Previous Page Next Page 
హిమసుందరి పేజి 14

    "ఇదే మొదటిసారా తాగటం?" సీత అడిగింది.

    "నాలుగు డబ్బులు ఎక్కువ వస్తే చాలు - పికదాకా తాగి రావాల్సిందే!" అంది రంగి - నీరసంగా అంట్లు తోముతూ.

    "నీవెలా భరిస్తున్నావు?"

    "ఏం చేయమంటారు - నాతల రాత!"

    "తలరాత - మొలరాత అని ఎక్కడా వుండదు. నీవలా భరిస్తుంటే, ఇహపై రోజు తాగి వస్తుంటాడు."

    "ఏం చెయ్యమంటారు చెప్పండి - ఆడదాన్ని అయిపోయాను."

    ఆడదాన్ని అయిపోయానని రంగి అనంగానే, ఆడపులిలా లేచింది సీతామనోహరి.

    "ఆడదానిలోని ఈ అలుసే మగవాడు కనిపెట్టి ఆడిస్తున్నది. ఆడదయితేనేమిటి - మనిషి కాదా? పశువా? తర తరాల నుంచీ. యుగ యుగాల నుంచీ స్త్రీ ఇలా అన్నింటికీ తలవంచుకు పోబట్టే- మగజాతి యిలా విర్రవీగిపోతున్నది. నీ మొగుడు మొదటిసారి తాగి వచ్చినప్పుడే గట్టి వార్నింగ్ ఇవ్వాల్సింది. ఈ తఫా తాగి వస్తే మర్యాద దక్కదు - ఐ డోంట్ కేర్! నీ దోవ నీది - నాదోవ నాది అనాల్సింది" ఆవేశంగా అంది సీత.

    "అదెలా కుదురుతుందమ్మా!" అంది రంగి.

    "ఎందుకు కుదరదు? చక్కగా కుదురుతుంది. నీ మొగుడు రిక్షా బందీ వేస్తున్నాడు. నీవు నాలుగిళ్ళలో పని చేస్తున్నావు. వాడు పొమ్మంటే నీవు లేకపోతే బతకలేనా అనటం, ఇవతలికి వచ్చేయటం."

    "అదెలా కుదురుతుందమ్మా?" అంది రంగి.

    "నీకు ఎంత చెప్పినా అర్ధం కావటం లేదు. నీవు సంపాయిస్తున్నావు. వాడు సంపాదిస్తున్నాడు అవునా?"

    "అవును."

    "ఇంకేమి మహారాణిలా బతకొచ్చు. నాలుగిళ్ళలో పాచిపని చేసుకుంటున్నావు. అన్నం దొరుకుతుంది. కాఫీ యిస్తున్నాము. నాలుగురమ్మగార్లు చీరలు యిస్తారు. జీతం రాళ్ళు సగం ఖర్చు చేసుకున్నా సగం వెనకేసుకోవచ్చు. ప్రతినెలా ఎంతో కొంత బ్యాంకులో దాచుకుందువు గాని. అలా పొదుపుగా దాచుకోవటం వల్ల కొన్నేళ్ళకి అదే పెద్ద మొత్తం అవుతుంది. కావాలంటే వడ్డీ డబ్బు వాడుకోవచ్చు. అదీ అవసరం లేకపోతే ఫిక్సడ్ వేసుకుంటే అయిదేళ్ళదాకా తీయకపోతే డబుల్ డబ్బు పెరుగుతుంది."

    సీత చెప్పింది కడు శ్రద్ధగా విని "ఏమిటో మీరు చెప్పింది నాకర్ధం కాలేదు" అంది రంగి.

    కిటికీలో అద్దం పెట్టుకుని దాని ఎదురుగ కుర్చీలో కూర్చుని స్విష్ బ్లేడుతో గడ్డం గీచుకుంటున్న రామకృష్ణకి సీత చెప్పింది విని నవ్వు వచ్చింది. బలవంతాన నవ్వు ఆపుకోటం వల్ల గడ్డం తెగటం కూడా జరిగింది.

    "అందుకే అన్నారే రంగీ! ప్రతివాళ్ళూ చదవను రాయను నేర్చుకుని వుండాలని సరే చదువు సంగతి తర్వాత చూద్దాం. ముందు నీ మొగుడిని గట్టిగ అడుగు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పు. ఈ తఫా తాగి వస్తే నీ దోవ నీది నా దోవ నాది అని గట్టిగ చెప్పు అంతేకాదు. మరోసారి తాగి వస్తే యివతలికి వచ్చేసేయి. నీ కాళ్ళ మీద నీవు బతకలేవా ఏమి?"

    "అదే చూస్తున్నానమ్మగారూ? నేను వాడితో విసిగిపోయాను" అంది రంగి.

    సీతకి మహా సంతోషం వేసింది. ఆ సంతోషంలో విజ్రుంభించిపోయి. ఆడవాళ్ళ అశక్తత మగవాళ్ళ దౌర్జన్యం గురించి చిన్న లెక్చర్ యిచ్చింది.

    రంగికి అర్ధం అయిందో కాలేదో గాని తలొంచుకుని పని పూర్తి చేసి నీరసం మొహం వేసుకుని వెళ్ళిపోయింది.

    "పాపం రంగి విషయం చూశారా!" రంగి వెళ్ళింతరువాత రామకృష్ణ అంది సీత.

    ఏమీ ఎరగనట్లు ఏంటిట? అన్నాడు రామకృష్ణ.

    రామకృష్ణకి అన్నం వడ్డిస్తూ వివరంగా చెప్పింది సీత. "వాడి మాటలు విన్నారా! జయమాలినిని తెచ్చుకుంటాడుట. వాడి ముఖానికి అది జరిగే పనేనా? ఈ మాట జయమాలినితో అంటే వాడి మూతి పళ్ళు రాలేలా ఎడంకాలితో తంతుంది" అని కూడా చెప్పింది.

    "వీడి ముఖానికి జయమాలిని కావాల్సి వచ్చిందన్న మాట!" రామకృష్ణ నవ్వుతూ అన్నాడు.

    "తాగుబోతు వెధవ ఇంకా నయం పైకెళ్ళి రంభని తీసుకొస్తానని అనలేదు" అంది సీత.

 Previous Page Next Page