Previous Page Next Page 
విరిజల్లు పేజి 13


    పొంగి వస్తున్న కన్నీటికి అద్దుకుంటూ పైట చెంగుని తలనిండా కప్పుకుంది. మనసులో తీవ్రంగా మెదలిన బాధని అణుచుకుని లేచి నిలబడుతూ అన్నది.
    "ఆమెని సస్పెండ్ చేయనా ప్రమీలా?'
    నిట్టూర్చుతూ అంది. "ఎందుకులే డాక్టర్! మొన్న మొన్ననే పెళ్ళయిందట. భార్యా భర్తలు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నారట. వారిని మనం యెందుకు బాధించాలి? ఏ జన్మలో ఎవరికి బాధ కలిగించానో, వియోగం కలిగించానో ఈ జన్మలో అంతకంత అనుభవిస్తున్నాను. ఏదో చిన్న వార్నింగ్ ఇవ్వండి పాపం! ఇదిగో ఇటు చూడండి డాక్టర్....ఆ అమ్మాయి యిలా నీపై రిపోర్టు చేసిందని మాత్రమే చెప్పండి.... అంతేకానీ నీపై దయ దలిచిందని మాత్రం అనొద్దంది. చాలా కోపగించుకుంది. నీపై మండిపడుతూ వుంది.... పేషంట్సు అవసరాలు చూడకుంటే ఎలా? అని అరవండి చాలు."
    "అలాగే.... నీవు విశ్రాంతి తీసుకో."
    మెల్లిగా వదిలి రౌండ్సు ముగించుకుని తన కన్సల్టింగ్ రూమ్ కి వెళ్ళాడు. తలుపు తెరుస్తూనే యెవరో యువతి తన గదిలో తన కుర్చీకి యెదురుగా వున్న కుర్చీలో కూర్చొని వుండటం చూశాడు. ఆశ్చర్యపోయాడు.
    "ఎవరు? ఎవరు? ఎవరు?"
    తన గదిలోకి ఎవరూ అంత స్వతంత్రంగా వెళ్ళరు. బోయ్ అసలు వెళ్ళనివ్వడు. మరి?....ఇంతకీ వాడెక్కడ?....
    చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కానీ ఎదురుగా మేలిముసుగు వేసుకుని కూర్చున్న ఆమె మాత్రం కనిపిస్తోంది.
    ముసుగు చాటున సుదీర్ఘమైన వాలుజడ వీపుమీదుగా వ్రేలాడుతుంది. ఆ అల్లిక ఆమె పట్టుదలని సూచిస్తోంది. కుర్చీని దాటి వ్రేలాడుతుంది జడ.
    ఆమె ఏదో మెడికల్ జర్నల్ చూస్తోంది. భయంకరమైన నిశ్శబ్దంలో హృదయ స్పందనకూడా భీకరంగా వినిపిస్తుంది. కాలసర్పం కాలాన్ని మింగుతోంది. దొరకినంత మట్టుకి....కాలక్షేపంకూడా నేరమనే మనస్తత్వం అతనిది. మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు కుర్చీలో.
    జర్నల్ క్రిందికి దించి చూసింది. విశాలమైన ఫాలభాగం. పచ్చగా సూర్యోదయమయ్యేప్పుడు తూర్పుదిక్కులా వుంది. రెండు కనుబొమ్మలూ ధనురాకారంలో నల్లటి కాటుక కొండల్లా వున్నాయి.
    తల దించుకున్నాడు.
    పెన్ తీసుకుని మెల్లిగా పై పెదవికి రాసుకుంటూ క్రింది పెదవిని నొక్కిపట్టాడు.
    ఎవరు? ఎవరీమె?
    అతని మనస్సులో ప్రతి క్షణానికి కొన్నిపదులసార్లు మెదలుకున్న ప్రశ్న అది. డాక్టరుగా అతని వృత్తిరీత్యా అతనిలో తలెత్తవలసిన ప్రశ్న కాదది. కానీ ఆమె చొరవగా ప్రవేశించి కూర్చోవటమూ, తర్వాత ప్రళయ నిశ్శబ్ధమూ, ఆమెను చూశాక గుర్తురాని వేదన అనుకోని సంభ్రమము అతనిలో కలగడంతో ప్రశ్నల ఉదృతం ఎక్కువైంది.
    "నమస్తే!"
    ఎక్కడిదీ వీణారావం?
    ఆ కంఠ శ్రోత ధ్వనిలోని తీయదనానికి మురిసిముగ్ధుడై పరవశుడై చలించుపోతూ అన్నాడు.
    "నమస్తే!"
    వెన్నెల సెలయేరు లాంటి తీయని స్వరంతో చెప్పసాగింది_ "నేను యిప్పుడే వచ్చాను. మీరు రౌండ్సుకి వెళ్ళాలని తెలిసింది. త్వరలో వస్తారని బయటే కూర్చోమన్న మీ బోయ్ ని కాదని ప్రత్యేకంగా మాట్లాడాలని వచ్చాను లోపలికి. త్వరపడుంటే క్షమించండి."
    ఆమె మాటకి బదులు ఇవ్వకుండా అన్నాడు__ "మంచిది, మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి."
    "ఇక్కడికెవ్వరూ రారు గదా?"
    ఇది నా పర్సనల్ రూము. కాలింగ్ బెల్ మ్రోగందే ఎవ్వరూ రాలేరు. బహుశా ఈ రూములో అలా ప్రవేశించిన మొదటివారు మీరొక్కరేనేమో?"
