Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 13

"చిక్ లీ!" అన్నాడు హరీన్ గట్టిగా "నేను నీ జింబూరూని కాను -హరీన్ నని చెబుతుంటే నమ్మవేం?"
చటుక్కున అతని చెయ్యి వదిలేసింది చిక్ లీ.
"ఎందుకూ జింబురూ ఏడిపిస్తావు నన్ను? నువ్వు సింహంతో కలబడి చనిపోయావని మీ నాయన చెప్పినా నమ్మలేదు నేను. నీ శక్తి యుక్తులు నాకు తెలుసు! ఒక సింహాన్ని కాదు, రెండు సింహాలని ఒంటి చేత్తో చంపగల వీరుడివి నువ్వు. అలాంటి నువ్వు సింహానికి ఆహారమై పోవడమేమిటి?
కానీ ఎన్నిసార్లు ప్రొద్దుపొడిచినా, ప్రొద్దు గుంకినా కూడా నువ్వు తిరిగిరాకపోయేసరికి నా గుండెల్లో గుబులు బయలుదేరింది జింబురూ. నీకోసం కంటికి మింటికీ ఏకధారగా ఏడ్చాను.
అప్పుడు హటాత్తుగా తిరిగివచ్చావు నువ్వు.
నా ప్రాణం గూటికి చేరుకున్నట్లయింది. కొండదేవతకు కోడిపుంజుని బలి ఇప్పించాను మంత్రాల మల్లన్నచేత.
మళ్ళీ ఇవ్వాళ నా కంటతడి చూడాలని నీకు కోరికగా వుందా జింబురూ! అయితే చూడు!"
చూశాడు జింబురూ.
ఆమె విశాల నయనాల నిండుగా నీళ్ళు నిలిచి వున్నాయి.
"ఒక ఆడపిల్లను ఎడిపించడమే మొగతనమను కుంటున్నావా జింబురూ! అయితే నిన్ను మించిన మొనగాడు లేడు" అంది చిక్ లీ బేలగా.
ఆమె దుఃఖం చూసి జాలితో కరిగిపోయాడు హరీన్.
"నీ జింబురూ కోసం నువ్వుపడే తపనని అర్ధం చేసుకోగలను చిక్ లీ. కానీ నన్ను నమ్ము  నేను జింబురూని కాను. నాపేరు హరీన్" అని మొదలెట్టి తను ఎవరో, ఎక్కడి నుంచి ఎలా అక్కడికి వచ్చాడో చెప్పాడు హరీన్.
చెవులప్పగించి అతను చెప్పినదంతా శ్రద్దగా వింది చిక్ లీ. విన్న తర్వాత అన్నది -
"అయితే నువ్వు జింబురూవి కావూ?"
"ఉహు........కాను"
"నేనెవరో నీకు తెలియదూ? నన్నెప్పుడూ చూడలేదూ"
"లేదు"
"మనిద్దరికీ నిశ్చితార్ధం కాలేదూ!@ మళ్ళీ నెలవంక పోడిచేరోజున మనకి పెళ్ళి చెయ్యాలని పెద్దలు నిశ్చయించలేదూ?"
"లేదు.....లేదు.......లేదు."
"అయితే ఇటురా!" అని అతని చెయ్యి పట్టుకు లాక్కేళుతూ అక్కడే ఉన్న కొండమలుపు తిరిగింది చిక్ లీ. తిరిగి తిరగగానే హరీన్ కి హటాత్తుగా అక్కడ గోచరించింది - కొండలేనే తొలచిన కొండదేవత విగ్రహం. నాలుక బయట పెట్టి ఉగ్రంగా చూస్తోంది దేవత. రెండు తాటిచెట్ల అంత ఎత్తు వుంది ఆ విగ్రహం. నోరు వుండవలసిన స్థానంలో పెద్ద గుహ వుంది.
"చెప్పు జింబురూ!" అంది చిక్ లీ ఉద్వేగంగా. "ఇందాకటినుంచి నువ్వు నాతొ చెప్పిన అబద్దాలన్నీ ఇప్పుడు ఈ అమ్మ మీద అనవేసి చెప్పు. పున్నమినాడు అమ్మనుందు చేసిన బాసలన్నీ అబద్దాలే అని చెప్పూ జింబురూ! చెప్పు!"
