అమాటలు విని సహనంగా నవ్వేది అమ్మ.
తర్వాత నాన్న లేనప్పుడు తనకి హితభోద చేసేది.
"మనకి డబ్బు లేదనీ , మనం బీదవాళ్ళమనీ ఎప్పుడూ నొచ్చుకోకు నాన్న! దేవుడి దయవల్ల రెండు పూటలా తింటున్నాం. అది చాలు మనకి. ఆమాత్రం కూడా లేని నిర్భాగ్యులు కోట్లమంది వున్నారు దేశంలో. ఆ కోట్ల మంది అదృష్టహీనులని గురించి ఆలోచించాలి నాన్నా! కోట్లు ఎలా గడించాలన్న ఆలోచనతోనే కాలం గడిపెయ్యకూడదు. తెలిసిందా?"
అమ్మే మళ్ళీ అప్పుడప్పుడు చెప్పేది.
"మనిషికి ఈ క్షణాలని మూడు వుంటాయి హరీన్! అంటే మూడు రకాల తాపత్రయాలు. ఒకటి భార్య గురించి, రెండు బిడ్డల గురించి, మూడు ధనం గురించి, ఈ మూడు మనిషికి వుండొచ్చు కానీ హద్దుల్లో వుండాలి."
తను అర్ధం అయినా కాకపోయినా, అర్ధం అయినట్లే అన్నిటికి తల ఉపూతుండేవాడు. చాల రోజుల తర్వాత అర్ధం అయింది తనకి. ఆ మాటలన్నీ అమ్మ తనకు అర్ధం కావాలని చెప్పడంలేదని, స్వగతంలా తనకు తనే చెప్పుకుంటుందనీనూ.
ఇంకోసారి అమ్మ చెప్పింది తను కధ చెప్పమనీ వేధిస్తుంటే.
"అనగనగా ఒక ఆసామి. అతనొకసారి పొంగుతున్న నదిని దాటవలసి వచ్చింది. అతని తలమీద డబ్బుమూట వుంది. భుజాల మీద భార్యని కూర్చోబెట్టుకున్నాడు. చేతులతో కొడుకుని ఎత్తుకున్నాడు.
నది దాటుతుంటే వరద ఉదృతమయ్యింది. అంత భారాన్ని మొయ్యలేకపోయాడు అతను. అందుకని ఆలోచించి, చేతుల్లో వున్న కొడుకుని నీళ్ళలో వదిలేశాడు. 'భార్య వుంటే చాలు, ఇంకో కొడుకుని కనలేకపోతానా ' అని అతని ధైర్యం! ఇంకొంచెం దూరం పోయాక నది మరింత పొంగింది. ఈసారి అతను భుజాల మీద వున్న భార్యని నీటిపాలు చేసేశాడు. 'డబ్బు వుంటే చాలు! మరొక భార్యని చేసుకోలేకపోతానా' అన్న దిలాసాతో. నెత్తిమీద వున్న డబ్బు మూటని మాత్రం భద్రంగా పట్టుకుని ఒడ్డుచేరాడు అతను.
"డబ్బు ఆశ అంటే అలా వుంటుంది నాన్నా! దాన్ని దగ్గరికి రానివ్వకూడదు" అని చెప్పింది అమ్మే.
పోనూపోనూ సరిగ్గా అమ్మ చెప్పినట్లే మారిపోయాడు నాన్న. డబ్బు సంపాదన అనేది ఒక జాడ్యమైపోయింది ఆయనకి.
ఇంకోలా చెప్పాలంటే , "డబ్బు చేసింది ఆయనకి!"
కానీ........ఆ కారణంగా అమ్మకు మనశ్శాంతి లేకుండా చేయ్యడమెందుకు?
ఈ లోయలో నుంచి బతికి బయటపడగలిగితే, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మని తన దగ్గరకు తెచ్చేసుకోవాలి.
అలా ఆలోచిస్తూ వెళుతుంటే, మనసు స్పందింపజేసే దృశ్యాలు ఎన్నో కనబడ్డాయి హరీన్ కి.
