ఆమె మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ అన్నాడు__ "నిజం నేను చెప్పిందాంట్లో కానీ, చెప్పబోయే దానిలో కానీ పొరపాటు కానీ, అబద్ధం కానీ లేదు. బహుశా మీ రోగాన్ని ఊహించుకుని మనసులో మీరు రోగిగా సంకల్పించుకుని బాధపడుతూ వుండటంతో అదే ఓ రోగంగా తయారైందేమో.... మానసికైన వేదనేదో వేధిస్తుంది తప్ప మరేమీ లేదు. ఇదివరకు పరీక్షించిన డాక్టర్స్ ఏం చెప్పారో చెప్పండి" కుతూహలంగా అడిగాడు.
చిరునవ్వుతో అతని ముఖాన్ని నిశితంగా పరిశీలిస్తూ అంది_"ఏం చెపుతారు? రోగమేదో అంతుపట్టటంలేదు__అనటం తప్ప మరేమీ అనలేను."
ఆమె మాటనిఖండిస్తూ అన్నాడు "అబద్ధమై వుంటుంది బహుశా... మీకు జబ్బులేదు. అంతవరకు నిజం. కానీ వున్నట్టు నటిస్తున్నారు మీరు. నిజం చెప్పండి శారీరకంగా మీకు జబ్బేమీ లేదు. ఒకవేళ ఏదయినావున్నా అది కేవలం మానసిక రోగమే కావచ్చు.
కళ్ళు చిట్లించి నవ్వుతూ అంది "పోనీండి. ఇంతమంది డాక్టర్లు నాకు జబ్బులేదన్నా అమ్మకం కుదరలేదు. కానీ మీరు జబ్బు లేదంటూంటే అబద్ధం అని తోసెయ్యటానికి నోరు రావడంలేదు. అది మంచిదే. జబ్బు లేకపోవటం అదృష్టమే కదా?"
ఒక్క క్షణం ఆగి సూటిగా అతనిలోకి చూస్తూ అడిగింది. "పోనీ మీరన్నారే అదేదో మానసిక రోగమని దానికి వైద్యం చేయగలరా?"
అడిగేశాక ఆమె గుండె ఒక్క క్షణంలో సగంసేపు భయంతో ఆగిపోయింది. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాక భక్తునిమనస్సు ఒక్క క్షణం స్థంభించి పోతుంది. అది ఆనందమో, భయమో చెప్పలేం.
అతని మనస్సులో ఆ ఒక్క క్షణంలో చెలరేగినన్ని అనుమానాలూ, సందేహాలూ మరెన్నడూ తలెత్తలేదు.
"ఎవరీ విచిత్ర వనిత? బజ్జు లేకున్నా జబ్బున్నట్టు నటించి వైద్య సహాయానికి వచ్చింది. జబ్బేమీలేదు అదేదో మీ మనసులోని రోగం అంటే దానికైనా వైద్యం చేయరా అంటోంది! ఏం మనిషి? ఏమిటి ఈవిడ ఉద్దేశ్యం."
డాక్టర్ల చుట్టూ తిరగటం ఓ పనిలా పెట్టుకున్నట్టుంది. కొందరికి ఓ విధమైన జలసీ వుంటుంది. తాము కోరుకున్నది లభ్యం కాకపోతే అది అందుకున్న వాళ్ళని అదేపనిగా వేధిస్తారు.... అలాంటి వ్యక్తా? ఇంతకీ ఈవిడెవరు?
"ఏమిటి ఆలోచిస్తున్నారు డాక్టర్?"
తన ఆలోచనలు కనిపెట్టడానికా అన్నట్టు తదేకంగా తన ముఖంలోకే చూస్తూన్న ఆవిడ చూపునుంచి తప్పించుకుంటూ అడిగాడు.
"మీరెవరు? మీ పేరేమిటి? ఏం చేస్తుంటారు? ముందా వివరాలన్నీ చెప్పండి."
