"ఈ దశరధుడు వెంకట్రావ్ మాస్టారు లాంటి వాడు కాదు. పెళ్ళాం విషయంలో చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. సాయంత్రం కాంగానే రెండు రూపాయలకి తక్కువ కాకుండా మల్లెపూలు తెచ్చేవాడు. అలాగే నేతి మిటాయిలు కొనుక్కొచ్చేవాడు. ఇంటికి రాంగానే ఏ విషయంలోనో తుస్సున కోపం వచ్చేది. పూల పొట్లాన్ని వీధిలోకి గిరవాటేసేవాడు. అరకిలో మిటాయిని అడుక్కునే వాడికో, కనపడ్డ పిల్లలకో పెట్టేసేవాడు....."
"అదేం పిచ్చి?" అంది సీత.
"పిచ్చి, గిచ్చి ఏమిలేదు. అందరితో బాగా ఉండేవాడు. పెళ్ళాంముందే ఈ గోల. ఓరోజు కంది పచ్చడి ఇష్టం నూరు అన్నాడు. ఆమె అమృతంలా కంది పచ్చడి చేసింది. దేనికో పెళ్ళాంమీద కోపం వచ్చింది ఆయనకి. పచ్చడి తీసుకెళ్ళి వీధిలో పారేశాడు."
"మీరు మరీ వింతగా చెపుతున్నారు కోపం వస్తే కొట్టేను, తిట్టేను. తినేది పారేసుకుంటారా?" అంది సీత.
"దశరధుడి విషయంలో అదే తమాషా. బయటవాళ్ళ విషయంలో మామూలుగానే వుండేవాడు. పెళ్ళాం విషయంలోనే యిలా ప్రవర్తించేవాడు. పెళ్ళాం తన మాట కాదు అందంటే చాలు - కల్లు తాగిన కోతిలా గెంతేవాడు. ఓరోజు సినిమాకి వెళదాం అన్నాడు. ఇంగ్లిషు సినిమా నాకంతగా నచ్చాడు, రాను అంది. అంతే - ఇంట్లో ఉన్న కుర్చీ, పీటని విరగ్గొట్టి, ఆ తర్వాత గాజు గ్లాసులని పప్పు పప్పుగా నూరాడు. భర్త చేసే ఈ నష్టాలు భరించలేక - ఆమె అన్నింటికీ సరే ననటం నేర్చుకుంది."
"ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా!" సీత ఆశ్చర్యపోతూ అడిగింది.
"ఉంటారు. ఎవరిదాకానో ఎందుకు - దశరధుడు వున్నాడు కదా!"
"నాదో అనుమానం....."
"ఇలా మాటిమాటికీ అనుమానాలు బయటపెట్టవద్దు సీతా! నీ అర్ధంలేని అనుమానాలతో ఎప్పుడో మనం, మన సంసారం బజారున పడుతుంది- పడతాము."
"పెళ్ళాం అనుమానం వ్యక్తం చేస్తే - సంసారం వీధిన పడుతుందా! చాల్లెండి! ఎవరయినా వింటే నవ్విపోతారు. ఇంతకీ నా అనుమానం ఏమిటంటే- కాలాతీతం అవుతుంది అనుకుంటూ దశరధుడి కధ క్లుప్తంగా ముగించారేమోనని......"
"ఇలాంటి అనుమానాలు అయితే ఫరవాలేదు. వెంకట్రావు మాస్టారుకి పెద్ద కధ వుంది. దశరధుడికి ఓకే పెళ్ళాం ఓకే కధ. నీవు సినిమా హాలులో ఆ భార్యాభర్తలని చూసి అతగాడి ప్రవర్తనకి బాధపడుతుంటే - లోకంలో రకరకాల వాళ్ళు వున్నారు అంటూ వీళ్ళిద్దరి కధలు చెప్పాను. భార్యని మాటలతో ప్రతి నిమిషం బాధపెట్టేవారూ, చీటికి మాటికి కొట్టేవాళ్ళు, ఆఖరికి హత్య చేసేవారు - ఎన్నో రకాల మనస్తత్వాలు. మనం చూడటం, వినటం తప్పించి ఏమీ చేయలేము. ఎవరి ఖర్మకెవరు కర్తలు! అనుకోటం అన్నింటికన్నా బెస్ట్ పని.
రామకృష్ణ చెప్పిందంతా విని "ఎన్నిరకాల మొగవాళ్ళండీ!" అంది సీత.
"ఆడవాళ్ళు కూడా అన్నీ రకాలు ఉంటారు. కాకపోతే మగాళ్ళకి జరిగినట్లు ఆడాళ్ళకి జరగదు - అంతే!" అన్నాడు రామకృష్ణ.