Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 13

   

    ఏకాంతంలో దొరకని మాధుర్యం బహిరంగ ప్రదేశంలో రహస్య శృంగారాన్ని వెతుక్కోవడంలో వుంటుందా?
   
    రేపు తన భర్త కూడా అంతేనా?!
   
    భర్త!
   
    భర్త అనే పదం జ్ఞాపకం రాగానే గబుక్కున కుర్చీమీంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడింది.
   
    తనకు ఎలాంటి భర్త వస్తాడు? పొడవుగా అమితాబ్ బచ్చన్ లా వుంటాడా? చలాకీగా రిషీకపూర్ లా వుంటాడా? బేండిట్ క్వీన్ సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ కపూర్ గుర్తుకొచ్చాడు శేఖర్ కఫూర్ ముక్కు చాలా యిష్టం మయూషకు.
   
    తన భర్తతెల్లగా వుంటాడా? నల్లగా వుంటాడా? ఆఫీసర్ అవుతాడా? బిజినెస్ మేన్ అవుతాడా?
   
    మా అమ్మాయి జాతకం చాలా గొప్పదట తరతరాలకీ చెరగని ఆస్తిపరుడయిన వరుడు భర్తగా వస్తాడట. చిన్నప్పుడే జ్యోతిష్కుడు చెప్పాడు అని అప్పుడప్పుడు తల్లి శారదాంబ చెప్పే మాటలు గుర్తుకు రాగానే తనలో తనే సిగ్గు మొగ్గలైపోయింది మయూష.
   
    తన పెళ్ళి గురించి అమ్మ ఆలోచిస్తోంది కానీ నాన్న ఆలోచనలు ఎలాగున్నాయో? బతుకంతా రెక్కలు ముక్కలు చేసుకొని కేవలం జీతం మీద మాత్రమే సంసారాన్ని నడిపించుకొస్తున్నాడు తన తండ్రి.
   
    తన తండ్రి నిజాయితీని అందరూ పొగిడేవారే తప్ప ఏఒక్కరూ సహాయం చేసేవాళ్ళు లేరు! తండ్రి గురించి ఆలోచించుకుంటూ మంచం మీద కెక్కిన మయూష చూపులు గోడ పక్కనున్న టేబిల్ మీద పడ్డాయి.
   
    ఆ టేబిల్ మీదున్న నవల కింద రెపరెపలాడుతూ భార్గవి రాసిన ఉత్తరం కనపడగానే మనసు చివుక్కుమంది మయూషకు వెంటనే.
   
    ఆమెకు జ్వాలాముఖిరావు ఆకారం కళ్ళముందు కదలాడింది.
   
    జ్వాలాముఖిరావు లాంటి వాళ్ళను ఎవరూ ఏమీచెయ్యలేరా? అకస్మాత్తుగా ఆమెలో కసి ప్రవేశించింది.
   
    భార్గవికి తనిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది! అదే బాధగా వుందామెకు.
   
    భార్గవికి అన్యాయం చేసిన జ్వాలాముఖిరావు ఇవాళ కాకపోయినా రేపైనా పతనమవుతాడు.
   
    ఆ రోజును తను కళ్ళారా చూస్తుంది.
   
    అలా.....ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రపోయింది మయూష.
   
                                            *    *    *    *
   
    సెక్రటేరియట్ ఆ సెక్షన్ చాలా హడావుడిగా వుంది.
   
    సీనియర్ క్లర్క్ ఒకాయన ఆ రోజు సాయంత్రం అయిదు గంటలతో రిటైరవుతున్నాడు. సంబంధిత మినిస్టర్ ఆద్వర్యంలో సెక్షన్లోని సిబ్బంది.
   
    ఆయనకు మధ్యాహ్నం మూడు గంటలకు చిన్న సన్మానసభ ఏర్పాటు చేసారు. సెక్షన్ లోని మహిళా ఉద్యోగులు, ఒక్క పక్క డయాస్ ను తయారు చేస్తుండగా, మగ ఉద్యోగులు కుర్చీలూ, టేబుల్స్ అన్నిటినీ పక్కకు పెడుతున్నారు.
   
    సరిగ్గా అదే సమయంలో__
   
    టైపిస్టు సూర్యారావు చేతిలో ఏదో ఫైలుతో సెక్షన్ హెడ్ పీతాంబరం దగ్గరకొచ్చాడు.
   
    "మళ్ళీ ఇంకో ఫైల మీద సంతకమా....ఆ ఎకౌంటెంట్ గారు ఇవాళ ఇన్ని ఫైల్స్ పంపిస్తున్నారేంటయ్యా?" సూర్యారావు చేతిలో ఫైలుని అందుకుని విప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఎకౌంటెంట్ అప్పలాచారి అక్కడ కొచ్చాడు.
   
    "అది కాదోయ్ పీతాంబరం మన సుబ్రహ్మణ్యంకి దండ, మెమెంటో సరిపోతుందంటా ఏదయినా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటావా?"
   