ఒక లేడీ తన కూనలకు పాలు గుడుపుతోంది ఆప్యాయంగా.
ఒక నక్క తన పిల్లకి ఎర్రటి మాంసం ముక్కని తినిపిస్తోంది ప్రేమతో.
అతనికి ఎటూ చూసినా తల్లీ - బిడ్డా అనుబంధాన్ని గుర్తు చేసే దృశ్యాలే కనబడుతున్నాయి. ఈ పకృతి మాత వడిలో.
నిజం.....తను గనక నాగరిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళడంగనక జరిగితే, ఇంక ఆలస్యం చెయ్యడు. ఎలాగైనా సరే అమ్మని ఒప్పించి, తన దగ్గరకు తెచ్చుకుంటాడు తప్పదు.
ఆగి.........చుట్టూ చూశాడు హరీన్. తన పక్కన కరుణ కనబడలేదు. ఆలోచనల్లో పడిపోయి, కరుణని గూడెంలోనే వదిలేసి వచ్చాడన్నమాట తను.
ఇంక త్వరగా వెనక్కి తిరిగి వెళ్ళి ఆమెని చేరుకోవడం మంచిది.
దగ్గరలోనే నీళ్ళు వడివడిగా ప్రవహిస్తున్న శబ్దం వినబడుతోంది. అదేమిటో చూడాలని , అడ్డంగా వున్న చెట్టు కొమ్మలు తొలగించుకుని మరి కాస్త ముందుకు వెళ్ళాడు హరీన్.
అక్కడ కనబడుతోంది తాము కొట్టుకువచ్చిన నది.
ఆ నది ఒడ్డున నిలబడి నీళ్ళు తాగుతోంది - తమతో బాటు చెట్టుమీద నుంచి కింద పడిన చిరుత.
దాని వళ్ళంతా రక్తసిక్తమై గాయాలతో నిండి వుంది.
అంటే, చిరతకీ, కొండచిలువకీ భీభత్సవంగా జరిగిన పోరాటంలో చిరతపులి ప్రాణాలతో బయటపడి, కొండచిలువ చనిపోయి వుండాలి.
అప్పుడు -
వెనకనుంచి కొండచిలువ తనని చుట్టేసినట్లు ఒక్కసారిగా ఉపిరాడకుండా పోయింది హరీన్ కి.
అతికష్టం మీద తలతిప్పి చూశాడు అతను.
11
వెనక్కి తిరిగి చూసిన హరీన్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.
అతన్ని అంత బలంగా పెనవేసుకున్నది కొండచిలువ కాదు. ఆమె ఒక కొండజాతి యువతి.
గాభరాగా ఆమె పట్టు వదిలించుకోబోయాడు హరీన్.
అది గమనించి గలగల నవ్వింది ఆ యువతి.
"జిబూరూ.......నాకిస్త్ర మోనానే మదస్త్రనో?" అంది కవ్వింపుగా గొంతుపెట్టి. ఆమె గొంతులో మధురమైన జీర వుంది. లేడి కళ్ళలాగా విశాలంగా వున్నాయి ఆమె నేత్రాలు.
కష్టం మీద ఆమె కౌగిలి వదిలించుకున్నాడు హరీన్. లేతగా కనబడుతున్నా, ఆమె చేతుల్లో ఎంతో బలం వుంది.
"నువ్వు చెబుతోంది ఏమిటో నాకు అర్ధం కావడం లేదు" అన్నాడు హరీన్.
తెల్లబోయింది ఆ అమ్మాయి.
"మిస్త్రానీ..........కసీ హేగో?" అంది అపనమ్మకంగా.
"ఏమిటి?" అన్నాడు హరీన్.
ఈసారి ఆ అమ్మాయి కూడా తెలుగులోనే మాట్లాడింది.
"జింబూరు......నన్ను ఆటపట్టిస్తూన్నావా ఏమిటి? మనం రోజూ మాట్లాడుకునే మన భాషే నీకు అర్ధం కావడం లేదా? ఇంకాసేపు వుంటే ఈ చిక్ లీ ఎవరో కూడా నీకు తెలియదని అనేసేటట్లు వున్నావు. అవునా?"