అతనడిగిన ప్రశ్నకి గట్టిగా నవ్వుతూ జవాబు చెప్పింది. "చాలా చిత్రంగా వున్నాయి మీ ప్రశ్నలు. చూడండి డాక్టర్ నా పేరేమిటో నేనెవరో తెలియంది మీ వైద్యం పని చేయడా ఏమిటి?"
చమత్కారంగా సంభాషణని పెడమార్గం పట్టిస్తున్న ఆవిడ తెలివికి నవ్వుకుంటూ అన్నాడు "ముక్కు మొహం తెలియని వాళ్ళకి వైద్యం అందునా మానసిక వైద్యం చేయటానికి ప్రారంభించటం అంత మంచిది కాదేమో? అని అనుకుంటున్నాను."
"అలాగా. సరే. నాపేరు అంత అవసరం అనుకుంటే వైద్యం అక్కర్లేదులెండి. పేషంటుకి పేరుని చూచి మందిస్తారా మీరు. రోగానికి కాదా? స్త్రీకి పేరు ఎందుకు డాక్టరు? పేరు ఏదైనా చిత్తవృత్తి ఒకటేనేమో కదా? అలాంటప్పుడు పేరెందుకు, ఊరెందుకు డాక్టర్? నది ఏదైనా నీరు ఒకటే రుచి వేరంటారా? అది ఉపాధి గతము అంటే ఏమంటారు? పోనీండి దాని విషయం. మరి నీకు ఇప్పుడైనా అంగీకారమేనా?"
నిట్టూర్చి ఓడిపోయినట్టుగా అన్నాడు "మీరు చాలా గడుసువారు. అసలు మీకు ఏ జబ్బూ లేదని ముందే చెప్పాను. ఇదేదో నాకర్ధంగాని విషయంలా వుంది. పోనీండీ పేరులో ఏముంది! పేరు తెలిస్తే పిలుచుకోవటం సులభమన్నాను. అంతకుమించి మరేమీ లేదు."
కవబుగా నవ్వటంతప్ప మరేమీ అనలేదు. లేచి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్న ఆమెతో అన్నాడు.
"మనసు శాంతిగా వుండాలి అనుక్షణం ఆవేశాన్ని అణచుకోండి. మనసు శాంతంగా ఉండటానికి భాగవతం చదవండి_"
అంగీకార సూచకంగా బరువైన కనురెప్పల్నివాల్చి గట్టిగా వూపిరిపీల్చి అంది. "అలాగే రుక్మిణీ కల్యాణం చదువుతాను" మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
ఆమె దాటిపోయేవరకూ అలాగే చూస్తూ, ఓ స్త్రీ నీవు యుగయుగాలనుండీ సమస్యవే! అనుకున్నాడు.
8
"బావా!"
ఆ పిలుపులో ధ్వనిస్తున్న వేదనని కానీ అనురాగంతో కూడిన విన్నపం కానీ వినిపించుకోకుండా మెల్లిగా జాగ్రత్తగా కట్టుని విప్పుతున్న వేణు అతన్ని మాటాడనీయకుండా మాట్లాడవద్దని నోరుమూశాడు.
మెల్లిగా బావచేతిని తొలగిస్తూ అన్నాడు. రంగా "పదిరోజులుగా నన్ను బందీ చేశారు. కాలు కదల్పకుండా నోరు సరిగా మెదపనీయకుండా ప్రపంచమే మూగగా అంధకార బంధురంగా చేశారు ఇప్పుడైనా...."
"ఉష్! మాట్లాడవద్దంటే వినవు కదా?"
బావగారి పలుకుల్లో అవ్యక్తంగా తోచిన అధికారాన్ని శిరసావహించి నోరు మూసుకున్నాడు.
కానీ మనసులో పదిరోజుల తర్వాత కళ్ళు తెరువబోతున్నానని బయటి ప్రపంచం ఈ పదిరోజుల్లో మారిపోయిందోనని ఎప్పుడెప్పుడా వినూత్న సౌందర్యాన్ని దర్శించాలని అతని మనసులో మెదిలే విచిత్ర భావన మెదలుతూనే వుంది.
