Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 12

 

                                                     హోటెల్లో

                   
                                         (ఐదు రోజుల దినచర్య)

                                                                                      22-5-41

    రాత్రి పదిగంటలకి బందరులో దిగాను. బంధువుల ఇంటికి వెళ్ళటం ఇష్టంలేదు. తిన్నగా "మో--కే" హోటలుకి వెళ్ళాను. గది చాలా చిన్నది. గాలీ వెల్తురూ ఆట్టే సోకని పతివ్రత ఉండటానికి చాలా బావుంటుంది. గదిలో ఒక మంచం, ఒక బల్లా, ఒక కాలు విరిగిన కుర్చీ వున్నాయి. చాలా అసహ్యం వేసింది. కాని, బడలికమీద త్వరలోనే గాఢంగా నిద్ర పోయాను.

                                                                                                         23-5-41

    ఇక్కడికెందుకు వచ్చానూ? అదే తలియటంలేదు. తిరిగి ఆ 'వింత సంఘటన' జరగ్గానే వెళ్ళిపోయాను. బందర్లో ఎందర్నో కలుసుకోవాలని కుతూహలం. కృష్ణారావుగార్నీ, పురాణంవార్నీ, కాటూరివార్నీ, మునిమాణిక్యంవార్నీ ఇంకా యింకా! స్నానం చేసి కాఫీ పైకి తెప్పించుకొని తాగి, వెళ్ళబోతూంటే అతను! - ఎదురుగా గుమ్మందగ్గిర వానవిడిచిన ఆకాశంలా మొహం లోతుకుపోయిన కళ్ళూ!

    "ఏం అలా చూస్తున్నావ్" అన్నాను.

    "దయ చూడాలి."

    "ముష్టి, ఎప్పుడూ నీకు ముష్టేనా, చంపుతారయ్యా మీరు" అన్నాను గదమాయిస్తో.

    అతను చేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తున్నాడు. నాకు అసహ్యమూ జాలీ వేసింది.

    "ఏమిఁటి అల్లా ఏడుస్తున్నావు. ఇంద తీసుకో" అని ఒక అణా అతని మీదకు విసిరాను, అతను ఆ 'అణా' జాగ్రత్తగా తీసి నా మంచంమీద పెట్టి "నేను ముష్టికి రాలేదు" అన్నాడు.

    "మరి ఏం" అన్నాను ఆశ్చర్యంతో!

    "నాకు ఐదు రూపాయలు కావాలి -బదులు!"

    "పాపం, ఐదు చాలా! నువ్వెవడవో ఉత్త స్కౌండ్రల్ లా ఉన్నావే" అంటూంటే అడ్డువచ్చి.  "తిట్టకండి! లోని వ్యక్తి బాధపడుతుంది. ఆత్మనిందని సహించలేదు" అన్నాడు.

    పూర్వం చదువుకొని, లెక్చర్లిచ్చి, డబాయించిన 'సోషలిజం' నాలో ఒక్కసారి ఉబికింది, జార్ ప్రభుత్వం కూలదోసిన  "రైడ్స్"లో వీడు ఒకడా!

    "పెద్ద కబుర్లు చెప్పకు! దయ చెయ్. ఇది దబాయింపు భిక్షలా కనపడుతోంది పో" అన్నాను.

    అతను వెళ్ళాడు. వెళ్ళుతూ అతను చూసిన చూపులో 'బాధా, తృణీకారమూ' ఉన్నై అతనెవడో ఏమిటో అని వీధిలోకి అతని వెనకాలే వెళ్ళాను. వీధిలో ముగ్గురు మనుష్యులూ, ఒక స్త్రీ నుంచుని ఉన్నారు. అతనిక్కడికి వెళ్ళి, ఏదో గుసగుసలాడాడు. ఇందులో ఏదో గూడుపుఠాణి ఉందనీ, వీళ్ళు దొంగ వెధవలనీ అనుకున్నాను.

    నా ప్రక్కగదిలో ఉన్న యువకుడు (ఎగదువ్వుడు క్రాఫింగు) ఇటూ అటూ రెండుసార్లు తిరిగి, ఆమెను చూసి నవ్వి వెళ్ళిపోయాడు.

    జట్కానుంచి ఒక నలబైయేళ్ళాయన అప్పుడే దిగి, హోటలులోకి వెళుతూ సూటుకేసు క్రింద పడేసుకొన్నాడు.

    నేను ముందుకు సాగిపోయాను.

    తిరిగి 11 గంటలకి వచ్చాను. భోంచేసి, మునిమాణిక్యంవారి 'తిరుమాళిగ' చదువుతూ పడుకొన్నాను.

    సాయంత్రం 'సంజీవ్' వచ్చాడు. ఇద్దరం కలిసి పార్కుకి వెళ్ళాం.

    పార్కులో రేడియోలో న్యూస్ విని ఇద్దరు విద్యాధికులు మాట్లాడుకుంటూ వెళ్ళుతున్నారు.
 
    'సంజీవ్' కొన్ని పాటలు పాడాడు. నేను కొన్ని గేయాలు చదివాను.

    'చూడామణి' ఎడ్వర్టయిజుమెంటు చూస్తూ యింటికి వచ్చాము. ఏదో ఆలోచిస్తున్నాడు సంజీవ్.  "ఏమిటిరా" అన్నాను.

    "వాడెవడో చాల బీదవాడు. వచ్చి రెండురూపాయలుంటే ఇమ్మన్నాడురా! యేడ్చాడు. ఇవ్వకుండా పంపించేశాను. పాపం తప్పు పని చేశానురా!" అన్నాడు.

    "ఓరి ఫూల్! నన్నెవడో వచ్చి ఇలాగే 'ఐదు' అంటే ఐదు రూపాయలడిగాడురా. వెధవ నీదగ్గరికీ వచ్చాడా! ఇదేదో పెద్దవేషం!" అన్నాను.

 Previous Page Next Page