"అమ్మా! జానకీ! తండ్రి ఉన్నాడని గుర్తుంచుకోమ్మా, గుర్తుంచుకో తల్లీ" అని బావురుమన్నాడు కూతుర్ని కావిలించుకొని.
జానకి తండ్రి కన్నీరు తుడిచింది. తన కళ్ళు తుడుచుకుంది.
"అమ్మా! నేను దౌర్భాగ్యుణ్ణి, దరిద్రుణ్ణి. ఆస్తిని హరించాను, మీ అమ్మను మింగాను, ఒక్కగానొక్క కూతురు, నీకు పెళ్ళి చేయలేకపోయాను. ఒక అయ్య చేతిలో పెట్టలేక పోయాను. కాలం కత్తుల వంతెన అయింది. కట్నాలు మనుషుల్ను కాలపెడ్తున్నాయి. ఏం చేయమంటావు తల్లీ! అత్తింట్లో ఉండగా చూడాల్సిన నిన్ను కొలువుకు పంపుతున్నాను. నీ సంపాదన మీద బతుకుతున్నాను. ఇంతకంటే నీచం ఏం కావాలి? నువ్వు ఆలస్యంగా వస్తే నా ప్రాణాలు లేచిపోతుంటాయి. నిన్నని లాభం లేదు. వయసు అలాంటిది. అది చంచలనం అయింది. అది దారి తప్పిస్తుంది. కన్ను కాననీయదు. గుంతలో పడేదాకా తెలియదు. ఆ తరువాత తెలిసీ ప్రయోజనం లేదు. నిగ్రహం వహించాలమ్మా, నిగ్రహం. మనం భారతీయులం_ హిందువులం. సీతా, సావిత్రి, అనసూయ పుట్టిన భూమి ఇది. నిగ్రహానికి మారుపేరు భరతభూమి. మన కులానికీ, మతానికీ, వంశానికీ కళంకం రానీయకు. నిన్ను వేడుకుంటున్నానమ్మా" చెప్పాల్సిందంతా వడిసి పోవడంతో కుర్చీలో కూలబడ్డారు ముకుందంగారు.
జానకి నుంచునే వుంది. వినడం అయిపోవడంతో ఏదో ఆలోచిస్తూంది. ముకుందంగారు కూతుర్ని తదేకంగా చూస్తున్నారు.
"నేనేం చేశానని నాన్నా?" ఎన్నో అడుగుదామనుకుంది జానకి. కట్నాలు మన సంప్రదాయమా? ఆడపిల్ల ఆర్జించటం కుసంప్రదాయమా? ప్రేమకు మతాలూ, కులాలు ఉంటాయా? మానవులందరినీ భగవంతుడు ఒకే విధంగా సృష్టించలేదా? ఇంకా ఎన్నో అడుగుదామనుకుంది. కాని అన్నమాట అది.
"ఏం చేశానో? ఏం చేస్తానో? ఎలా తెలుస్తుందమ్మా! ఈ గోడ ఆవల జరిగేదాన్ని చూడలేం. నీ మనసులో ఏముందో నేను గ్రహించలేను. ఏం చేశావని కాదు, ఏమీ చేయవద్దని నేను కోరేది."
"చేయగూడని పని ఏదీ చేయను నాన్నా" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది జానకి.
వెళ్ళిపోతున్న జానకిని చూచాడు తండ్రి. అనేక ప్రశ్నలు అతని మెదడ్లో ప్రవేశించాయి. ప్రశ్నల పరంపరలు. సమాధానం లేదు. అనుమానాలెన్నో_ఆధారాల్లేవు.
