Previous Page Next Page 
జనపదం పేజి 13


    "ఏం చెయ్యాలి?" ఈ ప్రశ్న శివరావు మెదడును చీల్చింది. బలరామయ్యను సంప్రదించాడు. జంగయ్యను ఖతం చేసి తీసికెళ్ళాలని సలహా ఇచ్చాడు. శివరావుకది నచ్చలేదు. సుందరరావుగారి ఉపవాసం అతన్ని అంత ఊపేసింది!    
    తెల్లవారింది . కొనవూపిరితో ఉన్న జంగయ్యనూ, ఊపిరి లేని పోలీసునూ లారీలో వేసుకొని ఊరు వదిలారు. శివరావూ, బలరామయ్యా పోలీసు బలగంతో , రాముడు ఊళ్ళోనే ఉండిపోయాడు.
    శివరావు ఇంటికి చేరేవరకు రోదన ధ్వనులు వినిపిస్తున్నాయి. గుమ్మంలో అడుగుపెట్టగానే అతని భార్య సావిత్రమ్మ అతన్ని చుట్టేసుకొని హోరుమంది. శివరావు స్థాణువులా నుంచున్నాడు . అతని ముందే ఘోరమైన దృశ్యం. శివరావు కూతురు స్వరాజ్యం -ఆరేళ్ళ ముద్దుపాప - లారీ కింద పడ్డది. తల నలిగిపోయింది. మెదడు బయటికి వచ్చింది. అది చూశాడు శివరావు భరించలేకపోయాడు. "పాపా" అని కేక పెట్టి పాపా మీద పడిపోయాడు. కన్నీరు కాలువలు కట్టింది. గుండెలు అవిసేట్టు ఏడుస్తున్నాడు. అతన్ని చూచే వాళ్ళకు దుఖం వస్తుంది.
    అతడు పోలీసు కాదు - తండ్రి శివరావు!
    జంగయ్యను కాన్సెంట్రేషన్ క్యాంపులో వేశారు. విడిగా వున్న మైదానం చుట్టూ ముళ్ళతీగ చుట్టారు. ఆచ్చాదన లేదు. జనం క్రిక్కిరిసి ఉన్నారు. జంగయ్యకు అప్పటికి స్పృహ వచ్చింది. అతని స్థితి చూసి నలుగురూ దూరం జరిగి అతనికి కూర్చునే స్థలం ఇచ్చారు. నీళ్ళడిగాడు. నలుగురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. రోజు మొత్తానికి లోటా నీరు మాత్రమే ఇస్తారు. అందులోనే అన్నీ గడుపుకోవాలి. అయినా కొద్ది నీళ్ళిచ్చారు. త్రాగాడు జంగయ్య. కొద్దిగా స్థిమితపడ్డాడు.
    "ఎందుకొచ్చిన్రీడికి?" అడిగాడు ధ్వని నీరసంగా ఉంది.
    "పట్టుకొచ్చిన్రు"
    "ఎందుకు?"
    "నిన్నెందుకు తెచ్చిన్రు?"
    "దొరకేదురు తిరిగిన"
    "ఊరికేనే తెచ్చిన్రు మమ్మల్ని - తుపాకులోండ్లల్ల చేరిన మంటున్రు"
    "ఎట్లున్న దీడ?"
    "అడుగుతావు? చూస్తున్నావు కద. ఒక్కపాలి చంపుతే బాగుండేడేది. గిద్దెడు గుగ్గిళ్ళు లోటేడు నీళ్ళిస్తరు. ఎండనక వాననక గిట్లనే చావాలె. గత్తర తగిలింది కెంపుల. ఇయ్యాల పది పీనిగల్ను పట్కపోయిన్రు . మనతోనే బొందలు సుతపెట్టిస్తున్రు. సొరాజ్జమొచ్చిందంటాన్రేమో మేల్ల. అంటే మల్ల దొర ల్రాజ్జమేనంటావా?"
    జంగయ్య మాట్లాడలేదు. అతనికేదో తల తిరిగుతున్నట్లయింది. కళ్ళ ముందు చీకట్లు కనిపించినాయి. కూర్చున్నాడు సోలాడు. తూలాడు. పక్కనున్న వారు పట్టుకున్నారు. వళ్ళు మసిలిపోతుంది. పేలాలు వేగేట్లున్నాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    "ఏం చేద్దమంటావ్?" ఒకడు అడిగాడు.
    "చేసెడిదేముంది చూస్తుందం" ఇంకొకడన్నాడు.
    "దేవుడా! జల్ది పాణం తీయి. నీ దయ" అన్నాడు మరొకడు.
    తెల్లావారే వరకూ జంగయ్య గాయాలన్నీ చీములు పట్టాయి. వళ్ళంతా సలుపులు, తీవ్రమైన జ్వరం. అందులో వాంతులూ విరేచనాలు. ఆ సాయంకాలానికే కాళ్ళూ చేతులు చల్లబడ్డాయి. ప్రాణాలు ఎగిరిపోయాయి! పక్కనున్నవారు కన్నీరు కార్చారు!!
    మూడో నాడు శవాన్ని పూడ్పించారు.
    వార్త ఊరికి ఆలస్యంగా చేరింది. చేరి ఊరు ఏడ్చింది. వల వలా ఏడ్చింది. లబలబ మొత్తుకో లేకపోయింది. పోలీసుల బెదురుకు కుమిలి కుమిలి ఏడ్చింది. అ ఊరు నిద్రపోలేదు. ప్రతి ఇంట్లో అతనికి సంబంధించిన కధలు చెప్పుకున్నారు.