    టైపిస్టు సూర్యారావు ఇచ్చిన ఫైల్లో పైనున్న కాగితంలోని మేటర్ ని చదవబోతూ ఆగిపోయి తలతిప్పి ఎకౌంటెంట్ వేపు చూసి.
   
    "మళ్ళీ మళ్ళీ రిటైరవుతాడా...మన మధ్యకు వస్తాడా.....తలో పది రూపాయలూ వేసుకుని ఏదో ఒక మంచి ఆర్టికల్ కొనిస్తే బావుంటుంది ఏంటంటావ్ సూర్యారావ్?"
   
    ఆ టైమ్ కోసమే చూస్తున్న సూర్యారావ్_
   
    "ముందు సంతకం పెట్టేయండి గురూగారూ. నాకవతల చాలా పనులున్నాయి" అని తొందర పెట్టాడు.
   
    పీతాంబరం పెన్నును అందుకుని సంబంధిత మినిస్టర్ ని సంబోదిస్తూ నోట్ రాసి సూర్యారావుకి అందించి ఎకౌంటెంట్ వేపు తిరిగాడు.
   
    సూర్యారావు ఆ ఫైలుని గబగబా మూసేసి చూసీ చూడకుండా ఎకౌంటెంట్ వేపు చూసి కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
   
    పీతాంబరం సర్వీస్ లో ఒక ఫైల్లో విషయం తెలీకుండా సంతకం చేయడం అదే ప్రధమం!
   
    అప్రయత్నంగా అయోమయంగా గంధరగోళపు పరిస్థితుల్ని సృష్టించి తననొక ట్రాప్ లోకి ఇరికిస్తున్నారని ఆ సమయంలో పీతాంబరానికి తెలీదు తను చేసిన ఒక సంతకం తనకు మచ్చను తెస్తుందని- ఆ సంతకం తన కూతురు మయూష మెడకు ఉచ్చులా బిగిస్తుందని పాపం ఆయన ఊహించలేదు!
   
    తన రూమ్ లోకి వెళ్ళిన టైపిస్టు సూర్యారావు తలుపు దగ్గరగా వేసి ఫోన్ వేపు నడిచి ఒక నెంబరుకు ఫోన్ చేసి "గురూగారూ గుడ్ న్యూస్ పీతాంబరం ఆ ఫైలుమీద సంతకం చేసేసాడు" అంటూ ఆనందంగా చెప్పాడు.
   
    "గుడ్ మిగతా కార్యక్రమం కూడా నేను చెప్పినట్టుగా జరగాలి. కారు పంపుతున్నాను. అలాగే అందులో రెండు బ్యాగులున్నాయి. చిన్న బ్యాగ్ లోని ఎమౌంట్ నువ్వు తీసుకో. పెద్ద బ్యాగ్ లోని ఎమౌంట్ ఎకౌంటెంట్ కివ్వు. ఓ.కే." ఆజ్ఞాపించాడు అవతలి వ్యక్తి.
   
    "అలాగేసార్" చెప్పి అటూ ఇటూ చూస్తూ ఫోన్ రిసీవర్ ని యధాస్థానంలో పెట్టేసి వెనుదిరిగాడు సూర్యారావు.
   
    సూర్యారావుకి ఫోన్క్ హేసిన వ్యక్తి భుజంగపతి అనుకున్నది అనుకునట్లుగా జరుగుతుండడంతో భుజంగాపతి పెదవుల మీద చిరుదరహారం మెరిసింది....పాము కనబడదు. అలాగే భుజంగపతి నవ్వినా, ఆ నవ్వు నవ్వుగా గుర్తించడం కష్టం.
   
                                           *    *    *    *
   
    పీతాంబరం ఇంటి కొచ్చేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది. భోజనం చేసి పడుకునేసరికి పన్నెండయింది.
   
    భర్త ఇంటికిరాగానే ఏదో విషయం చెప్పాలనుకున్న భార్య శారదాంబ ఆ విషయం ఎందుకో మరిచిపోయింది.
   
    ఒక్కొక్కప్పుడు దురదృష్టం మాయలా మనిషిని వెంటాడుతుంది.
   
                                           *    *    *    *

   
    ప్రైవేటు క్లాస్ వుండడంవల్ల త్వరగా లేచి తయారయింది మయూష.
   
    టిఫిన్ పెడుతూ అడిగింది వదిన మాలతి.
   
    "ఏవిటీ....ఎర్లీగా వెళుతున్నావ్, అర్జంట్ పనా?"
   
    "ఏం లేదులే వదినా మీ తమ్ముడు ఇవాళ ఎర్లీగా రమ్మన్నాడు" నవ్వుతూ అంది మయూష.
   
    "తమ్ముడెవరు?" అదే సమయంలో లోనికొచ్చిన అన్నయ్య కాళహస్తి శర్మ అడిగేసరికి వదినా మరదళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
   
    "అన్నయ్యా నాన్నింకా లేవలేదు. బస్టాపులో ఇవాళ నువ్వు దిగబెడతావా?" అడిగింది మయూష.
   
    నా రూట్ వేరుగదమ్మా."

 Previous Page Next Page