Previous Page Next Page 
మనసున మనసై పేజి 15


    "లోపలికెడదామా...ఇంకా ఎవరన్నా రావాలా' దివాకర్ శ్రీధర్ ని అడిగాడు.
    'మా కజిన్ బ్రదర్, వాడి ఫియాన్సీ రావాలి. అమెరికాలో వుంటాడు వాడు - వాడికీ పెళ్ళికుదిరింది. ఇంకో పది రోజులలో పెళ్ళి. వాడు కజిన్ కంటే బెస్ట్ ఫ్రెండ్ అందుకే మీకు పరిచయం చెయ్యాలనీ వాడినీ ఈ డిన్నరుకి రమ్మన్నాను' మాటల్లోనే రాహుల్, భావిక వచ్చారు- ఇద్దరూ చూడగానే ఎంత చక్కని జంట అనేట్టున్నారు. భావిక నార్త్ ఇండియన్ సింధి అమ్మాయి. చాలా మంచి రంగులో నాజూగ్గా బొమ్మలా ఉంది. అందరికి తోడు అలంకరణ ఆమె రూపానికి వన్నె తెచ్చింది. బాబ్డ్ హైర్, లిప్ స్టిక్....మంచి పెర్ ఫ్యూమ్, వస్తూనే మంచి సువాసనని మోసుకువచ్చింది. రాహుల్ కూడా చాలా స్మార్ట్ గా ఆరడుగుల పొడుగు, ఓ మాదిరి తెలుపు, మంచి ఫీచర్సుతో నవ్వు మొహంతో చూడగానే మగవాళ్ళలో బాగున్న వాళ్ళ కింద లెక్క అవుతాడు. ఇద్దరికీ అమెరికాలో పరిచయం ప్రణయంగా మారింది. సెలవు మీద పెళ్ళి కోసం ఇండియా వచ్చారు. భావిక తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ చేస్తున్న సంపన్నులు. పెళ్ళి దక్కన్ కాంటినెంటల్లో చేస్తున్నారు. వాళ్ళిద్దరిని అందరికి పరిచయం చేశాడు శ్రీధర్. 'కమ్ లెటజ్ గో ఇన్ సైడ్' అని లోపలికి దారితీశాడు శ్రీధర్. ముందే బుక్ చేసిన టేబిల్ దగ్గరికి అంతా చేరారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న గోపాలకృష్ణకి దివాకర్ షేక్ హాండ్ ఇచ్చి 'నీవిక్కడ ఉన్నావా ఇంకా రాలేదే అనుకున్నాను' అన్నాడు. దమయంతికి నమస్కారం చేస్తూ ఈ దివాకర్ అతనికెందుకు అంతప్రాముఖ్యం ఇస్తాడు అనుకుంటూ మనసులో గుంజుకుంది.
    "మంగళవారం వైస్రాయ్ హోటల్లో ఆంధ్రా భోజనం స్పెషల్. ఇవాళ ఇక్కడ అన్నీ అచ్చ తెలుగు వంటలే ఉంటాయి. మామిడికాయ పప్పు మొదలు, మజ్జిగ పులుసు, అరటికాయ ఆవకూర, వడియాలు, ఊరుమిరపకాయలు, అన్ని రకాల కనీసం ఓ ముఫ్ఫై పదార్ధాలు...అరడజను సలాడ్స్, అరడజను రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎవరికేం కావలిస్తే అంత తినచ్చు. 'పర్ హెడ్ ఎంతో తెలుసా... జస్ట్ వన్ ఎయిటీ..." శ్రీధర్ అన్నాడు.
    "ఓవ్...గ్రేట్...మంచి తెలుగు భోజనం తినబోతున్నాం అన్నమాట. ఓసారీ....భావికా' అంటూ రాహుల్ ఇంగ్లీషులో అనువదించి విశదీకరించాడు విషయం. ఆ అమ్మాయి మనిషి ఎంత నాజూకూ మాట అంత నాజూకు అన్పించింది. భావిక వచ్చాక సడన్ గా జయంతికి అనీజీగా అన్పించింది. ఆ అమ్మాయి అందం, మెరిసే బట్టలు, నగలు... ముందు తను ఓ చీమో, దోమో అన్నట్టనిపించింది- అమెరికా డాలర్ల వాళ్ళ ముందు తమ ఉద్యోగాలు, జీతాలు....తన రూపం ఏవీ అతకనట్టు వాళ్ళ ముందు కుంచించుకుపోయిన భావన కలిగింది.
    'ఓ నాట్ యీవెన్ ఫైవ్ డాలర్స్ పెర్ ప్లేట్" -భావిక నాజూగ్గా అంది. డాలర్లలో లెక్కలు కట్టుకుని భోజనం ఎంత చవకో తేల్చారు.
    డాలర్లు కాకపోయినా పెద్ద బిజినెస్ మాన్ కూతురయిన ఆమెకి రూపాయలకి మాత్రం కొదువా.