మౌనంగా కొండదేవత విగ్రహాన్ని చిక్ లీని మార్చి మార్చి చూశాడు హరీన్. తర్వాత స్థిరంగా అన్నాడు -
"చిక్ లీ....ఈ కొండదేవత అనగా నువ్వెవరో నాకు తెలియదు. నేను నీ జింబురూని కాను - నాపేరు హారీన్ - మాది ......"
"ఇక చాలు" అంది చిక్ లీ రోషకషాయిత నేత్రాలతో అతన్ని నిలువెల్లా దహించేలా చూస్తూ "చాలు జింబురూ ఈ అబద్దాలు! చాలించు ఈ అసత్యాలు! నాకు అంతా అర్ధమైంది. చాలా మారిపోయావు జింబురూ నువ్వు. పట్టుమని పది రోజులు పట్నవాసం చెయ్యకముందే వాళ్ళ మాయలు, మోసాలు నీకు వంటబట్టాయి. పట్నవాసపు దుస్తులు తోడుక్కువడంతోనే నీతి, నిజాయితీ ఇవన్నీ వదిలేశావా జింబురూ ? అమ్మ ముందే ఇన్ని అబద్దాలా?" అని హటాత్తుగా గుర్తొచ్చినట్లు అడిగింది. "నీతో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు?"
"ఆ అమ్మాయి పేరు కరుణ"
"పేరూ ఊరు నాకెందుకు? ఆ అమ్మాయి నీకేమవుతుంది?"
"ఏమీ కాదు" అన్నాడు హరీన్ ఇబ్బందిగా.
"హొయ్ హొయ్ హొయ్!" అంది చిక్ లీ వ్యంగ్యంగా.
"ఆమె నీకేమవుతుందో నాకు తెలుసు. ఆమె నిన్ను వల్లో వేసుకున్న పట్నంపిల్ల! నెరజాణ. ఆ పిల్లేనన్నమాట నీ ఈ ప్రవర్తనకు కారణం! సరే........చూద్దాం" అని చివాలున వెనక్కి తిరిగి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది.
కీడు శంకించింది హరీన్ మనసు.
గూడెంలో వుండిపోయింది కరుణ. ఇప్పుడు ఈ చిక్ లీ వున్నవీ లేనివీ ఉహించుకుని పగబట్టిన పన్నగంలా వెళ్ళిపోతోంది.
కరుణకి ఏమీ ప్రమాదం జరగకముందే తను గూడెం చేరుకోవాలి.
అడుగు ముందుకు వెయ్యబోయాడు హరీన్.
అతను అడుగుతీసి అడుగు వెయ్యకముందే వినిపించింది చిరుత గాండ్రింపు.
కానీ భయంకరంగా లేదు ఆ గాండ్రింపు.
బాధతో అరుస్తున్నట్లుంది పులి.
ఏం జరిగింది?
కొండమలుపు దాటివచ్చి చూశాడు హరీన్.
అక్కడ కనబడిన దృశ్యం అతన్ని ఆశ్చర్యచకితుడిని చేసింది.
నదీ తీరాన నిలబడి నీళ్ళు తాగుతున్న ఆ చిరుతపులిని ఒడిసి పట్టుకున్నాడు ఒక ఏడడుగుల మహాకాయుడు. నల్లరాతితో చేసినట్లుంది అతని ఒళ్ళు. పులి తలను ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో దాని నోటిని బలంగా తెరిచాడు.
దుర్భరమైన బాధతో గాండ్రించింది పులి. కటకటమని విరిగాయి దాని దవడ ఎముకలు.
అప్పుడు దాని నోటిని రెండు చేతులతో పట్టుకుని చీల్చేశాడు అతను. విలవిల్లాడుతూ పులి చనిపోయింది. దాని నెత్తుటితో రక్తసిక్తమైపోయాయి ఇనుప గదల్లాంటి అతని చేతులు.
తర్వాత చులాగ్గా ఆ పులి కళేబరాన్ని ఎత్తి భుజాన వేసుకుని, భూమి అదిరేటట్లు అడుగులు వేస్తూ ముందుకు రాసాగాడు అతను.
అప్పుడు గమనించాడు అతను హరీన్ ని.
హరీన్ ని చూడగానే తక్షణం అతని మొహం కోపంతో జేవురించింది. వికృతమైన నవ్వుతో పెదిమలు విదివడ్డాయి.
"జినత్రీకనుమె హె!" అన్నాడు కర్కశంగా.
"ఏమిటీ?" అన్నాడు హరీన్.
