"చాలా దాంపత్యాల కధలు తెలుసు!" రామకృష్ణ గొప్పగా చెప్పాడు.
"అయితే చెప్పరా!" గోముగా అడిగింది సీత.
"ఇప్పుడా?"
"ఇప్పుడే."
"కాలాతీతం..... కాలాతీతం....."
"కాలాతీతం అయితే కొంపేమీ మునగదు. నాకు నిద్ర రావటం లేదు."
"నీకు నిద్ర రాకపోతే జోల పాడతాను. ప్రేమ వూసులాడుకుందం పడి దొర్లుదాం. ఇంకేదేదో చేద్దాం. వెయ్యిన్నొక్క రాత్రులు కధల్లాగా - లోకంలో ఉన్న దంపతుల కధలన్నీ నన్ను చెప్పమంటే ఎలా? ఎలా?" రామకృష్ణ వాపోయాడు.
"నాకు ఆ కధలన్నీ వినాలని వుందండీ!" ముద్దులోలుకుతూ పలికింది సీత.
"వినాలని వుంటే రోజుకొకటి చెపుతాను. ఈ పూట రెండు చెప్పాను. నీవు మాట్లాడరాదు - ఆ..... అంతే!"
"అంతేనా!"
"అంతే!"
"రేపు చేపుతారుగా!"
"చెపుతాను."
"సరే, ఇంతకీ సినిమా హాలులో భార్యాభర్త ఏ రకం అంటారు? మాష్టారు రకమా? దశరధుడి రకమా?"
"ఈ తఫా మనం ఏదో ఒక సినిమాకి అఘోరిస్తే- ఆ మొగుడూ పెళ్ళాం కూడా అదే సినిమాకి అఘోరిస్తే - వాళ్లనే అడుగుదాము మీరేం రకమూ అని....." రామకృష్ణ కోపం దిగమింగుతూ అన్నాడు.
"అంత కోపం దేనికండీ!" ముద్దుగా అడిగింది సీత.
"కాలాతీతం...... కాలాతీతం....."
"ఈ మగవాళ్ళందరికీ పెళ్ళాం విషయంలో తలావొక పిచ్చి. మీకు కాలాతీతం పిచ్చి. పెదవి కదిపితే చాలు - అరిగిపోయి గ్రామఫోను రికార్డ్ లాగా కాలాతీతం అంటూ నా చెవిలో తుప్పు రేగగోడుతూ..... కాలాతీతంట - అదేదో తారకమంత్రం అయినట్లు....."
"చూడు సీతామనోహరీ! ఏమీ తెలియనట్లు వేషాలు వేయకు. కధ చెప్పటం పూర్తికాంగానే మీ ఇష్టం అన్నావు. ఆ తర్వాతేమో అదని, ఇదని టైం వేస్ట్ చేస్తున్నావు. రౌతు మెతగ్గా ఉంటే, గుర్రం ఎగిరెగిరి దూకిందట. ఏ విషయంలో మెతగ్గా వున్నా ఫరవాలేదు గాని, ఈ విషయంలో మగాడు మెతగ్గా వుండరాదు" అంటూ రామకృష్ణ సీతని దగ్గరగా తీసుకున్నాడు.
"అవునేను. అసలే కాలాతీతం అయింది" అంటూ సీత కిలకిల నవ్వింది.
రోజు పనిమనిషి మూడు గంటలకల్లా వచ్చి, నాలుగు లోపల పని పూర్తి చేసుకుని వెళుతుంది.
ఇంక లేచి పని చేసుకుందామా అనుకుంటుండగా - పని మనిషి రంగి ఉరుకులు పరుగుల మీద వచ్చి - "బేగి అంట్ల గిన్నెలు వేయండి అమ్మగారూ! వెళ్ళాలి" అంది.
చక్కగా తయారయి కళ కళ లాడుతున్న రంగిని చూసి తెల్లబోయింది సీత. అది చూసి సిగ్గుపడింది రంగి.
ఉదయం రంగి పనిలోకి వచ్చినప్పుడు శోకమూర్తిలా ఉంది. "అదేమిటే రంగీ - అలా ఉన్నావు?" అంటే - కారణం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
"రాత్రి మా ఆయన పీకదాకా తాగి వచ్చాడు. వాడు తాగితే మనిషి కాదు. చేపల కూర వండలేదని, రాంగానే తన్నాడు. వాడు చెప్పినట్లు వినలేదని రాత్రంతా సాధిస్తూ, అరుస్తూ మధ్య మధ్య కొడుతూనే వున్నాడు. మాలావు మగాడు రమ్మనంగానే నేను పక్కలోకి రాలేదుట. 'పోవేకునారి ముఖందానా! మద్రాసెల్లి జయమాలిన్ని తెచ్చుకుంటాను. నీ సవతిగా సిల్కుస్మితని తెచ్చుకుంటాను' అంటూ ఒకటే అరుపులు వాడు నిద్రపోడు - నన్ను నిద్రపోనీయడు. తాగి వచ్చాడంటే రాక్షసుడే!" అంటూ కళ్ళు తుడుచుకుంది రంగి.