ఆ రాత్రి ముకుందంగారికి నిద్రలేదు. జానకి ఏదో దాస్తున్నది. దాపరికం లేకుండా మాట్లాడ్డం లేదు. దోవ తప్పుతుందా? తప్పదు. తన కూతురు! తాను తప్పలేదూ? తప్పాడు. తాను మగాడు! అయినా బుద్ధి తెచ్చుకున్నాడు. భార్యను మింగాడు. ఆ తరువాత ఆడదాని ముఖం చూళ్ళేదు. జానకి కూడా తరవాత బుద్ధి తెచ్చుకుంటుందా? ఛీ ఛీ ఏమిటి ఆలోచనలు! ఆడది కాలు జారడం ఒకేసారి. అంతే! పతనం. పాపం_అవన్నీ చెప్పాడు కూతురుకు. సావిత్రి, అనసూయ, సీత అందరి గురించీ వివరించాడు. అయినా కాలు జారుతుందా? ఏమో! ఎందుకలా అనుకోవాలి? తన బుద్ధులు ఎందుకు రావాలి జానకికి? తల్లి గుణాలు అబ్బకూడదూ! వెంకాయమ్మ పతివ్రత! ఎన్నడూ తనను పల్లెత్తుమాట అనలేదు. తానే హత్య చేశాడామెను! అవును తానే చంపాడు. ఆడది అలాగే ఉండాలా? అన్ని ఆశల్నూ చంపుకోవాలా? హతమారిపోవాలా? అవును అంతే! అది మన వారసత్వం. అంతే, ఆడది ఉద్యోగం చేసిందా? చేసిందా ఎన్నడన్నా? ఎప్పుడు చేసింది? తాను ఉద్యోగం చేయిస్తున్నాడు. జానకి ఉద్యోగం మాన్పిద్దాం అనుకున్నాడు. వెంటనే దారిద్ర్యం వికృతరూపంతో ప్రత్యక్షం అయింది, నల్లని ముసుగుతో ప్రత్యక్షం అయింది. వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షం అయింది. లేదు, జానకి కొలువు మాన్పించడానికి వీల్లేదు. జానకికి పెళ్ళి చేయాలి! పెళ్ళంటే_డబ్బు! కట్నాలు. అట్టహాసం! ఏముంది తన దగ్గర? ఏమిటి తాను? ఏమీలేదు. ఏమీకాడు. భగవంతుడే శరణ్యం. "లావొక్కింతయు లేదు." పద్యం చదివారు ముకుందంగారు. రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టారు. భారం భగవంతునికే అప్పగించారు. నిద్ర రాలేదు. కాని కళ్ళు మూసుకున్నారు.
ఆ రాత్రి జానకిని నిద్రపట్టలేదు. ఎందుకు తననలా అనుమానిస్తాడు తండ్రి? ఏం చేసింది తాను? ఆడపిల్ల అంటేనే అంతా? అనుమానాలకు మారుపేరు ఆడతనమా? ఆడది అంటే అరికాలి క్రింద రాయాల్సిందేనా? చేసిందేమిటి తాను? కాస్త ఆలస్యంగా వచ్చింది ఇంటికి. అది మహాపాపమా? తాను పాతకం చేసిందా? తండ్రి తనను గుర్తించడా? తండ్రే అనుమానిస్తాడా? వంశం, సాంప్రదాయం, కుటుంబం_ తండ్రి చేసిందేమిటి? తన తల్లిని దిగమింగాడు? అది సాంప్రదాయమా? అది ఆచారమా? అది నాగరికతా? తాను ఉద్యోగం చేస్తూంది. కుటుంబం గడుపుతూంది. మగానికంటే తానేం తక్కువ చేస్తూంది? అయినా ఇసుమంత స్వేచ్చ లేదా తనకు? ఆడది అంటే బానిసేనా? భర్తకు బానిస, అన్నకు బానిస, తండ్రికి బానిస, ఏమిటీ సంప్రదాయం? ఏమిటీ ఆచారం? తనకు కొన్ని భావాలున్నాయి. ఆలోచనలున్నాయి. ఆశలున్నాయి. ఆశయాలున్నాయి. తాను ఆడది. తనకో తోడు కావాలి. తనలాంటి జోడుకావాలి. పాల్ కనిపించాడు. మంచివాడు. తనవలే ఆలోచించేవాడు. తనకు జోడు, తోడు ఇంత కాలానికి దొరికాడు. ఇప్పుడు విడుచుకోవడమా? అతను కిరస్తాని. తండ్రి సహించడు, తనకు వాటిలో నమ్మకం లేదు. మనిషిగా అతడు గొప్పవాడు. తండ్రిని ఎదిరించాలా? ఎదిరించగలదా? ఎదిరించాలి. అందుకు శక్తి కావాలి, బలం కావాలి. "శక్తి ప్రసాదించు స్వామీ! బలం కలగచేయి భగవంతుడా!" ప్రార్థించింది జానకి. అయినా నిద్రపట్టలేదు జానకికి! ఏవేవో ఆలోచన్లు ముసురుకున్నాయి.