    ఆమెను నిశితంగా పరిశీలిస్తూ మాట్లాడుతున్నాడు. బంగారంకన్నా ఓ ఛాయ ఎక్కువే! మేలి ముసుగులో వుండటంతో మరీ శోభిస్తుంది. పలుచటిమబ్బు చాటు మెరుపు తీగలా_చందమామలా_
    "పార్శ్వపు నొప్పి_అనుకోకుండా ఈ కుడి కణత నొస్తూ వుంటుంది యెందర్నో అడిగాను. యెవరూ సరైన మందు ఇవ్వలేకపోయారు."
    మరేమీ మాట్లాడకుండా లేచి దగ్గరగావచ్చి అన్నాడు మృదువుగా_ "ఆ తలపై మేలి ముసుగును తీయండి."
    "బాంబే కాపురంతో అలవడింది డాక్టర్.... ఆంధ్ర దేశంలో ప్రవేశించినా ఆ అలవాటు పోలేదు...." ముసుగును ప్రక్కకు పెడుతూ లేచి నిలబడింది.
    "కూర్చోండి"
    నిశ్శబ్దంగా అతని ఆజ్ఞని పరిపాలించింది.
    కూర్చున్నాక పరీక్ష చేశాడు. అతనికి ఏమీ తెలియలేదు__
    "ఏమిటిది?" అతనికి అర్ధం కాలేదు.
    నిశితంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "మీకు ఎప్పటినుంచి వుందీ బాధ?"
    "దాదాపు ఎనిమిది వసంతాల నుంచీ ఈ బాధను అనుభవిస్తున్నాను. అప్పటికి నా వయస్సు పద్దెనిమిదేళ్ళుండవచ్చు. ముందు ఎప్పుడూ కుడి కన్ను అదురుతుండేది... తోటివాళ్ళు అందరూ అదృష్టమనేవారు వ్యతిరేకంగా__ ఎందుకంటే__"
    సిగ్గు పడింది తర్వాత చెప్పటానికి. ఆ క్షణంలో ఎర్రబడిన ఆమె చెంపల్లో అలా అలా మెరిసిన అరుణిమ స్త్రీ సౌందర్యానికే అరుణిమ దిద్దేట్టుంది. కాని సెకన్ల కాలం సిగ్గుతో ఆడుకుంది.
    "ఆడవారికి ఎడమకన్ను అదిరితే అదృష్టమంటారు. శుభసూచకమంటారు పూర్వులు. ఇక కుడికన్ను అదిరితే దాని విషయం చెప్పక్కరలేదు....కానీ....కానీ ఇది ఎప్పుడూ అంటే ఈ ఎనిమిదేళ్ళనుంచీ ఎడతెగకుండా వుండటంతో ఇది మావారి అదృష్ట సూచకమనేవారు అందరూ ఇక చెప్పలేక ఆగిపోయింది.
    "మీ వారు ఏం చేస్తారో?"
    నవ్వింది కొంచెం గట్టిగానే.
    "అసలు నాకింకా పెళ్ళే కాలేదు."
    అతనూ మందహాసం చేశాడు.
    "భలేవారే__సరే సాయంకాలం కానీ, రేపుదయం కానీ, రండి. యక్సరే తీయవలసిన అవసరం వుంటుందేమో చూద్దాం__ ఇంతకుక్రితం ఎక్కడయినా చూపించారా."
    "ఆఁ...."
    "ఎక్కడైనా యెక్సరే తీయించారా?"
    "ఆఁ...."
    "అవి వుంటే పట్రండి చూద్దాం. వాళ్ళిచ్చిన ప్రిస్క్రిప్షన్ అవి కూడా తీసుకుని రండి."
    మరీ గట్టిగా నవ్వింది. అతను ఆశ్చర్యంగా చూశాడు.
    "ఇంకెక్కడుంచానండీ వాటిని? ఏ డాక్టర్ దగ్గరికయినా వెళ్ళటం....ఓ నెల రోజుల్లో కుదరకపోతే అవన్నీ కాల్చేయటం__మరో డాక్టర్ని వెతుక్కోవటం.... అసలు నా ఉద్దేశ్యం వాళ్ళ సర్టిఫికేట్సు కాల్చేయాలని.... రోగమేమిటో కనుక్కోలేని వాళ్ళేం డాక్టర్లండీ! రోగాన్ని పెంచి రోగుల్ని చంపేవారు కాకపోతే."
    కుర్చీలోంచి లేచి నిలబడుతూ అంది. "అలాగే వస్తాను మళ్ళీ__ ఇంతకీ మీ ఫీజు విషయం చెప్పలేదు."
    "ఆ విషయం వదిలెయ్యండి__మీ రోగం కనుక్కుని వైద్యం ప్రారంభించాక మీకు నా వైద్యం నచ్చితే నావద్దే తీసుకోండి_నమ్మకం లేకపోతే, నచ్చకపోతే పోనివ్వండి....ఇక ఫీజు విషయం మీ ఇష్టం- అంతే."
    రెండు చేతుల్ని జంటగా జోడించి అంది "నమస్తే! మరలా వస్తాను.
    ఆమె వెళ్ళిన వేపే నిశితంగా చూస్తూ ఆమె ప్రకృతి అర్ధంకాక ఆలోచిస్తూ వుండిపోయాడు.


                                                   *    *    *    *


    "మీకు జబ్బేమీ లేదు" దాదాపు గంట పరీక్ష చేశాక నిర్ణయంగా నిర్దుష్టంగా అన్నాడు.
    నవ్వింది. అప్పుడే గిట్టగిల్లిన లేగదూడ పరుగులా నవ్వింది అప్పుడప్పుడే గున్న మామిడి చివురు నమిలిన కోయిలమ్మలా నవ్వింది.
    "నాకు జబ్బుందో, నేను రోగినో, బాధతో చస్తున్నానో అంటుంటే మీరు నా మాటని ఖాతరు చేయకుండా కాదు. నీకు జబ్బులేదు అనటం."

 Previous Page Next Page