Previous Page Next Page 
డాళింగ్ పేజి 14

 

    మధ్యాహ్నం నాలుగంటలైంది.
    పల్చటి ఎండలో వాతావరణం మనోహరంగా వుంది.
    ఊటీ నుంచి మద్రాసు వెళ్ళే హైవేలో , రోడ్డుకి కుడిపక్క ఓ గ్రామంలోకెళ్ళే దారుంది -------
    కొండవారన ఆ గ్రామం వుంది. గ్రామంలో గుడిసెలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
    ఏదో గుడి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
    కారుని అటువేపు తిప్పింది మాధురి.
    రోడ్డునుంఛి కొండవారకు వెళ్ళడానికి పది నిమిషాలు పట్టింది.
    మొదటగా కనిపించింది వినాయకుడి గుడి. దాని పక్కనే పెద్ద రావి చెట్టు.
    ఆ పక్కన చిన్న పందిరి.
    ఆ పక్కన తేయాకు తోటలు.
    ఆ తోటలకు కుడిపక్కన సెలయేరు. సెలయేరులో చిన్న పిల్లలు ఈతలు కొడుతున్నారు.
    ఆ పిల్లల్తో ఆడుతూ, అక్కడొక వ్యక్తీ. వెనక్కి తిరిగి ఉండటం వల్ల ఏం కన్పించటం లేదు. ఒడ్డూ, పొడుగూ అంతా విమల్ లాగానే వున్నాడు.
    విమలేనా?
    పరుగు పరుగున గుడిదాటి , రావిచెట్టు దాటి, తేయాకు తోటలు మధ్యలోంచి వెళ్ళింది.
    "విమల్" గట్టిగా పిలిచింది.
    ఆ పిలుపుకి పిల్లల్తో ఆడుకుంటున్న విమల్ తలతిప్పి చూసాడు.
    అక్కడ, అలా విమల్ కన్పిస్తాడని , కలలో కూడా ఊహించలేదు మధురి కళ్ళల్లో ఎంతో సంతోషం, ఎంతో ఆశ్చర్యం , ఎంతో అనందం, ఉద్వేగం.
    "మాధురి , నువ్వు ఇక్కడికి ......ఇలా!"
    "మహానుభావా ! నన్ను చూసి ఆశ్చర్యపోవడం కాదు, మీ రు సడన్ గా ఎవరికీ చెప్పకుండా మాయమైపొతే, బయటేంత గగ్గోలుగా ఉంటుందో మీకు తెలుసా?"
    "కూర్చో." తనో రాతి బండమీద కూర్చుంటూ , ఎదురుగా వున్న ఇంకో బండవేపు చెయ్యి చూపించాడు కుర్చోమన్నట్టుగా.
    "చూడండీ మాధురీ. ఇక్కడెంత బాగుందో. ఈ ప్రశాంతమైన వాతావరణం మనకెప్పుడైనా దొరుకుతుందా. ఈ పిల్లల్లా మనం ఇంత స్వేచ్చగా ఉండగలమా, కేరింతలు కొట్టగలమా, వీళ్ళ చుట్టూ అంతులేని పేదరికం వున్నా ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నారో . మన చుట్టూ ఎంతో ఐశ్వర్యం వున్నా, నిరంతరం విషాదం, మన డబ్బు, మన హోదా ' మనకు కన్నీళ్ళే  మిగులుస్తాయి మాధురీ. చెప్పండి. ఇందులో నిజం లేదంటారా?"
    ఆ మాటలంటున్నప్పుడు విమల్ ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. అలసట వల్ల, ఎంతో దూరం నడిచి రావడం వల్ల మధురికీ అలసటగా ఉంది. అయినా ఆనందంగా వుంది.
