"బలరాజ్ ఇక్కడున్నాడని ఎలా అనుకున్నావ్...." ప్రశ్నించాడు ముజ్మిల్.
"మరి అతనెక్కడుండవచ్చని నీ అంచనా?"
"అతనికి కొడుకు వున్న సంగతి నీవు చెప్పేవరకూ నాకు తెలియదు. అయినా బలరాజ్ మనమనుకున్నంత తేలికగా దొరకడు."
"ఆ సంగతి నాకు తెలుసు. కాని సీరియస్ గా ప్రయత్నించడంలో తప్పులేదని అనుకుంటున్నాను." స్థిరంగా పలికింది అలెక్స్ కంఠం.
"తప్పులేదనను కాని మన జాగ్రత్తలో మనం వుంటే మంచిది. మనం ఈ పనిమీద వున్నాం అని తెలిస్తే అతని టార్గెట్ మనం అవుతాం గుర్తుంచుకో. అయినా నా సహాయం నీకెప్పుడూ వుంటుంది."
కారు చేరవలసిన ప్రదేశానికి చేరటంతో డ్రైవర్ కి ఆపమని సంజ్ఞ చేసి దిగారు.
కారు ఓ పాడు బడ్డ బిల్డింగ్ ముందు ఆగింది.
అధునాతనమైన బిల్డింగ్స్ ఉన్న ఆ ప్రదేశంలో ఈ బిల్డింగ్ వుండటం కొంచెం చిత్రంగా తోచింది అలెక్స్ కి.
పదడుగులు నడిచి అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్ని దాటుకుని బిల్డింగ్ దగ్గరకు చేరారు.
బిల్డింగ్ పక్కగా మెట్లు వున్నాయి.
మేడ మెట్లెక్కి లోపలికి చేరారు. లోపల ఒక పెద్ద హాల్.
బయట ఎంత పాడుపడినట్లు అనిపిస్తుందో లోపల ఇంటీరియర్ అంత అందంగా ఉంది.
హాల్ కి పక్కగా కొన్ని రూమ్స్ లాక్ చేసి వున్నాయి.
లోపల గదుల్లో మనుషులున్నట్లు చప్పుడు వినిపిస్తుంది.
ఒక రూమ్ తాళాలు తెరిచి లోపలకి వెళ్ళమన్నట్లు సంజ్ఞచేశాడు ముజ్మిల్.
కొంచెం ముస్లిమ్ సంప్రదాయం అనిపిస్తుంది ఫర్నీచర్ లో.
ఫైవ్ స్టార్ సదుపాయాలన్నీ ఆ రూమ్ లో వున్నాయి.
రూమ్ లోకి వెళ్ళిన పదినిమిషాలకి ముజ్మిల్ వచ్చి ఏ.సి. ఆన్ చేసి తలుపు దగ్గరగా వేశాడు.
ఇంటర్ కమ్ లో ఎవరికో ఏదో చెప్పాడు.
ఒక వ్యక్తి రెండు టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు.
అతను తెచ్చిన టీ కప్పుని అందుకున్నాడు అలెక్స్.
అది బ్లాక్ టీ.
"నేను బ్లాక్ టీ మాత్రమే త్రాగుతానని మీకెలా తెలుసు?"
ప్రశ్నించాడు అలెక్స్.
వచ్చిన వ్యక్తిని వెళ్ళమన్నట్లు సంజ్ఞచేసి సమాధానంగా నవ్వాడు ముజ్మిల్.
"ఒకే. నువ్ స్నానం చేసి, కాసేపు రెస్ట్ తీసుకుంటే లంచ్ తయారవుతుంది. తరువాత మనం పని మొదలపెట్టవచ్చు" చెప్పాడు ముజ్మల్.
రాత్రంతా నిద్రలేకపోవటం వలన బాగా అలసటగా అనిపించటంతో కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు అలెక్స్.
సరేనని చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్ళి పది నిముషాల్లో స్నానం ముగించి వచ్చేసరికే రూమ్ లో ముజ్మిల్ లేడు.
అలసటగా బెడ్ మీదకు వాలడు అలెక్స్. బలరాజ్ కోసం అతని బుర్రలో ఒక పధకం కోసం ఆలోచన మొదలై అదొక నిర్దిష్టమైన రూపు దిద్దుకున్న తరువాత తృప్తిగా నిద్రపోయాడు.
సరిగ్గా రెండు గంటల ప్రాంతంలో కాలింగ్ బెల్ మ్రోగడంతో అతడికి మెలుకువ వచ్చింది.
అంతకు ముందు టీ తీసుకు వచ్చిన వ్యక్తి లంచ్ తీసుకువచ్చాడు. లంచ్ ని ముగించి ముజ్మిల్ గురించి అడిగాడు అలెక్స్. అతను సాయంత్రం కలుస్తాడని చెప్పటంతో తను బయటికి వెళుతున్నానని చెప్పి. ఎప్పుడు తిరిగి వచ్చేది చెప్పకుండా బయటపడ్డాడు అలెక్స్.
పావుగంట వెయిట్ చేసిన తరువాత అతనికి ఖాళీ ఆటో కనిపించింది. డ్రైవర్ కి తను వెళ్లవలసిన అడ్రస్ చెప్పి కూర్చున్నాడు.
* * *
మిత్రా ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అతని ఆలోచనలు అంతకు ముందు జరిగిన సంభాషణల చుట్టు తిరగసాగాయి.
ఆమె తనతో తొలిసారిగా మాట్లాడింది. కాని, తమ మధ్య జరిగిన సంభాషణ అంత సంతృప్తికరంగా లేదు. అన్విత ప్రాణంతో సమానం
ఆమె లేందే తను బ్రతకలేడు. ఆమె కోసం ఏ పనైనా చేయగలడు.
ఒక నిండు ప్రాణాన్ని తన ప్రేమ కోసం బలి చేయగలడా....?
ఏమో తనింతవరకు కనీసం ఎదుటి వ్యక్తితో పోట్లాటకి కూడా దిగలేదు, అటువంటిది మర్డర్ చేసే సాహసం చేయగలడా....?
ప్రేమంటే ప్రపంచానికి సరికొత్త భావ్యం చెప్పాలి.
ఇక ఈ విషయంలో మంచి - చెడు అన్న ప్రశక్తే రాకూడదు.
ఈ క్షణం నుంచి పోరాటం మొదలు కాబోతుంది. ఒక ఆడదానికోసం మహాసంగ్రామాలే జరిగాయి. అటువంటిది ఒక ప్రాణిని చంపడం అంత వింతగా కనపడటం లేదు!