నాలుగు మైళ్ళలో వున్న ఖండగిరి, ఉదయగిరి గుహలు పది నిమిషాలలో చేరాం. పేర్లు చూస్తె గుహలని పెద్ద గొప్పగా అనడం గానీ నిజానికి అక్కడ కొండలలో తోల్చిన చిన్న చిన్న గుహల లాంటివి కొన్ని వుంటాయి. యిటు ప్రక్క కొండవి ఖండగిరి , అటు పక్క కొండవి ఉదయగిరి అంటారు..... చిన్న చిన్న రాతి విగ్రహాలు చెక్కిన గుహలు చూసి ఏదో ఊహించుకుని వచ్చిన వారందరూ అవి చూడగానే అనవసరంగా ఇన్ని మెట్లెక్కి వచ్చాం ఏమీ లేదు, చూడడానికి అనుకోకుండా వుండలేరు ... ఖండగిరిలో ఓ చిన్న దేవాలయం వుంది. దాన్లో దేవుడి పేరు గోమఠేశ్వరుడో, ఏదో గుర్తు లేదుని నల్లరాయితో చేసిన రెండు మూడు విలువుల నగ్న విగ్రహం వుంటుంది. పిల్లలు లేనివారు ఆ నగ్న మూర్తిని దర్శించుకుని ప్రక్క ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్న చిన్న రాళ్ళు గుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగయిన రాళ్ళని చూస్తె ప్రపంచ జనాభా యింతలా పెరిగిపోతుంది..... యింత మంది పిల్లలు లేని వారున్నారా అనిపిస్తుంది.
"ఇంతేనా బావా.... ఖండగిరి ఉదయగిరి అంటే ఏమిటో అనుకున్నాను." అంది మీనాక్షి అంతా చూడ్డం అయ్యాక.
"చెప్పాగా పెద్దగా చూడడానికి ఏమీ లేదని. పద. అలా వెళ్ళికాసేపు కూర్చొని వెడదాం. అన్నాను.... దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరాయిని అనుకుని ఇద్దరం ప్రక్క ప్రక్కన కూర్చున్నాం.
కొంతసేపు ఇద్దరం మాటలు కరువయినట్లు అలా కూర్చున్నాం..... "మీనాక్షి " అదోలా ధ్వనించింది నాగొంతు. మీనాక్షి తో ఏదో చెప్పాలని ఆరాటంగా వుంది. మీనాక్షితో గడిపిన ఈ రోజులు ఎంత ఆనందాన్నిచ్చాయో తను వెళ్ళిపోతుంటే ఎంత బాధగా వుందో ..... ఏదేదో చెప్పాలని ఏదో చెయ్యాలని ఆరాటంతో నా మాట తడబడింది .... మీనాక్షి నావైపు తిరిగి నా మోహం చూసింది. "బావా ... ఈ ఇరవై రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి గదూ. ఇంత ఆనందంగా నేనెప్పుడో గడపలేదు బావా ..... వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా వుంది .... ఏదో కలలా అయిపోయాయి రోజులు. ప్చ్ మళ్ళీ ఏముంది. ఆ గందరగోళం సిటీ. రోజంతా ఆఫీసులోనే వుండి అయన వున్న కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా వుండే అయన కాలక్షేపం లేక దొర్లే నేన..... మళ్ళీ మామూలే. బావా నిజం చెపుతున్నాను.... ఐ హేట్ దట్ లైఫ్...." బేలగా అంది మీనాక్షి. నేను చేపుదామనుకున్నా మాటలన్నీ మీనాక్షే అనేసింది.
"అవును మీనాక్షీ .... ప్రొద్దుట నించీ నీవు వెళ్ళిపోతానంటే ఏదోలా వుంది .... నీ వన్నట్టు మళ్ళీ ఆఫీసు. ఇల్లు రొటీన్ లైఫ్ ఈ ఇరవై రోజులు ఎంజాయ్ చేసినంతగా ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయలేదు నా లైఫ్ లో . ఆఖరికి శాంతితో "హనీమూన్" కి వెళ్ళినప్పుడు కూడా ..... అంతకంటే ఇంకా ఎలా చెప్పాలో అర్ధం కాలేదు నాకు.
అలా ఇద్దరం మూగగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇద్దరి హృదయాలు బరువుగా వున్నాయి!! మీనాక్షి కాసేపు అలా వుండి ఎందుకో నిట్టుర్పు విడిచింది.
"వెళ్ళిపోదామా బావా ఇంకా!" అంది.
"అప్పుడేనా , వుండు.... వుండు ...." కలవరంగా అన్నాను. .. ఎన్నో చెప్దామని తీసుకొచ్చాను. మీనాక్షితో ఏకాంతం కోసం కలవరించాను.... ఆ ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. "వుండు మీనా ..... ఎలాగా వెళ్ళిపోతావు ..... ఇంకా కొన్ని గంటలేగ మనం కలిసి వుండడం ..... తరువాత మళ్ళీ ఎన్నాళ్ళకో .... అసలు కలుసుకోగలమో లేదో ... మీనాక్షి చేయి చేతిలోకి తీసుకొని వణుకుతున్న గొంతుతో అన్నాను.
