Previous Page Next Page 
జీవనయానం పేజి 13


    ప్రతి ఇంట్లోనూ ఏవో పండ్ల చెట్లుండేవి. కూరగాయలు ఇండ్లలోనే కాసేవి. సొర పాదులు, గుమ్మడి పాదులు పాకిన గుడిసెలు ఎంతో అందంగా ఉండేవి. కూరగాయలు అమ్మటం ఎరుగరు. ఒకళ్లకు ఒకళ్లు ఇచ్చుకోవడమే! అయితే, ఎండాకాలం కూరగాయలు వుండవు. అందుకు సిద్ధంగానే ఉండేవారు. గొయ్యి తవ్వి దోసకాయలు, బూడిదలో పెట్టేవారు. ఒరుగులు, వడియాలు, పప్పులు, మామిడికాయలు, చింత పండుతో వెళ్లదీసుకునేవారు. తప్పాల చెక్క, ఉప్పుడు పిండి, కుడుములు, అట్లు, గారెలు - అప్పుడు తినే పిండి వంటలు. అరిశెలు, బూఱెలు, జంతికలు, చక్కినాలు, చేగోడీలు, అటుకులు, పోపుబియ్యం వగైరాలు - నిలవ ఉండే పిండి వంటలు.

 

    అది వంటరి బ్రతుకు కాదు. ఉమ్మడి బ్రతుకు. నిలవా పిండి వంటలకు ఊళ్లో బంధువులు లంతా కూడుతారు. ముచ్చట్లు, నవ్వులాటలు, పాటలు. పనిలా ఉండదు. ఆటలా ఉంటుంది. ఒక పండుగలా ఉంటుంది.

 

    పాడికూడా సర్వసాధారణం. పాలు అమ్మటం పాపంగా భావించేవారు. దాలిలో కాచిన పాలు - ఎర్రగా మీగడ కట్టి! పాడి ఉన్నా పాలు తాగడం లేదు. టీ కాఫీ పేరు తెలియదు. కవ్వంతో చల్ల చేయడం ఒక కళ. ఆ శబ్దం ఒక స్వరం. వెన్న తీసి నేయి కాస్తుంటే కమ్మని వాసన!

 

    ఏదండీ ఆ నేయి! ఏదండీ ఆ చల్ల!

 

    కాఫీ అంటే ఒక విషయం గుర్తుకు వస్తున్నది. నేను చాల చిన్న వాణ్ణి. మా అన్నయ్య మదర్సలో చదువుతున్నాడు. గుంటూరు నుంచి శేషాచార్యుల వారు వచ్చారు. వారు వైష్ణవపు ద్రావిడ మత గ్రంథాలను తెనిగిస్తారు. తమ ముద్రణాలయంలో అచ్చువేస్తారు. అవి అమ్ముకోవడానికి నైజాంలో సంచారం చేస్తారు. ఆ విధంగా మా ఇంటికి వచ్చారు. వారు "కాఫీ" అన్నారు. ఇంటివారికి అందరికీ ఆశ్చర్యం! వారు కాఫీ చేశారు. అది రుచి చూపించడానికి నేను స్కూలు నుంచి మా అన్నయ్యను పీల్చుకుని వచ్చాను. అది తొలిసారి కాఫీ వినడం - రుచి చూడడం. అది బహుశః 1931. నాకు మూడేళ్లు ఉంటాయి!

 

    వంటకు చాల వరకు అందరూ మట్టి పాత్రలే ఉపయోగించేవారు. మా ఇంట్లోనూ ఒక్క అన్నం వార్చడం తప్ప-  కూరలు వగైరాలు మట్టి పాత్రలే. బిందెలు, గుండీలు, కంచాలు మాత్రం ఇత్తడివి. అప్పటివారు చాల ముందు చూపుగలవారు. బల్లపీటలు కుర్చీలు, పాత్రలు ఏమి చేయించినా తరతరాలు ఉండేటట్లు చేయించేవారు.

 

    భోజనాలు విస్తళ్లల్లోనే - అయినా కంచాలుండేవి. వాటికి కళాయి పోసేవారు. చద్దన్నంలో మామిడికాయ పచ్చడి - పేరిన నెయ్యి కలిపేది మా అమ్మ. మా అన్నయ్యనూ, నన్నూ కూర్చుండబెట్టుకునేది. చెరొక ముద్దా పెడ్తుండేది. ఆ ముద్ద అమృతం. అది అమృతానందం!

 

    ఇప్పుడు మృష్టాన్నాలు తింటున్నాం. ఆ ఆనందం రాదు! అది అమ్మ పెట్టింది కదా!

 

    మా అమ్మ 1960లో కన్నుమూసింది.

