షెడ్యుల్ ఆఫ్ సెట్ అవటంతో అతని మానసిక స్థితి దెబ్బతింది.
మాధురికి అంతా అయోమయంగా ఒకింత భయంగా వుంది.
ప్రొడ్యుసర్ ఏం చెప్తున్నాడో ముందసలు అర్ధం కాలేదు.
"మా డాడీకి సీరియస్ గా ఉందని ఫోనోచ్చినా , టెలిగ్రాం వచ్చినా ప్రొడక్షన్ మేనేజర్ నాకివ్వలేదు సార్. అది తెలిసి మన విమల్ నన్ను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేశారు" మాధురి బాధగా చెప్పింది.
"దారిలో విమల్ దేని గురించైనా నీతో మాట్లాడాడా" డైరెక్టర్ సందేహంగా అడిగాడు.
"లేదండి" చెప్పింది మాధురి.
"మీరోసారి వెళ్ళి, హీరో గారి సూట్ చూడండి - ఏం జరిగిందో మీరైనా వూహించగలరేమో." ప్రొడ్యుసర్ మాటతో ఆ గదిలోంచి బయట కొచ్చింది మాధురి. వెనక ప్రొడక్షన్ మేనేజరున్నాడు.
"ఎమైందసలు "చిందరవందరగా అయిపోయిన సూట్ ను చూస్తూ అడిగింది మాధురి.
"అదే అర్ధం కావడం లేదమ్మా."
"నేను నా రూమ్ కేళుతున్నాను.ప్రొడ్యుసర్ గారితో చెప్పు. విమల్ ఎకక్డకు వెళ్తాడు. ఇవాళో, రేపో వచ్చేస్తాడులే" ఆ హోటల్ ల్లోంచి బయటకోచ్చింది. తన హోటల్ రూమ్ వెళ్ళడానికి - కాని ఆమెకేదో ఒక్క క్షణం వేల్టిగా అనిపించింది, తన సర్వస్వం అనుకున్న దేదో పోగొట్టుకున్నట్లనిపించింది.
* * * *
అప్పటికి విమల్ కనిపించక 12 గంటలు కావొస్తుంది.
ఊటీ నుంచి మద్రాసు వరకూ ఈ వార్త పాకిపోయింది. మద్రాసు లోని కొన్ని తమిళ ఈవినింగ్ డైలీలు "ప్రముఖ యువ నటుడు విమల్ కిడ్నాప్ " హెడ్డింగు తో గాసిప్ స్టోరీలు రాసేసాయి.
కొంతమంది సినిమా వారా పత్రికల విలేకర్లూ , ఆదరాబాదరాగా ఊటీ పరుగెత్తుకొచ్చారు.
విమల్ షూట్ పొటోలు, హోటల్ పొటోలు , డైరెక్టర్, ప్రొడ్యుసర్ ల వెర్షన్ లతో పాటు-
పోలీసుల వెర్షన్ లు కూడా తీసుకున్నారు.
గంటలు గడుస్తున్నాయి.
విమల్ ఆచూకీ లేదు.
వార్తా గుప్పుమనడంతో విమల్ విషయం ఎమైందంటూ ఫోన్ కాల్స్ రాన్రానూ ఎక్కువై పోతున్నాయి.
* * * *
రూమ్ లో కూర్చున్న మాధురి క్కూడా ఏం తోచడం లేదు ఏం తీసుకోవాలనుకున్న సహించటం లేదు. పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది- ఆమె సూట్ లో అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
న్యూయార్క్ నుంచి ఫోన్ కాల్ తర్వాత , విమల్ సూట్ లో నుంచి మాయమయ్యాడు.
తనకు తెల్సినంతవరకూ విమల్ సెన్సిటివ్.
అంచేత, న్యూయార్క్ ఫోన్ కాల్ , రిసీవ్ చేసుకున్న తర్వాత అతను బాగా 'డిస్ట్రబ్ ' అయివుండవచ్చు.
అందరూ అనుకున్నట్టుగా అతన్ని ఎవరూ 'కిడ్ నాప్' చేయలేదేమో?
'అవుటాఫ్ మూడ్' లో -
ప్రశాంత వాతావరణం కోసం బయటకు వెళ్ళి పోయుంటాడెమో
మాధురి మనసునిండా ఆలోచనలు.
ఊటీ, చుట్టుపక్కల పరిసరాలన్నీ పోలీసులు- ప్రొడక్షన్ మనుషులు వెతుకుతున్నారు.
ఎక్కడా కనిపించలేదు.
అంటే -
చుట్టూపక్కలున్న పల్లెల్లో కి వెళ్ళిపోయాడెమో.
అందరిలా, తను ఆలోచిస్తూ, రూమ్ లో కూర్చోవటం నచ్చలేదు మాధురికి.
గబుక్కున రూమ్ లోంచి బయటికొచ్చింది.
కారులో కెక్కి కూర్చుంది.
మాధురిని చూడగానే, హలో కూర్చున్న డ్రైవర్ పరుగు, పరుగున ముందుకొచ్చాడు.
"ఎవరైనా నన్నడిగితే, రెండు గంటల్లో వస్తానని చెప్పు, రిసెప్షన్లో ఇన్ ఫామ్ చెయ్యి. " అంటూ కారుని ముందుకు దూకించింది.
మేడమ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఈ సిన్మా మరి తయారవదు. ప్రొడ్యుసర్ మద్రాసే వెళ్ళిపోవటం ఖాయం. తనలో తను ఆలోచించుకుంటూ, సర్రున ముందుకెళ్ళిపోతున్న కారువేపు చూస్తూ నిలుచుకున్నాడు డ్రైవర్.
ఊటీ ..........
పరిసర ప్రాంతాల్లో , లోయల దిగువున తోడా జాతి గిరిజిన ప్రజలు ఎక్కువగా నివస్తిస్తుంటారు.
వాళ్ళ గుడిసెలు, అక్కడక్కడ విసిరేసినట్లు గా వుంటాయి.
కొండ వారన కారాపి,
అయిదు కిలోమీటర్లు పరిధిలో , కాలినడకన , ఆ గ్రామాలన్నీ గంటల తరబడి తిరిగి తిరిగి చూసింది.
ఎక్కడా విమల్ జాడ లేదు.
కాలి నడకన తిరగడం, అలవాటు లేకపోవడం వల్ల కాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నాయి.
అయినా తన ప్రయత్నాన్ని విరమించుకొదలచుకోలేదు.
విమల్ తనకే కనిపిస్తాడని. ఎక్కడో ఆశ.
ఊటీ నుంచి మద్రాసు వెళ్ళే దారి.