"ఏమిటా.......పట్నమెళ్లి మన భాష మర్చిపోయావా ఏం? నువ్వెప్పుడు వంటరిగా దొరుకుతావా అని చూస్తున్నా ఎన్నాళ్ళనుంచో! ఇప్పటికి దొరికింది అవకాశం. ఈ పులితోలు వలిచే ప్రయత్నంలో వున్నా ఇప్పుడు. కానీ నున్ను చూశాక ఆ ఆలోచన మారింది. నువ్వు బతికి వుండగానే నీ తోలు వలుస్తా కాచుకో!"
"అగు!" అన్నాడు హరీన్. "నువ్వెవరో నాకు తెలియదు. కానీ నువ్వు కూడా నేను జింబురూనే అనుకుని పొరబడుతున్నట్లు వుంది. నేను జింబురూని కాను. నీతో నాకు శతృత్వం లేదు."
"నువ్వు జింబురూవే! నాకు తెలుసు! నేను వలచిన చిక్ లీని మాయచేసి వల్లో వేసుకున్న జింబురూవి నువ్వు. చిక్ లీ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. కానీ ఆ చిక్ లీ నీ మాయలోపడి నన్ను అలక్ష్యం చేసింది. నీతో నిశ్చితార్ధం కూడా చేసుకుంది. అందుకని నిన్ను నిలువునా చీల్చినా నా కసి తీరదు - కాచుకో!" అని పులికళేబరాన్ని కింద పడేసి ,హరీన్ మీదకి లంఘించాడు ఏడడుగుల ఎత్తున ఆ మహాబలుడు .

                                                                    12

ఆ మహాకాయుడు తనమీదికి లంఘించగానే ఒడుపుగా పక్కకి తప్పుకున్నాడు హరీన్. వేగాన్ని ఆపుకోలేక ముందుకి వెళ్ళిపోయాడు ఆ మనిషి.
ఈ కొండలాంటి మనిషిని శక్తితో ఎదుర్కోవడం కంటే యుక్తితో లొంగదీసుకోవడం సులభం అనిపించింది హరీన్ కి. అటూ ఇటూ చూశాడు.
ఈలోగా తనని తాను అదుపులోకి తెచ్చుకున్న మహాబలుడు వెనక్కి తిరిగాడు. నిప్పులు కక్కుతూ హరీన్ వైపు చూసి ఈసారి జాగ్రత్తగా మీదికి రావడం మొదలెట్టాడు.
చటుక్కున రెండడుగులు గాల్లోకి ఎగిరాడు హరీన్. పైన వ్రేళ్ళడుతున్న మర్రి వూడలను అందుకున్నాడు. సర్కస్ లో ట్రేపిజ్ ఆర్టిస్టు వుయ్యాల వుగినట్లు వూగుతూ వెళ్ళి ఆ బలిష్టుడిని సమీపించి, అతని మెడచుట్టు తన కాళ్ళు పెనవేశాడు.
క్షణంలో మెడకి వురిపడినట్లయింది మహాకాయుడికి. నాలుక బయటికి వెళ్ళుకొచ్చింది. మిడిగుడ్లు పడ్డాయి. గొంతులోంచి గురగురమని శబ్దం రావడం మొదలెట్టింది.
ఒక చేత్తో వుడని పట్టుకుని, రెండోచేత్తో బొడ్లోని చాకుని బయటికి తీశాడు హరీన్.
"నువ్వు నిరాయుధుడివి! నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. చెప్పు ......నువ్వెవరు? నీ పేరేమిటి?' అన్నాడు హరీన్. అంటూనే చాకుని ఆ మనిషి గొంతు దగ్గరకు పోనిచ్చి, కాళ్ళు పట్టు కొద్దిగా సడలించాడు.
ఒక్కసారి శ్వాస తీసుకుని, కాస్త తెప్పరిల్లుకున్నాడు ఆ మనిషి. రొప్పుతూ చెప్పాడు. "నేను దేశింగ్ ని. పదిరోజులపాటు పట్నమెళ్లిరాగానే విరోధం లేదు. నీకు తెలుసు - తలుచుకుంటే ఈ క్షణంలో నేను నిన్ను చంపివేయ్యగలనని. కానీ నీ పట్ల నాకు శతృత్వం లేదని రుజువుచెయ్యడానికి గానూ నిన్ను వదిలేస్తున్నాను . ఆ తర్వాత ఇంక నీ ఇష్టం!"

 Previous Page Next Page