 

    "దేవుడు లేడనేవాడున్నాడు.

    అమ్మ లేదనే వాడున్నాడా?" అని మా అన్నయ్య సినీమా పాట వ్రాశాడు.

 

    "జననీ జన్మభూమిశ్చ" అన్నాడు వాల్మీకి.

 

    వరిపంట తక్కువ. మెరక పంటలు జొన్న, సజ్జలు ఎక్కువ పండేవి. బ్రాహ్మణులు, కోమట్లు, మరి కొందరు సంపన్నులు తప్ప - వరి అన్నం తినేవారు కారు.

 

    వరి ఒకేరకం "కోణామణి" పండేది. బియ్యం దొడ్డువి. ప్రతి బియ్యపు గింజమీదా ఒక ఎర్రటి చార ఉండేది.

 

    నా చిన్నతనంలో గ్రామస్తుల ఒక సంభాషణ విన్నాను.

 

    "సాంబలు వచ్చినయట - ముదనష్టపుపంట. మనిషి తింటే కుట్లు పడ్తయట. గడ్డి గొడ్డుకు వేస్తే వాతం కమ్ముతదట!"

 

    జొన్నలు - సజ్జలు తినేవారు. తెల్లవారు జామున పాటలు పాడుతూ వాటిని దంచేవారు. అది ఒక లయ.

 

    ఆ జీవితమే ఒక లయ!.

 

    ఇప్పటివి లయ తప్పిన జీవితాలు!

 

    ఆ జొన్నన్నం - సద్దన్నం తినేవారు. కంచుతో చేసిన లోయ గిన్నెలాంటి పళ్లెంలో అన్నం వేసుకునేవారు. కంచుడునిండా మజ్జిగ. ఉప్పు, ఉల్లిగడ్డ లేక ఉప్పు పచ్చిమిరపకాయతో తినేవారు.

 

    ఇందులో హెచ్చు తచ్చులు ప్రసక్తి లేదు. ఎవరి అలవాట్లు వారివి!

 

    ఆనాడు గ్రామం ఉమ్మడిగా జీవించింది. అది వంటరిగా జీవించలేని సమాజం. అనాదిగా వస్తున్న భారత సంప్రదాయం సామాజికం.

 

    "సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై" అంటుంది కఠోపనిషత్తు.

 

    కలిసి కాపాడుకుందాం. కలిసి భుజింతాం. కలిసి ఎదిరింతాం.

 

    చిన్నగూడూరులో కులాలూ మతాలూ ఉన్నాయి. కాని, ఉన్నట్లు కనిపించవు. మహమ్మదీయులు మనవలెనే ఉండేవారు. వారు వేరు అనుకోలేదు. ఇస్మాయిల్ పటేల్ మా అన్నయ్యకు ఉర్దూ చెప్పేవాడు. మాలో కలిసి ఉండేవాడు.

 

    కులాలు స్థిరపడిపోయినాయి. ఎవరి అంతస్తు వారికి తెలుసు. ఉమ్మడిగా ఒక కులం - మరో కులంమీద పెత్తనంలాంటిది లేదు.

 

    పేర్లకు కులాలకు సంబంధించిన తోకలు - రెడ్డి, రావు, ఆచార్య ఉండేవికావు. రంగయ్య, కిష్టయ్య, వెంకటయ్య - అంతే. పేర్లు కావు, వరసలతో పిలుచుకునేవారు.

 

    చాకలి -మంగలి కులాల్లో "కుట్టు" అయిక్యత ఎక్కువ. ఒక్కడు కాదంటే అందరు కాదన్నట్లే. ఒకరికి పోటీగా మరొకరు పోరు. ఇది అనూచానంగా వస్తున్న ట్రేడ్ యూనియన్. నేను రచించిన "మోదుగుపూలు" నవలలో మంగళ్ల సంఘటిత శక్తిని చూపించాను.

 

    ఏ కులానికి ఆ కులానికి పెద్ద యింటారు. సాధారణంగా ఈ పెత్తనం వయసును బట్టి వస్తుంది. వారికి ఉన్న- కుటుంబ, కుల సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. కుల తప్పుకింద వేసిన జరిమానాలు కులవిందులకే గాని వ్యక్తికి కాదు. ఇలాంటి ఒక కులపు తగాదాను నా నవల "శరతల్పం" లో చూపించాను. కుల పెద్దలు తీర్చలేని తగాదాలు దొర దగ్గరకు వెళ్తాయి. దొర పరిష్కారానికి సాధారణంగా తిరుగు ఉండదు. దొర పరిష్కారంలో దొర ప్రయోజనం కొంత ఉంటుంది. అయినా ఊరు దాటి కోర్టుకు ఎక్కడం అరుదు.

