Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 14

 

   

    "ఎవరడిగారురా ఈ సోదంతా, పెళ్ళి చేసుకు వచ్చావా అని మాత్రమే అడిగాను దానికి జవాబివ్వు" రామచంద్రం కోపం నిగ్రహించుకుని అడిగాడు.


    "అదికాదు నన్నా!"

 

    "నేనడిగిన ప్రశ్నకిది జవాబుకాదు. పెళ్ళి చేసుకు వచ్చావా?"

 

    "అవును"

 

    "ఎవరినడిగి? నేచచ్చాననుకున్నవా?"

 

    "నాన్నా" అన్నాడు బాబా


    
    "నాన్నా" అంది సీత.

 

    "నువ్వుండమ్మా" అన్నాడు రామచంద్రం.

 

    "నేనేం తప్పుపని చెయ్యలేదు. నా మాట కాస్త వినండి." ప్రాధేయ పడుతూ అన్నాడు బాబా.

 

    "వింటారా! ఏదో చెపుతావు పీక మీద కొచ్చిందంటావు ఇంకేదో చెపుతావు. చెప్పేవాడికి వినేవాడు లోకువ. నీ తెలివి నీ ఆవేశం, నీ గొప్ప ఎవరికి తెలియవురా. నీ వెప్పుడు పట్టినా మూడుకాళ్ళ కుందేలే వలలో పడుతుంది. అది నీ ప్రతాపం అది నీ...."

 

    బాబాకి కోపం వచ్చింది "మీరు నా మాట వినేదేమయినా వుందా?' అన్నాడు.

 

    "నాన్నా! నాన్నా! కాస్త బాబా చెప్పేది వినండి. అరిచి అవేశాపడితే లాభమేముంది" సీత తండ్రి చేయి పట్టుకుని అంది.

 

    రామచంద్రం కొంచెంలో కొంచం కోపం నిగ్రహించుకున్నాడు. అదయినా సీత చెప్పబట్టి. ఏం జరిగిందో చెప్పమని మాత్రం అడగలేదు. పూర్తిగా నిశ్శబ్దమయ్యాక బాబా చెప్పబోయే తన కధకి నాంది "హు...హ్హు" అంటూ కంఠం సవరించుకున్నాడు.

 

    "మీరు పూర్తిగా నేచేప్పింది విని తప్పో వప్పో నిర్ణయించండి. నాన్నా! హైదరాబాద్ లో నాతో పాటే మా ఆఫీసులో కౌసల్య జాబ్ చేస్తున్నది. కౌసల్య పరిచయంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం అయింది. కౌసల్య మెతక మనిషి గాని వాళ్ళ వాళ్ళు మాత్రం కాదు. నేను కౌసల్య ప్రేమించుకున్నాము. మీతో చెప్పి వివాహం చేసుకోవాలని అనుకున్నాము.

 

    ఇంతలో...." అంటూ కాస్త ఊపిరి పిల్చుకోటానికి ఆగాడు బాబా.

 

    రామచంద్రం తలఎత్తి చాలా సేపు తీక్షణంగా చూసి మళ్ళి తల తిప్పేసుకున్నాడు.

 

    "మా ప్రేమ విషయం వాళ్ళ వాళ్ళకి చెప్పకముందే తెలిసింది. వెంటనే వాళ్ళు నన్ను చాలా బలవంతం చేశారు. నేను మా నాన్న గారికి తెలిపి పబ్లిక్ గానే పెళ్ళి చేసుకుంటానన్నాను. కట్నం కూడా అక్కరలేదనే మాట ముందే చెప్పను. వాళ్ళు వినలేదు. నేనేదో మోసగాడినన్నట్లు తులానాడారు. వాళ్ళు మా విషయంలో అంత కఠినంగా వుండటానికి కారణం లేకపోలేదు. కౌసల్యది బాల్యవివాహం, వెంటనే చనిపోవటం విడోకావటం జరిగింది. నా మూలకంగా కౌసల్య అల్లరి పడిపోతుందేమోనని వాళ్ళ భయం. వాళ్ళ వాళ్ళు మా ఆఫీసు వాళ్ళు ఏకమయ్యారు. అందరూ కలిసి మాది ఆదర్శ వివాహం అంటూ గొప్పగా పొగిడారు. విడోని పెళ్ళాడటం, కట్నం తీసుకోక పోవటం నన్ను గొప్పవాడిని చేశాయి. అదలా జరిగిపోయింది. నే పెళ్ళి చేసుకున్నాక టెలిగ్రాం కొట్టే బదులు నాతో కౌసల్యని తీసుకొచ్చి జంటగా కనిపించి జరిగింది చెప్పి మీ ఆశీర్వాదం పొండుదామనుకున్నాము. ఈ కాళీ రోజుల్లో ప్రతివాళ్ళు సింపుల్ గా పెళ్ళి చేసుకుంటే సగం దేశం బాగుపడుతుంది. ఏమంటారు నాన్నా" తాను చెప్పేదంత పూర్తిగా చెప్పి ఉషారుగా అడిగాడు బాబా.

 

    రామచంద్రంలో ఆవేశం కట్టలు తెచ్చుకుని ప్రవాహంలా దూకింది. తోక తొక్కిన తాచులా చర్రున లేచాడు కుర్చిలోంచి.

 

    "ఏమంటావురా! నువ్వు చెప్పింది నిజమేనంటాను సగం దేశం బాగుపడుతుంది. మరి మిగతా సగందేశం మట్టిగాలిసి పోతుందా? నీ లాంటి వారివల్ల కదూ సగం దేశం కలకలలాడేది. అందరూ నీలాగే వుండరే? సీతకి ఇప్పటికి పది సంబంధాలు చూశాను. వాళ్ళలో వక్కడు కట్నం వద్దని అనలేదే..."

 

    "దొరుకుతారు కాస్త ఆగితే..." అంటూ బాబా మధ్యలో అందుకున్నారు.

 

    "నోరుముయ్యరా, ఇవతల సీతకి సంబంధాలు చూస్తున్నాను. కట్నాలు చాలా అడుగుతున్నారు. పెళ్లీడు కూడా దాటి పోతున్నది. కాస్త కష్టమయినా మనం తట్టుకుని సీత పెళ్ళి చేయాలి అంటూ నికేన్ని లెటర్స్ రాశానురా! వాటికీ రిప్లయిలు మటుకు చిలకపలుకుల్లా యిచ్చావు. సీతకు నీకు ఏం వయసు వారుందిరా? దాని పెళ్ళి కోసం ఇక్కడ నేను దిగులు పడుతుంటే నీ పెళ్ళికి తొందరోచ్చింది. మగాడివి ఏమంత వయసు ముదిరిపోయింది. ఆదర్శ చేసుకున్నానని అనందించనా! కట్నం లేకుండా పెళ్ళాడావని సంతోషించనా? సీత పెళ్ళి ఎలా చేయను. ఎలా, చెప్పరా చెప్పు?" ఆవేశంతో వుగిపోయాడు రామచంద్రం.

 

    "నేనేం కానిపని చెయ్యలేదు." కొద్ది కోపంతో అన్నాడు బాబా.

 

    "ఊరుకో నాన్నా! బాబా పెళ్ళి చేసుకొచ్చాడు. ఇప్పుడేమి అనకు" అంది సీత.   

 Previous Page Next Page