    అందరూ ఎవరికి వారు ప్లేట్లు పట్టుకెళ్ళి కావల్సినవి వడ్డించుకొని తెచ్చుకొన్నారు. కబుర్లు మొదలయ్యాయి. రాజకీయాల మీద, సినిమాల మీద, అమెరికా ఇండియా తేడాల మీద జోకులు మొదలయ్యాయి. అందరికంటే ఎక్కువగా గోపాలకృష్ణ మాట్లాడుతూ జోకుల మీద జోకులు చెపుతూ నవ్విస్తున్నాడు. లాలు మీద, రబ్రీదేవి మీద జోకులు...' లాలూని ఎవరో అన్నారట నీ భార్యని ముఖ్య,మంత్రిగా చేయడం ఏం బాగాలేదు దించెయ్యి అన్నారుట- దించేయచ్చు. కానీ నాకింకో భార్యలేదే ఎలా" అన్నాడుట. అంటే తనో, తన భార్యో తప్ప ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారన్నట్టు? లాలూ రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశాక "ముఖ్యమంత్రిని అయ్యావు. నాలుగక్షరం ముక్కలు నేర్చుకో ఇప్పటికైనా" అన్నాడుట. పాపం ఆ ఇల్లాలు కష్టపడి నాలుగక్షరాలు నేర్చుకుందిట.... 'రబ్రీదేవి' అని- అంతా లాలు జోకరు రూపం గురించి మాట్లాడుకుని నవ్వుకున్నారు.
    పాలిటిక్స్ మీద, అమెరికాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికున్న మంచి పేరు గురించి చెప్పుకున్నారు. 'కాంగ్రెస్ ఇంటికో బల్బు ఇస్తాం ఉచితంగా' అంటే తెలుగుదేశం వాళ్ళు 'అదేం భాగ్యం, మే కావలిస్తే రెండిస్తాం పది రూపాయలకి ఓ బల్బ్ గా' అన్నారుట. అంటే ఉత్తి బల్బే ఇస్తారు కరెంటుండదు అని అర్ధం. గోపాలకృష్ణ ఇలాంటి జోకులు చెప్పకుంటే అమెరికాలో ఉండి ఇక్కడి వార్తలు అన్నీ అందని శ్రీధర్, రాహుల్, భావన చాలా ఆనందించి నవ్వసాగారు. దమయంతి భర్త మాటలని, జోకులని చాలా ఎంజాయ్ చేస్తుంది. దివాకర్ తనూ తీసిపోలేదన్నట్టు 'లాలూ ఓసారి ముచ్చటపడి పశువుల మధ్య ఫోటో దిగాడట. అది పత్రికలవారు ప్రచురించి కింద కాప్షన్ లొ 'ఎడమ నుంచి నాలుగో వ్యక్తి లాలూ' అని రాసారట. అంతా పడీ పడీ నవ్వారు. గోపాలకృష్ణ జోకులు వేసినపుడు బలవంతాన పెదాలు బిగపట్టుకున్న జయంతి ఈసారి నవ్వింది వెంటనే. శేఖర్, సుమన్ కండక్ట్ చేసే 'మూవర్స్ అండ్ షేకర్స్' ప్రోగ్రాములో భలే మంచి జోకులు అందరిమీద విసురుతుంటాడు. మంచి ఫేషియల్ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తాడు. "దివాకర్ అన్నాడు. 'అవును ఒకటి రెండుసార్లు చూసాను. బాగుంటుంది' అన్నాడు శ్రీధర్. 'ఆ ప్రోగ్రాం లో ఓ జోకుచెప్పనా. ఓ, లేడీస్ వున్నారు... వద్దులే' అన్నాడు దివాకర్. "ఏం అంత నాన్ వెజ్ జోకా' రాహుల్ కొంటెగా అడిగాడు. 'పెర్మిట్ మీ....' అంటూ ఆడవారి వంక చూశాడు.
    "గో ఎ హెడ్ మై బాయ్....సరదాకి చెప్పు......ఏమనరులే' ప్రోత్సహించాడు శ్రీధర్.
    'ఓసారి జనాభాలెక్కలు రాసుకునే వాళ్ళు ఓ ఇంటికొచ్చి లెక్కలు రాసుకుంటూ- భార్యా భర్తల వివరాలు అయ్యాక-పిల్లలు ఎందరు?' అన్నాడుట. 'ఇద్దరూ' అన్నాడుట ఆసామి. 'సెక్స్' అన్నాడు. పాపం ఆసామి సిగ్గుపడి గొణుగుతూ 'వారానికోసారి' అన్నాడుట....జనాభాలెక్కల మనిషి కంగారుపడి....' అదికాదు సార్ మేల్ ఆర్ ఫిమేల్ అని అడుగుతున్నాను' అనడిగాడట... ఆ జోకుకి అంతా పగలబడి నవ్వారు. పక్క టేబుళ్ళ వాళ్ళు అంతా ఇటే చూస్తున్నారు.

 Previous Page Next Page