 

    సర్కారు బడికి పిల్లలను ఎక్కువమంది పంపేవారు కారు. ఉర్దూ చదువు నిత్యజీవితంలో పనికి వచ్చేది కాదు. పెద్ద చదువులు చదివినా - తురకలకు తప్ప - ఉద్యోగాలు రావు. అందువల్ల వీధి బళ్లలో చదువు. అక్షరాలు - పెద్ద బాల శిక్షతో చదువు ముగింపు. నిత్య జీవితానికి అక్కరకు వచ్చేవన్నీ పెద్ద బాలశిక్షలో ఉంటాయి. అంతకుపైన చదవదలచినవారు పండితుల వద్ద పోతన భాగవతం చదివేవారు.

 

    చిన్నగూడురులో ఆరు శ్రీవైష్ణవ కుటుంబాలు, ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. మూడు కుటుంబాలు మా మాతామహుల సహితంగా నాలుగు ఉద్దండ పండిత కుటుంబాలు. ఎవరు కోరినా వారు ఉచితంగా ఆంద్ర, ద్రావిడ, సంస్కృతాలు బోధించేవారు. వాళ్ల ఇళ్లలో ఉంచుకొని భోజనాలు పెట్టి చదువు చెప్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి.

 

    ఊళ్లో ఇద్దరు వైద్యులుండేవారు. ఒకరు మా పితామహులు, ఇంకొకరు వడ్లకుంట సాయెబు అని గౌండ్లతను. సాయెబుకు భారత భాగవతాలతో కూడా పరిచయం. మా తాతగారికి సాయెబుకు ప్రాణ స్నేహితం. కలిసి తినడం లేదు కాని, వారిది అవ్యాజమైత్రి.

 

    సాధారణంగా మందుల సంచీ తీసుకొని వైద్యులే రోగుల ఇళ్లకు వెళ్లేవారు. రోగులు వైద్యుల దగ్గరికి రావడం తక్కువ. ఒకసారి ఆకాశవాణి వారికి వైద్యాన్ని గురించి ఒక రూపకం వ్రాశాను. అందులో వైద్యుడు రోగి దగ్గరకు వెళ్లడం తెలిపాను. ఇది చైనా పధ్ధతి అన్నారు ఆకాశవాణివారు. ప్రాగ్దేశాలు - తూర్పుదేశాలన్నింటిలో అదే ఆచారం అని వివరించాల్సి వచ్చింది.

 

    మన జీవన విధానం, మనకు తెలియకుండా చేస్తున్నాయి - మన ప్రచార సాధనాలు!

 

    అసలు జీవన విధానంలోనే ఆరోగ్య సూత్రాలు, వ్యాయామం ఇమిడి ఉన్నాయి. కాబట్టి వైద్యుల అవసరం ఉండదు. ఉదయంలేచి వేపచెట్టు ఎక్కి పళ్ళపుల్ల విరుచుకోవాలి. దొడ్డికి చెంబు పట్టుకొని నడిచి పోవాలి. స్నానానికి ఏటికి గాని, చెరువుకు గాని వెళ్లాలి. లేకుంటే బావిలో నీళ్లు చేది పోసుకోవాలి. ఎక్కడికి పోయినా నడిచి పోవాలి. ఇదంతా పురుషులకు స్వతస్సిద్ధంగా జరిగే వ్యాయామం.

 

    స్త్రీలు ఇళ్లు అల్లుక్కోవాలి. దూరం నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాలి. వడ్లు దంచుకోవాలి. పప్పులు విసురుకోవాలి. నీళ్లు తోడుకోవాలి. మజ్జిగ చేయాలి. వారి నిత్యకృత్యంలోనే కావలసినంత వ్యాయామం ఉంది.  

 

    అవి 'కల్తీ' అనే పదం పుట్టని రోజులు! అన్నీ స్వచ్ఛమైన ఆహార పదార్థాలు. నువ్వులు గానుగనూనె, ఇంటవండిన ఆముదం, తెలియకుండానే స్వచ్ఛమైన వాతావరణం.

 

    అప్పుడు - వైద్యుని అవసరం ఎప్పుడో!

 

    అగ్గిపెట్టె సహితం లేని వ్యవస్థ అది. కుంపట్లో ఊక - పిడక వేసి ఉంచేవారు ఎప్పుడూ. చిన్నతనంలో నా కాలు కుంపట్లోపడి కాలింది. నూనెరాసి తుమ్మపొడి వేశారు. మరొకసారి రక్త విరేచనాలు అయినాయి. విసపుగోళ్లు ఇచ్చారు. ఇలాంటి గృహవైద్యాలు అందరికీ తెలుసు.

 Previous Page Next Page