ఇంటికి వచ్చాక పార్వతమ్మ , శారద ఒకటే హడావుడి చేసి పిండి వంటలు చేసి భోజనం పెట్టారు. శారద అక్కయ్యా, అక్కయ్యా అంటూ ఒక్కక్షణం వదలకుండా వెంట వెంట ఈ కబురు ఆ కబురు చెపుతూ తిరుగుతూ వుండడంతో యింట్లో అసలు మాట్లాడే వీలు చిక్కలేదు.
సాయంత్రం అతని స్నేహితులు, తన స్నేహితులు మొత్తం ఏభైమందికి హోటల్లో పార్టీ ఏరెంజ్ చేశారు. ముస్తాబయి, పార్టీకి వెళ్ళి, అంతా ముగిసి ఇంటికి వచ్చాక పార్వతమ్మ స్నానం చెయ్యమని, తెల్లచీర కట్టుకోమని కన్నతల్లిలా చెప్తుంటే ఆవిడ చెప్పినవన్నీ తు.చ తప్పకుండా చేసింది. శారద సన్నజాజులు, మరువం కట్టిన మాల యిచ్చింది. "చూడమ్మాయి, నీకు తల్లి తోడు ఎవరూ లేరు, పెద్దదాన్ని చెపుతున్నాను....మాధవ్ , రాధ.... ఆ రాధాకృష్ణుల్లా కలిసిపోవాలి. అతని మనసెరిగి మసలుకో. నీకేం కావాలన్నా నేనున్నాను అడుగు" అంటూ పాలగ్లాసు చేతిలో పెట్టింది.
"రాధా...."ఆర్తిగా ఆమె చుట్టూ చేతులు బిగించాడు మాధవ్...."రాధా యింతా లశ్యమా....నీకోసం చూసి చూసి ....మధ్యాహ్నం ఎందుకు రాలేదు ?
"మీ పిన్నిగారి కూతురు.....అంటే మీ చెల్లాయి గాబోలు.....అక్కయ్యా అంటూ తోకలా వదిల్తేనా...' రాధ నవ్వుతూ అంది.
'అవునూ , నీకంటే అంత పెద్దగా కనిపిస్తుంది. అక్కయ్యా అంటుందేమిటి? భలే చెల్లెలు దొరికిందే రాగానే...." మాధవ్ హాస్యంగా అన్నాడు.
"పెళ్ళయినదానిని నన్ను చెల్లీ అంటే ఏం బాగుంటుందని కాబోలు" రాధ నవ్వింది.
"రాధా.....యిప్పుడామ్మాయి సంగతే మాట్లాడడం: అంటూ రాధని తమకంగా దగ్గిరగా హత్తుకున్నాడు..."రాధా" మత్తుగా అన్నాడు.
అతని గుండెల మీద తల అన్చిన రాధ కదిలితే ఆ సుందర స్వప్నం మాయమవుతుందేమోనన్నట్టు నిశ్చలంగా , నిశ్శబ్దంగా తల ఆనించి మైమరపుతో కళ్ళు మూసుకుంది.
"రాధా .....ఏమిటలా ఉండిపోయావు...." ఆమె తలని గుండెల మీద నించి లేపి కళ్ళల్లోకి అనురాగంతో చూస్తూ అడిగాడు.
"నా అదృష్టం మీద నాకింకా నమ్మకం కలగడం లేదు మాధవ్.....ఎక్కడో అనాధగా పుట్టి.....నా అన్నవారి ఆప్యాయత అనురాగం లేకుండా గాలికి ధూళికి పెరిగిన ఈ పూవూ ఈనాడు మాధవ్ హృదయంలో చోటు సంపాదించుకుంది. నాకే నమ్మకం కల్గడంలేదు. మాధవ్.....పదిహేనేళ్ళ అనాధాశ్రమంలో పడిన నరకం, ఆ తరవాత నా కాళ్ళ మీద నేను నిలబడానికి పడిన యాతన, ఆ కష్టాలన్నీ యేవో గత జన్మలో జరిగినవిగా అనిపిస్తుంది యిప్పుడు...."
"ష్....రాధా.....మనం ఇప్పుడు మాట్లాడుకోవల్సినవి అవా? ఆ కష్టాల కధ మర్చిపో."
"కాదు మాధవ్ నన్ను చెప్పనీ.....ఏ కులమో, గోత్రమో తెలియకుండా పెరిగిన నేను యింత గొప్పింటి కోడల్ని అవగలనని , నాకోసం యింత అదృష్టం దాచి వుంచాడు దేముడిని ఎన్నడూ అనుకోలేదు."
