రామకృష్ణకి ఆఫీసు టైము కావటంతో ఎక్కువ సమయం మాట్లాడటానికి లేకపోయింది. భోంచేయటంతోనే వెళ్ళిపోయాడు ఆఫీసుకి.
రాత్రంతా నిద్రలేదు. పైగా మొగుడు కొట్టాడు. దాంతో రంగికి వళ్ళు నొప్పులో జ్వరమో వచ్చి వుంటాయి. మధ్యాహ్నం పనిలోకి వచ్చింది. ఉరుకులు పరుగుల మీద పనిచేయటం మొదలుపెట్టింది.
సీత కొద్దిసేపు చూసి "సాయంత్రం ఎక్కడికైనా వెళుతున్నావా?" అంది.
"అవునమ్మగారూ! హిందీ సినిమాకి" సిగ్గుపడుతూ చెప్పింది రంగి.
సినిమా కెళతానని చెప్పటానికి సిగ్గెందుకు పడాలో సీతకి అర్ధం కాలేదు. "హిందీ సినిమా నీకర్ధం కాదుగా?" అని మాత్రం అడిగింది.
"ఆడికి హిందీ సినిమాలంటే మా చెడ్డ ఇష్టం అమ్మగారూ! నాకర్ధం కాదని చెపితే చాలా పెద్ద యాక్టర్లు వున్నారు పెద్ద క్లాసుకి వెళ్ళి పక్కపక్కన కూర్చుందాం నేను కధ చెపుతుంటాను అన్నాడు."
"ఎవరు మీ ఆయనే?"
"ఊ"
"వాడడిగితే మాత్రం నీవెందుకు సినిమాకి వెళ్ళాలి? రాత్రే కదా తాగొచ్చి నానా గొడవ చేసి తన్నింది?"
"నిజమేనమ్మగారూ!"
"ఏమిటే నిజం! సినిమాకి రమ్మని అడిగితే మాత్రం నీవలా వెళ్ళిపోవటమేనా? ఎంత మొగుడైతే మాత్రం రమ్మనటం ఆలస్యం పరుగెత్తుకు వెళ్ళటమేనా? నీకో మనసు అభిప్రాయం వుండవా!"
రంగి ఏదో గొణిగింది.
సీతకి ఆ మాట ఏదో అర్ధం కాలేదు.
"నీవలా మెత్తగ వుండోద్దని చెప్పానా లేదా? తాగి వచ్చి కొట్టిందే గాక జయమాలిన్ని తెచ్చుకుంటానని కూడా అన్నాడు."
"అలా అంటాడు అంతే అమ్మగారూ! నన్ను ఏడిపించటానికి రకరకాల మాటలు అంటాడు. వీడి ముఖానికి జయమాలిని కాదు కదా వాళ్ళింట్లో పనిమనిషి కూడా రాదు. ఓ చుక్క తాగంగానే నరంలేని నాలుక తిరగబడుతుంది." రంగి నవ్వుతూ చెప్పింది.
రంగి వ్యవహారం చూస్తుంటే సీతకి అనుమానం వచ్చింది. మొగుడు మాట ఎత్తంగానే యిదింతగ ముచ్చట పడుతుందేమిటబ్బా! అనుకుంది.
"రంగీ!"
"ఊ....."
"రాత్రి నీ మొగుడు తాగొచ్చి కొట్టాడు కదూ?"
"కొట్టాడు."
"వాడు తాగటం మానడు. నేనింకా వాడితో కాపురం చెయ్యలేను. అని నా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నావు కదూ?"
అమ్మగారు అంత సీరియస్ గా ఎందుకడుగుతున్నారో అర్ధంగాని రంగి "ఎందుకమ్మగారూ?" అంది.
"అడిగిందానికి సమాధానం చెప్పు. నీ మొగుడు రాత్రి తాగి వచ్చి నిన్ను కొట్టాడా లేదా?"
"వాడితో యింక కాపురం చేయలేను అని అన్నావా లేదా?"
"అన్నాను."
"మరి ఉదయం నాతో చెప్పుకుని అంత బాధపడ్డదానివి ఈ మధ్యాహ్నానికే మారిపోయి మొగుడు రమ్మనగానే టింగురంగా అని తయారయి సినిమాకి పోవటమేనా?"
"అదికాదు....." మళ్ళి రంగి నసిగింది.
సినిమా చూడాలని అంత పిచ్చిగా ఉంటే నేను డబ్బు ఇస్తాను. ఇటు నుంచి ఇటే నీకిష్టమైన తెలుగు సినిమాకి వెళ్ళిరా. మీ ఆయన మాట విననట్లు అవుతుంది."
"సినిమా పిచ్చి కాదండీ. రాత్రి జరిగిందానికి వాడు బాధపడి మధ్యాన్నం బతిమిలాడాడు. నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు."
"దాంతో నీవు కరిగిపోయ్యావ్ అవునా?" సీత కరుకుగ అడిగింది.
"నేనేం పిచ్చిదాన్నిటండీ! గంటసేపు బతిమిలాడిం తరువాత యింక ఆది బాధ చూడలేక సరేనన్నాను. తాగొచ్చిం తరువాత అలా చేస్తానని తెలియదే. నిన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టానుటే రంగీ! నీ వంటే నాకు చచ్చే ప్రేమ. తాగిన మైకంలో ఏమీ తెలిసి చావదు. బుర్ర పనిచేయదు. అంటూ లబలబ లాడాడు."