Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి  పేజి 15


                          ఆడవాళ్ళు అమ్మమ్మలు కాకుండా
                                    ఉండకూడదూ?

    సావిత్రి అద్దం ముందు నిల్చుని తల దువ్వుకుంటూ పాపిడిలో బయలు దేరిన తెల్ల వెంట్రుకలను లాగి పారీయాలని తాపత్రయపడుతుంది. అవి చేతికి దొరక్కదొరికినవి తెగక , తెగినవి నల్ల వెంట్రుకలవుతూ నానా అల్లరి పెడ్తున్నాయి.
    కృష్ణమూర్తి జోళ్ళు తొడుక్కుంటూ భార్య వంక చూశాడు. "ఇంకా ముస్తాబే అరంభించలేదా? ఐదున్నర దాటింది. టైమవుతుంది' అన్నాడు.
    'ఉండండి...ఏమండీ, ప్లీజ్ యిదిగో యీ తెల్లవెంట్రుకలు నాలుగూ లాగేద్దురూ, రాకుండా వున్నాయి....' అంటూ దగ్గరికి వచ్చి తల వంచింది.
    'అబ్బ వుండనిద్దూ వుంటే ఏం అయింది?"
    "అసహ్యంగా కనిపిస్తున్నాయి.....ముడేసుకుంటే బాగుండదు...."
    "ఎన్నని పీకేస్తావు? వయసుదాటుతుంటే జుట్టు తెల్లబడుతుంది. దానికోసం యింత ఆరాటం ఎందుకు?....పదహారేళ్ళ బాలకుమరిలా కనిపించడానికెనా యీ తాపత్రయం?....." టీజ్ చేసాడు భార్యని.
    సావిత్రి దిగాలు పడి చూసింది. 'నిజంగా అంత వయసు మళ్ళిన దానిలా కనిపిస్తున్నానేంటండీ .....ముసలిదానిలా అగుపిస్తున్నానా?...."
    "ఏమిటి సిల్లీ ప్రశ్నలు....పద.....పద టైమవుతుంది.' జవాబు చెప్పకుండా తప్పించుకుంటూ తొందర పెట్టాడు.
    "చేపుదురూ ....ఎంతసేపు, పావుగంటలో తయారవుతాగా....' బ్రతిమాలిడింది.
    సావిత్రి ముఖంలో ఆరాటం , ఉత్సుకత చూస్తుంటే నవ్వు వస్తుంది కృష్ణమూర్తి కి . ఈ మధ్య అస్తమాను ఏవో యిలాంటి ప్రశ్నలు వేస్తూనే వుంది.
    "ఏమండీ , యిదివరకటి కంటే రంగు తగ్గిపోయాను కాదూ, ఏమిటో ఆ రంగంతా పోయింది" అంటూ నిట్టురిస్తూ అడుగుతుంది ఓసారి. 'జుట్టంతా వూడిపోతుంది. పల్చబడి పోయింది , ఏం చెయ్యడం' అంటూ వాపోతుంది మరోసారి. 'ఈ కళ్ళ క్రింద నల్లచారలేమిటండీ బయలుదేరాయి- ఏం చేస్తే పోతాయో తెలుసా మీకు' అంటూ ఆరాటంగా ప్రశ్నిస్తుంది మరోసారి.
    "ఛ.....ఎంత డైటింగ్ చేస్తున్నా యీ పొట్ట ఎందుకు ఇలా పెరుగుతుంది' అంటూ విసుక్కుంటుంది.
    'ఏమండీ ఏ ఎక్సర్ సైజ్ చేస్తే నడుం, నడుం క్రింది భాగం తగ్గుతుందో తెలుసా?" అరాలు తీస్తుంది.
    'నిజం చెప్పండీ, ముప్పై ఎనిమిదేళ్ళ దానిలా కనిపిస్తానా నేను....అంతవయసు వున్నట్టు అవుపిస్తానా.....చిన్నదానిలా కనిపిస్తానా చెప్పండీ' అంటూ వేధిస్తుంది.
    కృష్ణమూర్తి యిలాంటి ప్రశ్నలు తరచు సావిత్రి నోట ఈ మధ్య వింటూనే వున్నాడు. అంతేకాక భార్యలో బ్యూటీ కాన్షస్ ఎంత పెరిగిందో చూస్తుంటే అతనికి చిత్రంగా వుంది. భోజనం సగానికి సగం తగ్గించేసింది. రాత్రి పూట రెండంటే రెండు చపాతీలు తింటూ వళ్ళు పెరగకుండా డైటింగ్ చేస్తుంది. ఉదయానే తలుపులు బిగించుకుని ఎక్సర్ సైజులు చేస్తుంది. సాయంత్రం పూట తను రాలేనన్నా బలవంతాన రోజూ వాకింగ్ కి తీసుకేడ్తుంది . అంతేకాదు జుట్టు ఊడకుండా వారానికి రెండు సార్లు నూనెలు, ఆముదాలు మర్ధించుకుని తలంటుకోవాలని ఎక్కడ చదివిందో ఎవరో చెప్పారనో అలా చేస్తుంది. అంతేకాదు జుత్తు తెల్లబడకుండా నిగనిగలాడ్తుందని ఎవరో చెపితే మందారాకుల ముద్దలు నూరి తలకి పట్టించికోడం జుత్తు నెరియకుండా వుసిరికాయ పచ్చడి రోజూ తినడం, టర్కిష్ టవల్ బాత్స్ వగైరాలతో జుత్తుకి సంరక్షణలు చేస్తుంది. ఇవన్నీ అయ్యాక మొహానికి ముస్తాబులు సరే యేవో క్రీములు లోషన్లు, ఆయింట్ మెంట్స్ రకరకాలు ముఖానికి రాత్రింబవళ్ళు పాముకుంటుంది. ఆపైన పౌడర్లు , ఐబ్రో పెన్సిల్సు , లిప్ స్టిక్ లు అవీ సరేసరి!