"రాధా....కులం, గోత్రం యివన్నీ నాకక్కరలేదు. ఈ అందం, నీ సంస్కారం చాలు నాకు. నిజంగా ఏ గొప్పింటి బిడ్డో నిన్ను కని శరణాలయం పాలు చేసింది. లేకపోతే యింత అందం నీకెక్కడ నుంచి వచ్చేది? యింత సంస్కారం నీకెలా అబ్బేది?"
"కాబోలు ....నా అందమే నాకు శత్రువైంది. మాధవ్ యిన్నాళ్ళూ....శరణాలయంలో పెరిగినన్ని రోజులూ గుమస్తా దగ్గిర నుంచి వంటవాడి వరకు ప్రతివాడి చూపుల నించి వాళ్ళు విసిరే ఉచ్చుల నించి తప్పించుకోవడానికి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు మాధవ్. నా అందం చూసి పెళ్ళి చేసుకుంటాం అని ఎందరో వచ్చారు."
"మరి ఎందుకు చేసుకోలేదు....అనాధగా పుట్టి నీకు పెళ్ళి అనే వరం దొరికి స్వేచ్చగా దొరుకుతుంటే ఎందుకు చేసుకోలేదు" కుతూహలంగా అడిగాడు.
"ఈ మాధవ్ లాంటి పుణ్యపురుషుడు నాకు రాసి పెట్టి వుండగా ఎవరో చదువు సంస్కారం లేని వాళ్ళని ఎందుకు చేసుకుంటాను? శరణాలయం అధికారులు ఆ వచ్చిన సంబంధాలలో ఒకటి కుదిర్చి పెళ్లి చేసి పంపి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. కాని నేను వప్పుకోలేదు."
'అలా నీవనడానికి హక్కు వుందా?"
"శరణాలయం ప్రతి అనాధకి ఉచితంగా మెట్రిక్ వరకు చెప్పిస్తారు. ఆ తరువాత పెళ్ళి చేసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తే పెళ్ళి చేసి పంపిస్తారు. ఉద్యోగం చేసుకుంటామంటే ఏదో ఉద్యోగం చూపించి బాధ్యత తీర్చుకుంటారు. నాకు పెళ్ళి వద్దు ఉద్యోగం చేసుకుంటానన్నాను. ఓ ప్రవేటు స్కూల్లో ఉద్యోగం చూపారు."
"నిజంగా రాధా....మెట్రిక్ చదివి నీ కాళ్ళ మీద నీవు నిలబడి ప్రవేటుగా చదివి ఎమ్మే పాసయి కాలేజిలో లెక్చర ర్ గా చేరావంటే నీ పట్టుదల, కృషి మెచ్చుకోవలసిందే" మెచ్చుకోలుగా అన్నాడు మాధవ్.
'అంత సుళువుగా అనేశావు గాని, గత ఏడేళ్ళగా ఎంత బాధపడి, ఎన్ని కష్టాలు పడి , ఎంత త్యాగం చేసి ఈ స్థాయికి చేరానో నీకర్ధం కాదు. స్కూళ్లో పనిచేస్తూ, ప్రవైట్లు చెప్పుకుంటూ, రాత్రిళ్ళు కూర్చుని ప్రైవేటుగా చదువుకుంటూ , డబ్బు చాలక ఒంటిపూట తిని, చుట్టూ సీతాకోకచిలకల్లా అలంకరించుకునే ఆడపిల్లల మధ్య రెండు చీరలతో గడుపుతూ చదువే ఒక తపస్సుగా చేసి ఎమ్మే అయిన రోజున లోకంలో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినంత అనందం కల్గింది.
"రాధా.....మొదటి రోజు కామన్ రూములో ఎవరితో మాట్లాడకుండా మూల కూర్చున్న నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీలో ఏదో విలక్షణత వుందని గుర్తించాను సుమా....." రాధ ముంగురులు సవరిస్తూ అనురాగంతో అన్నాడు మాధవ్.
"ఏమిటో ఆ విలక్షణత?" చిలిపిగా అంది రాధ.
"ఏమో! ఫలానా అని అనుకోలేక పోయాను. అందరిలాంటిది కాదు అని. నీవు కట్టుకున్న అతి మాములు వాయిలు చీర, నుదుట ఎర్రని పెద్దని బొట్టు, చేతికి మట్టి గాజులన్నా లేకుండా , మెడలో నకిలీ హరమన్నా లేకుండా , నీ లేమితనం దాచుకోవడానికి ప్రయత్నించని నీ ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. కాలేజిలో లెక్చరర్ గా చేరిన ఆమె నిరాడంబరంగా వుందంటే ....లేమితనమా , ఫ్యాషనా అన్పించింది."