Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 13


    

      ఎవరయినా ముసలివాళ్ళు అయిపోతారని ఇప్పుడు నలభై ఏళ్ళు నిండినవాడ్ని కట్టుకోమంటున్న అమ్మ లాజిక్  నాకు అర్థం కాలేదు.

 

    "కానీ-"

 

    "అలా నసగొద్దు. నువ్వు నాకు ఒక్కదానివే. నీ ముందూ వెనకా ఎవరూ  లేరు మాకు. నువ్వు ఎవర్నో చేసుకుని ఎక్కడో కాపురం చేసే దానికన్నా ఇక్కడే మనింట్లోనే వుండిపోవాలని మా కోరిక. నీకు పెళ్ళి అయి నీ కడుపునా ఓ కాయ  కాస్తే వాడితో ఆడుకుంటూ  ఈ శేష జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. నిన్ను చేసుకొని ఇక్కడే ఇల్లరికం వుండిపోయే వాడు మనకు దొరకద్దూ. చలపతి అయితే ఆల్ రెడీ ఇక్కడే వున్నాడు. నిన్ను చేసుకున్న తరువాత కూడా  ఇక్కడే వుండిపోతాడు."

 

    "అదిగాదే"

 

    "ఇంక నీ సందేహాలూ, అపనమ్మకాలూ నేను వినను. ఇంకో రహస్యం చెప్పనా? ఈ ఆస్థి అంతా ఎవరో  తినిపోవడం కన్నా మన ఆస్థి మనమే తింటే  పోలా. వాడు ఎవరో పరాయివాడు కాడు. నాకు తమ్ముడు. మీ నాన్నకు పెదబామర్ది. నీకు మావయ్య. మన ఆస్థి మన దగ్గరే వుండాలంటే వాడయితేనే బెస్టు. పెళ్ళి అంటే ఏదో సంవత్సరం, రెండు సంవత్సరాల ముచ్చట కాడు నూరేళ్ళ పంట."

 

    అదే నా బాధ అంతా. నూరేళ్ళలో అప్పటికే నలభై ఏళ్ళు అయి పోయినవాడ్ని చేసుకోమనడం దారుణం. అందుకే నిక్కచ్చిగా చెప్పాను. "ఒద్దే అమ్మా! నువ్వు నూరు చెప్పు, లక్ష చెప్పు, నలభై ఏళ్ళవాడిని నేను చచ్చినా చేసుకోను."

 

    అమ్మ ఈసారి మరింత అనునయిస్తూ "అలా అనకు. ఇంత చిన్న కారణం వలల్ నీ జీవితాన్ని మరొకరితో ముడిపెట్టుకుని బాధలు పడవద్దు. మేము నీ తల్లిదండ్రులం గానీ  శత్రువులం కాము. వాడికి ఏమైనా దురలవాట్లు వున్నాయా అంటే అదీ లేదు. సిగరెట్ తాగడు. మందు పుచ్చుకోడు. ఆడవాళ్ళ వెంట పడడు. అడపా దడపా ఆ లాటరీ టికెట్లు కొనడం తప్ప మరో  యావలేదు" అని మావయ్య సుగుణాలను ఏకరుపు పెట్టింది.

 

    అమ్మ చెప్పిన సుగుణాలన్నీ ఏమోగానీ నాకు మాత్రం చలపతిలో కనిపించిన సుగుణం ఒక్కటే. ప్రశాంతతను కోరుకునే మనస్తత్వం. చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడి కూడా ఎరుగడు. కామ్ గా వుండేవాడు. ఇంట్లో కూడా ప్రశాంతత కొరుకునేవాడు. ఇల్లు ఎప్పుడూ మౌనంగా ఋషిలా వుండాలనేవాడు. మా అమ్మ ఎప్పుడైనా ఎవరిమీదైనా కేకలేస్తుంటే వెంటనే అడ్డుకునేవాడు. మనం  నష్టపోయినా సరే  ప్రశాంతంగా వుండే పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలనేవాడు.

 

    ఈ ఒక్క  సుగుణానికి కట్టుబడి అతన్ని పెళ్ళి చేసుకోవడం అసంభవం. అదే మాట  చెప్పి కిందకి వచ్చేశాను.

 

    మరుసటిరోజు నాన్న నాకు క్లాసు తీసుకున్నాడు. మావయ్యను చేసుకొమ్మని బ్రతిమిలాడాడు. బుజ్జగించాడు. చివరి అస్త్రం అన్నట్లు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించాడు.

 

    ఇంట్లో అమ్మా నాన్నే ఇలా శత్రువులుగా మారిపోతే ఆడపిల్లను నేనేం చెయ్యగలను? చివరికి విధిలేని పరిస్థితుల్లో తల వూపాను.

 

    పెళ్ళి అంటే కలగాల్సిన థ్రిల్ లేదు. నా ఊహలకు, నా రంగుల కలలకు అంత్యక్రియల్లా అనిపించింది. మావయ్యతో నా పెళ్ళి నిశ్చయమయ్యాక ఊర్లోణి నాతోటి ఆడపిల్లలు నా వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించి, బాధ పొంగి పోర్లేది.

 

    పెళ్ళి పనులు మొదలయ్యాయి మా ఇంట్లో.

