నిబ్బరంగా.. ధృడంగా వుంది రామావతారం గొంతు. మీనాక్షి నేను యిద్దరం మొహాలు చూసుకున్నాము.... మా ఇద్దరి మొహాలు మలినం అయ్యాయి.. ఒకరి మొహం ఒకరు చూసుకోలేనట్టు వెంటనే చూపులు తప్పించి లోపలికి అడుగు పెట్టాం.. రామావతారం చెబుతున్నది ఆపేశాడు మావైపు చూసి. శాంతి తలెత్తి నా కళ్ళలోకి చూసి చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది.
"ఎప్పుడొచ్చారు.. కారు చప్పుడైనా కాలేదే.." రామావతారం ప్రశ్నార్థకంగా .. చూస్తూ అడిగారు..
"పెట్రోలు పోయించుకు రమ్మని డ్రైవరుని పంపాను... ఏమిటో చర్చిస్తున్నట్టున్నారు ఇద్దరూ..." సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ...
రామావతారం మొహం కాస్త ఎర్రబడింది... "ఆ.. ఏదో లోకాభిరామాయణం" పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఒకసారి నావంకచూసి లోపలికి వెళ్ళింది.
రాత్రి పదిన్నరకి మీనాక్షిని వాళ్ళని హౌరామెయిల్ఎక్కించి వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాం నేనూ, శాంతి.
మీనాక్షి వెళ్ళిపోగానే.. ఒక్కసారి తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతిలా హాయిగా వుంది నా మనసు.
రామావతారం మాటలు విన్న తరువాత ఈ ఇరవై రోజులలో నా కళ్ళకి కమ్మిన పొర ఏదో విడినట్టయింది! నిజంగా అతనన్నట్లు 'ఫూల్'ని నేను!
రామావతారం అన్నమాటలకో, మీనాక్షి చెప్పిన నిజం మనసుకి ముల్లుగా గుచ్చుకోడంచేతే.. ఏదో చెప్పలేనుగానీ ఆ మధ్యాహ్నం నుంచి నేను నేనులా వుండలేకపోయాను... శాంతిని చూస్తే... పట్టుబడ్డ దొంగని శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీలయ్యాను... శాంతి మొహంలోకి సూటిగా చూడలేకపోయాను... నేను ఫూల్ ని.. మూర్ఖుడిని.. నిజంగా ఫూల్ ని...
జలపాతం మొదటిసారి చూచినపుడు అబ్బ ఎంత అద్బుతంగా వుంది అని అనుకోకుండా వుండలేరు ఎవరూ. కొన్ని నిమిషాలు వివశులై చూస్తారు ఆ అద్భుత ప్రకృతిని! ఆ మనోహర దృశ్యం చూసి కొన్నిరోజులు విడవకుండా అదేపనిగా చూస్తే...? ఏ అందమూ కనపడకపోగా.. ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాము.. ఇంకే శబ్దమూ వినపడనీయని ఆ హోరుకి చెవులు దిబ్బడ వేస్తాయి. కాస్త ప్రశాంతి దొరికేచోటుకి పారిపోబుద్ధి వేస్తుంది... ప్రశాంతి లభ్యమయ్యేచోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం... హ... నా వ్యామోహం గతి అంతే అవుతుంది.
ఈ ఇరవై రోజులలో మొత్తం పద్దెనిమిదివేలు ఖర్చయింది!.. డబ్బు మాటేమైనా.. మనసుకి విశ్రాంతి అన్నది ఒక్కక్షణం దొరకలేదు...
కారులో ఓ మూలకి ఒదిగి కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎందుకో జాలి అనిపించింది... ఈ ఇరవై రోజులలో మానసికంగానేకాక శారీరకంగా కూడా దూరమైంది నాకు శాంతి.. అనురాగంతో నా మనసు నిండిపోయింది.
ఎడం చెయ్యి జాపి శాంతి భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గిరకి లాక్కున్నాను... "అలా వున్నావేం శాంతీ" అన్నాను ఆదరంగా. ఈ ఇరవై రోజులలో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట ఇదే!
"ఎలా వున్నాను..." తన మామూలు సామ్యతతో నెమ్మదిగా అంది శాంతి. గోడలమీద పోస్టర్లపై నయీరోష్ నీ అన్న "సినిమా పేరు కన్పించింది. రెండో ఆట ప్రారంభించి చాలాసేపయి వుంటుందని తెల్సినా సిల్లీగా సినిమాకి వెళదామా శాంతీ" అన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది "ఇప్పుడా" అంది. అంతలోనే సర్దుకుని "మీ యిష్టం..." అంది.
"వూరికే అన్నాను.. వద్దులే...." అన్నాను శాంతిని మరింత దగ్గిరగా లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసునిండా ఆవరించుకున్న చీకటి తొలగి.... 'నయారోష్ నీ' ప్రసరించిన యీ రాత్రి సినిమాహాల్లో వృధా చేసేంత 'ఫూల్'ని మాత్రం కాను... కాలేను...
ఏక్సిలేటర్ గట్టిగా నొక్కాను.
* సమాప్తం *