వాళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటూ తనవేపు చూడటం ఓపిల్ల రాక్షసి, మరోపిల్ల దాని వీపు వాయగొట్టటం కళ్ళారాచూసిన మదన్ గోపాల్ చూచాయగా సంగతి గ్రహించినవాడయి "నాన్నమ్మా! భాగవతంలో యుద్ధం మొదలైందా? ఎవరిమీద ఎవరు ముందుగా బాణంవేశారు" అని అడిగాడు.
బామ్మగారు చిరుమందహాసంచేసి మనవడివైపు తిరిగి "పిచ్చినాయనా!" అని ముద్దుగా మందలించి "ఇప్పుడు నే చెప్పేది భాగవతం కాదురా భారతం" అంది.
"మొదటక్షరం అదీ యిదీ భా ఏ కదా? భారతంలో యుద్ధం ఎంతదాకా వచ్చింది?"
"యుద్ధందాకా ఎప్పుడు వచ్చావురా ఇంకా కధ మొదట్లోనే వున్నానుగా?" ఆశ్చర్యం వెళ్ళబుచ్చింది బామ్మాగారు.
"ఆ....ఇందాకేదో చప్పుడయితేను. బాణంవేయటమో కత్తి విసరటమో జరిగిందనుకున్నాలే. కధ కానియ్యి నాన్నమ్మా!" వైజయంతివైపు ఓ చూపు పారేసి అన్నాడు.
"కుదురుగా కూర్చోటం ఈ జన్మలో నీకురాదు శరీరం కదులుతూనే వుంటుంది. నోరువాగుతూనే వుంటుంది" మదన్ గోపాల్ వైపు చురచుర చూసి త్రిలోకసుందరిని కోప్పడింది వైజయంతి.
బామ్మగారు కధ మొదలుపెట్టింది. "ఏ మహాపురుషుడయినా వరంయిస్తే ఆ వరాన్ని సమయానుకూలంగా సద్వినియోగం చేసుకోవాలని కుంతి వరం కథ మనకి తెలియజేస్తుంది. తనకిచ్చిన వరం అపూర్వమైనది తొందరపాటుతో కుంతి సూర్యభగవానుడిని వరం కోరటంవల్లనే సూర్యభగవానుడు ప్రత్యక్షం కావటం. పుత్రుడ్ని అనగా కర్ణుడిని ప్రసాదించటం జరిగింది. ఈకధవల్ల వరంకూడా ఒక్కోసమయంలో శాపం అవుతుందని తెలియజేస్తుంది. తన చేతులలో బంగారుకమతులు విరజిమ్ముతూ వున్న ఆ పసిగుడ్డుని చూసి తల్లి ప్రేమతో ఉప్పొంగిపోవాలో కన్యగా వున్న తమ మాతృమూర్తి అయినందుకు విలపించాలో తెలియక అప్పుడు ఆ కుంతి..."
"బామ్మగారూ!" అంటూ అడ్డు తగిలింది వైజయంతి.
"మళ్ళీ ఏదో అనుమానం వచ్చిందన్నమాట. ఊ...అడుగు" అంది బామ్మగారు. ఆవిడకు అనుభవమే వైజయంతి మధ్య మధ్య యక్ష ప్రశ్నలేస్తుందని.
"పతివ్రతల్లో కుంతిని చేర్చవచ్చునుకదా బామ్మగారూ!"
"అయ్యో పిచ్చిపిల్లా! కుంతి పతివ్రతేనమ్మా!"
"పెళ్ళికాకుండా పిల్లవాడిని కందికదా?"
"కర్ణుడు వరంతో పుట్టాడేపిల్లా!"
"వరంతో పుట్టినా లేక టెస్ట్ ట్యూబ్ లో తయారైన కూనయినా కన్యగా వివాహితురాలికా అన్న పాయింట్ వస్తుందికదా? ఓ కన్యకి పుడితే తప్పులేదన్నమాట ఆవిడ పతివ్రత అయిందన్నమాట! ఈ కాలంలో ఓ అమాయకురాలు ఓ మగాడివల్ల మోసపోయి గర్భిణి అయితే కన్యకి కడుపొచ్చిందని లోకులు కాకులయి ఆ పిల్లని వేలెత్తి చూపటమేగాక చంపుతారా? కుంతి పతివ్రత. ఈ అమాయకురాలు కులట వంచకి మహాపాపీనా! ఇదెక్కడి న్యాయం. మన పురాణాలు మనకేం నీతిబోధిస్తున్నాయి?" అంటూ ఆవేశం వెళ్ళగక్కింది వైజయంతి.
"అడ్డదిడ్డం ప్రశ్నలు నువ్వూను" అంటూ కోప్పడింది సౌభాగ్యమ్మ.
"కన్యకి గర్భిణి రావటం తప్పని పురాణాలు చెప్పాయి గాని ప్రోత్సహించలేదమ్మా పిచ్చిపిల్లా! ఈ కాలంలో లోకులు ఎలా వేలెత్తి చూపుతారో ఎలా దుయ్యబడతారో అలానే ఆ కాలంలోను వుంది. కాబట్టే కుంతి లోకులకి వెరచి పెద్దలకి వెరచి తనవాళ్ళకి వెరచి మాతృహృదయం విలపిస్తుంటే మనసు రాయి చేసుకుని ఆ పసికూనని నీటిపాలుచేసింది. కుంతి కధ మనకేం నీతిబోధిస్తుంది? ఏ కన్య కాలుజారరాదని ఆడది ఏనాడూ తన హద్దులు దాటరాదనీను. కుంతి రాకుమార్తె అయినా తప్పలేదు శోకం. తెలిసీ తెలియని మనస్తత్వంతో అమాయకంగా వరం నిజమాకాదా అనే అనుమానం తీర్చుకోటానికి సూర్యభగవానుడిని పిలవబట్టేకదా కర్ణుడి జన్మకి కారణం అయింది. ఈకాలం అమ్మాయి లోకం తెలిసి పుస్తకాలు చదివి సినిమాలుచూసి అన్ని తెలిసి కాలుజారితే ఈ అమ్మాయికి ఆనాటి కుంతికి పోలికా?" అంటూ బామ్మగారు ఇంకేమో చెప్పబోయింది. మదన్ గోపాల్ గట్టిగా చప్పట్లు చరిచి "నాన్నమ్మ మాట ముత్యాలమూట. లెక్కన..." అన్నాడు.