వెళ్ళు నాయనా, కనీసం మీ అమ్మగారి తృప్తి కోసమన్నా వెళ్ళు....ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటుందో" ఆర్ద్రంగా అంది పార్వతమ్మ.
తల్లి జ్ఞాపకంతో మాధవ్ మనసు కలతపడింది.
రాధ దోషిలా తలదించుకుంది.
6
అన్నపూర్ణమ్మ గంటనించి కాలుగాలిన పిల్లిలా తెరుగుతుంది. ఆవిడ మనసు ఏ పనిమీద నిలవడం లేదు. ఈరోజు కొడుకు పెళ్ళి అన్నమాట పదేపదే గుర్తుకు వస్తుంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసులో ముల్లు గుచ్చినట్లవుతుంది. ఇంటికి పెద్ద కొడుకు! ఆ కొడుకు పెళ్ళి తమందరూ వుండి దిక్కు మొక్కు లేనివాడిలా చేసుకుంటూన్నాడు. అన్న ఆలోచన ఆమె గుండెని రంపపు కోత పెడ్తుంది. ఎంత తమని కాదని చేసుకుంటూన్నాడని కోపం తెచ్చుకుంటున్నా ఆ తల్లి ప్రాణం ఎందుకో నిలవడం లేదు.....యిదెం ఖర్మ వచ్చింది, ఎంత ప్రారబ్ధం! కొడుకుని కోడలిని నట్టింట గృహప్రవేశం చేయించి ముద్దు ముచ్చట తీర్చుకునే అదృష్టం తనకి లేదు. అవతల కొడుకు పెళ్ళి, అవుతుంటే ఎవరిదో అన్నట్టు యిక్కడ పడి వుండాల్సిన గతి పట్టిచ్చిన కొడుకుని ఒక పక్క క్షమించలేకపోతుంది ఆవిడ. మరొకపక్క మమతని దూరం చేసుకోలేక అల్లాడుతుంది.
వీధి వరండాలో పేపరు చదువుతున్న అవధాని గారి పరిస్థితి అలాగే వుంది. మగవాడు కనక అన్నపూర్ణమ్మలా బయట పడకుండా మనసులో మధన పడ్తున్నాడు. 'నాకు కొడుకే లేడనుకుంటాను' అని మాటైతే అనగలిగాడు గాని ఆ బంధం అంత సుళువుగా ఎలా తెంచుకోగలదు! ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు కొడుకు మీద! ఆఖరికి యిలా తనమాట కాదని కులం, వంశం, గౌరవం చెల్లెళ్ళ, తమ్ముళ్ళ భవిష్యత్తు లెక్క చెయ్యకుండా కులం గోత్రం తెలియని దానిని పెళ్ళాడి తన దారి తను చూసుకోవడం అయన క్షమించలేకపోతున్నాడు. ఒక్కక్షణం వాడు లేడు నాకు ఇంక అని నిబ్బరంగా అనుకుంటూ పేపరు చదవడానికి ప్రయత్నిస్తాడు. మరుక్షణంలో పేపరు పక్కన పెట్టి ఆలోచనలో పడ్తాడు.
ఇద్దరికీ ఇద్దరూ బాధ పడ్తున్నారు. ఇంట్లో పిల్లలు ఏదో తప్పు చేసిన వాళ్ళలా బిక్కుబిక్కు మంటూ తలోమూల కూర్చున్నారు. అన్నగారి పెళ్ళిరోజు! యిది అంతా సవ్యంగా వుంటే ఎంత కళకళలాడుతూ ఎంత ఆనందంగా హడావుడిగా వుండేవారు అందరూ , కానీ యిప్పుడు ......యింటినిండా శ్మశాననిశ్శబ్దం -౦ దానికి కారకులెవరు? అన్నగారా? అన్న కోరికని ఆమోదించని తల్లి దండ్రులా! ఆ ప్రశ్నకి జవాబు వాళ్ళకి తెలియదు.
అన్నపూర్ణమ్మ భయపడుతూనే వీధి గుమ్మంలోకి వచ్చి భర్త పక్కన అరుగు మీద కూర్చుంది. ఆవిడ రాగానే అయన పేపరు మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. భర్త మోహంలో హావభావాలు చూసి ఆయనా కొడుకు గురించే ఆలోచిస్తున్నట్టు పసిగట్టింది ఆవిడ. కాస్త మెత్తబడినట్లు కనపడగానే ధైర్యం చేసి "ఏమండీ మధూ....." ఏదో చెప్పబోయింది. అవధాని విసురుగా పేపరు పడేసి తీక్షణంగా చూశాడు...." వాడి పేరు నా దగ్గిర ఎత్తడానికి వీలులేదని చెప్పానా?" కఠినంగా అన్నాడు.
"అది కాదండి....ఈపాటికి పెళ్ళి'...."
