Previous Page
Next Page
మధుమాసవేళలో ... పేజి 14
"ఇప్పటికివి చాలు."
"రక్షించావ్!" అంటూ నిట్టూర్పు విడిచాడు మదన్ గోపాల్.
చక్రవర్తి ఇంకా ఆ కిటికీనే పట్టుకువేలాడుతూ వుండిపోయాడు.
"ఒరే గబ్బిలం! ముందా కిటికీని వదిలి యిలావచ్చి కూర్చో" అంటూ ముందు జాగ్రత్తపడ్డాడు మదన్ గోపాల్.
"ఇక్కడ నుంచోకూడదేమిటిరా?"
"అవసరమయితే నుంచోవచ్చు. అనవసరంగా నుంచున్నావనుకో ఆపిల్ల నిన్ను చూసిందనుకో అర్జెంటుగా మరో ఇల్లెతుక్కోమంటుంది. యమర్జంటుగా అప్పుడు మనం బైటికి పరుగెత్తాలి."
"మన వాటాలో మనకిటికీదగ్గర నుంచోటానికి ఆమాత్రం హక్కులేదురా? యమర్జన్సీ రోజులు ఎప్పుడో వెళ్ళాయి!"
"ఎమర్జెన్సీలో నేనేం భయపడలేదు."
"ఇప్పుడు భయపడుతున్నావన్నమాట..."
"అన్ని వసతులున్న ఈ ఇల్లు నా అదృష్టం కొద్దీ దొరికింది. మా నాన్నమ్మ మడికి తడికి కూడా హాయిగా జరిగిపోతున్నది. ఇళ్ళవేటలో బండెడు గడ్డితిన్నాను"
మదన్ గోపాల్ మాటలకి ఫక్కున నవ్వాడు చక్రవర్తి. నవ్వాపంగానే ఎగిరి యివతలికి ఓ గంతేశాడు. "నా నవ్వు విని ఆ పిల్లలిటు చూశారురోయ్!" అన్నాడు.
"అమ్మబాబోయ్!" అంటూ అరిచాడు మదన్ గోపాల్.
"అంత భయమేమిటిరా?"
"మళ్ళీ బండెడు గడ్డి తినేపని కల్పించావు కదరా చక్రీ! నాకొంప....నే వుంటున్న కొంప కూల్చావుకదరా చక్రధారీ! నీ నవ్వు మండిపోనూ నిన్ను కొరివిదెయ్యాలెత్తుకెళ్ళా" మదన్ గోపాల్ పళ్ళు కొరుకుతూ ఏడ్పు ముఖంతో అన్నాడు.
"నోరు మూస్తావా! మళ్ళీ ఆ కిటికీ దగ్గరకెళ్ళి విలన్ ల నవ్వనా?" బెదిరించాడు చక్రవర్తి.
మదన్ గోపాల్ టక్కున నోరుమూసుకుని చక్రవర్తి జబ్బ పుచ్చుకుని వీధిలోకి లాక్కెళ్ళాడు బలవంతాన.
6
ఆరోజు ఆదివారం.
మదన్ గోపాల్ ఇంట్లోనే వున్నాడు.
మధ్యాహ్నం భోజనాలయింతర్వాత బామ్మగారు పురాణంలాంటి సంగతులు చెపుతుంటే అంతా సమావేశం అయ్యారు. "మా కాలంలో..." అంటూ మొదలుపెట్టి భారతం వద్దకొచ్చింది బామ్మగారు.
"మదన్ గోపాల్ చూసావా మనవేపే దొంగచూపులు చూస్తున్నాడు. మగబుద్ది మగబుద్ది" త్రిలోకసుందరి చెవి కొరుకుతూ అంది వైజయంతి.
"నువ్వు చూడబట్టేకదా అతగాడు నిన్ను అదేపనిగా చూస్తున్నట్లు తెలిసింది ఆడబుద్ది ఆడబుద్ది" అంటూ వైజయంతి చెవి గట్టిగా కొరికింది త్రిలోకసుందరి.
త్రిలోకసుందరి వీపుమీద గట్టిగా ఒకటి చరిచింది వైజయంతి.
"అమ్మో!" అంది త్రిలోకసుందరి.
"ఏంటే సుందరీ!" అంది అక్కడే కూర్చున్న త్రిలోకసుందరి తల్లి శారదాంబ.
వైజయంతి త్రిలోకసుందరిని కొట్టటం చూసిన సౌభాగ్యమ్మ మట్టుకు. "అదేమిటే జయంతీ?" అంది.
Previous Page
Next Page