Previous Page Next Page 
మానవత పేజి 12


    "నిజంగా రమాదాసివా, దయ్యానివా?"
    ఇద్దరూ కాసేపు కీచులాడుకున్నారు.
    "ఏవీ నీ కాళ్ళు చూపించు" రమాదాసి అడిగింది. చూపించాడు. "నీ కాళ్ళు వెనక్కు తిరిగిలేవు. నువ్వు మనిషివే! ఏసుదాసువే!"
    "నీ కాళ్ళు చూపించు"
    చూపించింది రమాదాసి.
    ఇద్దరికీ నమ్మకం కుదిరింది.
    "నిన్ను దయ్యమనుకున్న" రమాదాసి అన్నది నిర్భయంగా.
    "నిన్ను సైతాననుకున్న" భయం లేకుండా అన్నాడు ఏసుదాసు.
    భయం తీరిపోయింది.
    చెట్టు తల మండుతూంది. నిప్పు రవ్వలు కురుస్తూంది. కీచురాళ్ళ రొద; గబ్బిలాల రెక్కల రెపరెప.
    ఇప్పుడు భయంలేదు. నిబ్బరంగా వున్నారు. మనిషికి మనిషి తోడు. తోడుంటే భయం దూరం.
    ఇద్దరూ మండే చెట్టును చూచారు.
    చెట్టు మండుతున్నది_నిప్పు రవ్వలు కురుస్తున్నది.
    "అదేంది? అట్ల మండుతది!" అడిగింది రమాదాసి.
    "రా, చూద్దాం" ఏసుదాసన్నాడు.
    "అమ్మో, భయం, దయ్యమేమో!"
    "ఇద్దరమున్నాం, ఇంకేం భయం?" రామాదాసిని లాక్కుపోయాడు. ఇద్దరూ చెట్టు దగ్గరికి చేరారు, చూచారు.
    అది ఈతచెట్టు. కొనకు నిప్పంటుకుంది. మండుతున్నది. గాలికి రాల్తున్నది, రాలి నిప్పురవ్వలు కురుస్తూంది.
    "ఇంతేనా! దయ్యమనుకున్నాం" విరగబడి నవ్వింది రమాదాసి. ఏసుదాసూ నవ్వాడు. ఇద్దరూ కలిసి నవ్వారు. గలగలా నవ్వారు. నిప్పు రవ్వల్లా నవ్వారు. జలపాతంలా నవ్వారు.
    "దయ్యమనేది యాడున్నది? మనం భయపడ్తే దయ్యం, లేకుంటే లేదు" రమాదాసి అన్నది.
    "అవును సైతాను మనలోనే వున్నది" అన్నాడు ఏసుదాసు.
    దయ్యాన్ని జయించిన జంట సాగిపోయింది.
    భయాన్ని ఓడించిన జంట సాగిపోయింది.