"అన్నపూర్ణా.....మరోసారి వాడి ప్రసక్తి నా దగ్గిర తీసుకురాకు. ఆనాడే వాడు నాకు లేనివడయ్యాడు. తల్లి, తండ్రి పరువు , ప్రతిష్ట మమత అనుబంధం అన్నింటిని కాలదన్నిన ఆ స్వార్ధపరుడి గురించి నేనేం వినదలచుకోలేదు." తీక్షణంగా అన్నాడు. అన్నపూర్ణమ్మ ఎటూ చెప్పలేక దీనంగా చూసింది.
అదే సమయంలో గుమ్మం ముందు టాక్సీ ఆగింది. టాక్సీలోంచి దిగుతున్న మాధవ్ ని, రాధని చూసి ఇద్దరూ చకితులై ఒక్క క్షణం చూస్తుండిపోయారు. అన్నపూర్ణమ్మ ఆనందంగా ఎదురు వెళ్ళబోయింది. వెంటనే ఆయనకు కర్తవ్యం గుర్తుకువచ్చినట్లు "అన్నపూర్ణా అగు. లోపలికి పద" తీక్షణంగా అంటూ భార్య చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళి విసురుగా తలుపు మూసి గుమ్మానికి జారబడ్డాడు ఆవేశాన్ని అణచుకుంటూ. అన్నపూర్ణమ్మ ఏదో చెప్పబోయి భర్త మొహం చూస్తూ భయంతో ఆగిపోయింది. పిల్లలు కుతూహలంగా కిటికిలోంచి చూడసాగారు.
మాధవ్, రాధ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మాధవ్ ముందుకు వెళ్ళి "అమ్మా , ఒక్కసారి తలుపు తీయి" అన్నాడు.
అన్నపూర్ణమ్మ ఇంక ఆగలేకపోయింది. "తలుపు తీయండి . మాధవ్ పిలుస్తున్నాడు. బిడ్డ పెళ్ళి చేసుకుని వస్తే తలుపులు మూస్తారా.....ఒకసారి తీసి లోపలికి రానియండి.....ఒక్కసారి ' ప్రాధేయపూర్వకంగా బతిమాలినది.
"వీల్లేదు నా మాటకి విలువ ఈయని వాడు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీలులేదు. వెళ్ళమను " కఠినంగా అన్నాడు.
మాధవ్ మొహం మన్లమైంది. రాధ మొహం నల్లబడింది.
'అమ్మా.....మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. అది నాకెప్పుడూ వుంటుందని తెలుసు. వేడ్తున్నాను, బాధపదకమ్మా...." అంటూ రాధ చెయ్యి పట్టుకుని వెనుదిరిగాడు.
అన్నపూర్ణమ్మ కొంగు నోట్లో దోపుకుని కింద కూలబడింది.
* * *
తెల్లచీర కట్టుకుని, శారద కట్టిచ్చిన సన్నజాజుల మాల తలలో తురుముకుని రాధ నెమ్మదిగా మాధవ్ మంచం దగ్గరికి వచ్చింది. మాధవ్ తలకింద చేతులు పెట్టుకుని అలసటగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు. అతను రాధని చూడలేదు. అతని మోహంలో లీలగా మెదిలే ఆవేదన చూసి రాదకి బాధ అనిపించింది. అతని క్లేశం పోగొట్టడానికి తనేం చెయ్యగలదు. రాధ నెమ్మదిగా అతని పక్కన కూర్చుని అతని గుండెల మీద తల అన్చి "మాధవ్" అనురాగంతో పిల్చింది.....ఉదయం నుంచి ఇద్దరికీ మాట్లాడుకునే వీలే చిక్కలేదు. ఇంటికి వెళ్ళి తండ్రి చేత అవమానం పొందాక ఉదాసినంగా గంభీరంగా టాక్సీలో కూర్చున్న అతన్ని పలకరించడానికే భయం వేసింది . "మాధవ్.....ఎవరూ లేని దురదృష్టవంతురాలిని....నేను నీకూ అందరినీ దూరం చేశాను. క్షమించు మాధవ్" అంది పట్టుకున్న గొంతుతో.
అతను ఆలోచననించి తేరుకుని చటుక్కున ఆమె మొహం చూసి "ప్లీజ్ రాధా.....నీవూ ఏదో అని నన్ను బాధపెట్టకు. ఆనాడే అందరినీ వదులుకుని నీకోసం వచ్చాను. ఈరోజింక కొత్తగా బాధపడటానికి ఏముంది. కాని....అమ్మ పాపం.....ఆవిడ బాధ తల్చుకుంటే మనసు గిల్టీగా ఫీలవుతుంది అంతే, ప్లీజ్ , నీవేదో చేశావన్న భావం నీకింక వస్తే వూరుకొను. వాళ్ళకి దూరమయ్యాను నీకు దగ్గిర కావాలని....యిందులో నీ తప్పు ఏమివుంది నెమ్మదిగా చెయ్యి నిమిరి అన్నాడు.