"ఎంత మాటండి. శివరావుండగానే! పోలీసు లారీలో పంపిస్తానండీ రామయ్య గారిని.
"సరే ఇగ పో"
శివరావు వెళ్ళిపోయాడు. బలరామయ్య కారులో ఏదో రాచకార్యం మీద సాగిపోయాడు.
రాముడు ఆ రాత్రంతా ఊరిని గురించే కలలు గన్నాడు. తనకేదో ప్రమాదం జరిగినట్టు. తల తెగినట్టూ, కలవచ్చింది. ఉలికిపడి లేచి చూచాడు. ఏమీ లేదు. అంతా భ్రమ. అయినా గుండె దడ ఆగలేదు. చాలా సేపు నిద్ర రాలేదు. కన్ను మలగాగానే ఊడల మర్రి కనిపించింది.
ఊడల మర్రి, బొంద మీద పాతబట్టలు, ఎవడో రాక్షసుడు. ఆ దృశ్యం అతన్ని భయపెట్టింది. అయినా అందులో ఏదో ఆకర్షణ ఉంది. అందుకే అతను తయారైనాడు ఊరికి వెళ్ళడానికి. పోలీసుల లారీలు కూడా వచ్చాయి ఇంటి ముందుకు. వారితో పాటే ఘోరం అయిన వార్త కూడా వచ్చేసింది.
"కుప్పలు తగలబడ్డాయి. తగల బెట్టారు"
బలరామయ్య అగ్గి అయిపోయాడు. ఆయన్ను చూచి శివరావు రుద్రుడైనాడు. మరికొన్ని పోలీసుల లారీలు వచ్చాయి. ఊరివైపు సాగాయి. బలరామయ్య గారి జీపు ముందుకు నడిచింది. అయన చేతిలోనూ తుపాకి వుంది.
జరిగిందేమంటే పంచుకున్న పొలాలను ప్రజలే దున్నారు. విత్తనాలు వేశారు. పండించారు. పొలాలు పంటకు వచ్చేవరకు బలరామయ్య వచ్చాడు. పోలీసుల్ని ఉంచి ప్రజలతో కోతలు కోయించాడు. కుప్పలు పెట్టించాడు. కుప్పలకు సాయుధ పోలీసుల్ను కాపలా పెట్టాడు. అయినా అంటుకున్నాయి కుప్పలు. వారు ఊరికి చేరుకునే వరకు ఇంకా మండుతూనే ఉన్నాయి. పోలీసులు తప్ప అక్కడ ఎవరూ లేరు. గుండెలు గుప్పెట్లో పెట్టుకొని ప్రజలు ఇండ్లలో కూర్చున్నారు.
కుప్పలు ఒకేచోట కుర్చీ పెట్టించాడు. కోసిన వాళ్ళకు కూలి ఇవ్వలేదు బలరామయ్య. మూడేళ్ళుగా తన పొలాల పంటలు తింటున్నారు. ఎందుకివ్వాలి అనుకున్నాడు కాని తరువాత ఇద్దామనే అనుకున్నాడు. నూర్పిళ్ళు అయినాక యిస్తానని వాగ్ధానమూ చేశాడు. అయినా యెంత పని చేశారు లుచ్చాలు అనుకున్నాడు. కుప్పలు కాలుతున్నాయి. మంటలు లేస్తున్నాయి. ధాన్యం చిటపటమని పేలాలు వేగుతున్నాయి. ఆ మంట బలరామయ్య యెదలో మండింది. కళ్ళలో ఊపిరి లో మండింది. మండింది గడ్డి అది అంటుకుంటే అరదు. బూడిద అయి కూలాస్సిందే.
"తమాషా చుస్తున్రా! భోగామోళ్ళాడ్టాన్రా!!" గొంతు చించుకొని కేక పెట్టాడు బలరామయ్య.
శివరావు గుండె దడల్లుమంది. మార్చ్ అన్నాడు. పోలీసుల బూట్లు టకటక లాదేయి. ఊళ్ళో ప్రవేశించాయి - గుడిసిల్లో దూరాయి. కొంపల్లో దూరాయి. దెబ్బలు అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, హాహాకారాలు , ఏడ్పులు పెడబొబ్బలు జనాన్నంతా తుపాకి మడమల్తో బాది లాఠీలతో కొట్టి గడీ ముందు లాక్కొచ్చారు పోలీసులు. జనాన్ని మధ్య నుంచి వలయాకారంగా ఏర్పడ్డారు పోలీసులు. లాఠీలతో బాదసాగారు. ఏడ్పులు కేకలు తగ్గి మౌనంగా దెబ్బలు తింటున్నారు! ఆదుకునే నాదులు లేడని తేల్చుకున్నారు. అరచి ఏం ప్రయోజనం? అయినా పిల్లల కేకలు ఏడ్పులు వినిపిస్తూనే ఉన్నాయి.