కట్టు జాగ్రత్తగా విప్పి అన్నాడు వేణు. "నేను కళ్ళు తెరువు అనే వరకూ అలాగే వుండు బావా!"
ఒక్క సెకనుకాలం అతని గుండె గుబ గుబ లాడింది. ఇంకో రెండు క్షణాల్లో కళ్ళు తెరవబోతున్నాడు తను. అయినా ఆ కొద్ది క్షణాలూ ఎంత భయంకరంగా ఉన్నాయ్! గుండెలపై బండ దించినట్లుగా యెంత బరువుగా వుందీ భావన. కొద్ది సెకన్ల కాలానికే తానిలా అయిపోతే జీవితాంతం అంధత్వాన్ని అనుభవించే వారి హృదయం.... ఎలా వుంటుంది? ఏమో?
మెల్లిగా నీటితో కనురెప్పలు తుడిచాడు వేణు. బరువుగా కరుచుకపోయిన కనురెప్పల్ని ఎత్తేట్టు చేశాడు.
చెక్కిళ్ళపై జారుతున్న నీటిని తుడిచి ఫాలభాగాన్ని కూడా శుభ్రంగా తుడిచి మరోసారి కనురెప్పల్ని తుడిచాడు. మెల్లిగా మంచం కాళ్ళవేపు నడిచి ఎదురుగా నిలబడ్డాడు.
పదహారేళ్ళ వయస్సుతో కండలు తిరిగిన శరీరంతో బలంగా కన్పిస్తున్న బావమరిదిని చూసేసరికి ముద్దేసింది. గులాబీలపై వ్రాలిన తుమ్మెద రెక్కలాంటి మీసాన్ని చూసేసరికి ముద్దెట్టుకోబుద్ధి అవుతున్నా ఆపుకున్నాడు.
"రంగా!"
మనసులో ముద్ద కట్టుకున్న ప్రేమంతా వెలికివచ్చేస్తుందా అన్నట్టు పిలిచాడు.
"బావా!"
ఆ జవాబులో అతని మనసులో తోస్తోన్న సర్వ విషయాలు బావగారి శ్రవణ కుహరాన్ని హృదయ మందిరానికీ అవగత మయ్యాయి.
"ఇటు చూడు__"
ఆ నాలుగు అక్షరాల్ని అతనెంతో ప్రయత్న పూర్వకంగా అన్నాడు. డాక్టర్లలో ఉండకూడని బలహీనత అతన్నాక్షణాన ఆవరించింది.
కనురెప్పల్ని బరువుగా తెరిచాడు.
అబ్బ! పదిరోజుల తర్వాత బావ ముఖం చూస్తే ఎంత అందంగా వుంటుంది.... అక్క__ గార్డెన్, అందునా తన మల్లెమొక్క__మల్లె మొగ్గ.
కానీ యిదేమిటి? మసక మసకగా....
"బావా!" భయంకరంగా అరిచాడు. అతని గొంతుక దుఃఖంతో కూడిన ఉద్వేగంతో పూడుకపోయింది.
నివ్వెరపోయి హఠాత్తుగా అరిచాడెందుకనా అని భయంతో దగ్గరగా వచ్చి కూర్చుని మీద చేయివేసి నిమురుతూ అడిగాడు ఆతురతో.
"ఏమిటి రంగా?"
అతని చేయి అందుకుని ముఖంపై రుద్దుకుంటూ అన్నాడు.
"మీరు__మీరు__నీవు__కనిపించడంలేదు బావా!"
ఆ మాటలు అనేటప్పుడు అతని మనస్సులో మాటల్లో ధ్వనించిన వేదనకి స్పష్టమైన రూపాన్ని ఇవ్వలేక పోతున్నాను.
ఉలికిపడి నమ్మలేనట్టుగా చూశాడు. మనస్సుని కుదుట పరచుకుని కనురెప్పల్ని మరోమారు శుభ్రంగా తుడుస్తూ అన్నాడు.
"భయపడొద్దు రంగా.... ఇప్పుడు చూడు...."