    "ఇక్కడ ఉండిపోతారా, రండి ......వెళ్దాం ." తను లేవడానికి ప్రయత్నిస్తూ అంది మధురి.
    తప్పదంటారా అన్నట్టుగా చూసాడు విమల్.
    "రండి సార్, ఊరంతా తగలబడి పోతుంటే హీరో గారు పిడేలు వాయిస్తూ కూర్చున్నాడట. అలా వుంది మీ వ్యవహారం" అంది నవ్వుతూ లేచి నిలబడింది.
    అక్కడ నుంచి వెళ్ళిపోతున్న ఆ ఇద్దరి వేపు ఆ పిల్లలు విచిత్రంగా చూస్తూ నిల్చున్నారు.
    మట్టిదారిలో ముందు మాధురి, వెనుక విమల్ నడుస్తున్నారు.
    "నిన్నరాత్రి అసలేమైంది విమల్. " ఆ ప్రశ్న మాధురి నాలుక చివరి వరకూ వచ్చింది.
    మళ్ళీ విమల్ ఎలా రియాక్టవుతాడో , తెలీక ఊరుకుంది.
    నెమ్మదిగా కారు డోర్ తీసి విమల్ వేపు చూసింది. విమల్ మాట్లాడకుండా సీట్లో కూర్చున్నాడు.
    డ్రైవింగ్ సీట్లో, కూర్చుని , ఇగ్నిషన్ కీ తిప్పింది.
    కారు డ్రైవ్ చేస్తూనే మిర్రర్ లోంచి చూస్తోంది మాధురి.
    తల వెనక్కి వాల్చుకుని, ఏదో ఆలోచిస్తున్నాడు విమల్.
    "ప్రతి చిన్న విషయానికి సడన్ గా అప్ సెట్ అయిపోతారని నేననుకోలేదు." అతని ప్రాబ్రమ్స్ కానీ, ఫీలింగ్స్ కానీ తెలియకపోయినా ఆ మనిషికి ప్రస్తుతం కావాల్సింది ఓదార్పు.
    అందుకే గాల్లో బాణం వేస్తున్నట్టుగా అంది మధురి.
    విమల్ జవాబివ్వలేదు.
    "మీకెవరూ ఫ్రెండ్స్ లేరా విమల్. మళ్ళీ అడిగింది.
    విమల్ పెదవి విప్పాడు.
    "ఉన్నారు మాధురీ........ప్రెండ్, గైడ్ వెల్ విషర్ , గాడ్......అంతా ఒకటే అయిన ఒక వ్యక్తీ .....వుండేవారు . కానీ ఇప్పుడు లేరు....."
    "ఎవరా వ్యక్తీ?"
    "మా మదర్.........ఆవిడ భౌతికంగా లేకపోయినా, నా నీడలో నీడలా నా వెన్నంటే వుంటారు మాధురీ."
    "మరి మీ ఫాదర్...."
    ఆయనో సిన్సియర్ సోషల్ వర్కర్. పొలిటీషియన్. అయనా బిజీ ఆయనది. మా అమ్మగారు గనక ఇప్పుడుంటే నాకీ బాధలేవీ ఉండకపోను మాధురీ."
    "మీ ప్రాబ్లమ్స్ ఏవిటో తెల్సుకోవచ్చా" మిర్రర్ లోంచి అతని ముఖకవలలికల్ని గమనిస్తూ అంది మాధురి.
    ఒక్క క్షణం నిశ్శబ్దం.
    కారు అరవై మైళ్ళ స్పీడుతో వెళ్తోంది. గాలి చల్లగా వీస్తోంది. సాయం చీకట్లు నెమ్మదినెమ్మదిగా అలుముకుంటున్నాయి.
    "అవి మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మాధురీ. ఎవరికీ చెప్పుకో లేని ప్రాబ్లమ్స్. చెప్పినా అర్ధం కాని ప్రాబ్లమ్స్" నెమ్మదిగా అన్నాడు విమల్. అతని గొంతులో ఏదో నిరాసక్తత - జీర.

 Previous Page Next Page