అప్పటికి సరిగ్గా సమయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలైంది.
* * * *
మాధురీ - కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో దిగి - కారులో ఊటీకి వచ్చేసరికి సమయం పన్నెండూ ముప్పై నిమిషలైంది.
అప్పటికి ఇరవై నిమిషాల వెనక్కి వెళ్తే -------
హోటల్లోని ప్రొడ్యుసర్ సూట్లో ప్రొడ్యుసర్ . డైరెక్టరూ కూర్చుని వున్నారు.
వాళ్ళ కెదురుగా ప్రొడక్షన్ మానేజర్ నిల్చుని వున్నాడు.
టెన్షన్ భరించలేక ప్రొడ్యుసర్ ఉదయాన్నే తాగుడు కార్యక్రమం మొదలేట్టెసాడు.
"చూడండి దైరక్తరూ గారూ , నేను కారా కిళ్ళి లు దుకాణం పెట్టుకుని లక్షలు లక్షలు గణించి ఈ వ్యాపారం కూడా ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడ కొచ్చాను. కన్యకాపరమేశ్వరి దయవల్ల , రాఘవేంద్రస్వామి కృప వాళ్ళ నా రెండు సినిమాల్ని మీరు హిట్టు చేసారు. మూడో సిన్మా కూడా మీ చేతిలో పెట్టాను. హిట్టయిన నా రెండు సినిమాల్లో ఆ కుర్రాడే హీరో అంచేత ఆ నమ్మకంతోనే విమల్ ని మళ్ళీ పెట్టుకున్నాం - పెట్టుకుంటే ఏం చేసాడు? నన్నిలా తినేస్తున్నాడు. నా టెన్షన్ ని పెంచేస్తున్నాడు.చెప్పండి సిన్మా కాన్సిల్ చేసేసుకుని మా వూరు వెళ్ళిపొమ్మంటారా, లేదా ఆ హీరోని ఆ హీరోయిన్ని మార్చేసి సినిమా తీద్దామంటారా? నాకేదో విషయం చెప్పాలి మీరు. నేనీ టెన్షన్ భరించలేను. గుర్తుంచుకొండి. లక్షలక్షల లాసోచ్చినా భరిస్తాను గానీ ఈ టెన్షన్ భరించలేను" హై కిక్ లో చెప్పాడు ప్రొడ్యుసర్.
అప్పుడా సమయంలో మాట్లాడితే ఏం జరుగుతుందో డైరెక్టర్ కి తెలుసు.
"మీరేం చెప్తే - అలాగే చేద్దాం. నాక్కూడా మన హీరో వరసెం నచ్చలేదు. కానీ ఒక విషయం సార్. విమల్ ఏ ఆపదలో చిక్కుకున్నాడో చలాకీగా ఉండే విమల్ సడన్ గా డౌన్ అయిపోవడం వెనక ఏఏ కారణాలున్నాయో ఏ గొడవలున్నాయో తెలీకుండా మీరో నిర్ణయం తీసుకున్నారానుకోండి రేపు ఇండస్ట్రీలో మీకు చెడ్డ పేరు . విమల్ అర్దనరీ హీరో ల్లాంటి వాడు కాదు, వాళ్ళ డాడీ సిట్టింగ్ ఎమ్ .పి. అదే కాకుండా విమల్ కి మంచి ఫాలోయింగ్ కూడా వుంది. విమల్ పేరు చెప్తే ఇవాళ బయ్యర్లు టైటిల్ రిజిస్ట్రేషన్ రోజునే అడ్వాన్సు లిచ్చేస్తున్నారు.ఒక నిర్ణయం తీసుకునే ముందు - వెనకా ముందూ ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం.
అసలైన బిజినెస్ మెన్ ని ఏ వీక్ నెస్సూ ఏమీ చెయ్యరు. అలాంటి వాడే ప్రొడ్యుసర్ కూడా.
డైరెక్టర్ మాటల వెనక నిజాన్ని అట్టే పట్టేశాడు.
"అదీ కదండీ డైరెక్టర్ గారూ , డబ్బు పొతే పోయింది , ఏవిటీ టేన్షని."
