అతనిది మావారే. చిన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఊరెళ్ళిపోయాడు. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళేవాడు. ఊరికి వచ్చినప్పుడు ఏ రెండు మూడు రోజులో వండడం వల్ల నేనెప్పుడూ అతన్ని పరిశీలించలేదు.ఈమధ్య అతని తాతయ్య పోయాడు. దాంతో అక్కడున్న పొలమూ, పుట్రా అమ్ముకుని అతని అమ్మమ్మ కూతురి దగ్గరికి వచ్చేసింది. అమ్మమ్మతోపాటు అతనూ పర్మినెంట్ గా ఊరికి వచ్చేశాడు.
అతను వచ్చిన రెండోరోజో, మూడోరోజో వీధిలో వెళుతుంటే చూశాను. బంధువుల అబ్బాయి కనుక పలకరించాను.
"ఏం వంశీ! ఎప్పుడు రాక?"
"మొన్న వచ్చాను. అంతా బావున్నారా?" అంటూ నేనున్న వరండాలోకి వచ్చాడు.
"ఆఁ"
"మామయ్య ఎక్కడ?"
"పండరి భజనలు కదా. ఆ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడు."
వంశీ వెళ్ళిపోయాడు.
రెండోరోజు ఇంకాస్త పొద్దుపోయాక వచ్చాడు. వరండాలో వున్న మంచంమీద కూర్చుని అవీ ఇవీ కబుర్లు ప్రారంభించాడు.
నా నేచర్ తెలిసి ఎవరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు కారు. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మనిషి దొరకడం చాలా రిలీఫ్ గా వుంది. అందుకే అతను చిన్న ప్రశ్న వేసినా సుదీర్ఘమైన జవాబులు చెబుతున్నాను.
ఆ తర్వాత రోజూ రాత్రి ఏడుగంటల ప్రాంతాన మా ఇంటికి వచ్చేవాడు. ఆ టైమ్ కి నా భర్త పండరి భజన నేర్పించడానికి దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. నేనూ, వంశీ ఆరుబయట కుర్చీలో కూర్చుని కబుర్లు వేసుకునేవాళ్ళం. ఏ తొమ్మిందింటికో అతను ఇంటికి వెళ్ళేవాడు.
క్రమంగా నాలో మార్పు రావడం ప్రారంభించింది. మనుషుల మీద ఇంతకు ముందున్న ద్వేషం లేదు. గయ్యాళితనం కాస్తంత తగ్గింది. పనివాళ్ళ మీద కేకలు వేయడం ఎప్పుడో తప్ప చేయడం లేదు. చాడీలు కూడా తగ్గాయి.
మనసులో అంతకు ముందున్నంత గందరగోళం లేదు. ఫ్రస్ట్రేషన్ తో పిచ్చిపట్టినదానిలా ప్రవర్తించే నేను మామూలు మనిషి అయ్యాను. ఇంతకు ముందులా వెర్రిమొర్రి కలలు కూడా రావటం లేదు.
అయితే ఎందుకు నాలో ఇలా మార్పు వచ్చిందో మాత్రం గుర్తించలేదు. నాలోకి నేను తొంగిచూసుకోవడమంటే నాకెప్పుడూ భయమే.
వంశీ చాలా మంచి మనిషి. ఇరవై ఏళ్ళకే అంత బాగా మాట్లాడటం చాలా అరుదు. అతనిలో ముఖ్యంగా నచ్చింది అతని సమయస్పూర్తి. స్పాంటేనియాస్ గా జోక్ లు వేసేవాడు. జీవితంలో అంత చక్కటి హాస్యం వుంటుందని అతని ద్వారానే తెలుసుకున్నాను.
నాతో మాట్లాడే ఆ రెండు గంటల్లో నన్ను ఎన్నోసార్లు నవ్వించేవాడు. అతని కంపెనికన్నా అతని హాస్యానికే ఎక్కువ అడిక్ట్ అయిపోయాను.
ఆరోజు శివరాత్రి, ఉదయమే నిద్రలేస్తూనే తలస్నానం చేశాను, ఆరోజు ఒక్కపొద్దు గనుక టిఫిన్ ఏమీ చేయకుండా ఏకంగా భోజనం చేయాలి కాబట్టి ఆ పనిలో పడ్డాను. వడలూ, పాయసం, అవినాకూ తాళింపూ, సాంబారూ, కొబ్బరిచట్నీ ఇలా రకరకాల వంటలు చేయడంతో మధ్యాహ్నం రెండయ్యింది. నేనూ, నా భర్తా భోజనాలు ముగించాం. అలా నడుము వాల్చి లేచేసరికి నాలగయ్యింది.