బలరామయ్య , శివరావు వచ్చారు. వారి ముఖాల మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. వారిని చూసి పోలీసులు తప్పుకున్నారు. బలరామయ్య ఒక్కసారి జనాన్ని తేరిపార చూశాడు. ఉరిమాడు "లంజకొడుకుల్లారా! కుప్పలు కాలబెట్టి పానాల్తో ఉంట మానుకుంటున్రేమో! ఒకోక్కన్ని బందూఖాత్ ఉదాయిస్తా- ఊరిని కాడు చేస్త చెప్పండి ఎవడు తగల పెట్టిందో?"
జనంలోంచి జవాబు రాలేదు.
నిశ్శబ్దం ఒక్కడూ పలకలేదు.
పిల్లల ఎక్కిళ్ళూ తప్ప ఏదీ వినరావటం లేదు.
"మాట్లాడరేం గాడ్ది కొడకులు. ఇట్లింటారు మీరు. చూడండి కాలుస్త" అని తుపాకి ఎత్తారు. ట్రిగ్గర్ మీదవేలు కూడా వేశాడు. కాల్చాడు. కాని శివరావు పెరిగేత్తుకొచ్చి తుపాకి మదమను వంచాడు. బుల్లెట్ గాలిలో తేలిపోయి వేప చెట్టుకు తగిలింది. జనంలో హాహాకారాలు చెలరేగాయి.
"చెప్పండి ఎవరు కాల్చారో , లేకుంటే అందర్నీ కాల్చేస్తా" ఈ తడవ శివరావు ఉరిమాడు.
"ఎరకలేంది ఎట్ల చెప్పుతముండి" జంగయ్య జనంలో అన్నాడు. - కాదు సుమారు అరిచాడు.
"పటకా రండి లంజ కొడుకును" బలరామయ్య కేకకు దిక్కులు పిక్కటిల్లాయి.
పోలీసులు జంగయ్యను పట్టుకొచ్చి బలరామయ్య కాళ్ళ ముందుకు గెంటారు. జంగయ్య బోర్ల పడిపోయాడు. నొసట రాయి గుచ్చుకుంది. రక్తం సోటసోట కారుతుంది.
"లే, లేచి నిలబడు."
లేవలేదు జంగయ్య.
"లేవమంటే లేవవులే" తన్నాడు బలరామయ్య - పదానికి రక్తం అంటింది. గుండె జల్లు మంది. అయినా అరిచాడు. "లేపి నిలబెట్టండి"
లేపి నుంచో బెట్టారు పోలీసులు.
రక్తం ముక్కుమీద నుంచి పెదవుల దాకా పారి నోట్లోకి పోతుంటే చేత్తో తుడుచుకొని నుంచున్నాడు జంగయ్య.
"చెప్పు ఎవరు తగల పెట్టిన్రో?"
మాట్లాడలేదు జంగయ్య.
"చెప్పమంటే దయ్యమాలే నిలబడ్డావు" అంటూ లెంపమీద కొట్టాడు బలరామయ్య. నొసట రక్తం చిమ్మి బలరామయ్య ముఖం మీద పడ్డది. జంగయ్య తూలి నిలదొక్కుకున్నాడు.
బలరామయ్య మరీ మండిపడ్డాడు. "చెప్పమంటే చెప్పవులే - బొంద పెడతా లంజా కొడక" అని చెయ్యెత్తాడు మళ్ళీ కొట్టడానికి.
దొర చేతిని పట్టుకున్నాడు జంగయ్య. హరిజనుడు - వెట్టి మాదిగ!
"చెప్పుతే ఏం చేస్తరండి ?" అడిగాడు! ప్రశ్నించాడు. సవాలు చేశాడు. అది సవాలు కాదు - శూలమై గుచ్చుకుంది దొర గుండెల్లో , రక్తం వేడెక్కింది. ఆవిర్లు వచ్చాయి. అయినా కోపం అణచుకున్నాడు.
"చెప్పుతే అందర్నీ ఇడ్చి పెడతాం. కాల్చినోన్ని కోసి కాకులకు గద్దలకు ఏస్తం పంటకుప్ప తగుల పెడ్తే ఊరుకుంటామా? నోటి కాడ ముద్ద గుంజుకున్నరు లంజకొడుకులు" కాస్త సౌమ్యంగానే అన్నాడు బలరామయ్య.
