"రంగా!"
బాధతో అరిచాడు. మనసంతా రంపంతో పెట్టి రాచినట్లయింది. కన్నీళ్ళు అనుకోకుండా తిరిగాయ్.
"ఏం బావా? కోపమొచ్చిందా? ఉన్నమాటంటే నీక్కూడా కోపం వస్తుందా? నీవే చెప్పు? రాలుగాయిని ఇంట్లో కట్టేసి పెడితే ఎలా ఉంటాను. అనుక్షణము గంతులు వేస్తూ తిరిగే లేగదూడని కట్టిఇస్తే అది పరిగెత్తే వీలులేక కట్టిన తాడును తెంచుకుని పారిపోయే శక్తిలేక, అవకాశం రాక అమ్మని తలుచుకుని అంబా! అంబా! అంటూ ఎంతగా అలమటిస్తుంది కాదా బావా?"
"నిజమే రంగా!"
ఒక్కక్షణం ఊరుకున్నాడు. ఆ కొన్ని సెకండ్లూ అతనికి మహా వేదనగా గడిచాయి.
"పోనీ మీ అక్కని ఏదయినా చదివి వినిపించమని చెవుదునా?"
ప్రేమగా అతని చేతిని తన చేతులోకి తీసుకుని నిమురుతూ అడిగాడు వేణు.
"హుఁ....నీవైనా ఈమాత్రం నా దగ్గర కూర్చొని నా గుండెల్లో మండే మంటను చూశావు.... ఆమె అసలు దగ్గరకే రాదు. వచ్చిందా పళ్ళరసం తాగుతావా? బార్లీ పెట్టివ్వనా? హార్లిక్స్ కలిపివ్వనా? పోనీ టీ కూడా అక్కరలేదా? ద్రాక్ష ఇవ్వనా? అనాబ్ షాహ నీ కిష్టమేకదా? తెచ్చివ్వనా అంటుంది, అంతేకానీ అడిగింది కదా అని ఆశగా కాఫీ యిమ్మని అడిగితే వద్దొద్దు బోర్నవిటా ఐనా తాగు కానీ కాఫీ ఇవ్వనంటుంది. అవునుగానీ బావా నిజంగా కాఫీ ఎలా వుంటుంది బావుంటుందా? మా విజయ్ అంటుంది నెస్ కాఫీ బావుంటుందని నిజమేనా."
అతను చేసిన వాచికాభినయానికి నవ్వుతూ అన్నాడు. "ఏమో బాబూ! నాకుమాత్రం దానిరుచి ఇప్పుడేం తెలుసు! బలకరమైన పదార్ధాల్ని ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిని సేవించాలికానీ వెధవ కాఫీ ఎందుకని కాపురానికి వచ్చిన రోజే నాచేత మాన్పించింది మా అక్క.... ఆఁ సరే.... ఇక వెళ్ళిరానా__మళ్ళీ సాయంకాలం త్వరగావచ్చి నీ సీరియల్ చదివిపెడతా."
లేచి నిలబడిన బావగారి చేయి అలాగే పట్టుకుని గోముగా అడిగాడు__
"త్వరగా రండి బావా! సస్పెన్స్ లో మునిగి చస్తున్నాననుకో.... ఏమైందో ఏమో ఆమెకి__అసలా రచయిత్రి భలే సస్పెన్స్ లో ముంచేస్తుంది....చదివి పెడతారుకదూ త్వరగావచ్చి....ఆఁ థాంక్స్."
మెల్లిగా అతని చేతినుండి తనచేయి విడిపించుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆయన పాదధ్వని వినిపించేంతవరకూ అదే దిక్కుగా ముఖం చేసుకుని వుండి తర్వాత నిట్టూర్చుతూ మంచంపట్టి పట్టుకొని పడుకున్నాడు. అతనిలో ఆలోచనలు వృద్ధికాసాగాయ్. వర్షాకాలంలో ముసురు పట్టినరోజు చినికే చినుకుల్లాగా....
7
నర్శింగ్ హోమ్ లో ప్రవేశించి, నేరుగా తన కన్సల్టింగ్ రూమ్ కి వెళ్ళిపోయాడు వేణు. కుర్చీలో తీరిగ్గా కూర్చున్నా, అతని మనస్సంతా చికాగ్గానే వుంది, అనుక్షణం రంగా మాటలే గుర్తుకువస్తూ మనస్సుని దహించివేస్తున్నాయి. అతి సున్నితము అతి భావుకము అయిన ఆ అబ్బాయి ఊహలు అతని చుట్టూ వర్షాకాలంలో విజృంభించే దోమల్లా ముసురుకుంటున్నాయి.
