Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 12

    "సూర్యాపేటలోని ఆంద్రవిజ్ఞానప్రకాశినీ గ్రంధాలయాన్ని దర్శించిన జిల్లాతాలూక్దారుగారు ప్రభుత్వానుమతి లేదనే నెపంతో గ్రందాలయాన్ని మూసివేయించారు. అక్కడి కార్యకర్త వ్రాస్తే నేను హోమ్ సెక్రటరీ అయిన సర్ అక్బరు హైదరీకి వ్రాశాను. "గ్రంధాలయాలు స్థాపించడానికి ఈ కార్యాలయం నుండి అనుమతి పొందాల్సిన అవసరంలే"దని వారు వ్రాసిం తర్వాత ఆ గ్రంధాలయం తిరిగి తెరువబడింది.
    "కరీంనగరంలోని సిరిసిళ్ళలో ఉన్న గ్రంధాలయాన్ని చూసి అక్కడి తాసిల్దారు "సర్కారు వారి దస్తరములలో వ్యవహార మంతయు ఉర్దూలో ఉండగా చచ్చిపోయిన తెలుగును బైటికి గుంజవలసిన పనిలేదు" అన్నారు.
    'వరంగల్లుజిల్లా మడికొండ గ్రామంలో నడుస్తున్న ఆంద్ర గ్రంధాలయం స్థాపనకు ప్రభుత్వాజ్ఞ అవసరమని పోలీసు పటేలు పట్టుపట్టాడు. కార్యదర్శి అవసరం లేదన్నారు. అప్పుడు అదాలతు (కోర్టు) నుండి కార్యదర్శి పేర ఒక లేఖ వచ్చింది' అని డ్రాయరు తెరచి ఒక లేఖ అందించారు హనుమంతరావుగారు పాణికి.
    సారంగపాణి, కష్టంగా ఇలా చదివాడు:
    'ప్రతిరోజు సదరు లైబ్రరీకి పుస్తకములు చదువుకొనగలందులకు వస్తూ వున్నారు. మరిన్నీ ఆంద్రపత్రిక, కృష్ణాపత్రిక, ముషీర్ దక్కన్ వగైరా పత్రికలు వస్తూ వున్నవి. హాలు సదరు లైబ్రరీ ఖాయం చేయుటకు మీరే యేమక్మా(యేప్రభుత్వశాఖ) నుండి అయినా హుకుం(అనుమతి) పొంది వున్నారా? అగరు (ఒకవేళ) పొందకున్నట్లయితే ఫౌరన్ (తక్షణం) పొందవలసింది. కెంకె అక్సరు(తరచు), నుజహబీ (మతసంబంధమైన) వార్తలతో జగడాలు అవుతూ ప్రాణహాని కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి మరియొక హుకుం పంపువరకు గ్రంధాలయము మూసి ఉంచవలెను.'
    "ఈ లేఖ సర్ అక్బరు హైదరీ ఉత్తరువు తరువాతదా, అంతకు ముందే జారీ చేయబడిందాండి?"
    "సర్ అక్బరు హైదరీ లేఖ 8-10-1929 ఫసలీన జారీచేయబడగా ఈ లేఖ 24-1-1934 ఫసలీన జారీచేయబడింది. ఈ ఉత్తరువు అక్రమమైందని హోమ్ సెక్రటరీకి వ్రాశాను. దానికి ఇంతవరకూ జవాబు రాలేదు. ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తున్నా, పట్టుదలా, ధైర్య సాహసాలు గల కార్యకర్తలు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు."
    ఇంతలో రెండు కప్పులలో చాయ్ వచ్చింది.
    "ఎందుకండీ ఈ శ్రమ?"
    "శ్రమ ఏముందండీ? తెలుగును గురించీ, తెలుగువారిని గురించీ ఇంత శ్రద్దగా తెల్సుకోవాలనుకునేవారే కరువు ఈ రాజ్యంలో. సుదీర్ఘమైన నీ సంభాషణ మీకు విసుగు కలిగించవచ్చు. టీ కొంత వేడి నిస్తుంది. ఉత్సాహం కలుగజేస్తుంది."
    "అదేమిటండీ, అలా అంటారు? మీరు చెప్పే విషయాలు విసుగు కాదు, ఆసక్తి కలిగిస్తున్నాయి. చాయ్ కంటే మీ మాటలే వేడినిస్తున్నాయి. సభల విషయం శలవిస్తు ఉంటిరి" అన్నాడు. పాణి చాయ్ చప్పరిస్తూ.