    ఇదంతా చూస్తుంటే భార్యకి శరీర పోషణ పట్ల వున్న శ్రద్దా సక్తులకి మెచ్చుకోవాలా వద్దా అనిపిస్తుంది. ఒకోసారి ఈవిడకి యింత తాపత్రయం ఎందుకు అందం పట్ల అవి మరోసారి అనుకుంటాడు! యివన్నీ వయసుని మరుగుపరిచి మభ్య పెరచటానికేనా అనిపిస్తుంది. వయసుని దాచేసి చిన్న దానిలా కనిపించడానికి యింత తాపత్రయం ఎందుకో అతనికి అర్ధం అయ్యేది కాదు! ఏ పెళ్ళి కాని పిల్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళో పడే తాపత్రయాలు సావిత్రి కెందుకో ననుకునేవాడు. పెళ్ళి కావాల్సిన పిల్లలున్న సావిత్రికి యిప్పుడీ ఆరాటం ఏమిటోననిపించేది. ఆ మాట వుండబట్టలేక ఒకసారి అడిగేశాడు కూడాను.
    "ఏం, ముప్పై ఎనిమిదేళ్ళ కే ముసలిదానిలా తయారవాలా ......నా ఖర్మ కొద్దీ వేగిరం పెళ్ళి చేసేశారు మావాళ్ళు , పిల్లలు తొందరగా పుట్టుకొచ్చారు.....అంత మాత్రానికి ముసలి దాన్నవుతానా, ముప్పై ఐదేళ్ళ వాళ్ళు యింకా పెళ్ళి కాకుండా వుంటున్న ఈ రోజుల్లో నాకేం వయసు మించి......"
    "వాళ్ళకి కాలం, ఖర్చ కాలిసి రాక పెళ్ళి కానంత మాత్రాన వాళ్ళ వయసు ఇరవై ఏళ్ళ దగ్గిర ఆగిపోదుగా...... వయసు పెళ్ళి అయినా మానినా మొహం మీద తెలుస్తూనే వుంటుంది...."
    ఆ మాటతో సావిత్రి దిగులుగా, చిన్నపుచ్చుకొన్న మొహంతో 'అయితే నిజంగా నేను వయసు మళ్ళిన దానిలా కనిపిస్తున్నానన్న మాట...... అంటూ మొదటి కొచ్చింది.
    ఆ మాట గుర్తు వచ్చి ఆరాటంగా చూస్తున్న భార్యని చిన్న పుచ్చటం ఇష్టం లేక , "ఏమో ఎవరికెలా కనిపిస్తావో కాని నాకు మాత్రం కాపురానికి వచ్చిన రోజు ఎలావుండేదానివో అలాగే పద్దెనిమిదేళ్ళ దానిలాగే కనిపిస్తున్నావు సుమా. అసలు నిజానికి అప్పటికంటే యిప్పుడే బాగున్నావు. నాకు అప్పుడు సన్నాగా ఈసురోమని వుండేదానివి. కాస్త వళ్ళు వచ్చి యిప్పుడే చక్కగా  వున్నావు" అవకాశం దొరికితే వృధా పుచ్చని మగ మనస్తత్వంతో సావిత్రిని దగ్గిరికి లాక్కుంటూ అన్నాడు కృష్ణమూర్తి.
    సావిత్రి బుగ్గలు ఎర్రబడ్డాయి. వదిలించుకుంటూ 'నిజం చెపుదురూ మీరెప్పుడూ యిలాగే అంటారు....'
    'అదిగో చెప్పు, చెప్పు అంటావు. చెపితే నమ్మవు. నేనేం చేసేది. ఇంతకీ ఈరోజు సినిమాకి వెళ్ళడం వుందా లేదా...."
    "ఇదిగో అయిపొయింది. ఐదు నిమిషాలు...." ముడి చుట్టుకోడం మొదలుపెట్టింది సావిత్రి.
    సావిత్రికి భర్త మాటల మీద నమ్మకం లేదు, మొగుళ్ళ అందరూ పెళ్ళాలను మంచి చేసుకోడానికి యిలా అంటారని సావిత్రి నమ్మకం. ఎంత కోతిలా వున్నా వాళ్లవసరం కోసం రంభలా వున్నావు అంటూ డబ్బెస్తారని సావిత్రికి తెలుసు. అంచేత నిజానిజాలు మొగుడి ద్వారా రాబట్టడం కష్టం అని తెల్సినా అలా సందర్భం దొరికినప్పుడల్లా ఆ ప్రసక్తి ఎత్తి అడుగుతూనే వుంటుంది.
    మొగుడ్ని కాక ఇంకెవరినైనా యీ ప్రశ్నలు అస్తమానం ఏమనిపిస్తుంది. ఏ కూతురునో అడిగితె 'అబ్బ! నీకస్తమానం ఇదే గొడవ సిల్లీగా అడుగుతావు. నాకు తెలియదు బాబు' అంటూ విసుక్కుంటుంది.
    "ఏ స్నేహితురాలి దగ్గిరో లౌక్యంగా ఈ ప్రసంగం ఎత్తితే ముసలి వాళ్ళం కాక పడుచువాళ్ళం అవుతామేమిటి రోజు రోజుకి .....అయిపొయింది మన కాలం .....అమ్మమ్మలవుతాం యింక" అంటూ చప్పరిస్తారు.

 Previous Page Next Page