                                                        *    *    *    *


    స్కూలు వదిలేశారు. జానకి ఇంటికి వెళుతోంది. తోవలో పాల్ కనిపించాడు. సైకిల్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. జానకి చూచింది.
    "హో! మీరా..."
    "మీరు మళ్ళీ కనిపించనేలేదు..."
    "కాపలా కాస్తున్నారన్నమాట."
    "కాదు. ఇలా వచ్చాను. మీ స్కూలు అయిపోయింది. మీరు వస్తారేమోనని చూస్తున్నాను. అవునూ, కాపలా కాయడం నేరమా?"    
    "కాదుగాని ఇలా నుంచొని మాట్లాడుకోవడం నేరం. పదండి నడుద్దాం"
    "అవును. నేను గమనించనేలేదు. పదండి" అని సైకిల్ తీసుకొని నడక సాగించాడు పాల్. జానకి పక్కగా నడుస్తూంది.
    "పేషెంటును చూడ్డానికి వచ్చారా?"
    "అవును, ఒక బూబమ్మకు కాస్త జబ్బు, ఆస్పత్రికే వస్తుంటారు. సీరియస్ గా ఉందని మనిషి వచ్చాడు. రాక తప్పింది కాదు. మీరు కనిపిస్తారని నుంచున్నాను.
    "థాంక్స్. ఎలా ఉంది బూబమ్మకు?"
    "అలానే ఉంది. మనమేం చేయలేం, జబ్బు మానసికం. అసలే గుండె జబ్బు మనిషి."
    "అంటే ఆ మనిషి....!!
    "ఆమెకు నా అనేవారు ఎవరూ లేరట, ఒక్క మనుమరాలు తప్ప, ఆమె చదువుకునేందుకు పట్నం వెళ్ళి మతం కాని వాడినెవడినో ప్రేమించిందట, అదీ ఆమె దిగులు."
    మాట్లాడుకుంటూ పాల్, జానకి చెరువు గట్టు మీదకు వచ్చారు. చల్లటి గాలి వీస్తోంది. 'కాసేపు కూర్చుందాం!' అనుకున్నారిద్దరూ. బూబమ్మ మనస్తత్వం దగ్గర ప్రారంభమై వారి సంభాషణ తిరిగి మతాల వైపుకి మళ్ళింది. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించటంలో వచ్చే ఆత్మానందం యీ పెద్దలు ఎందుకు గ్రహించలేక పోతున్నారు? అక్కడ బూబమ్మే కాదు, తమ ఇళ్ళల్లో పాల్ తండ్రీ, ముకుందరావు గారూ...వారి విశ్వాసాన్ని వారు నమ్ముకోవటం తప్పు కాదు. మరొకరిని ద్వేషించడమనేది ఎప్పటికి పోతుంది? ఎలా పోతుంది? దాదాపు పాల్, జానకిల సంభాషణ చర్చలాగా సాగింది.
    చెరువు కట్టమీంచి పశువులను తోలుకుపోతున్నారు కుర్రాళ్ళు. మర్రిచెట్టు మీదికి చేరిన కాకులు కాట్లాడుకుంటున్నాయి. సూర్యుడు పడమటి దిశన పరాగం పరిచాడు.
    "సాయంకాలం అయినట్లుంది. వెళ్దామా?" జానకి లేచి నిలుచుంది.
    "అరే, అప్పుడే సాయంకాలం అయిందా? పదండి వెళ్దాం. పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు" పాల్ లేచి నుంచున్నాడు.
    ఇద్దరూ నడుస్తున్నారు.
    ఎవరూ మాట్లాళ్ళేదు. నడిచి పోతున్నారు. మౌనంలోనూ ఏదో మాధుర్యం వుంది, అది చెప్పుకోరానిది, సాగిపోయారు కొంత దూరం. జానకికి వీడ్కోలు చెప్పాడు పాల్. సైకిలు మీద వెళ్ళిపోయాడు.
    జానకి వెళ్ళిపోతున్న సైకిల్ను చూస్తూ _ నుంచోలేదు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ సాగిపోతున్నది. ఆమె అడుగులు తేలిగ్గా పడుతున్నాయి. గుండె చెండులా గంతులు వేస్తూంది. ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా వుంది. గాలిలో తేలిపోతూంది. రమాదాసి ఎదురు వచ్చింది.
    "నీకోసమే వస్తున్నానమ్మా, అయ్య కోపంగున్నడు, ధుమధుమ లాడుతున్నడు" అని చెప్పింది రమాదాసి.
    "సరే నువ్వెళ్ళు" అని బయల్దేరింది. ఆమె గుండె గుబగుబలాడింది. ఉత్సాహం అడుగంటింది, ఆలస్యం అయిందని గమనించలేదామె. తండ్రి విషయం మరిచిపోయిందామె. ఇప్పుడు తల్చుకుంటే దిగులుగా వుంది. ఇంటి గుమ్మం ముందుకు వచ్చేసింది.
    "నేను చచ్చిపోయాననుకున్నావా?" ముకుందంగారి స్వరంలో కరకుదనం వుంది.
    జానకి తల వంచుకుంది. మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళిపోదామనుకుంది. తండ్రి గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు.
    "మాట్లాడవేం_ఎక్కడ చచ్చావింతసేపు?"
    జానకి తలెత్తి చూచింది. తండ్రేనా మాట్లాడేది? ఏమీ అర్థం కాలేదు జానకికి. "మనం వీధిలో వున్నాం లోనికి పదండి" అన్నది.
    ముకుందంగారికి అప్పటికిగాని అర్థం కాలేదు _ లోనికి నడిచాడు. జానకి లోన ప్రవేశించింది.
    "చెప్పు, ఇహ చెప్పు, ఎక్కడికెళ్ళావు?"
    "వస్తూనే ఉన్నా గద నాన్నా"
    "వస్తూనే ఉన్నా. వస్తూనే ఉన్నా....ఈ ముసలివాడి కింత విషం పెట్టి తిరుగు."
    "ఏమిటి నాన్నా! మీరు మరీను."
    "అవును, నీకలాగే అనిపిస్తుంది. నీ సంపాదన మీద బతుకుతున్నా, నన్నెందుకు లెక్కచేస్తావు? నా బతుకే ఇలా తగలబడ్డది. ఎక్కడికెళ్ళావంటే చెప్పవు? నీకు నేనేం లెక్క? భగవంతుడా, త్వరగా నీ దగ్గరకి తీసికెళ్ళు" అని తల బాదుకోసాగారు ముకుందంగారు.
    జానకి, తండ్రి చేతులు రెండూ పట్టుకుంది, "ఏం చేశానని నాన్నా! అలా ఇదైపోతావు. స్కూల్లో కాస్త ఆలస్యమైపోయింది. నువ్వలాగే బాదుకుంటే నేను తల బద్దలు కొట్టుకుంటా" జానకి కళ్ళవెంట జాష్పధార ప్రవహిస్తూంది. ముకుందంగారు చూశారు.

 Previous Page Next Page