"అదేంటే.....సదన్ గా అలా అనేసావు....." అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.
"మరేం లేదు.....నీ మీద అతనిప్పుడు బెటరేమో. నన్ను బాగానే చూసుకుంటాడు అతనికొచ్చే జీతంతో....ఫర్లేదు మేనేజవ్వొచ్చు......" అంది.
"ఎందుకు మేడం?" వాచ్ మెన్ ఆశగా చూస్తూ అడిగాడు.
"వదినా...వదినా....నేనిప్పుడు వాచ్ మేన్ ని " వాచ్ మెన్ అన్నయ్యా....." అని పిలవొచ్చా....." అడిగాడు అత్యుత్సాహంగా. శ్రీచంద్ర వంక భయంగా చూస్తూనే.
శ్రీచంద్ర సమీరను, సత్తిపండును బరబరా అక్కడనుంచి లాక్కేళ్ళాడు.
"ఏంటో ....నాకు కళ్యాణ యోగం కొద్దిలో తప్పిపోయినట్టుంది" అంటూ వాచ్ మెన్ తనలో తనే గొణుక్కున్నాడు.
* * *
"అసలు నీ ఉద్దేశమేంటి? కనిపించిన ప్రతి గన్నాయ్ గాడిని చేసేసుకుంటా.....చేసేసుకుంటా....అంటూ వెంటపడతావు....చెట్టంతా మగాడ్ని నేనున్నానా? లేదా?" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.
ముగ్గురూ ఓ రెస్టారెంట్ లో కార్నర్ టేబుల్ దగ్గర కూచున్నారు.
సమీర కాఫీ మెల్లగా సిప్ చేస్తోంది.
సత్తిపండు మాత్రం చాలా ఏకాగ్రతగా కాఫీని చప్పరిస్తూ మధ్య మధ్య శ్రీచంద్ర వంక చూస్తున్నాడు.
"ఏంటి....ఓ పక్క నేను నానా చెత్త వాగుడు వాగుతుంటే నీ మానాన నువ్వు కాఫీ తగుతున్నావా?" మరింత కోపంగా అన్నాడు.
సమీర కూల్ గా చూసింది శ్రీచంద్ర వైపు. సత్తిపండు ఆ సీన్ చూసి కిసుక్కున నవ్వాడు.
శ్రీచంద్ర ......సీరియస్ గా చూసి "ఒరే పోట్టిలాగు.....చంపేస్తాన్రోయ్....అలా దొంగ చూపులు చూస్తూ కిసుక్కు కిసుక్కుమని నవ్వితే.....అసలు నువ్వేమనుకుంటున్నావు....నాకు వళ్ళు మండితే ఈ హోటల్ వాడితో చెప్పి, నీతో కప్పులు కడిగిస్తా....." అన్నాడు వళ్ళు మండి.
"ఎందుకంటావ్ గురూ........" సత్తిపండు అమాయక ఎక్స్ ప్రెషన్ తో అడిగాడు.
"ఓ...రే...య్...." గట్టిగా అరిచాడు శ్రీచంద్ర. రెస్టారెంట్ లోని అందరూ శ్రీచంద్ర వంక చూసారు.
"చందూ....లాభం లేదురా....నువ్వు హై బి.పి.ని కంట్రోల్ లో వుంచుకోవాలి" మరింతగా శ్రీచంద్రని ఉడికించాలని అంది సమీర.
కోపంగా అరవబోయి మళ్ళీ రెస్టారెంట్ లోని జనం మన వంక వింతగా చూస్తారని గుర్తొచ్చి కామ్ గా వుండి పోయి , సమీర వైపు చూస్తూ లో గొంతుకతో.
"బయటకు పద.....నీ సంగతి చెబుతా...." అన్నాడు. సత్తిపండు ఓ చెవి శ్రీచంద్ర వైపు వేశాడు. అతడేదో సమీరతో, గుసగుసలాడ్డం చూసి....
"వదినా....గురువేమంటున్నాడు....ఫస్ట్ షో సినిమాకు తీసుకెళ్తాడంటనా?" అడిగాడు సంతోషంగా.
"నిన్ను సినిమాకు కాదు....ఎగ్జిబిషన్ కు తీసుకెళ్తా....అక్కడ నిన్ను దిష్టిబొమ్మలా నిలబెట్టి డబ్బులు సంపాదిస్తా....." కసిగా అన్నడు శ్రీచంద్ర.
"బావుంది గురూ.....ఐడియా....నేను గాంధీ తాతలా నిలబడనా?"
"వద్దొద్దు ...యోగి వేమనలా నిలబడు...." కసిగా అన్నాడు శ్రీచంద్ర.
"బావుంటానా వదినా?" అమాయకంగా తన డౌట్ ని క్లారిపై చేసుకోవడానికి అడిగాడు.
"ఛ...ఛ....జనం గుండాగి చస్తారు.....వాక్...." అంది వామ్టింగ్ సెన్సేషన్ ఎక్స్ ప్రేషనిస్తూ సమీర.