"ఎవరుండి నోటికాడి ముద్ద గుంజుకుంది.?" అని నొసట రక్తాన్ని అరచేతితో రుద్ది దొరకు చూపిస్తూ "ఈ నెత్తురు ఒడిసి పొలాలు దున్నినం. పంట కోస్కపోతోంటే ఒళ్ళు మండడానుండి?"
మండిపోయాడు దొర. "దొరలకు పుట్టినార్ర గాడ్ది కొడుకుల్లార దొరల సొమ్ము తినేటందుకు?" కాండ్రించి నేలమీద ఊసి అడిగాడు బలరామయ్య.
"దొరల కాలం పోయింది. దున్నేలోనిదే ......" మాట పూర్తీ కాకుండానే లాఠీతో పడ్డాయి దెబ్బలు జంగయ్య మీద.
"వీడే తగల పెట్టిండు కొట్టండీ లంజాకొడుకును" ఆదేశించాడు బలరామయ్య. అంతకు ముందే సాగించారు పోలీసులు. ఇప్పుడు మరీ జోరుగా బాదసాగారు.
జంగయ్య మాట్లాడలేదు. మౌనంగా దెబ్బలు తింటున్నాడు. కాళ్ళు, చేతులు వీపు, ముఖం వాచిపోతున్నాయి అయినా ఆగడం లేదు. జనంలో హాహాకారాలు చెలరేగాయి. అక్కడా లాఠీలు పడ్తూనే ఉన్నాయి.
జంగయ్య స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని లాక్కుపోయి గడీలో ఒక కొట్లో పారేశారు. శివరావు ప్లాను ప్రకారం జంగయ్య , జగ్గయ్య , వీరభద్రం ఇళ్ళకు నిప్పంటించబడింది. అవి తగలబడుతుంటే బలరామయ్య గుండె చల్లబడింది.
కొట్లో జంగయ్య ఉన్నాడు. పశువుల కొట్టంలో ప్రజలున్నారు. ఊరు బయట పంటకుప్పలు, ఊళ్ళో కొంపలు తగలబడ్తూన్నాయి. దొరవారు గాంధీ విగ్రహ ప్రతిష్టాపన గురించి మాట్లాడుతున్నారు. సరీగ్గా గడీ ముందున్న విడి స్థలంలో విగ్రహం స్థాపించబడాలన్నాడు. స్థలం నిర్దేశించి చూపించాడు శివరావుకు.
"ఎట్లుంటదంటావ్?"
'చాల బాగుంటుందండి" అన్నాడు శివరావు.
ఆ రాత్రి ఎందుకో భయం భయంగా ఉంది శివరావుకు. నిద్రపట్టలేదు. బలరామయ్య కూడా పోర్లుతున్నాడు. పోలీసు క్యాంపుల్లో పడుకున్న రాముడు ఉలిక్కిపడి లేచాడు. వీరభద్రం, వీరభద్రం అని కేకలు పెట్టాడు. అదే కేక పోలీసులూ పెట్టారు. కాపలా ఉన్న పోలీసు తుపాకీ పేల్చాడు. అది ఎదుట వున్న పోలీసు వానికి తగిలింది. పెద్ద కేక పెట్టి పడిపోయాడు. ఎవడు కాల్చింది ఎవడు పడిపోయింది తెలియలేదు పోలీసులకు. శివరావు అదిరిపడి లేచాడు. టార్చిలైట్లు వెలిగాయి. రక్తపు మడుగులో ఉన్న పోలీసు కనిపించాడు. తుపాకుల వాళ్ళు వచ్చారనుకున్నాడు శివరావు.
"వెతకండి , పట్టండి" కేక పెట్ట్టాడు.
విజిల్స్
బూట్ల టకటకలు.
టార్చిలైట్ల వెలుగులు.
ఊరంతా గాలించారు పోలీసులు -ఏమీ అగుపించలేదు. ప్రజలు పశువుల కొట్టంలోనే ఉన్నారు. ఒక్కడూ కదల్లేదు. ఆశ్చర్యం అనిపించింది శివరావుకు. ఇంతమంది కళ్ళు మూసి వచ్చాడు! ఒక పోలీసును చంపి వెళ్ళిపోయారు! తలవంపు లనిపించింది శివరావుకు. నామోషి అనిపించింది. నామర్దా అనిపించింది.