మీనాక్షి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా "బావా!" అంది. "మీనా " అని పిలవడం నా జీవితంలో అదే మొదటి సారి! అంతే కాక నా అంతట నేను మీనాక్షి చెయ్యి పట్టుకోడం అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది.
"మీనా!" ఆవేశంగా మీనాక్షి చేయి నొక్కాను.
"ఏమిటి బావా, క్రొత్తగా వున్నాయే నీ మాటలు చేతలు యివాళ!" చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చేయి ఎడం చేత్తో నిమురుతూ.
"అవును మీనా. ఇన్నాళ్ళు ఫూల్ లాగా ప్రవర్తించాను... కదూ!" మీనాక్షికి నేనన్నది అర్ధం కానట్లు ప్రశ్నార్ధకంగా చూసింది. " అవును మీనా ఆఖరిసారిగా లభ్యమయిన యీ అవకాశాన్ని జార విడుచుకో మంటావా?" నా వళ్ళు అప్పటికే వశం తప్పింది.... నా కళ్ళు మత్తేక్కడం ఆరంభించాయి. మీనాక్షి నావైపే చూస్తుంది ..... ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేని కోసమో వెతుకుతున్నాయి.
"మీనా ..... ఐ లైక్ యూ!... ఐ లవ్ యూ! మీనా!" గుండెలదురుతుండగా వణుకుతున్న గొంతుతో అని మీనాక్షి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకోబోయాను ..... మీనాక్షి వెలవెలపోతూ చూసింది. వివశురాలైనట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది.... చిన్న నిట్టుర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం త్రిప్పేసింది .... సున్నితంగా నా మొహం ప్రక్కకి త్రిప్పేసింది.
"వద్దు బావా! ... వద్దు .... ఎందుకీ క్షణిక సుఖానికి, ప్రలోభానికి లొంగిపోయి .... తరువాత అంతా ఏదో తప్పు చేసినట్టు మనం గిల్టీగా ఫీలవ్వాలి. నీకు శాంతి, నాకు భర్త ఇవి రెండూ రెండు నిజాలు. మనం మన ఇద్దరికీ అన్నది అబద్దం ! ఈరోజు కల! రేపు నిజం! మనం జీవితాంతం గడపవలసింది వాళ్ళతో. ఆ మాత్రం దానికి. ఈ ఒక్క క్షణంతో మనకు ఒరిగేదేమీ వుండదు, గిల్టీ కాన్సేస్ తప్ప ...." మీనాక్షి కళ్ళల్లో దైన్యం ద్యోతకామవుతున్నా మాట స్థిరంగా వుంది.
నేను వెర్రివాడిలా "మీనా! అంటూ చూశాను.... మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కలలోంచి మెళుకువ వచ్చినట్లయింది! నిజం చెళ్ళు మని చెంప మీద కొట్టినట్టు అయింది. ఆవేశం ఒక్కసారిగా దిగజారి పోయింది. మీనాక్షి పరాయింది! నేను మీనాక్షికి పరాయివాడిని! ఇంక కొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నించి నేనే మాశించినా ఆ అనందం క్షణికం! తరువాత అది పాప భీతిగా మారి ఆ నీడ రోజురోజుకి పెరిగి భూతంలా నన్ను జీవితాంతం వెంటాడుతుంది .....
అది నిజం !.... ఇది కల! ఈ నిజం ఇలా చేదులా మింగుడు పడనట్టనపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను ..... "చటుక్కున లేచి నిల్చున్నాను ....' పద వెడదాం మీనాక్షి .... ఇంకా పేకింగ్ అది చేసుకోవాలిలా వుంది నీవు .... " క్షణం క్రితం సంఘటన లేనట్టు సాధ్యమైనంత మాములుగా అన్నాను.
కారులో వున్నంతసేపూ ఒకటే ఆలోచన! మీనాక్షి రాకుండా వుంటే ఎంత బాగుండేది! ఏదో ఎద్దుబండి అయినా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిస్తున్న నేను ..... గుర్రం బండి చూడగానే ప్రలోభపడి ఆ బండిలో ప్రయాణించాలని , కనీనం ఆ వేగంతో సరిగ్గా నా బండి పరిగెత్తించాలని ఆశించాను ఫలితం నాకు హైరానా! నా ఎద్దుకు నష్టం కలిగింది ..... కానీ అందుకోలేక పోయాను! అసలు గుర్రం బండి చూశాక గదా ఆ గుర్రంలా నా ఎద్దునీ పరుగెత్తించాలన్న వ్యామోహం!... చూడకపోయి వుంటే నేను వెనకబడి వున్నా నన్నఅసంతృప్తి వుండేది కాదు.
నిజమే .... మీనాక్షి రాకుండా వుంటే ..... యీ దౌర్భాల్యం , యీ అశాంతి యీ అసంతృప్తి ఏమీ వుండేవి కావు! మీనాక్షి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తుంది ....