"ఏవీ నా లక్షరూపాయలు?" అంది ఆ అమ్మాయి సాధికారంగా, తన అందమైన చేతిని ముందుకు జాస్తూ.
సన్నగా కంపిస్తున్న తన చేతులని కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ, సెంటర్ పీస్ పై పెట్టిన లక్షరూపాయల చెక్కుని అందుకుని, "పేరు?" అన్నాడు మెకానిక్.
అంతకుముందు ఆమె అతని దృష్టిలో కేవలం అందమయిన ఆడపిల్ల ఊరూ పేరూ అడగనక్కరలేని ఆడమాంసం. అంతే!
ఇప్పుడు -
ఆమె ఒక పర్సన్! ఒక మేధావి, ఒక ఛాంపియన్!
కొంచెం ముందుకు వంగి, చెవిలో గాయత్రి ఉపదేశిస్తున్నంత లెవెల్లో అంది ఆ అమ్మాయి.
"నా పేరు వైశాలి!"
"వైశాలి!" అని మనసులోనే ఓసారి అనుకుని, అదే పేరుని చెక్ మీద రాసి కలలోలాగా అందించాడు మెకానిక్!
చెక్ ని మడిచి నిర్లక్ష్యంగా తన హాండ్ బ్యాగుతో వేసుకుంది వైశాలి. లేచి చకచకా నడుస్తూ వెళ్ళి తలుపు తీసి, వెనక్కి తిరిగి ఒక్కసారి నవ్వి వెళ్ళిపోయింది.
దిగ్భ్రమలోంచి కోలుకోవడానికి చాలాసేపు పట్టింది మెకానిక్ కి. తర్వాత చటుక్కున లేచి గబగబా బయటికి వచ్చాడు.
అప్పుడే కిందికి వెళ్ళిపోయింది లిఫ్టు. నాలుగేసి మెట్లు ఒక్కసారిగా దిగేస్తూ కిందికి వెళ్ళిపోయాడు మెకానిక్.
అక్కడ ఆగివుంది ఒక కారు. ఆ కారు డ్రయివింగ్ సీటులో కూర్చుని ఉన్న వ్యక్తి...
ఎవరది?
కళ్ళు చిట్లించి చూశాడు మెకానిక్.
డ్రయివింగ్ సీట్లో కూర్చుని ఉన్న మనిషి క్లబ్బులో తన చేతిలో ఓడిపోయిన బట్టతల బిజినెస్ మాన్!
ఛక్ మని వెయ్యి వోల్టుల షాక్ తగిలినట్లయింది మెకానిక్ కి.
మైగాడ్!
ఎంత కిలాడీ ఈ పిల్ల!!!
ఆ అమ్మాయి ఎన్ని ఎత్తులు ముందుగానే ఊహించగలిగిందో అతనికి ఒక్కసారిగా అర్ధమయింది.
అంటే...
వరుసక్రమం గుర్తుతెచ్చుకోవడం మొదలెట్టాడు అతను.
క్లబ్బులో ఆమెని చూసీ చూడగానే ఆకర్షితుడైపోతాడని ముందే ఊహించింది ఆ అమ్మాయి.
తను ఓడించిన బిజినెస్ మాన్ చేతిలో కావాలనే ఓడిపోయి తనకు ఫాల్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది.
కారు చెడిపోయిందని అబద్దం చెప్పింది. అలా చెప్పగానే తను లిఫ్ట్ ఇస్తానంటాడనీ, అపార్టుమెంటుకి ఇన్వయిట్ చేస్తాడనీ గ్రహించింది.
అపార్టుమెంటుకి వచ్చాక తను శృంగారానికి సంబంధించిన ఇలాంటి ప్రపోజల్ ఏదో చేస్తాడని కూడా ఊహించి, అందుకు కూడా ఎత్తుకు పైఎత్తులు ఆలోచించి పెట్టుకుని, తనని బోల్తా కొట్టించి, సరిగ్గా ఆట ముగిసే సమయానికి కారుతో సహా అక్కడికి వచ్చెయ్యమని ఆ బాల్డ్ హెడ్ బిజినెస్ మాన్ కి - వాడు తప్పకుండా ఆమె తాలూకే అయివుంటాడు, పురమాయించింది.
తన దగ్గర లక్షరూపాయల చెక్కు తీసుకుని ఆ కారులో చెక్కేసింది.
మాస్టర్ గేమ్స్ ఆడే మాస్టర్ ప్లేయర్ ఈ పిల్ల!
ఒఫ్ఫో!
అతనికి అన్నిటికంటే బాధ కలిగించింది మరో విషయం!
లక్షరూపాయలు పోతే పోయాయి!
కానీ రసగుల్లాలాంటి పిల్ల తను రుచి చూడకుండానే తప్పించుకుపోయింది. ఇంతవరకూ ఎప్పుడూ కూడా తను కోరుకున్న ఆడపిల్ల ఎవరూ కూడా తనని ఇలా పరాభవించి పారిపోలేదు.
జీవితంలో మొదటిసారిగా తనకు ఓటమి!
అన్ని విధాలుగా!
కోపంతో, అవమానంతో అతని మొహం ఎర్రబడింది.