ఆలోచనల్ని దారిలోకి తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ ఆ రోజు వచ్చిన లెటర్ని చూశాడు. చాలామటుక్కి మందు తీసుకుని నయమైపోయిన పాత రోజులు రాసిన కృతజ్ఞతాభినందనలు ఏదో కంపెనీవాళ్ళు పంపిన శాంపిల్ మందులు కూడా న్నాయి.
ఇదితప్ప ప్రేమలేఖలు ఏమైనా వస్తాయా అనుకున్నాడు కొంటెగా. అంతలో తన ఊహకి తనే నవ్వుకున్నాడు. చివర్న మామగారు వ్రాసిన లెటర్ ఉంది.
ఆతురతతో చింపి చదివాడు. అందులో ఏమీలేదు ఆయన జ్వలించే హృదయం తప్ప.
ఎంతకీ అబ్బాయికి కళ్ళు ఎలా ఉన్నాయి? చూచి వెళ్ళినప్పటినుంచి మనసంతా అక్కడే వుంది. దిగులుగా భయంగా దినాలు గడుస్తున్నాయి. ఏమీ ప్రమాదంలేదుకదా? నాకేదో భయంగా ఉంది. అయినా నీవున్నావనే ధైర్యమే నన్ను నిలువనిస్తోంది. నీకంటే నేనేమీ ఎక్కువ చేయలేను.... కట్టు ఎప్పుడు విప్పుతావు? వెంటనే ఫోన్ చెయ్.... బయలుదేరి వస్తాను. ముందుగా తెలిపితే ఆ క్షణానికి అక్కడకు రాగలను.
ఇదీ ఆయన మనస్సు!
నిట్టూర్చాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలముందు ఎవరి ప్రేమానురాగాలైనా తక్కువేనేమో? భార్య ప్రేమిస్తోందంటే తన భర్త గొప్పవాడనీ పగ్వారా తనకా గౌరవాభిమానాలు దక్కుతాయని.... అంతే కానీ నిస్వార్ధమైన ప్రేమ ఉండదేమో? తల్లిదండ్రులు సంతానం నుంచి ఏమాశిస్తారు? వృద్ధాప్యంలో ఆదరణా, అభిమానం....ఒక్క ప్రేమ పూర్వకమైన మాట చాలు వాళ్ళ మనసుల్ని సెలయ్యేళ్ళలా ప్రవహింప చేయటానికి.
ఆలోచనల్ని ప్రక్కకి తోసి ఉత్తరాల్ని పక్కకు పెట్టేసి ఇంటికి ఫోన్ చేసి భార్యతో మామగారు వ్రాసిన ఉత్తరం గురించి చెప్పి రౌండ్స్ కి బయలుదేరాడు.
ఒక్కొక్క పేషంట్ ని పలుకరిస్తూ అనురాగాన్ని చిలుకరిస్తూ ప్రేమపూరితమైన చిరునవ్వు సదా పెదాలమీద వెలుగుతుంటే ముందుకుసాగాడు.
చేయెత్తి దండం పెట్టబోతున్న వృద్దుల్ని మధ్యనే వారిస్తూ కుశలప్రశ్నలు వేసి లేని ధైర్యాన్ని వాళ్ళకు సృష్టిస్తూ వెళ్ళసాగాడు.
డాక్టర్ నిషేధించిన వాటిని దొంగతనంగా తెప్పించుకుని హాస్పిటల్ స్టాఫ్ ఎవ్వరూ లేకుండా చూసి తింటున్న వారి జిహ్వచాపల్యానికి జాలిపడి మృదువుగా మందలించాడు.సిగ్గుతో తల వంచుకుంటే మారుమాటాడకుండా ముందుకు సాగాడు. అక్కడ కూడా బాతాఖానీ వేస్తున్న వృద్ధులు డాక్టర్ గారి రాకను చూసి మవునాన్ని అవలంభిస్తున్నారు. ప్రొద్దుపోవటానికి వీక్లీలు అవి చదువుకుంటున్నవారు అవి తీసి పక్కన పెడుతున్నారు.
