Previous Page Next Page 
సామ వేద సంహిత పేజి 13

 

10.    అశ్వినులారా! మీ రథము ప్రియతమము. ఫలదము. ధనవాహము. స్తోతలగు ఋషులు చక్కని స్తుతులచే దానిని శోభిల్ల చేయుచున్నారు. మధు విద్యావిశారదులారా! ఆ స్తుతులను ఆకర్షించండి.
   
                                        ఎనిమిదవ ఖండము
   
ఋషులు :- 
   1,7. వసుమిత్రుడు. 2,4. విమదుడు. 3. సత్యశ్రవుడు. 5,6. గోతముడు. 8. అంహోముగ్వామాదేవ్యుడు.
   
1.    అగ్నిదేవా! నీవు దీప్తిమంతుడవు. జరా రహితుడవు. నిన్ను సకల దిశలందు ప్రజ్వలింప చేయుచున్నాము. నీ దీప్తి స్తుతియోగ్యము. అది ద్యులోకమున వెలుగుచున్నది. మేము స్తోతలము. మాకు అన్నము ప్రసాదించుము.
   
2.    అగ్నిదేవా! నేను విమదుడను. నీ కొరకు దోషరహిత స్తుతులు రచించినాను. నీవు హోతవు. కుశలు పరచినట్టియు, ఓషధీ వ్యాప్తమైనట్టియు, పావక శుద్దమగు యజ్ఞమునకు నిన్ను ఆహ్వానించుచున్నాను. ఆరాధించుచున్నాను. నీవు మహిమాన్వితుడవు కదా!
   
3.    ఉషోదేవీ! నేడు నీ వెలుగులతో మా ధన మార్గములను ప్రకాశింపచేయుము. నీవు సుజాతవు సూనృతవు. నేను వయపుత్రుడనగు సత్యశ్రవుడను. నన్ను పూర్వము వలెనే అనుగ్రహింపుము.
   
4.    సోమమా! నీ మహిమ గొప్పది. నేను విమదుడను. నా మనసును, ఆత్మను, ప్రజ్ఞానమును శుభ ప్రధము చేయుము. నీ స్తోతలు నీకు మిత్రులు అగుదురు గాక. గోవులు పచ్చికలో వలె వారు నీ మైత్రిచే ఆనందింతురుగాక.
   
5.    ఇంద్రుడు ప్రజ్ఞావంతుడు. అరిభయంకరుడు. సోమాన్నవంతుడు. అతడు తన బలమును ఎదుట నిలిచి ప్రదర్శించును. తదనంతరము దర్శనీయులు, సునాసికలగు హర్యశ్వవంత ఇంద్రుడు సంపదల కొరకని దగ్గరనున్న ఇనుప వజ్రమును అందుకొనును.
   
6.    ఇంద్రుడు స్నేహశీలి. వరదుడు. గోప్రదాత. అతడు రథమును అధిష్టించువాడు. అతనికి సోమము నిండిన పాత్ర గుర్తుకురాగా హర్యశ్వములను పూన్చును గాత.
   
7.    అగ్ని ధనమగును. ఆశ్రయమగును. అతని తృప్తుని చేయుటకు ధేనువులు సాగును. అట్టి అగ్నిని శీఘ్రగాములగు అశ్వములు తెచ్చును. హవి సమర్పించు నిత్య ఉపాసకులను అగ్ని అనుగ్రహించుము. అట్టి అగ్ని మాకు అన్నము ప్రసాదించునుగాత.
   
8.    దేవతలారా! ప్రసన్న మనస్క, శత్రు శిక్షక ఆర్యను, రక్షించు మిత్రుడు, పాపనాశక వరుణుడు ఎవనిని ఉన్నత పదమునకు చేర్తురో - వానిని పాపములు అంటవు. దుర్గతులు తాకవు.
   
                                            తొమ్మిదవ ఖండము
   
ఋషులు :- 1-6, 9,10 ఋణసదస్యుడు. 7. వసిష్ఠుడు. 8. వామదేవుడు.
   
1.    సోమమా! ఇంద్రుని కొరకు, మిత్రుని కొరకు, పూషా కొరకు, భాగుని కొరకు రుచికరమవై పాత్రలన్నింట నిండుము.
   
2.    సోమమా! నీవు సహనశీలవు. మాకు మంచి అన్నములు ప్రసాదించుము. నలువైపులా నున్న పాత్రలందు నిండుము. మా శత్రువులపై దండెత్తుము. మా రుణములను తీర్చుము. పాపములను నాశము చేయుము. దాటిపొమ్ము.
   