తెల్లవారింది, రమాదాసి వస్తే తలుపు తీసింది జానకి. తండ్రి మంచం చూచింది. ఇంకా పడుకునే ఉన్నారు ముకుందంగారు. జానకి ఆశ్చర్యపడింది. తండ్రి తనకంటే ముందు లేచేవారు, వాకింగ్ కు వెళ్ళేవారు. ఇవ్వాళ ఇంకా లేవలేదు. అంతగా పట్టించుకోలేదు. దొడ్లోకి వెళ్ళింది. రమాదాసి అడిగింది. తోటి ఆడది అడిగితే గుండె విచ్చింది. జరిగినదంతా వివరంగా చెప్పింది. డాక్టర్ కలిశాడనీ, మాట్లాడామనీ చెప్పింది. ఏదీ దాచలేదు. రమాదాసికి అందులో కానిపని ఏమీ కనిపించలేదు. డాక్టర్ను పొగిడింది. పేదవాళ్ళను డబ్బడగడన్నది. వైద్యం బాగా చేస్తాడన్నది. వివక్షత చూపడన్నది. దేవుడన్నది. దైవం లాంటి వాడన్నది.
జానకి కాఫీ కప్పు తెచ్చింది తండ్రికోసం. ముకుందంగారు ఇంకా లేవలేదు, లేపింది. మూలుగుతూ ముసుగు తొలగించారు.
"వళ్ళు బాగాలేదమ్మా. కాసేపు పడుకోని."
"కాదు నాన్నా! కాఫీ తాగి పడుకో."
ముకుందంగారు లేచారు. ముఖంలో జ్వరం కనిపిస్తూంది. నొసలు మీద చేయివేసి చూసింది. మండిపోతూంది.
"జ్వరం వచ్చింది నాన్నా? వళ్ళు మసిలిపోతూంది."
"వచ్చి ఉంటుందమ్మా_నాకేం తెలీడం లేదు. వళ్ళు నొప్పులుగా ఉంది. తల బద్దలవుతూంది. కాస్త అమృతాంజనం రాయి తల్లీ."
"నాన్నా! డాక్టర్ను పిలిపించనా?"
"ఎవరు? కిరసానీ డాక్టరునేనా? వద్దమ్మా. చూద్దాం. మరీ తగ్గకపోతే ఎటూ తప్పదు."
"నాన్నా! డాక్టరుకూ...."
"నువ్వూరుకో తల్లీ! నీకు పిచ్చి పట్టింది. అందర్నీ వెనకేసుకొస్తావు. నేను అవునన్నది కాదనడం నీ మతం. వాళ్ళు పాముల్లాంటివాళ్ళు. వాళ్ళు మన సంప్రదాయాన్ని, మతాన్నీ నాశనం చేశారు. ఇంకా చేస్తారు. నీకర్థం కాదు. నన్ను వాగించకు."
ఏదో అనాలనుకుంది జానకి. నోటిదాకా వచ్చింది. అనలేదు. కాఫీ కప్పు అందించింది. తాగారు తండ్రి. అమృతాంజనం రుద్దింది. అక్కణ్ణుంచి లేచిపోయింది. రమాదాసితో చెప్పింది. తాను డాక్టరు దగ్గరికి వెళ్తానంది. మందు తెస్తానంది. చూద్దామన్నది జానకి.
జానకికి మనసేం బాగాలేదు.
జానకి ఆ రోజు స్కూలుకు వెళ్ళలేదు.