Previous Page Next Page 
మనసున మనసై పేజి 14


    'నే చచ్చే వరకు పోదు' కసిగా అంది జయంతి. దమయంతి నవ్వింది. 'అక్కా చిన్నప్పటి సుమతి పద్యం గుర్తు తెచ్చుకో. 'తన కోపమే తన శత్రువు...తన శాంతమే తనకు రక్ష.....అక్కా....అయిందేదో అయింది. అతనిప్పుడు నీ చెల్లెలి భర్త. మన కుటుంబంలో వ్యక్తి. వూరికే శత్రుత్వాలు పెంచుకుని ప్రయోజనం ఏముంది చెప్పు. అతను నీవు అవమానపరిచావన్న కోపంతో ఏదో ఆవేశంలో నీకు బదులిచ్చి అవమానపరిచాడు. దానికి కారణం నీవేగా, అక్కా అతను నా దగ్గర ఎంతో బాధపడ్డాడు తన మూలంగా నీవు ఇల్లు విడిచావని.  నీకు అపాలజి చెప్పడానికి నీ ఇంటికి వెడదాం అని కూడా అన్నాడు".
    "నాకేం అపాలజీలు చెప్పక్కరలేదు. రానక్కరలేదు....'కసిగా అంది జయంతి.
    'అక్కా ఒక్క మాట చెప్తున్నాను. ఈ నెల రోజులలో ఆయనతో సాన్నిహిత్యం తరువాత నీవు ఎంత మంచి వ్యక్తిని చేతులారా చెయ్యిజార్చుకున్నావో నీకు తెలియదు. నా అదృష్టం కొద్ది అతను నాకు దొరికాడు- రత్నం లాంటివాడు"
    "అవును.... బొగ్గులోంచేగా రత్నాలు పుట్టేది "వ్యంగ్యంగా అంది- దమయంతి మనసు ఒక్కక్షణం చివుక్కుమన్న వెంటనే దులుపేసుకుని నవ్వుతూ 'బాగా చెప్పావు. బొగ్గుల్లో రత్నాలను అందరూ గుర్తించలేరులే.....బొగ్గుల్లో వెతుక్కుంటే రత్నాలు దొరికేది ఎవరికో అదృష్టవంతులకేలే. జయంతి చెల్లెలి వంక చుర చుర చూసి 'అబ్బో - ఈ మాత్రానికే ఇంత మిడిసిపడిపోతున్నావు. ఇంకాస్త అందగాడు దొరికితే మఏమయ్యేదానివో.
    'అందగాళ్ళను నీలాంటి వారికోసం వదిలేసా మరి.... చాల్లే అక్కా నీకు ఇంకా ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుందో తెలియడం లేదు నాకు....' అంటూ ఎవరో తెలిసిన వారు పలకరిస్తే 'హలో...' అంటూ అటు వెళ్ళింది. జయంతి ఉడుక్కుంటూ మొహం ముడుచుకుంది. తనవైపు దివాకర్, గోపాలకృష్ణ రావడం చూసి మొఖాన నవ్వు పులుముకుంది. దివాకర్ చనువుగా 'వీడి మిసెస్ మీ చెల్లెలట కదా. మన పరిచయాలు, చుట్టరికాలు ఈ పెళ్ళిలో బాగా కలిశాయి' అన్నాడు.
    తన గురించి దివాకర్ కి ఏం చెప్పాడో, జరిగింది చెప్పే వుంటాడా, ఇంక ఏం ఏం కల్పించి చెప్పలేదుగదా.....అవన్నీ వింటే దివాకర్ కి తన మీద సదభిప్రాయం పోతుందేమో- బలవంతంగా నవ్వు పులుముకుంది. మనం ఇంక వెడదామా- పది అయింది. మా ఇంటి ఓనర్ గేటు తాళం పెట్టేస్తుంది' అంది మాటమార్చి.
    "ష్యూర్, వెడదాం అని చెప్పడానికే వచ్చా. ఓ.కే గోపీ, మనం సావకాశంగా తరువాత కలుద్దాం....దమయంతి గారూ మీ ఇద్దరూ మా ఇంటికి ఓసారి రావాలి.
    'మేం సరే, మీరు ఒంటరిగా వున్నారు. సెలవు రోజుల్లో భోజనానికి వస్తుండాలి'.
    'ఓ ష్యూర్ నాలాంటి బ్యాచిలర్ గాడికి ఇంటి భోజనం దొరికితే సంతోషంగా పరిగెత్తివస్తాను' నమస్కారాలు చేసి జయంతి, దివాకర్ బయటపడ్డారు.
    'మీ ధర్మమా అని మా ఇద్దరి స్నేహితులని కలుసుకోగలిగాను' కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు.
    'మధ్య నా ధర్మం ఏముందిందులో..' జయంతి నవ్వింది.
    'ఉష గారు మీ స్నేహితురాలవడం వల్ల గదా నాకూ ఇన్విటేషన్ వచ్చింది- మీ అందరికంపెనీతో ఈ రోజు చాలా సరదాగా గడిచింది. రేపుగాని, ఎల్లుండిగాని మనం అందరం మళ్ళీకలుద్దాం, శ్రీధర్ డిన్నరిస్తాన్నాడు గదా"
    అతనితో పరిచయం పెంచుకొనే అవకాశాలు ఒకదానితో ఒకటి రావడం మనసులో చాలా సంతోషం కల్గించింది. కాని తమ మధ్య ఆ గోపాలకృష్ణ ఉనికి భరించాల్సి రావడం అన్నది ఆమెకు చాలా అసహనాన్ని కలిగించింది.
    
