Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 13


    ఇంటి గేటుదగ్గర కారు ఆపేశాను.. పెట్రో ఎమ్టీ చూపిస్తూందని గేటు దగ్గరకొచ్చిన డ్రైవరుని కారు తీసికెళ్ళి పెట్రోలు పోయించి రమ్మని పంపాను......
    వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూము దగ్గిరకి వచ్చేసరికి లోపలనించి శాంతి, రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినపడి ఇద్దరం అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేసి ఆగిపోయాం..
    "...నిజం అండీ ఆయనకి నేను తగినదాన్ని కాను అనిపిస్తూంది.. నేనేం చెయ్యను... ఆయన అభిరుచులు వేరు.. ఆయనకి కావల్సినట్లుండడం నాచాతకాదు.. నాకేమితో ఆ క్లబ్బులు పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చావు. అవన్నీ ఆయనకి కావాలి.. నేనలా వుండనని ఆయనకి కోపం, అసంతృప్తి"
    "అలా అని మీరెందుకనుకుంటున్నారు..." రామావతారం అడిగారు.
    "ఎలా.. ఎందుకంటే నే జవాబు చెప్పలేను.....కాని ఈ ఇరవై రోజులనించి మీనాక్షిగారు వచ్చిం దగ్గరనించి ఆయన ఎప్పుడూ లేనంత ఉలాసంగా వుంటున్నారు. ఆవిడ అన్నింటిలోనూ ఫార్ వర్డ్ గా ఉంటారు... ఆయనకి అలా వుండేవారు నచ్చుతారు.. అందుకే అంత సంతోషంగా వున్నారు... ఆయనకి అలాంటి భార్య కావాలి... నేను... నేను... నన్ను పెళ్ళాడి ఆయన సుఖపడ్డం లేదని బాధపడుతున్నారేమో అనిపిస్తూంది..." వ్యధగా వుంది శాంతి గొంతు.
    ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమయింది? బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏదన్నా మాట్లాడుకుంటూంటే.. ఈ ఇరవై రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న, శాంతి మనసు నొచ్చుకుని వుంటుంది! ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి వుంటుంది! గిల్టీగా ఫీలయ్యాను.
    "అలా మీరు బాధపడడంలో అర్థం లేదంటాను.. ఒకవేళ నిజంగా మీవారు అలా ఫీలయితే అది తాత్కాలిక వ్యామోహం!.... అది ఆయనకి ఇప్పుడు గాకపోయినా కొన్నాళ్ళకయినా అర్థం అవుతుంది... నేనూ మొదట్లో మీనాక్షికి తగినవాడిని కాను అనిపించేది! కాని తరువాత ఆలోచిస్తే నాలాంటివాడే మీనాక్షికి వుండాలి అని ధృడపరచుకున్నాను. మా మీనాక్షికి ఇంటి సంగతి పట్టదు! ఎంతసేపు తిరుగుడు కావాలి! ఫ్రెండ్స్, పార్టీలు, పిక్నిక్ లు, డ్రింక్స్... సోఫిస్టికేటెడ్ లైఫ్ మీద ఆమెకి మోజు! నేను ఆవిడకు పూర్తి వ్యతిరేకం అందుకే నన్ను ఉత్త బుద్ధావతారం అని తిడ్తుంది! ఆవిడ రమ్మన్నచోటికి రానని కోపగించుకుంటుంది.. కాని మీరు ఆలోచించండి... ఆవిడ ఇంటి సంగతి పట్టించుకోదు.. పిల్లలు తిన్నారో మానారో, చదువుకున్నారో లేదో ఒక్కసారయినా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు, ఇవాళ ఇలా ఖర్చుపెట్టేస్తే రేపటి మాట ఏమిటి అన్న ఆలోచన లేదు.. ఎంతసేపూ రోజుకో చీర, సినిమాలు సరదాలు తప్ప మరో ధ్యాస లేదు. ఎంత టైము లేకపోయినా పిల్లల సంగతి కాస్తో కూస్తో నేనే చూసుకోవాలి... డబ్బు ఇంటికి తీసుకొస్తే మరి మీనాక్షి నిలవనీయదని ముందే బ్యాంకులో వేసేది వేసి ఇంటికి తీసుకొస్తాను.. అరడజను సినిమాలకి వెళదామన్న మీనాక్షిని నేను కంట్రోలు చెయ్యలేక ఆవిడని వదిలేసినా నేను ఒక్కడ్నే వెళతాను... తప్పనిసరి అయిన పార్టీలకు అటెండ్ అవుతాను. అవసరముందంటేనే పార్టీలు ఇస్తాను.. అంతలా మీనాక్షిని ఎన్నివిధాలుగానో వెనకనించి కంట్రోలు చేస్తుంటేనే మా సంసారం ఈ మాత్రం నిలుస్తూంది.. సపోజ్ నేనూ మీనాక్షిలాగే వుంటే ఇంక ఆ సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి.. చూడండి శాంతిగారూ.. ఈ సంసారమనేది బండి అయితే భార్యా, భర్తలలో ఒకరు గుర్రం, మరొకరు రౌతు అనుకుంటే.. వళ్లూ, పైతెలీకుండా అదుపులేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం! వళ్ళు తెలీయకుండా రౌతూ గుర్రాన్ని పరిగెట్టిస్తే ఆ బండి ఎప్పుడో అప్పుడు బోల్తా పడడం తథ్యం!.. అలాగే సంసారంలో భార్యాభర్తలు చూడండి, పొంగే పాలు పొయిలో పడకుండా వుండాలంటే నీళ్ళు చిలకరించేవారు కావాలిగానీ, మరింత మంట ఎగద్రోసేవారుంటే... గిన్నెడు పాలు బూడిదపాలు అవుతాయి.. ఈ సంసారమూ అంతే శాంతిగారు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకలాంటివారే అయివుండాలని కోరుకోడంకంటే విభిన్న మనస్తత్వాల కలయిక అయితేనే ఆ సంసారం రాణిస్తుందన్నది నా ఉద్దేశం... సపోజ్ నాలాగే మీనాక్షి వుంటే బొత్తిగా ఆ సంసారంలో చైతన్యం లోపిస్తుంది! వెనకనించి మీనాక్షి పోరు ఉండబట్టిగదా అప్పుడప్పుడు సినిమాలు, పార్టీలకు అవీ వెళుతుంటాను.. బొత్తిగా ఆ మాత్రం సరదాలు కూడా లేకుండాపోతే లైఫ్ డల్ గా వుంటుంది! అన్నీ సమపాళ్ళో వుండాలి.. పాలు పొంగిపోతాయని అసలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేదెలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అసలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరతాం? శాంతిగారూ, దేవుడు వెర్రివాడుకాడు ఇలాంటి జంటల్ని కూర్చడానికి.. కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం వున్నవారెవరైనా ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలుండవని నా ఉద్దేశం! మీ ఆయన మీరేదో ఆయనతో సరిగా వుండరని అసంతృప్తి అని మీరంటున్నారు.. మీరూ ఆయనలా నిజంగా ఉంటే మీమీద విముఖత్వం కలగటానికి ఆయనకెన్నాళ్ళో పట్టదు.. సంసారం స్థిరంగా సాఫీగా సాగుతన్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు .. మీలాంటి భార్య దొరికినందుకు మీవారు అదృష్టవంతులు. అలా ఆలోచించలేని వారు.. ఎవరయ్యేది ఫూల్స్... మా మీనా నాకు తగిందికాదని నేను కలలో కూడా అనుకోను ఎప్పుడూ..."

 Previous Page Next Page