"ఉషారాణి గారి పెళ్ళి ధర్మమా అని, ఆవిడ స్నేహితురాలు జయంతిగారి ధర్మమా అని అనుకోకుండా మనం ఇలా కలుసుకున్నాం. నీ శుభలేఖ చూసి మీ నాన్నగారి పేరు చూడగానే నీవేవనిపించి జయంతిగారిని అడిగి వచ్చాను ఇలా"
'ఓ అయామ్ టూ గ్లాడ్... ఇక్కడే వుండు నా పక్కన, మనం చాలా మాట్లాడుకోవాలి.
నాకు చెప్పకుండా వెళ్ళద్దు'. వచ్చి పలకరించేవాళ్ళకి నవ్వు మొహంతో నమస్కారాలు పెడ్తూ, కాస్త ఖాళీ దొరికినపుడు దివాకర్ తో చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నాడు శ్రీధర్.
'ఊఁ! ఏమిటి... ఎంత వరకు వచ్చింది వ్యవహారం కలిసి కారులో ఇద్దరూ వచ్చారంటే అనుకున్నదానికంటే స్పీడ్ గానే ప్రొసీడ్ అవుతున్నట్లున్నావు' హాస్యంగా అంది ఉషారాణి.
"ఏడిచావు అదేం కాదు. అతను వూరికి కొత్త. పెళ్ళికి మీరు వెళ్తున్నారు. నాకు దారి తెలియదు కలిసి వెడదాం అంటే సరే అన్నా'
'అదేలే ఏదో వంక ఉండాలిగా పరిచయాలు పెరగడానికి-కీపిట్ అప్, ఛాన్సు వదులుకోకు...' ఉషారాణి హాస్యం ఆడింది.
'అరే అక్కయ్యా.... నీవు వచ్చావా పెళ్ళికి...' దమయంతి, గోపాలకృష్ణ ఎప్పుడు డయాస్ మీదకి వచ్చారో జయంతి మాటల్లోపడి చూడలేదు. దమయంతిని, గోపాలకృష్ణ ని చూడగానే జయంతి మొహం అప్పటి వరకు వెలిగిపోతున్నది కాస్త మబ్బు కమ్మినట్లయింది. 'నీవా...ఈ పెళ్ళికి' ఆశ్చర్యంగా అంది.
'పెళ్ళి కొడుకు ఈయనకి మేనత్త కొడుకు, మేం చాలా సేపయింది వచ్చి, నీవు రావడం చూసి వచ్చాను....' దమయంతి నవ్వుతూ అంది.
'నమస్కారం వదినగారూ' గోపాలకృష్ణ చనువుగా జయంతిని నమస్కారం చేస్తూ నవ్వాడు. జయంతి మొహం ఎర్రబడిపోయింది. మొఖం చిట్లించింది.
'హాయ్....కృష్ణా....ఏమిటీ రోజు ఇన్ని ప్లెజంట్ సర్ ప్రైజెస్...నీవేమిటి ఇక్కడ..." దివాకర్ ముందుకు వచ్చి గోపాలకృష్ణ భుజంపట్టుకులాగి తన వైపు తిప్పుకుని అన్నాడు. గోపాలకృష్ణ ఆశ్చర్యానందాలతో 'అరే, దివాకర్ ఎన్నాళ్ళకి కలుసుకున్నాం. నీవీ పెళ్ళికి ఎలా...." దివాకర్ భుజం చుట్టూ చెయ్యివేసి స్నేహితుడ్ని కౌగిలించుకున్నాడు. 'అరేయ్ శ్రీధర్ ఈ దివాకర్ నేను జబల్ పూర్ లో పనిచేసినపుడు ఇద్దరి బాచిలర్స్ మే ఇల్లు షేర్ చేసుకుని మూడేళ్ళున్నాం. అప్పటి స్నేహం మాది' అని పరిచయం చేశాడు గోపాలకృష్ణ. 'దివాకర్ నా చిన్నప్పటి క్లాస్ మేట్. పదిహేనేళ్ళ తరువాత ఇవాళ కలిశాం' శ్రీధర్ అన్నాడు.
'హౌ స్మాల్ వరల్డ్ ఈజ్' ఉషారాణి నవ్వుతూ అంది.
'ఐ షుడ్ థాంక్ ఉషారాణి గారు అండ్ జయంతిగారు - వీళ్ళిద్దరి వల్లే మనం ఇలా కలుసుకున్నాం' దివాకర్ నవ్వుతూ అన్నాడు.
'ఉయ్ మస్ట్ సెలబ్రేట్ దిస్ అకేషన్.... రేపు ఈ పెళ్ళి హడావిడి అది అయ్యాక మనం అంతా మళ్ళీ ఏ హోటల్లోనో కలుసుకోవాలి. ఐ విల్ అరేంజ్ ఎ డిన్నర్' శ్రీధర్ అన్నాడు.
ఇంకా రేపటి నించి నీవు మాకెక్కడ దక్కుతావు నాయనా, ఉషారాణిగారు కొంగున ముడేసుకుంటారు....' గోపాలకృష్ణ నవ్వుతూ హాస్యం ఆడాడు.
'స్వానుభవంగాబోలు. నెల రోజులయినా ఇంకా మా వాడు దమయంతిగారి కొంగుముడి విప్పుకున్నట్టు లేదు. శ్రీధర్ బావ గోపాలకృష్ణ భుజం తట్టి నవ్వుతూ అన్నాడు.
అంతా నవ్వారు....'సో లెటజ్ మీట్ సమ్ వేర్ టుమారో...ఫిక్స్ చేసి ఫోను చేస్తాను. నే పెళ్ళి హడావిడిలో వుంటాను....మీరంతా భోజనం అదీ చేసి వెళ్ళాలి....గోపి అతిథి సత్కార్యం బాధ్యత సరిగా చూడు నువ్వు....'
'డోంట్ వర్రీ.... నే చూసుకుంటాలే వీళ్ళ సంగతి....' అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ.
దివాకర్ భుజం చుట్టూ చెయ్యివేసి 'రా....డైనింగ్ హాల్ కి వెడదాం....దమ్మూ మీ అక్కయ్య సంగతి నీవు చూడు....' అన్నాడు.
ఇంత చక్కని సాయంత్రం ఇంత ఆనందకర సమయంలో గోపాలకృష్ణ తమ మధ్య ఉండటం ఇటు దివాకర్ కి, అటు శ్రీధర్ కి స్నేహితుడు, బంధువు అవడం మింగుడు పడని నిజంలా! చక్కని విందు భోజనంలో పంటికింద రాయిలా కంట్లో నలుసులా అనిపించింది. అతన్ని తప్పించుకోలేని విధంగా అతను ఉష భర్తకి బంధువవడం, ఇటు దివాకర్ స్నేహితుడవడం, జయంతి ఉత్సాహాన్నంతా మాయం చేసింది. తప్పనిసరిగా దమయంతి వెంట డైనింగ్ హాల్ కి వెళ్ళింది.
"ఏంటక్కయ్యా-అలా అయిపోయావు. మా ఆయన్ని చూసా, ఇంకా నీకు ఆయన మీదకోపం పోలేదా...' ప్లేటులో అన్నీ పెట్టుకుని ఓ కుర్చీ చూసుకుని కూర్చుంది జయంతి అక్కగారి పక్కన ఓ కుర్చీలాక్కుని కూర్చుంది దమయంతి.