3.    సోమమా! నీవు మహానుడవు. రసవాహినివి. పోషకుడవు. సకల దేవతల లోకములందలి పాత్రలందు నిండుము.
   
4.    సోమమా! నీవు అశ్వము వలె జలముచే శుద్ది చేయబడినావు. అశ్వము వంటి వేగము కలదానవు. మాకుబలము, ధనము కలిగించుటకు పాత్రలందు నిండుము.
   
5.    సోమము శుభంకరము. విద్వత్తమము. అది ధనము, ఆనందము కొరకు జలములందు స్రవించును.
   
6.    సోమమా! నిన్ను సంపాదింతుము. స్తుతింతుము. నీవు మహా మానవ సామ్రాజ్యములను రక్షించుటకు శత్రు సేనపై దండెత్తెదవు.
   
7.    మరుత్తులు కాంతిమంతులు. ప్రభువులు సమాన స్థానముల వారు. మానవ హితైషులు. అశ్వవంతులు. ఉగ్రులు. వారు ప్రార్దించువారిని అనుగ్రహింతురు.
   
8.    అగ్నిదేవా! నీవు కళ్యాణమూర్తివి. పరమ ప్రియుడవు. మేము స్తోతలము. ఇంద్రాదులను ప్రసన్నులను చేయు స్తుతులతో - అశ్వము వలె హవిని వహించు నిన్ను వర్ధిల్ల చేయుచున్నాము.
   
9.    ఈ దేవతలు మానవ హితకారులు. ప్రకాశించువారు. సవిత కొరకు సిద్దము చేసిన సోమరూప అన్నమును అందుకున్నారు. యజమానులారా! ఇక స్వర్గమును జయించండి. అశ్వములను జయించండి.
   
10.    సోమమా! నీవు యశస్వివి. చక్కని ధారల దానవు. సనాతనుడవు. గొప్పవాడవు. రోమముల నుంచి ప్రవాహించుము.
   
    (సోమమును అజ రోమములతో శుద్ది చేయుదురు.)
   
                                                పదవ ఖండము
   
ఋషులు :- 1,2. ఐంద్రి. 3. త్రసదస్యుడు. 4,5. ఐంద్రి. 6,10. సంపాత ఋషి.
   
1.    ఇంద్రా! నీవు సర్వత్ర శత్రుచ్చేదకుడవు. సర్వత్రదాతవు. బలవంతుడవు. మాకు కోరిన పదార్ధముల నిమ్ము. యాచించువారికి ఇమ్ము.
   
2.    ఇంద్రుడు ఋతురూపుడు. ప్రఖ్యాతుడు. అడిగిన వరములు ఇచ్చువాడు. అతనిని ప్రశంసించుచున్నాను.
   
3.    వృత్రాసురుని వధించుటకు గాను ఇంద్రుని స్తుతించుచున్నాము. మంత్రములచే పూజించుచున్నాము. ప్రసన్నుని చేయుచున్నాము.
   
4.    ఇంద్రా! ఋభువులు మానవులు. వారు నీ గుర్రముల కొరకని రథము సిద్దము చేసినారు. త్వష్ట నీ కొరకని ద్యుమంత వజ్రమును నిర్మించినాడు.
   
    (మానవులగు ఋభువులు తమ నైపుణ్యమున దేవతలు అయినారు.)
   
5.    హవిస్సులు అర్చించువారు ధనవంతులగుదురు. సుఖింతురు. అర్పించనివాడు దానములు ఇవ్వజాలడు. తన ధనమును తాకజాలడు.
   
6.    ఇంద్రుని శరణు కోరినవారు నిర్మలులు, లోక పోషకులు, దానాది సద్గుణ యుక్తులు, పాపరహితులు అగుచున్నారు.
   
7.    ఉషోదేవీ! హర్షదాయక తేజస్సులతో విచ్చేయుము. పొడుగు బరువైన ఆవులు నీ రథమును సేవించుచున్నవి.
   
8.    ఇంద్రా! చమసములందు మధుర సోమము నీవద్ద ఉంచినాము. అన్నము వడ్డించినాము. ప్రార్దించుచున్నాము.
   
9.    సుందర స్తుతివంతులగు మరుత్తులు పూజార్హ ఇంద్రుని స్తుతింతురు. నిత్య యవ్వనుడు. ప్రసిద్దుడగు ఇంద్రుడు వారి శత్రువుల మీద దండెత్తును. వధించును.
   