"చిక్ లీ....;నీ పేరు చిక్ లీనా?" అన్నాడు హరీన్. "చూడు చిక్ లీ. నేను జింబురూని కాను - నాపేరు హరీన్. ఇందాక నేను అడినదంతా ఉత్త నాటకం. మీ నాయకుడి కోరిక మీద నేను......."
అతని వాక్యాన్ని సగంలోనే తుంచేసింది చిక్ లీ. "ఇందాక ఆడింది కాదు నాటకం! ఇప్పుడు నువ్వాడుతున్నదే అసలు సిసలైన నాటకం. అమ్మో ఎంతటి నటన! ఇది కూడా ఒక రకం సరసమే కాబోలు!"
"చిక్ లీ.......నిజంగానే నువ్వెవరో తెలియదు నాకు."
"నేనెవర్నో తెలియదా?" అంది చిక్ లీ చిరుకోపంగా. "అయితే చెబుతాను విను. నీకు కాబోయే భార్యని. నువ్వు నాకు కాబోయే భర్తవి. చాలా! ఇంకా గుర్తుచెయ్యాలా? మొన్న పున్నమి రాత్తిరి జాతర జరిపి మనిద్దరికీ నిశ్చితార్ధం చెయ్యలేదూ పెద్దోళ్ళు? మళ్ళీ నెలవంక పొడిచే రోజున మనం మనువాదాలని చెప్పలేదూ? గూడెంలోని వాళ్ళందరూ గుండెల్లోని సంతోషం పట్టలేక మందేసి, చిందేసి ఆడుతూ పాడుతూ సంబరం చెయ్యలేదూ? జింబూరు.......ఈ అడవిలోని ప్రతి చేట్టుకీ, ప్రతి పుట్టకి తెలుసు నువ్వు నా పుంజువనీ, నేను నీ పెంటిననీ! ఆ ఆకాశం, ఈ జలపాతం, ఆ కొమ్మా , ఈ రెమ్మా, ఆ పువ్వూ, ఈ తావూ అన్నిటికీ ఎరుకే జింబూరు నువ్వు ఈ చిక్ లీకి జతగాడివని . నేను ఈ గడ్డమీద పడ్డరోజే నీదాన్నయిపోయేను. అల్లదిగో! ఆ వెదురుపొదకి కూడా తెలుసు జింబురూ నువ్వు ఈ చిక్ లీ ఎదను చీలిస్తే నీ రూపే కనబడుతుందని! అనుమానముంటే అడుగు చెబుతుంది!" అంది తమకంగా.
నిర్ఘాంతపోయి వింటున్న హరీన్ తడారిపోయిన పెదిమలని నాలికతో తడిపెసుకున్నాడు.
"చిక్ లీ!" అన్నాడు మృదువుగా. "నువ్వు పోరబడుతున్నావు. నువ్వు నమ్ము! నేను నీ జింబురూ ని కాను - నిజంగానే!"
"అ అ .....నిజంగానే?" అంది చిక్ లీ వెక్కిరింపుగా. "హయ్ హొయ్ హొయ్.......ఎంత నంగనాచి తుంగబుర్రమ్మా ఈ పిల్లగాడు! నోట్లో వీలు పెడితే కోరకలేని చినవాడమ్మా." అని హొయలుగా నవ్వి! మళ్ళీ అంతలోనే చురుగ్గా చూసింది చిక్ లీ. "ఇంక సరసం చాలు గానీ! మా ఇంటికి రా! నీకోసం ముంతనిండా వడగళ్ళు సారా తెచ్చి వుంచాను. అది చారెడు తాగితే చాలు నిషా నషాలానికి అంటుతుంది. ఆ తర్వాత ఇంకెన్ని చిత్రమైన మాటలు చెబుతానో ఏమో! ఆ మత్తులో మరిన్ని గమ్మత్తులు చేస్తావో ఏమో!" అంది కళ్ళు అరమోడ్పుగా పెట్టి చూస్తూ.