"ఎప్పుడు లేదండి టెన్షను........టెన్షను...టెన్షన్........అంటే టెన్షన్ పోద్దా.....చెప్పండి మన సినిమా కన్నడ రైట్స్, తమిళ రైట్స్ కోసం అఫర్లున్న సమయంలో , విమల్ ని వదులుకోవడం మంచి పద్దతి కాదు. అదీ కాకుండా విమల్ మాధురి హిట్ కాంబినేషన్ సర్. ఆలోచించండి" డైరెక్టర్ చెప్పాడు.
"హిట్ కాంబినేషన్ కాకపోతే, మన మూడో సినిమాలో కూడా వాళ్ళే ఎందుకుంటారయ్యా. నువ్వు చెప్తున్న పాయింటు నాకర్ధమైంది గానీ, ఇంతకీ విమల్ ఏమయ్యాడయ్యా అతని కేమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వున్నాయా?" ఏవైనా అనుకోనిదేదైనా జరిగితే నానా గొడవ."
ప్రొడ్యుసర్ కొంచెం కూలవడంతో డైరెక్టర్ మనసులోనే ఆనందించాడు.
అసలు విమల్ ఏమయ్యాడు? అతని క్కూడా తెలియని జవాబు ఇది.
"పోలీసులేమంటారు ' డైరెక్టర్ అడిగాడు.
"వాళ్ళే మంటారు, ఏమీ అనరు. వెతుకుతున్నాం సార్ అంటారు. అదికాదు డైరెక్టరూ ....విమల్ కి విలన్లేవరయినా ఉన్నారా? చెప్పు లేకపోతే వాళ్ళ నాన్నంటే గిట్టని, అపోజిషన్ వాళ్ళేవరైనా కిడ్నాప్ చేసారా అసలు నీ ఆలోచనేంటో చెప్పుదూ."
ప్రొడ్యుసర్ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు డైరెక్టర్.
సడెన్ గా కాలింగ్ బెల్ మోగింది.
ఉలిక్కిపడ్డాడు ప్రొడ్యుసర్. సూటిగా ప్రొడక్షన్ మానేజర్ వేపు చూసాడు.
ప్రొడక్షన్ మానేజర్ తలుపు తెరిచాడు.
ఎదురుగా ---
మాధురి.
గబుక్కున లోపలికి రాబోయిన మాధురి, ఒక్కడుగు వెనక్కేసింది .
అలా.....
అకస్మాత్తుగా -
మాధురి ప్రత్యక్షం కావడంతో ప్రొడ్యుసర్ ఉలిక్కిపడ్డాడు డైరెక్టర్ సందిగ్ధంలో పడ్డాడు.
"కమాన్ మాధురీ. నువ్వయినా వచ్చావ్. కమాన్........" ప్రొడ్యుసర్ లోనికి ఆహ్వానించడంతో, మాధురి లోనకి అడుగేసింది.
రెండు నిమిషాలు నిశ్శబ్దం.
తర్వాత ------
"విమల్, నిన్ను తీసుకుని బయటికెళ్ళి పోయాడు. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పిందాకా తెలీదు. అసలు విషయంఏంటో . నిన్ను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసాడటగా. ఆ తర్వాత విమల్ తన సూట్ కొచ్చాడు. నిజాం పేలస్ లో షూటింగ్ ఏర్పాట్లు కూడా జరిగాయి. అంతే విమల్ మాయమైపోయాడు. ఏమయ్యాడో ఏవిటో తెలీదు. నీకేమైనా ఇన్ ఫర్మేషన్ తెలిస్తే చెప్పు."
ప్రొడ్యుసర్ ఏం చెప్తున్నాడో, అసలేమీ అర్ధం కాలేదు మాధురికి.
విమల్ ఏవిటి> మాయమవవడం ఏమిటి?
"నాకేం అర్ధం కావడం లేదు సర్ విమల్ ఇక్కడ లేరా?"
అయోమయంగా అడిగింది మాధురి.
"ప్రస్తుతం విమల్ ఇక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలీదు. నిన్న రాత్రి అతను , తన సూట్లోనుంచి తనే బయటకు వెళ్ళాడో, ఎవరైనా కిడ్నాప్ చేసారో , ఏం జరిగిందో తెలీదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు బాధపడకపోతే , ఇంకో విషయం చెప్తాను. చాలా మంది మీరిద్దరూ కల్సి వెళ్ళిపోయి ఒక డ్రామా ఆడారని అనుకుంటున్నారు" అన్నాడు ప్రొడ్యుసర్ సందేహిస్తూనే.