10.    విప్రులారా! ఇంద్రుడు వృత్రహంత. అతనిని ప్రసన్నుని చేయగల విశేష స్తుతులు గానము చేయండి.
   
                                                      పదకొండవ ఖండము
   
ఋషులు :- 1. పృషదుడు. 2,3,4. బంధువు. 5. సంవర్తుడు. 6. ఆప్త్యుడు. 7. ఐలూషుడు. 8. భరద్వాజుడు. 9. ఆత్రేయ. 10. వసిష్ఠుడు.
   
1.    అగ్ని హవ్యవాహుడు. బుద్దికుశలుడు. హవియుక్తుడు. రథము వలె చేర్చువాడు. అతడు యజమానిని గుర్తించును.
   
2.    అగ్నిదేవా! నీవు అర్చనీయుడవు. మాకు దగ్గరి వాడవు. రక్షకుడవు. సుఖ ప్రదుడవు అగుము.
   
3.    అగ్ని మహితాత్ముడు. సూర్యసముడు. పూజనీయుడు. అతడు యజిమ్చు వారికి రత్నరాసులు ఇచ్చును.
   
4.    అగ్ని సకల శత్రుహంత. ఈ యజ్ఞమున తూర్పున ఆసీనుడై ఉన్నాడు. ఋత్విజులు అతనిని స్తుతించుచున్నారు.
   
5.    ఈమె ఉష. తన సోదరి రాత్రి అంధకారమును తన ప్రకాశమును దూరము చేయుచున్నది. తన వెలుగులను రథము మీదకు చేర్చుచున్నది.
   
6.    దృశ్యమానములగు సమస్త భువనములను, సుఖముల కొరకని స్వాధీనపరచు కొనుచున్నాను. ఇంద్రుని, సమస్త దేవతలను స్తుతించుచున్నాను. వారు నాకు కార్యసిద్ది కలిగింతురుగాత.
   
7.    ఇంద్రా! నీ దానములు రాజమార్గము నుంచి చీలు చిన్న మార్గములవలె మాకు అందును గాక.
   
8.    ఇది దేవతలు ప్రసాదించిన అన్నము. దీనిని మేము అనుభవింతుముగాత. సుపుత్రవంతులమగుదుము గాత. శతహిమములు జీవింతుము గాక.
   
9.    ఇంద్ర, మిత్ర వరుణులారా! మాకు బలము నిచ్చు అన్నము ప్రసాదించండి. మా అన్నములను వర్ధిల్లచేయండి.
   
10.    "ఇంద్రో భువనస్య రాజతి" ఇంద్రుడు లోకములకు ప్రభువు అగుచున్నాడు.
   
                                              పన్నెండవ ఖండము
   
ఋషులు :- 1,10. గృత్సమదుడు. 2. గౌరాంగిరసుడు. 3,5,7,9 పరుచ్చేపుదు. 4. రేభుడు. 6. ఏవయామి. 8. నకులుడు.

1.    ఇంద్రుడు బలశాలి. పూజనీయుడు. తృప్తుడు. ఈ సముపార్జించిన సోమమున యవల సత్తు కలుప బడినది. దానిని విష్ణు సహితుడై ఇంద్రుడు పానము చేసినాడు. ఆ సోమము మహాకార్యములు నిర్వర్తించుటకు ఇంద్రునకు ప్రేరణ కలిగించినది. బిందువులుగారాలు ఈ సోమము దీప్తివంతమై సత్య స్వరూపుడగు ఇంద్రుని చేరినది.

2.    సూర్యభగవానుడు వేలకొలది మనుష్యులు కలవాడు. దర్సనీయుడు. విద్వాంసులకు మాననీయుడు. విధాత. జ్యోతిర్మూర్తి. అతడు నిర్మలములు, అంధకార రహితలు, సమాన మనస్కలగు ఉషస్సులకు ప్రేరకుడగును. సూర్యుని తేజస్సునాకు పగటిపూట చంద్రుడు తేజోహీనుడు అగుచున్నాడు.
   
3.    ఇంద్ర దేవా! నీవు సుదూరపు స్వర్గము నుండి మా వద్దకు అగ్నియు, సోమము మాకందినట్లు, యజమాని యజ్ఞశాలకు చేరినట్లు, తారల ప్రభువగు చంద్రుడు, స్వస్థానమునకు చేరినట్లు విచ్చేయుము. మేము సోమము పట్టి నిలిచి నిన్ను ఆహ్వానించుచున్నాము. అన్నము పెట్టుమని బిడ్డ తండ్రిని కేక వేసినట్లు యుద్దములందు విజయము కలిగించుమని నిన్ను కేక వేయుచున్నాము.
   