    గుక్కెడు చాయ్ మింగి హనుమంతరావుగారు ప్రారంభించారు:
    "మొదటి మూడు సభలకు ప్రభుత్వం అనుమతించింది. అవి హైదరాబాదు, నల్లగొండ, మధిరలలో జరిగాయి. 1925లో నాల్గవ వార్షిక మహాసభ సూర్యాపేటలో చేయాలని తలపెట్టాం.సభలు జరగాల్సిన తేదీ నాలుగురోజులుందనగా ప్రభుత్వానుమతి లేక సభలు జరగడానికి వీల్లేదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఉత్తరువు జారీ చేశారు. దీనిని కోర్టుకు లాగడం మంచిదని అమరవాది వెంకటనర్సయ్యగారు నల్లగొండ జిల్లా కోర్టులో అర్జీ దాఖలు చేయగా, ఇట్టి సభకు ప్రభువువారి ఫర్మానా 11 మొహర్రం, 1310 హిజ్రీ ప్రకారం బాబెహుకూమత్ (ప్రభుత్వం) సెలవు కావలెను అని తీర్పు ఇచ్చారు. హైకోర్టుకు అప్పీలు చేస్తే ఎవరైనను ప్రభువువారి ఫర్మానాకు విరుద్దంగా సభ జరిపించిన ఎడల అట్టి ప్రవర్తనముశాసన విరుద్ద మనపించుకొనును" అని తీర్పు ఇవ్వబడింది.
    "1927 లో బ్రిటీషు ప్రభుత్వం రెవిన్యూ పోలీసుశాఖమంత్రి లెఫ్టినెంటు కర్నలు ట్రెంచ్ ను నియమించింది. వారినుండి అనుమతి పొంది 1928 వ సంవత్సరంలో సూర్యాపేటలో వైభవంగా సభలు జరిగాయి. తరువాత ఉద్యమ వ్యాప్తిని గమనించి కార్యకలాపాల పరిధి పెంచి నిజాం రాష్ట్రాంద్ర మహాసభ ఏర్పాటు చేయాలని సంకల్పించబడి, 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన ప్రధమ నిజాం రాష్ట్రాంద్ర మహాసభ జరిగింది. 1931 లో బూర్గుల రామకృష్ణారావుగారి అధ్యక్షతన దేవరకొండలో రెండవ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఆ సభల్లో ఆంద్రజనుల ఉత్సాహం వెల్లివిరిసింది.ఆంద్రమహాసభ తమ సంస్థేననీ ప్రజలు భావించసాగారు. మరుసటి సభకు అనుమతించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరితే ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్బహద్దూర్ నుండి "మహాసభ సమావేశపర్చుటకు వీల్లేదు"అని ఆజ్ఞ వచ్చింది. అట్టి నిషేధాజ్ఞల్ని గురించి పునరాలోచించాల్సిందని విన్నవించుకోగా కర్నల్ ట్రెంచ్ గారు నాకు దర్సనమిచ్చి అనుమతించడానికి దిగువ షరతులు విధించారు:
    1.ప్రభుత్వం వారి పాలసీని గురించి చర్చించరాదు.
    2.అట్టి చర్యలు జరుపబడవనుటకు హామీగా రెండువేల రూపాయలు జమానతు యివ్వవలెను.
    3.అట్టి చర్చలు జరిగినవా, లేవా అను దానిని నిర్ణయించువారు ప్రభుత్వమువారు.
    "జమానతు చెల్లించమనీ, సభలకు అనుమతించాల్సిందనీ వేడుకోగా కర్నలు ట్రెంచ్ గారు నాకూ, బూర్గుల రామకృష్ణారావుగారికి దర్సనమిచ్చి లక్షప్రశ్నలడిగి అనుమతి ఇవ్వాల్సిందని బాబెహుకూమత్ కు సిఫార్సు చేస్తామన్నారు. అనేక షరతులు పెట్టి అనుమతి ఇచ్చారు. ఖమ్మంమెట్టులోని సనాతనులు కొందరు మా సభలు సనాతనాచారాలకుభంగం కలిగిస్తాయని, సభలు జరక్కుండా చేయడానికి అనేక అడ్డంకులు కలిగించారు. అయినా సాధారణ ప్రజలు ఉత్సాహంతో సహకరించారు. చారిత్రాత్మకంగా జరిగాయి ఖమ్మం మెట్టులో తృతీయాంధ్ర మహాసభలు -1934లో.
    "ఇలా ఏదో సాధ్యమైనంతవరకు తెలంగాణలోని ఆంధ్రులకు సేవచేస్తున్నాం. రాజకీయమైన ఈ హద్దులు కలకాలం నిలిచేవికావు. మహాత్ముని నాయకత్వాన కొనసాగుతున్న మహోద్యమం తెల్లదొరతనాన్ని గడగడలాడిస్తున్నది . భారతదేశం బానిస బంధాల్ని త్రెంచుకొని త్వరలోనే స్వతంత్రం అవుతుంది. ఈ నిజాంనవాబు పెత్తనం ఊడుతుంది. ముక్కోటి తెలుగు జనం ఒక్కటై - హైద్రాబాదు రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడుతుంది. ఆ మంగళ ముహూర్తం చూడ్డానికి జీవిస్తున్నా. జీవించి ఉన్నట్లయితే విశాలాంధ్ర ఏర్పడిం తర్వాత ఒకే రాష్ట్ర ప్రజలంగా మళ్ళీ కల్సుకుందాం" అని ముగించారు, మాడపాటివారు.
