Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 13

 

                                                                 9

    పదిరోజుల క్రితం ఓ పెళ్ళివారు సీతని చూసి వెళ్ళారు. సీత వాళ్ళకు నచ్చిందట. కట్నం కానుకలు నచ్చితే గాని మిగతా విషయాలు మాట్లాడేది లేదని మధ్యవర్తి ద్వారా కబురు పంపించారు.

 

    ఎవరితో నయినా సంప్రదించడానికి పెద్దవాళ్ళేవరూ లేరు రామచంద్రంకి. ఇల్లాలుంటే ఆవిడతోనే మాట్లాడొచ్చు, ఆమె లేదు. సావిత్రి దూరం అయిన తర్వాత ప్రతి చిన్న విషయం సీతతో చర్చించటం రామచంద్రంకి అలవాటయింది.

 

    ఆదివారమేమో పిల్లలు యింట్లోనే వున్నారు. పెందలాడే భోజనాలు అయ్యాయి. సీత వంటిల్లు సర్ది వచ్చింది. సీత రాకకోసమే ఎదురు చూస్తున్న రామచంద్రం పెళ్ళివారి విషయం చెప్పాడు.

 

    "వాళ్ళు కొంచెం డబ్బు మనుషుల్లా వున్నారమ్మా? పదివేల కట్నానికి పైసా తగ్గారట లాంచనాలు అయిదు వేలదాకా చెప్పారు ఎంత జాగ్రత్తగా వాడినా పదివేలదాకా చేతిలో వుండాల్సిందే, పదివేలు కట్నమే యిస్తే, ఇంక పై లంచానాలేమివ్వగలను పెళ్లెం చేయగలను?"

 

    "దీనికింత ఆలోచన దేనికి నాన్నా!

 

    "అదేమిటమ్మా, పిల్లడు సలక్షణంగా చాకులా వున్నాడు. బ్యాంకులో ఉద్యోగం. ఈ కాలంలో బ్యాంకి ఉద్యోగాస్తుడంటే మాటలా? నీవంటే యిస్తాపడ్డాడు."

 

    "ఇష్టం తెలుస్తూనే వుంది. పైసా పొతే ప్రాణం పోతుందని విలవిలలాడే వాళ్ళకేం తెలుస్తుంది మనుషుల సంగతి. అంతనచ్చితే మంచి ఉద్యోగం వుందికదా, పదివేల కట్నం అయిదు వేల లాంచనాలు ఇంకేం గొంతెమ్మ కోరికలు లేవూ? సీతకి కోపం వచ్చింది. సంసారంలో కష్టసుఖాలు తెలుసు. తండ్రికిది తలకు మించిన భారమని తెలుసు. అప్పో సప్పోచేసి పెళ్ళయిందనిపించినా ఆ తర్వాత బాధలు ఆ తర్వాత ఉన్నాయి.

 

   
    "మగ పెళ్ళివారు, కోరికలుండటంలో అసహజ మేముందమ్మా, 'పదివేల వరకు ఫర్వాలేదమ్మా ఆపై డబ్బే ఎలా అని చూస్తున్నా, బాబా దాచింది 'మహా అయితే, ఏ రెండు మూడు వేలుంటుందేమో, ఈ కాలంలో ఊరికే అప్పులిచ్చేవాళ్ళు లేరు ఎంత వడ్డీ అయినా సరే తెద్దామంటే , తాకట్టుకేం తెచ్చా వంటారాయే తాకట్టు పెట్టేటంత పెద్ద వస్తువే వుంటే, ఇంత ఆలోచన దేనికి. బాబా ఏమన్నా పలుకుబడి వుపయోగించి ఓ అయిదు వేలు అప్పు తెగలడేమో చూడాలి"

 

    "అప్పు అనేమాట వద్దు నాన్నా! ఎలా జరగాలని వుంటే అలా జరుగుతుంది. నా కంత తాహతు లేదని కబురు చేయండి."

