Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 13

"బ్లూ పాంటు మీదకి పచ్చ చెప్పలేం బాగుంటాయ్ నాన్నగారూ? మీరు మరీనూ!" అంటూ నల్లటి ప్లాట్ ఫారం హీల్సు తీసి వేసుకుంది.
కుటుంబరావు గారు శ్రీహర్ష వైపు చూసి అర్ధంతరంగా నవ్వారు.
"నేను ఏ కారు తీసుకెళ్ళనమ్మా?"
"నాకు మాత్రం ఎర్రకారు కావాలి. " అంది లావణ్య.
"నీలం పాంటు మీదకి ఎర్రకారు బాగుంటుందా?" అన్నాడు శ్రీహర్ష.
"మీరు కూడా వేళాకోళలు నేర్చుకున్నారన్నమాట" అంది లావణ్య.
"అంటే నాకు తెల్లకారన్నమాట. గుడ్! రావోయ్! వెళుతూ మాట్లాడుకుందాం! కాఫీ క్లబ్బుకెళ్ళాక తాగోచ్చులే."
"అదేమిటి? ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ అయినా ఇవ్వకుండా ఎలా పంపిస్తాం! నర్సయ్య కాఫీ ఏముంది? చూడు."
"కాఫీ రెడి అమ్మా" అంటూ ప్రవేశించాడు వంటవాడు.
ప్లేట్లో కాఫీ కప్పులూ, ఒక పాట్ , ఇంకో చిన్న పింగాణి కప్పులో షుగర్ క్యూబ్స్, పాలూ , వేయించిన జీడిపప్పు ఉన్నాయి.
"మీరు కాఫీ ఎలా తాగుతారు?" అంది లావణ్య.
"మాములుగానే!"
"అంటే?" అర్ధం కానట్లు చూసింది. "పాలు వెయ్యాలా? ఉత్త డికాక్షన్ తో బ్లాక్ కాఫినా? చక్కెర ఎన్ని క్యూబ్స్ వేసుకుంటారు? ఒకటా? రెండా? ఇన్ స్టంట్ కాఫీ నచ్చుతుందా? ఫిల్టర్ కాఫీ నే కావాలా?"
నవ్వాడు శ్రీహర్ష.
"నిజం చెప్పాలంటే , కాఫీ ఇన్ని రకాలుగా తాగుతారని నాకు తెలియదు. మాములుగా అందరు తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో తాగినట్లు పాలూ, డికాక్షాన్ కలిపి చక్కెర వేసుకుని తాగటమే నా కలవాటు."
ఒక్క క్షణం విచిత్రంగా చూసి, కాఫీ కలిపింది లావణ్య.
"లావణ్యా! నీకు సినిమాకు టైమవటం లెదూ?"
"ఫర్వాలేదు. కాఫీ తాగేసి వెళతాను. " అంటూ శ్రీహర్ష వైపు తిరిగి "మా నాన్నగారు మనముందు మాములు కాఫీ తాగుతున్నారు గానీ, మనం లేకపోతే ఉత్త డికాక్షన్ లో బ్రాంది కలుపుకు తాగుతారు. మనేయ్యలేదు కదూ నాన్నగారూ?" అంది కోపంగా, ఆరోపణగా ఆయనవైపు చూస్తూ.
అయన కాఫీ ఒక్క గుక్కలో తాగేసి క్లబ్బుకి టైమయింది అంటూ లేచారు.
"క్లబ్బుకి టైమేమిటి? మాట తప్పించే ప్రయత్నం కాకపోతే!" అంటూ నవ్వింది లావణ్య.
అందరూ నవ్వారు.
"నేనూ వస్తాను క్లబ్బుకి" అంది లావణ్య.
శ్రీహర్ష చాలా మధురంగా వినబడిందామాట.
అందరూ బయటికి నడిచారు.
డ్రైవింగ్ సీట్లో కూర్చుంది లావణ్య. ఆమె పక్కనే కూర్చున్నారు కుటుంబరావు గారు. వెనక సీట్లో కూర్చున్నాడు శ్రీహర్ష.
గేర్లు మార్చి కారు స్టార్టు చేసింది లావణ్య. మెత్తగా జరి గేట్లోంచి బయటికి వచ్చి క్లబ్బువైపు దారి తీసింది కారు. ఊరికి కాస్త దూరంగా పెద్ద ఆవరణలో వుంటుందా క్లబ్.
దాన్లోకి ప్రవేశించింది కారు.
అప్పటికే ఇంకో పదిహేను కార్లు వచ్చి ఆగి ఉన్నాయ్.
ఆవరణలో ఒకవైపు చిన్న పార్కులా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలూ, జారుడు బండా అలాంటివి ఉన్నాయి. బొద్దుగా, ముద్దుగా ఉన్న పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు.
"హయ్!లవ్!" అంటున్నరెవరో.
"హై! సుధా!" అంటూ విష్ చేసింది లావణ్య.
కుటుంబరావుగారు క్లబ్బు లోపలికెళ్ళిపోయారు. శ్రీహర్ష లావణ్య కోసం ఆగాడు.
"లవ్! సినిమా కెళ్తనన్నావ్ వెళ్ళలేదా? టిక్కెట్లెం చేశావ్? వారం రోజుల క్రితమే బుక్ చేయించుకుంటివే. నువ్వు వెళ్ళకపోతే నాకు ఇచ్చేసి ఉంటె బావుండేదిగా?" అంది.
లావణ్య నవ్వింది.
"లావణ్య అనే పేరుని కట్ చేసి లవ్ అని పిలుస్తుంది. ఇది సుధారాణి. వీళ్ళ నాన్నగారు ఎక్స్ పోర్ట్సు బిజినెస్ చేస్తారు. ఇది కాస్మటిక్స్, ఖరీదైన సెంట్లు దిగుమతి చేస్తుంటుంది తన స్వంత వాడకం కోసం."
"ఇది లవ్లిగా ఉంటుంది కావట్టి "లవ్" అని పిలుస్తాను. ఇంకాస్త లావేక్కిందంటే "లావ్" అని పిలుస్తాను. కరెక్టేనాండి?" అంది సుధ శ్రీహర్ష వైపు చూస్తూ.
మొహమాటంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీహర్ష.
"ఇంతకీ టిక్కెట్ల సంగతి చెప్పలేదేమే?" అంది సుధ టైం చూసుకుంటూ.
"నా బెడ్ రూంలో డ్రసింగ్ టేబుల్ మీద ఉంటాయి. కావాలంటే నర్సయ్యని అడిగి పట్టికెళ్ళిపో."
"అబ్బ! ఎంత ఉదారంగా దానమిచ్చేస్తోందో! స్టార్ వార్స్ టిక్కెట్లని ఇష్టంగా నాకిచ్చేసి సినిమా మానేస్తున్నావంటే ఇంకేదో పెద్ద విశేషమే ఉండి ఉండాలి. ఏమిటది?" అంది పెదాలు బిగపెట్టి, శ్రీహర్ష వైపు చిలిపిగా చూస్తూ.
"టైమయిపోయింది. నువ్వెళ్ళిపో" అని తొందర పెట్టింది లావణ్య.

 Previous Page Next Page