 

    కాంచీపురం వెళ్ళి చీరలు తెచ్చారు. తిరుపతికి వెళ్ళి బంగారు నగలు తెచ్చారు. పెళ్ళికూతురి అలంకరణకోసం అన్ని కాస్మిటిక్స్ మద్రాసు నుంచి తెప్పించారు.

 

    ఇవి ఏవీ నాకు ఆనందాన్ని కలిగించలేదు. నా యవ్వన సామ్రాజ్యానికి కాపలకాసే ఇంద్రచాపంలా వుండాల్సిన పట్టుచీర ఉత్తిబట్టలా అనిపించింది. నా శరీరపు రంగును చూసి తలలు వేలాడదీసినట్లు అనిపించాల్సిన బంగారు ఆభరణాలు ఉత్తిలోహపు పిచ్చి డిజైన్లలా కనిపించాయి. నా ఆనందానికి మెరుగులు దిద్దడానికి పుట్టినట్లు అనిపించాల్సిన కాస్మిటిక్స్ ఉత్తి రసాయన జిగురుల్లా  తోచాయి.

 

    నాకేమీ థ్రిల్స్ అనిపించకనే నా పెళ్ళి అయిపోయింది.

 

    నా ఫస్ట్ నైట్ ఎలా రసహీనంగా తెల్లవారిందో మిగిలిన రోజులూ అలానే అనిపించాయి. మధ్య వయసులో ఎలాంటి స్పందన వుంటుందో అంతే ప్రదర్శించేవాడు నా భర్త. నా అభిరుచులకు, ఆయన మనస్తత్వానికీ ఎక్కడా పొంతనలేదు.

 

    ఒ రెండేళ్ళు గడిచిపోయాయి అమ్మ టైఫాయిడ్ తోనూ, నాన్న క్షయతోనూ చనిపోయారు. నాకు పిల్లలు కూడా కలగాలేదు. దీంతో మళ్ళీ నేను ఒంటరిదాన్నయి పోయాను. నాకు పెళ్ళి అయిందన్న విషయం కూడా అప్పుడప్పుడూ గుర్తుండేది కాదు.

 

    నా ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బాగా గయ్యాళితనం వచ్చింది. కానిదానికీ, అయినదానికీ పనివాళ్ళమీద విరుచుకుపడే దాన్ని. బయట మనుష్యులతో కూడా అలానే ప్రవర్తించేదాన్ని. చిన్న విషయానికి కూడా కటువుగా రియాక్టయ్యేదాన్ని. నానా తిట్లూ అబ్బాయి. బూతులు కూడా అలవాటయ్యాయి. జనాన్ని చూస్తేనే శివాలెత్తి పోయేదాన్ని. మనుష్యులంతా అసహ్యంగా కనిపించేవాళ్ళు. ఇరుగు పోరుగంటే నన్ను పీక్కుతినడానికి తిష్టవేసిన వాళ్ళలా అనిపించేవాళ్ళు.

 

    కొన్నిరోజులకి ఊరు ఊరంతా నేనంటే హడలిపోయే స్థితికి వచ్చింది. నాలాంటి గయ్యాళి, కచ్చబోతు మనిషి, వ్యవహారాల పుండాకోరు. చాడీల మనిషి మరొకరు ప్రపంచంలో వుండదన్న పేరొచ్చింది.

 

    బయటే కాదు. ఇంట్లోనూ అంతే. పనిమనుషులమీద ఎగిరేదాన్ని. ఎంత చిన్న విషయానికయినా నా భర్త మీద విసుక్కునేదాన్ని, కోపగించుకునేదాన్ని, ప్రతిదానికీ పేచీకి దిగేదాన్ని.

 

    నా భర్త  నరకం  ఎలా వుంటుందో  నా ప్రవర్తనలో రుచి చూపించాను. ఆయన కొరుకునే ప్రశాంతత పూర్తిగా కరువైంది. రోజులో ఒక నిముషం కూడా ఆయనకు ప్రశాంతత చిక్కుకుండా చేసేదాన్ని.

 

    ఈ గుణాలన్నీ ఎలా అబ్బాయో నాకు తెలియదు. నాభర్త ప్రశాంతతను ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆయనమీద పగ సాధించాలన్న కోరికతో నేనలా అయిపోయానో ఏమో తెలియదు.

 

    అందర్లాగే నేనెప్పుడూ నన్ను నేను విశ్లేషించుకోలేదు. నాకు ఏం కావాలో, ఏం తక్కువైందో నా అంతరంగాన్ని  వెదికి తెలుసుకోలేదు. గయ్యాళిగా వుండడంతో ఇతరులమీద చాడీలు చెప్పడంలో, అసహ్యంగా మాట్లాడడంలో, ఎదుటివాళ్ళు నైతికంగా ఎలా పతనమైపోతున్నారో చెప్పుకోవడంలో వుండే ఆనందాన్ని అనుభవిస్తున్నాను.

 

    ఇల్లు ఇలా అయిపోవడాన్ని భరించలేకపోయాడు నా భర్త. అందుకే రాత్రయితే పండరి భజనకు వెళ్ళిపోయేవాడు. త్వరలోనే ఆయన పండరి భజనలు నేర్పించే గురువు స్థాయికి ఎదిగిపోయాడు. రోజు రాత్రికాగానే దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. కుర్రుకారుకి పండరి భజనలు నేర్పించి ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకునేవాడు.

 

    ఇదిగో ఇలాంటి సమయంలో మా వూరికి వంశీ వచ్చాడు.

 Previous Page Next Page