    గడిలో రాముడికి నిద్ర పట్టలేదు. అతడికి మర్రిచెట్టు దయ్యం ఆవరించింది. కన్ను మూసినా, తెరిచినా మర్రిచెట్టు కనిపిస్తుంది. మర్రి దగ్గరకి వెళ్ళాలి. కాని ధైర్యం చాలడం లేదు. తుపాకుల వాళ్ళ భయం. పోలీసులను తీసికెళ్ళలేడు. పోలీసుల భయం! ఎవరినీ నమ్మలేదు. అంతా తనను మోసం చేస్తారని బుగులు. ఈ బుగులుతో నిద్రపట్టలేదు. అతడు ఎవరినీ నమ్మడు. తనను తానే నమ్మని దశకు వచ్చాడు. ఏం చెయ్యాలో తోచదు. మనసులో ఆరాటం. మనసులో మంట. మనసులో తహతహ. మాట చెప్పలేదు. మనిషిని నమ్మలేడు. అయినా ధైర్యం చేశాడు. తెగించాడు. చావుకూ సిద్దమయ్యాడు. తెల్లావారు జామున మసక చీకట్లో, ముసుగు వేసుకొని బయలుదేరాడు. చెంబు తీసుకొని బయల్దేరాడు. అదొక నెపం. ఊరు దాటాడు. గుండె గుబగుబ లాడుతుంది. శ్మశానానికి చేరాడు. తల్లిని కాల్చిన చోటు చూశాడు. మనసులో తల్లి వెలిసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. గిరుక్కున వెనక్కు తిరిగాడు. పెద్ద పెద్ద అంగలు వేశాడు. మర్రి కిందకి చేరాడు. తాను వేసిన పాత గుడ్డలు లేవు. పాతిన చోటు కనిపించలేదు. ప్రాణాలు అవుర్న పోయినాయి. కూలబడ్డాడు. చతికిల బడ్డాడు. ఒకసారి చుట్టూ చూశాడు. మర్రి ఊదా గుర్తును పట్టి తోడాడు. మళ్ళీ చుట్టూ చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. దూరాన కుక్క ఏడుస్తుంది. ఇంకా తోడాడు. తోడాడు. మసక చీకట్లు మాయం అవుతున్నాయి. ధైర్యం విచ్చుకు పోతున్నది. అయినా గుండెను బండను చేసుకున్నడు. తవ్వుతున్నాడు. తోడుతున్నాడు. వచ్చేసింది కనిపించింది. మూట! అదే గుడ్డ గుండె గంతేసింది. అయినా అనుమానమే. ఎప్పుడైనా చిల్ల పెంకులు కట్టి పెట్టాడేమో! మూట పైకి తీశాడు. చుట్టూ చూశాడు. ఏదో అలికిడి వినిపించింది మర్రి చాటు నుంచి. మొదట వెనుక నుంచి , మూట చంకన పెట్టుకొని మర్రి చాటుకు పరిగెత్తాడు.  చూశాడు ఏమీ లేదు. తొండ ఎండు టాకుల మీద పరిగెత్తుతుంది. రాముడు నవ్వుకోవాల్సింది. అంత ధైర్యం లేదు. మళ్ళీ చుట్టూ చూశాడు. అక్కడే చతికిల బడ్డాడు. మూట విప్పాడు. జిగేలుమన్నాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. బంగారు నగలు! నోట్లు! డబ్బు! వేలితో గెలికి చూశాడు. అన్నీ ఉన్నాయి. మూట కట్టాడు. చంకన పెట్టుకున్నాడు. ముసుగు కప్పుకున్నాడు. ఊరి వైపు సాగాడు. కాళ్ళు ఊగిసలాడుతున్నాయి. కళ్ళు ఎందుకో మసకలు కమ్ముతున్నాయి.
    రాముడి చంకన మూట ఉంది. అది అతనికి ధైర్యాన్ని ఇవ్వాల్సింది. కాని పామును చంకన పెట్టుకున్నట్లు బెదురుతున్నాడు. ఈ డబ్బు విషయంలోనే తుపాకుల వాళ్ళతో కలహించాడు. వాళ్ళతో విడిపోయాడు. చెప్పకుండా పారివచ్చాడు. వారు పగబట్టారు. ఇది పగ సొమ్ము. దొంగసొత్తు . అందువల్ల అతనికి భయం. అయినా గబగబా వచ్చాడు. గడిలో ప్రవేశించి గదిలో దూరాడు. తలుపులు వేసుకున్నాడు. కూర్చున్నాడు మూట విప్పాడు. ఒక్కొక్కటే లెక్కపెట్టాడు అన్నీ ఉన్నాయి. నోట్ల కట్టలు రోంటికి కట్టుకున్నాడు. మరి నగలు! వీటిని ఏం చేయాలి! ఎక్కడ పెట్టాలి! మూటకట్టి మూలకు పెట్టాడు. గది బయటికి వచ్చాడు. గదికి తాళం వేశాడు. గుంజి చూశాడు. కాలు కాలిన పిల్లిలా తిరిగాడు. గుండెలో గుబగుబ తగ్గలేదు. మూట మర్రి కింద ఉన్నప్పుడూ బుగులే ,అది రొంటిన చేరిన బుగులే. ఏదో అగ్గిమూట దగ్గర పెట్టుకున్నట్లుంది. అటూ ఇటూ తిరిగాడు. ముందరి నుంచి వెనక్కు వెనుక నుంచి ముందుకు , ఎందుకీ భయం? ఏమిటీ భయం? ఎలా పోతుందీ భయం? ఏమీ అర్ధం కాలేదు.

 Previous Page Next Page