                                     * * *
    
    బ్యాంక్ లో మధ్యాహ్నం లంచ్ టైమ్ లో దివాకర్ జయంతిని పిలిచాడు-
    'ఇందాక శ్రీధర్ ఫోన్ చేశాడు' ఇవాళ రాత్రి వైస్రాయ్ హోటల్ లో డిన్నరిస్తున్నాడట. మనందరిని రమ్మని ఫోను చేశాడు. మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టాడు.
    'నేనూ నా... మీరంటే స్నేహితులు... మధ్య....' జయంతి గొణిగింది.
    'ఉషారాణి మీరు స్నేహితులుగదా. మీరు రాకపోతే ఆవిడ నన్ను పట్టుకుంటుంది. సాయంత్రం ఏడుగంటలకల్లా రెడీగా వుండండి, వచ్చి పికప్ చేస్తాను...' మరోమాటకి అవకాశం ఇవ్వకుండా కాగితాల మీద సంతకాలు పెట్టసాగాడు.
    ఎనిమిది గంటలకంతా హోటల్ కు చేరారు. దివాకర్ జయంతి వెళ్ళేసరికే ఉషారాణి, శ్రీధర్ గుమ్మంలోనే నిలుచుని రిసీవ్ చేసుకున్నారు. అప్పటికే దమయంతి, గోపాలకృష్ణ వచ్చి వున్నారు. గోపాలకృష్ణని చూసి మొహం చిట్లించింది జయంతి. అది దమయంతి దృష్టిని దాటిపోలేదు. జయంతి ముస్తాబు కూడా దమయంతి దృష్టిని దాటిపోలేదు. నిన్న, ఈ రోజు జయంతి ముఖంలో వెలుగు, ఆమె అలంకరణ పట్ల చూసిన ప్రత్యేక దృష్టి, నిన్న ఈ రోజు కూడా దివాకర్, జయంతి కలిసి రావడం అంతా గమనిస్తూనే ఉంది. వాళ్ళిద్దరు కారు దిగి లోపలికి వస్తుంటే గోపాలకృష్ణ చెవిలో 'ఇద్దరి జంట బాగుంది కదూ, దివాకర్ మీకు మిత్రుడేమో, అక్కయ్య గురించి సిఫార్స్ చేయకూడదు, అక్కయ్య కోరుకున్నవన్నీ వున్న హీరోలా వున్నాడు మీ ఫ్రెండ్, ఓ మాట అని చూడండి'
    'మీ అక్కయ్యకి సిఫార్సులక్కరలేదు. ఆల్ రెడీ మావాడ్ని బుట్టలో వేసినట్లుంది' హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ.
    'మాటల మధ్యలో పెళ్ళి ప్రసక్తి తీసుకువచ్చి అతని ఉద్దేశం ఏమిటో రాబట్టండి' దమయంతి ఆర్డరు వేసినట్టుంది- 'చిత్తం దేవిగారి ఆజ్ఞ' నవ్వి అన్నాడు.
    గోపాలకృష్ణ 'నే లోపలికి వెళ్తున్నా, రాగానే మీ అక్కకి నా మొహం చూస్తే తిక్కరాగలదు'.

 Previous Page Next Page