 

    "తాహతు లేదంటూ కూర్చుంటే ఇంకా ఏళ్ళు పెరుగుతాయిగాని తరగవు కాదమ్మా? మీ అమ్మే వుంటే నిన్నిలా మాట్లాడనిచ్చేదా నన్నిలా వుండనిచ్చేదా? డబ్బు ఎలాగో అలా చూద్దాం ముందెళ్ళి ముహుర్తాలు పెట్టుకురండి. పిల్ల పెళ్ళి తొందర మీకు లేనేలేదు, ఎదిగిన పిల్ల ఎదుట తిరుగుతుంటే మీకేం బాధలేదా. మనింటికి కోడలుగా తెచ్చుకునే పిల్లకి గుణమొక్కటే చాలు. మనపిల్లనిచ్చే చోట మాత్రం నాలుగూ చూసుకోవాలి, అంటూ సాధించేది కాదూ! సావిత్రి తలంపుకొచ్చి రామచంద్రం కంఠం బొంగురు పోయింది.

    సీత కళ్ళు తడి అయ్యాయి "అది కాదు నాన్నా! అంది కాసేపాగి.

 

    "నువ్వేం చెప్పకమ్మా."

 

    నే చెప్పేది వినండి నాన్నా.

 

    "సరిగ అప్పుడే వాకిట్లోంచి జయ పిలుపు వినపడింది. "అక్కా అక్కా! న్నాన్నోయ్!నాన్నోయ్! అంటూ.

 

    రామచంద్రం, సీత ముఖముఖాలు చూసుకున్నారు.

 

    జయ రయ్యిన పరుగెత్తుకు వచ్చింది. పరుగెత్తుకు రావటంవల్ల వచ్చిన ఆయాసంతో కొద్దిగా రొప్పుతూ "అక్కా! మరే అన్నయ్య వచ్చాడు. అన్నయ్యతో పాటు భలే అందంగా వున్న అమ్మాయి కూడా వచ్చింది. అన్నయ్య రిక్షాకి డబ్బులిస్తున్నాడు" అని బాబా గుమ్మంలోకి రావటం చూసి "అన్నయ్య వచ్చేశాడు" అంది.

 

    సీత ముఖం విప్పారింది.

 

    బాబా భారీగా వుంటాడు. ఉద్యోగం వచ్చాక కాస్త నునుపు తేలాడు. దర్జాగా అడుగులో అడుగేస్తూ వచ్చి "బాగున్నారా నాన్నా" అన్నాడు. వెంటనే తన వెనుకనే వచ్చిన కౌసల్యతో "మానాన్నగారు నమస్కారం పెట్టు "కౌసల్యా" అని తండ్రి వేపు తిరిగి "కౌసల్య మీ కోడలు నాన్నా అన్నాడు. ఆ అనటంలో జంకు, బొంకు ఏమి లేదు.

 

    బాబా ముఖం చూస్తూనే ఆనందంతో ఉప్పొంగి పోయిన రామచంద్రం బాబా చెప్పింది విని ముఖం చిట్లించాడు.

 

    పుస్తకం చదువుతున్న రూప కార్టున్స్ కొత్తగా వేయటం నేర్చుకుంటున్న రాజు, వాటిని విడిచిపెట్టి వీళ్ళ దగ్గర కొచ్చారు.

 

    కౌసల్య రామచంద్రంకి నమస్కారం చేసింది.

 

    బాబా పేరుపేరున అందరిని కౌసల్యకి పరిచయం చేశాడు.

 

    "కోడలా! అంటే వీడు పెళ్ళి చేసుకువచ్చాడన్నమాట? నిదానంగా ఒక్కోమాట నొక్కి పలుకుతూ అన్నాడు రామచంద్రం.

 

    బాబా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. "నాన్నా నేచేప్పేది  జాగ్రత్తగా వినండి. నేచేసినపని మీకు బాధ కలిగించవచ్చు. కాని ఆ పరిస్థితులలో వెంటనే పెళ్ళాడక తప్పలేదు...."

 Previous Page Next Page