ఎప్పుడూ కవ్విస్తున్నట్లు వుండే అతని కళ్ళు పాము కళ్ళలా మారిపోయాయి.
అప్పుడు అనుకున్నాడు అతను.
నిశ్చయంగా ఈ పిల్లని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాడు తను. ఇవాళ కాకపోతే రేపు!
అంతేకాదు. ఈ పిల్ల తన మగతనానికి దాసోహం అయ్యేలా చేసుకుంటాడు. ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు అని తపించిపోతూ తన వెంటబడేలా చేసుకుంటాడు. తప్పదు!
ఆ తర్వాత ఆమె అందాలన్నింటినీ తనివితీరా అనుభవించిన తర్వాత, అప్పుడు, ఆ అమ్మాయికి ఉన్న అపారమయిన తెలివితేటలని తన సొంతానికి వుపయోగించుకుంటాడు. ఆమె తెలివితేటలతో తన పనులు పూర్తిచేసుకుంటాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే-
తన పనులకి ఆమెని అందమయిన ఆయుధంగా వాడుకుంటాడు.
ష్యూర్! ష్యూర్!
ఇటీజ్ జస్ట్ ఏ మేటర్ ఆఫ్ టైం! అంతే!
* * *
క్రితం రాత్రి మెకానిక్ కి శృంగభంగం చేసిన వైశాలి, మర్నాడు పొద్దున్నే బ్యాంకుకి వెళ్లి, మెకానిక్ ఇచ్చిన లక్షరూపాయల చెక్కు ఎన్ కాష్ చేసి, యాభైవేలు క్యాష్ తీసుకుంది. మిగతా యాభైవేలు తన అక్కౌంటులో వేసుకుంది.
ఆ తర్వాత యూనిఫారంలో వున్న డ్రైవర్ నడుపుతున్న ఇంపోర్టెడ్ ఎయిర్ కండీషన్ డ్ కారు ఎక్కి నగరంలోకెల్లా పెద్దదయిన ఒక నగల షాపుకి వెళ్ళింది వైశాలి.
ఖరీదైన ఆ కారునీ, కారులోనుంచి దిగిన అందమయిన అమ్మాయినీ చూడగానే షాపులోని సేల్స్ మెన్ అలర్టుగా అయిపోయారు.
ఆమె షాపులో అడుగుపెట్టగానే "ఏం కావాలి మేడమ్!" అని సవినయంగా అడిగాడు ఒక సేల్స్ మెన్.
నుదురు చిట్లించి అతనివైపు చూస్తూ అంది వైశాలి.
"మీ సేఠ్ ఎక్కడ? లేరా?"
బాగా డబ్బున్న వాళ్ళ పద్దతి అంతే! బ్యాంకుకి వెళితే నేరుగా మానేజర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని పనులు చేయించుకుంటారు. ఫైవ్ స్టార్ హోటల్ కెళ్ళినా అక్కడి మేనేజర్ స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కోకపోతే తప్పుపడతారు.
అలాంటి వాళ్ళని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాడు ఆ సేల్స్ మాన్. అందుకని అతను, ఆమెకి కూర్చోమని సోఫా చూపించి. గబగబా లోపలికి వెళ్ళాడు.
రెండు నిముషాల్లో లోపలనుంచి బయటికి వచ్చాడు షాపు యజమాని సేఠ్ బదరీ నారాయణ్. గోధుమరంగు సిల్కు లాల్చీ, పైజమా వేసుకుని వున్నాడు అతను. వేళ్ళకి నలుగు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు.
"చెప్పండి మేం సాబ్? ఏం సేవ చేయగలము మేమూ?" అన్నాడు మర్యాదగా.
"డైమండ్ జూవెలరీ కావాలి! చాలా ఖరీదైనధీ అక్కర్లేదు! మామూలువి! ఒక యాభైవేల లోపు!" అంది వైశాలి చాలా తేలిగ్గా.
ఒక్క గుటకవేశాడు సేఠ్ బదరీ నారాయణ్.
మామూలువి! ఒక యాభై వేల లోపు!
మళ్ళీ తనే అంది వైశాలి "లాకర్ తాళాలు ఎక్కడో పోయాయి. నా డైమండ్స్ అన్నీ దానిలోనే వుంచాను. డైమండ్స్ పెట్టుకోకపోతే అదేమిటోగానీ నగ్నంగా తిరుగుతున్నట్లే అనిపిస్తుంది నాకు. లాకర్ కి డూప్లికేట్ కీస్ చేయించేలోగా పెట్టుకోవడానికి, తక్కువలో..."
గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయంగా నవ్వాడు సేఠ్ బదరీ నారాయణ్. ఇలాంటి కస్టమర్సే తనకి కావాలి.
అతను గుసగుస నడుచుకుంటూ వెళ్ళి స్వయంగా లోపలనుంచి ఒక జూవెల్ బాక్స్ తెచ్చాడు.
దానిలో వున్న నగలవైపు యధాలాపంగా చూసింది వైశాలి. వాటిలో నుంచి ఒక వజ్రపుటుంగరం, రెండు చెవిదిద్దులూ సెలెక్టు చేసుకుంది.
"ఎంత?"