"డాక్టర్!"
ఆ గొంతు ఆయనకు బాగా గుర్తు! పద్దెనిమిదేళ్ళయినా నిండకమునుపే భర్తని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు. ఆమె ముఖంలో ఇంకా పసితనం పోలేదు.
ఆ విషాద సంఘటననుండి కోలుకోక ముందే తాను గర్భవతినని తెలుసుకుని తన కడుపెన పడీ పడక పూర్వమే తండ్రిని పొట్టన పెట్టుకున్న ఆ నిర్భాగ్య శిశువుపై అకారణంగా కోపగించుకుని అతన్ని ప్రపంచం చూడకుండా చేయాలని ప్రయత్నించింది.
మనిషి ఎప్పుడూ వక్రంగా ఆలోచించి గమ్యాన్ని అడ్డుమార్గాన చేరాలని యత్నించి నిష్పలంగా అప్రయోజకుడిగా తయారవుతున్నాడు. విధి అనేది వుందని గ్రహచారాన్ని అనుసరించి జీవితం సాగుతుందని గ్రహింపులేక తన కర్తృత్వాన్ని నిరూపించుకోవాలని యత్నించి నిష్ప్రయోజకుడవుతున్నాడు.
చిత్రంగా ఆ అమ్మాయికి తన కోరిక నెరవేరలేదు. భగీరధునిలా నిలిచాడా శిశువు కానీ ఆరోగ్యం చెడుతుందేమోనని నర్శింగ్ హోంలో చేర్పించారు. ఆరోగ్యం సరిగా అయినా తన మనస్సులో తన దౌర్భాగ్యతకు కించపడని క్షణం లేదు.
ఒంటరిగా వుండి కాలంపై శత్రుత్వాన్ని సాధించాలనుకునే వాళ్ళకి ఆలోచనలు అందునా తృతీయ పంధాన వెళ్ళేవి ఎక్కువే! అందుకని ఆమెను రిలీఫ్ కానివ్వకుండా హోమ్ లోనే వుంచారు. దగ్గరగా వెళ్ళి పలుకరించాడు.
"ఏమ్మా !"
"కూర్చోండి డాక్టర్!"
నర్స్ తెచ్చి వేసిన కుర్చీలో కూర్చుంటూ నిశితంగా ఆమె ముఖంలోకి చూశాడు.
"చూడండి డాక్టర్.... మీ నర్స్అంజనను వెంటనే తొలగించి వేయండి. మీ నుండి తగినంత జీతం తీసుకుని మీరున్నప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ.... మీరు లేనప్పుడు పేషంట్సు ఎవరు చెప్పినా వినిపించుకోదు. తన విద్యుక్త ధర్మాన్ని మరచిన వాళ్ళను దేవుడుకూడా క్షమించకూడదు. మాట్లాడరేం డాక్టర్!"
"ఇంతకీ ఆమె ఏం చేసింది ప్రమీలా?"
"ఏం చేసిందా డాక్టర్! రాత్రి నాకు నిద్రరాలేదు- ఎంతగా ఆహ్వానించినా. ఆమెచే బాగా తిరస్కరింప బడ్డాను. ఆయన స్మృతి నన్ను నిలువనీయకుండా చేస్తోంది. పడుకుంటే నిద్రరాదు_నిద్రరాకపోతే ఆయన స్మృతులు నన్ను నిలువనీయవు. ఎదురుగా చూద్దామంటే అంత భాగ్యానికి నోచుకోలేదు. పోనీ ఫోటో అయినా చూచుకుందామంటే అదీమీరు నాకు అందివ్వరు ఎలా? ఆయన్ని చూడకుండా వుండలేను. చూచి తృప్తి చెందిందీలేదు. అందుకని పోనీ కలల్లోనయినా కలుద్దామంటే ఆయన తలపు మరపురాక నిద్రరాదు. నిదుర ఒక వేళ పట్టితే ఆయన కలల్లోకి తప్పక వస్తారనే ఆశ మాత్రం నమ్మకంగా వుంది. అందుకని బలవంతంగానైనా నిదుర పట్టించుకోవాలని గార్డినాల్ పిల్ యివ్వమంటే జవాబయినా ఇవ్వకుండా వెళ్ళిపోయింది."