"ఎప్పుడూ వెనకేసుకోస్తావుగా వాడ్ని.....వాడి విశ్వరూపం ఉహించుకొని చావు" కచ్ఝగా అన్నాడు శ్రీచంద్ర.
"సార్....బిల్లు...." అంటూ బెరర్ వచ్చి బిల్లు తీసుకు వచ్చి టేబుల్ మీద పెట్టాడు.
సమీర హ్యాండ్ బ్యాగ్ లో నుంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టిన బిల్లు తీసి చూసి వందనోటు ప్లేటులో పెట్టింది.
"నువ్వెంత మంచిదానివి వదినా.....మిగిలిన చిల్లర నేనుంచుకోనేదా?" అడిగాడు సత్తిపండు మరో ప్లేటులో వున్న సోంప్ ను గుప్పెటతో తీసి నోట్లో కొంచెం పోసుకుంటూ.
శ్రీచంద్ర కు అది చూసి కోపం పికల్దాక వచ్చింది. ఈలోగా బెరర్ రావడంతో ఆగిపోయాడు.
మిగిలిన డబ్బులు బెరర్ తెచ్చినాక, టిప్పు కింద అయిదు రూపాయలు వదిలి కొంచెం సోంపు తీసుకుని నోట్లో వేసుకుంది సమీర.
"అడ రౌడిలా ఆ సాంప్ తినడం ఏమిటి సమీరా....." కోపంగా చూస్తూ అన్నాడు శ్రీచంద్ర.
"అంటే....సోంపు తినడం రౌడితనమా...." రోషంగా అంది సమీర.
"మరి కాదా!సోంపు, వక్కపొడి, గుట్కా....తినడాలేమిటి? .....చీ....నాకు నచ్చదు..."
"ఏదైనా తిన్నాక సోంపు తినకపోతే నాకు కడుపులో తిప్పి చస్తుంది. ఏం చెయ్యమంటావ్...."
"ఇక ముందు మానేయ్.....నాకు నచ్చనిదేది నీకిష్టం వుండకూడదు...."
"సరే మహానుభావా....ఫస్ట్ నైట్ నుండి మానేస్తా....సరేనా....."
"అమ్మో! మళ్ళీ పెళ్ళి దగ్గర కొచ్చింది టాపిక్. అయిపోయాను' అనుకుంటూ టాపిక్ ని డైవర్ట్ చేసేసాడు బయటకు నడుస్తూ శ్రీచంద్ర.
శ్రీచంద్ర, సమీర బయటకు నడుస్తుంటే, సత్తిపండు ఏదో పని వున్నట్టు "గురూ....నువ్వూ, వదినా ఆదర్శ దంపతుల్లా నడుస్తూ వుండండి.....నేనిప్పుడే వచ్చేస్తా...." అంటూ వెనక్కి వచ్చాడు.
బెరర్ అప్పుడే టిప్పు తీసుకోవడానికి బిల్లు ప్లేటులో చేయి పెట్టబోతున్నాడు.
"ఎక్స్ క్యుజ్ మి...." అంటూ తన జేబులో వున్న రెండు రూపాయల కాయిన్ ప్లేటులో వేసి, అందులో వున్న అయిదు రూపాయల కాయిన్ తీస్కొని.....
"మరేం లేదు....మా అన్నయ్యకి అయిదు రూపాయల కాయిన్ సెంటిమెంట్...." అంటూ పళ్ళికిలించి తిరిగి వెళ్లిపోయాడు.
బెరర్ బిత్తరపోయి చూస్తుండిపోయాడు.
* * *
టాంక్ బండ్ దగ్గరికి వచ్చారు ముగ్గురూ.
అప్పుడే చీకటి పడుతోంది.
"సమ్మీ....నువ్వు నిజంగా ఎవడికైనా లైనేస్తావా?" రైలింగ్ ని అనుకుని, పక్కనే సత్తిపండు లేడన్నది కన్ ఫర్మ్ చేసుకొని, అడిగాడు శ్రీచంద్ర సమీరని.
"ఏం చేయాలిరా చందూ....సాల్టు, చిల్లిపౌడరు తింటున్న బాడీ.....అప్పుడప్పుడు వళ్ళు జిల్ జిల్ మంటుంది. నువ్వేమో ఉద్యోగానికి, పెళ్ళికి లింకేట్టావు....ఏంటో.....లైఫ్ బోర్ కొడుతోంది...." అంది నీళ్ళలో వున్న బుద్ద విగ్రహం వైపు చూస్తూ.
"నువ్విలాంటి డైలాగులు చెబితే ఎక్కడో గుచ్చుకుంటుంది" అన్నాడు శ్రీచంద్ర.
"ఎక్కడ గురూ....." ఎప్పుడొచ్చాడో వాళ్ళిద్దరి మధ్య దూరి తలను శ్రీచంద్ర వైపు పెట్టి అడిగాడు.