4.    ఇంద్రుడు ధనవంతుడు. ఉగ్రుడు. స్తఃయము. భూరి బలశాలి. అప్రతిహతుడు. అట్టి ఇంద్రుని మరల మరల ఆహ్వానించుచున్నాము.
   
    పరమ పూజ్యుడు. యజ్ఞయోగ్యుడగు ఇంద్రుడు మా స్తుతులు విన్నాడు. మా యజ్ఞమునకు అభిముఖుడు అగుచున్నాడు.
   
    వజ్రియగు ఇంద్రుడు ధనము లభించు సన్మార్గములను తెలియపరచును గాక.
   
5.    ఇంద్రా! నేను ఆహవనీయగ్నిని ప్రణయనాది కర్మలందు స్థాపించినాను. అట్టి అగ్నికి అభిముఖుడనై ఆరాధించుచున్నాను. ఇంద్రవాయువులను ప్రార్దించుచున్నాను. వారు - భూమికి నాభిస్వరూపమగు దేవాయాజన స్థానమున - కలిసి కూర్చున్నారు. వారు మాస్తుతులను వినవలెను. మా కర్మములు దేవతలను చేరినట్లు మాస్తుతులు ఇంద్రవాయువులను చేరుచున్నవి.
   
6.    ఇవి 'ఏవయామి' ఋషి వాక్కు నుండి అవతరించిన స్తుతులు. ఈ స్తుతులు మరుద్వంతుడు, వ్యాపకుడు, మహానుడగు ఇంద్రుని చేరునుగాక.
   
    ఈ స్తుతులు పూజనీయులు, సుందర ఆభరణోపేతులు, స్తుత్యభిలాషులు, మేఘచాలకులు, గమన శీలురగు మరుత్తులకు చేరునుగాత.
   
7.    పవిత్రము, హరిత వర్ణము, ప్రకాశధారల సోమము ద్వేషించు సకల రాక్షసులను - సూర్య కిరణములు చీకటిని వలె నాశనము చేయును. జగత్తును భరించు సోమధారలు దీప్తములై, హరితములై, పావనము చేయుచు ప్రకాశించును. స్తోతల తేజస్సులతో కూడిన రసవంత సోమము అనేక రూపములు దాల్చుచున్నది.
   
8.    సవితా దేవత సర్వజ్ఞుడు. సత్ ప్రేరకుడు, రత్నదాత. సర్వప్రియుడు. స్తుతియోగ్యుడు. అట్టి దేవతను అర్చించుచున్నాను. అతని కాంతి ఆకసమున నిలుచును. ద్యావాపృథ్వులను వెలిగించును. అతడు ఆవిర్భవించినంత కాంతులు పరచుకొనును. బంగరు కిరణముల సూర్యుడు మమ్ము అనుగ్రహించునుగాక. స్వర్గము కొరకని ఈ సోమము సేవించునుగాక.
   
9.    అగ్ని అగ్రుడు, హోత, ధనస్వామి. మహా బలపుత్రుడు. విద్వాంసుడు. నేను అట్టి అగ్నిని అర్చించుచున్నాను.
   
    అగ్ని యజ్ఞ నిర్వాహకుడు. దేవతలను పూజించువాడు. అనుగ్రహించువాడు. తేజస్వి, అతడు నలువైపుల జరుగు హోమములందు ఘ్రుత సమర్పణమున ప్రజ్వరిల్లుచున్నాడు.
   
10.    ఇంద్రా! నీవు ప్రేరకుడవు. మానవ హితకారివి. ప్రథముడవు. పురాతనుడవు. మహాకార్యములు చేసినావు. అందుకు సకల దేవతలు నిన్ను ప్రశంసించుచున్నారు.
   
    ఇంద్రా! నీవు నీ బలమున విజిగీషులగు అసురుల ప్రాణములు తీసినావు. వారు కట్టి పెట్టిన జలములను విడిపించినావు. నీ బలమున చీకట్లను పారద్రోలుము. నీ బలము కొరకు మా హవిస్సులు అందుకొనుము.
   
   
                                    దాశరథి రంగాచార్య విరచిత
                                శ్రీమదాంద్రవచన సామవేద సంహిత
                        పూర్వార్చిక యందలి ఐంద్రకాండము సమాప్తము.

 Previous Page Next Page