమెరాలోంచి చూచి-
'కాస్త కుడికి తలవంచు. ఆ ఆ చాలు. ఒక్క చిరునవ్వు' అన్నాడు పాణి. వనజకు నవ్వే వచ్చేసింది. నవ్వేసింది. కెమెరా క్లిక్ మనడమూ, ప్లాష్ చమక్కుమనడమూ జరిగిపోయాయి.
"వచ్చిందా బొమ్మ?"
"ఆ"
వనజ మంజరి దగ్గరికి పరుగెత్తింది. "దొరసానీ! పంతులు తస్వీర్లు గుంజే పెట్టె (కెమెరా) తెచ్చిండు. నా తస్వీరు గుంజిండు. మీ తస్వీరు తీయించుకోరి. అట్ల నిలబడ్డనా? అది 'టిక్' మన్నది.ఒక్క మెరుపు మెరిసింది. బొమ్మొచ్చిందన్నడు పంతులు" అని చెప్పేసింది గబగబా. మంజరి గుండెలో, మంజరి గుండెలోఒక కోర్కె మెరిసింది. తానూ బొమ్మ తీయించుకోవాలనుకుంది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. అద్దంలో చూచుకొని ముస్తాబు అవుతున్న రెడ్డిగారు కూతుర్ని గమనించలేదు. అద్దంలో నీడ కనిపిస్తూనే ఉంది.
'నాయ్నా!' మంజరి పిలిచింది.
వెనక్కు తిరిగి చూచి "ఏంది బిడ్డా?' అని అడిగాడు అత్తరు పూసుకొంటూ.
"నాయ్నో. నా బొమ్మ తీయించవా?"
"మా అమ్మవు కాదు. ఎందుకు తీయించ బిడ్డా! తీయిస్త. తయారుకా" అన్నారు కూతుర్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ.
"మా నాయ్న మంచోడు" అంటూ గంతులేస్తూ వెళ్ళిపోయింది మంజరి.
షేర్వానీ గుండీలు పెట్టుకుంటూ బైటికి వచ్చేవరకు వనజ ఎదురైంది.
"పెద్దొర్సాని తస్వీరు దిగుతదట" అన్నది.
"తయారు కమ్మను" అని చెప్పి వెళ్ళిపోయారు రెడ్డిగారు.
గడప దాటగానే అన్నాడు పాణి 'ముప్పయి ఏండ్ల యువకునిలా ఉన్నారండీ' అని.
పొంగిపోయారు రెడ్డి. "ఇట్ల నిలబడనా?" అనడిగారు.
"ఎట్లయినా నుంచోండి. పూర్తిగా తీయనా?"
"ఊ తియ్యి."
"కొద్దిగా తల పైకెత్తండి. ఆ ఆ,చాలు, ఊహు - కొద్దిగా దించాలి.ఆ చాలు."
"రెడీ" క్లిక్.