మధ్యాహ్నం వంటకాలే చాలా మిగిలాయి గనుక రాత్రి వాటితోనే అడ్జస్టయిపోదామనుకున్నాను. అంతలో సుగుణా, మమతా వచ్చి గుడికి వెళదామని పిలిచారు. నాలో మార్పు వచ్చినప్పట్నుంచీ మా ఇంటికి ఒక్కొక్కరే రావడం ప్రారంభిస్తున్నారు.
మా వూరికి రెండు ఫర్లాంగుల దూరంలో శివాలయం వుంది. సుగుణా వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆరయింది. అప్పటికే రాత్రంతా మేల్కొని వుండటం ఎవరికి వారు తమకు ఇష్టమైన కాలక్షేపాన్ని వెదుక్కుంటున్నారు.
నా భర్త అప్పటికే రెడీ అయిపోయి నాకోసం చూస్తున్నారు. మొలకు కాషాయవస్త్రం, చేతుల్లో చిటికెలు చూడటంతోనే ఆయన పండరి భజనకి వెళ్ళడానికి తయారైనట్లు అర్థమైంది.
"నేను భజనకి వెళుతున్నాను. ఈరోజు తెల్లారేవరకు భజన వుంటుంది. వడ్డించు తిని వెళతాను" అని చిటికెలు టేబుల్ మీద పెట్టారు.
ఆయనకి భోజనం పెట్టాను.
మరో పదినిముషాలకు బయల్దేరాడు.
"మరి నీ కాలక్షేపం ఏమిటి? కబుర్లాడుకునేందుకు వంశీ కూడా వచ్చినట్లు లేడే?" అన్నాడు.
"ఉదయం నుంచీ కనబడలేదు. బహుశా సినిమాకేమైనా చెక్కేశాడేమో. ఈరోజు ఒక టిక్కెట్టుకు రెండు షోలు కదా."
"బోర్ కొడితే అలా దేవాలయం దగ్గరికి రా. ఈరోజు భజన బ్రహ్మాండంగా వుంటుంది. తబలా మాస్టార్ ని తిరుపతి నుంచి పిలిపించాం.
"అలానే!"
ఆయన అత్యుత్సాహంతో వెళ్ళిపోయాడు.
మళ్ళీ మళ్ళీ వంటగిన్నెలన్నీ సర్దడం ఎందుకని నేనూ భోజనం ముగించి వీధిలోకి వచ్చి నిలబడ్డాను.
ఆ కోలాహలం చెప్పడానికి మాటలు చాలవు.
వీధి దీపాలకింద గుంపులు గుంపులుగా జనం. వయసులో వున్న ఆడపిల్లలు జట్లు జట్లుగా విడిపోయి నాలుగురాళ్ళ ఆట ఆడుతున్నారు. మరికొందరు తొక్కుడు బిళ్ళకు ఉపక్రమించారు. మరికొందరు వెన్నెల కుప్పలు ప్రారంభించారు. ఇంకొందరు కుంటాట అందుకున్నారు. కాస్త వయసు ముదిరిన స్త్రీ పురుషులు వరండాల్లో జేరి దాయాలాట ఆడుతున్నారు. వృద్ధులు పులీమేక ఆటలో లీనమైపోయారు. మరికొందరు భజన దగ్గరికి బయల్దేరారు.
నేనూ ఏదో గ్రూప్ లో చేరిపోదామని అనుకుంటూ వుండగా సుగుణ, మమతా వచ్చారు.
"ఏం చేద్దాం?"
"అదే ఆలోచిస్తున్నాను."
"మా ఆయన అందరం కలిసి దాక్కునే ఆట ఆడదామంటున్నాడు" సుగుణ చెప్పింది.
"అందరం కలిస్తే ఏదో ఒకటీ ఆడవచ్చులే. ఒకే ఆట ఆడినా బోర్ కొడుతుంది. కొంతసేపు దొంగాట, కోంతసేపు తొక్కుడు బిళ్ళ ఆట, మరికొంతసేపూ దాయాలాటా ఆడదాం. సినిమా రష్ గా వుంటుందని మా ఆయన ఇంటి దగ్గరున్నాడు. అందరం కలిస్తే కాలక్షేపం అవుతుంది. ఇంతకీ చలపతీ అన్నయ్య ఎక్కడ? భజనకి వెళ్ళాడా?"
"ఆఁ! గురువు వెళ్ళకపోతే. ఎలా? అదిగో అప్పుడే తబలాను శృతి చేస్తున్నట్టున్నారు. అందరం ఒక దగ్గర చేరదాం. ఇల్లు తాళం వేసి వస్తాను" అని లోపలికెళ్ళాను.
వంశీ ఎక్కడికెళ్ళాడా అని ఆలోచిస్తూ వంటిల్లంతా సర్ది ఇంటికి తాళం వేశాను.