    "తాము పెద్దలు, మనస్సుద్ది, వాక్సుద్ధి కలవారు. మీ వాక్యం తధ్యం అవుతుంది. ఆ శుభముహూర్తం చూచే భాగ్యం కలుగుతే తప్పకమీ దర్శనం చేసుకుంటాను. ఇంత వివరంగా తెలియజేసిన తమకు కృతజ్ఞతలు. మళ్ళీ ఎప్పుడైనా హైదరాబాదు వస్తే దర్శనం చేసుకుంటాను. శలవు" అని లేచాడు పాణి.
    "తప్పక విచ్చేయాలి" అని లేచి గుమ్మందాకా వచ్చి సాగనంపారుఆంద్ర పితామహులు.
    సారంగపాణి రోడ్డువెంట వెళుతుంటే ఒక విచిత్ర సంఘటన కనిపించిదతనికి.
    సైకిలుమీద వెళ్తున్నాడొకడు. పోలీసువాడు వాణ్ణి ఆపాడు. అడిగాడు : "సైకిలుకో లైట్ కహాహై (సైకిలుకు లైటు ఏది) అని. "దిన్ మే, లైట్ క్యా సాబు" (పగటిపూట లైటెందుకండీ) అన్నాడు బెంబేలుపోయి సైకిలువాడు. "సైకిలు కో లైట్ రహనా, దిన్ క్యా రాత్ క్యా(పగలేమిటి, రాత్రేమిటి సైకిలుకు లైటు వుండాలి) - అలా అనడమూ, సైకిలు లాక్కోవడమూ ఒకేసారి చేశాడు పోలీసు. సైకిలువాడు ఏదో కోపంగా అన్నాడు. పోలీసువాడు వాణ్ణి నెట్టాడు. అతడు రోడ్డుమీద పడిపోయాడు. సైకిలు ఎక్కివెళ్ళిపోయాడు పోలీసువాడు.
    అది అతి సాధారణ విషయంగా భావించి జనమంతా రాకపోకలు సాగిస్తుండగా పాణికేమో ఒళ్ళుమండింది.
    కాని, ఏం చేస్తాడు? ఇదేం తన దేశమా?
                                                 9
    'వనజా' మంజరి పిలిచింది.
    పరుగెత్తుకొని వచ్చింది వనజ.
    "గజ్జెల చప్పుడైతాంది కచ్చడ మొస్తాందెమో చూడు."
    వనజ పరుగెత్తింది. బంకుల్లో రెడ్డిగారిని చూచి ఆనకట్టను తాకి ఆగిపోయిన నదిలా నిల్చిపోయింది.
    అప్పటికీ "హూ" అన్నారు రెడ్డిగారు.
    రెండు చేతులు నలుపుకొంటూ గోడకానుకొని నుంచునింది వనజ.
    గేట్లోంచి బండి వచ్చేసింది. దాని వెనుకే వీణ మోసుకొని ఒక మనిషి వచ్చాడు. సారంగపాణి బండి దిగాడు. చాకలి చెప్పులు క్రింద వేశాడు. చెప్పులలో కాళ్ళు పెడుతూనే నమస్కరించాడు రెడ్డిగారికి పాణి.
    "ఏం పంతులూ! గాజుబిందెలు తెచ్చినవా?" అని అడిగాడు రామారెడ్డిగారు.
    "తెచ్చానండీ" అని వెనక్కు చూచాడు పాణి. మనుషులు కనిపించలేదుకాని, అతని వెంటనే ప్రవేశించిన యెండపొడ కనిపించింది.
    గమనించాడు ఎంకటి. "ఎర్రా మనుషులు? యాడచస్తాన్రు? బిర్న (త్వరగా) రమ్మను" అన్నాడు  అక్కడనే కూర్చుని ఉన్న ఒకన్ని చూచి. వాడు తలగుడ్డ చేతిలో పట్టుకొని పరిగెత్తాడు. కొద్దిసేపట్లో అయిదుగురు మనుషులు రెండు రెండు గాజుబిందెలు పట్టుకొని ప్రవేశించారు. వారివెంట వచ్చిన జనం గేటు ముందు ఆగిపోయారు, పామును చూచిన మనుషుల్లా.
    "ఏం రోగాలు పుట్టినైరా చచ్చుకుంటు నడుస్తాన్రు" ఎంకడు అరిచాడు.
    "కనుపడ్డోడల్ల బిందెల్ని చూస్తాంటే ఆగమం...." రెడ్డిగార్ని చూచి మాట మింగేశాడు బిందెలు తెచ్చిన వారిలో ఒకడు.
    ఒక్కొక్కడూ మెట్లెక్కి రెండు బిందెలు, రంగు రంగులవి బల్లమీదపెట్టి మెట్లుదిగి వస్తున్నాడు. రెడ్డిగారు లేచి చేతితో బిందెల్ని పట్టుకొని తిప్పితిప్పి చూస్తూ "పంతులూ! భలేటోనివయ్యా! నేననుకున్న రంగులే తెచ్చినవు. చూడు, నీలిరంగుదెంత బాగున్నదో! ఓహో, గులాబి రంగుది ఇంకా బాగున్నది, బంగారురంగుది తేలే? అదంటే నాకు శానా ఇష్టం" అన్నాడు.

 Previous Page Next Page