ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు.
బేగంపేటలో పెద్ద బంగాళా.
గేటు దగ్గర్నుంచి రెండు ఫర్లాంగులు తారు రోడ్డు.
రోడ్డుకి రెండు పక్కలా పెద్ద పెద్ద వృక్షాలు. లోపల దూరంగా బంగాళా కనబడుతోంది. ఇంటి వెనక కొబ్బరి చెట్లు.
పోర్టికోలో ఒక తెల్ల అంబాసిడర్ కారూ, ఎర్రటి వోల్క్ స్వాజేస్ కారూ ఆగి వున్నాయి.
కుటుంబరావుగారు సోషలిజం మీద ఇచ్చిన లెక్చర్ గుర్తొచ్చింది. మరి ఈయన ఇల్లు కూడా రాజభవంతిలా ఉందే! ఈయనా అందర్లాగానేగా? చెప్పడ మొకటి, చెయ్యదమొకటి, నీకు విందులు, ఎదుటివాడికి నీతులు, కాదుకాదు. అయన అలాంటి మనిషి కాడు, బహుశా ఆయన భార్యా, లావణ్యా- వీళ్ళిద్దరి ఇన్ ఫ్లూయేన్సు అయి వుంటుంది ఈ బంగాళా రూపుదిద్దుకోవడం.
వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉన్నా మొహానికి చిరుచెమట పట్టింది. ఒకటి- మహా సంపన్నుల ఇంట్లోకి మాములు మనిషైన తను వెళ్తున్నాడు. రెండు లావణ్యని మళ్ళీ చూడబోతున్నాడు. పదిహేను రోజులు మనసు ఉగ్గబెట్టుకొని గడిపాడు, అంతకంటే ముందు వచ్చేస్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో నన్న భయం. ఎలా వుంటుందో లావణ్య ఏం బట్టలు వేసుకుని ఉంటుందో! ఏ బట్టలేసుకున్నా కళ్ళు చెదిరే అందంతో కనబడుతుంది. బెల్ బాటమ్ షర్టు వేసుకుని ఉంటుందా? లక్షణంగా చీరే కట్టుకుని వుంటుందా?
తనని చూడగానే భయభక్తులతో లేచి నుంచున్నాడు గుమ్మం దగ్గరే కూర్చుని వున్న నౌకరు.
"అయ్యగారున్నారా?"
"ఉన్నారండి"
"శ్రీహర్ష వచ్చాడని చెప్తావా?"
"కూర్చోండి సార్! చెప్పి వస్తాను. " అంటూ లోపలికి నడిచాడతను.
శ్రీహర్ష వసారాలో ఉన్న కెన్ చెయిర్ లో కూర్చున్నాడు. లోపల డ్రాయింగ్ రూం కనబడుతోంది. అంతా లేత నీలం రంగు డెకరేషన్. సోఫా కవర్ల దగ్గర్నుంచి లైట్ దొమ్స్ దాకా అన్నీ నీలం కాంబినేషన్ లోనే ఉన్నాయి.
వరండాలో చెప్పులు పెట్టుకునే అరలు, ఆ అరల్లో ఒక ఇరవై జతల చెప్పులు అందంగా పేర్చి ఉన్నాయి. ఎక్కువ భాగం లేడిస్ చెప్పులు-- ఆరంగుళాల హీల్ వున్నవి, మెత్తటి కిడ్ లెదర్ చేసినవి , రంగుకొకటి చొప్పున వున్నాయి.
"హై!" అంది లావణ్య.
తలెత్తి చూశాడు.
కళ్ళు చేదిరెట్లు ఉంది లావణ్య అందం.
నీలం రంగు డెనిమ్ జీన్స్ వేసుకుని ఉంది. ఆ ఫాంటు కి ముందు ఆరు జేబులూ, వెనక రెండు జేబులూ, జేబులో జేబు, దాన్లో ఇంకో జేబు అన్నీ తమాషాగా బయటకి కనబడేటట్లు తెల్లదారంతో కుట్టారు. జేబులకి పెద్ద పెద్ద ఇత్తడి గుండీలు, ఫాంటులోకి టకప్ చేసిన ఎరుపు, నీలం చారాల హాండ్ లూం షర్టూ, లోపలనుంచి లీలగా కనబడుతున్న బ్రా. పాంటులో నుంచి రేఖా మాత్రంగా కనబడుతున్న పాంటిస్. పాంటు ఆమె నడుము సన్నదనన్ని, అతి కొద్దిగా పైకి ఒంపు తిరిగిన నాజుకైనా పొట్టని స్పష్టంగా తెలియబరుస్తోంది.
నిర్నిమేషంగా చూశాడు శ్రీహర్ష.
"గుర్తున్నామన్నమాట?" అంది లావణ్య. పదిహేను రోజులపాటు మళ్ళీ కనబడకపోతే మర్చిపోయారేమో అనుకున్నాను." అంది.
పదిహేనురోజుల ఆరుగంటలు- సరిగ్గా చెప్పాలంటే" అన్నాడు శ్రీహర్ష.
".......పైన ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు అయింది- మనం విడిపోయి" అంది లావణ్య.
వంద మాటలు చెప్పలేని సారాంశాన్ని ఆ మూడు ముక్కలూ తెల్చేశాయ్- "నిన్ను చూడకుండా క్షణం గడవటం లేదు" అని.
"నాన్నగారు క్లబ్బుకెళుటున్నారు. పదినిమిషాల్లో కింది కోస్తారు. మిరోచ్చారని చెప్పాను" అంది లావణ్య.
"తొందరేం లేదు నాకు. మిరేక్కడికో బయటికి వెళుతున్నట్లున్నారు?"
"సినిమా కెళుతున్నాను వస్తారా?"
"ఏం సినిమా?"
"స్టార్ వార్స్"
"నేను మీ న్నాన్నగారితో మాట్లాడాలి. పనుంది సినిమా కొచ్చేస్తే ఎట్లా?"
"ఎప్పుడూ పన్లెనా? రేపు మాట్లాడొచ్చు లెండి!"
నవ్వాడు శ్రీహర్ష. "అర్జెంటు"
"మీ ఇష్టం!" అంది లావణ్య ముక్తసరిగా. తనమాట అతను విననందుకు కాస్త నొచ్చుకున్న వైనం మోహంలో కనబడుతోంది.
తర్వాత ఏం చెప్పులేసుకోవాలా అన్న ప్రాబ్లెంలో పడిపోయింది. ఎంతకీ తేలటం లేదు. ఒక్కొక్కో జతా చేతిలోకి తీసుకుని, అంతలోనే మనసు మార్చుకుని దాన్ని కింద పారేస్తోంది.
"హెల్! ఇన్ని జతలుంటే తేల్చుకోవడం కష్టం. శ్రీహర్షా! మీరు చెప్పండి ఏ చెప్పులు బాగున్నాయ్?"
"మీరు వేసుకుంటే ఏ చెప్పులకైన అందం వస్తుంది. కాబట్టి ఏవి బాగున్నాయనే ప్రశ్నే లేదు. ఏదో ఒకటి వేసేసుకొండి. అందం సంగతి వాటికోదిలేయ్యండి."
"అలా ఎటూ తేల్చకుండా డిప్లమాటిక్ గా మాట్లాడితే నాకు నచ్చదు."
"సరే! ఆ ఎరుపూ, పసుపూ, నలుపూ కలిసిన చెప్పు లేసుకోండి."
"గాడ్? భయంకరంగా ఉంటాయవి."
"అంత భయంకరంగా ఉంటె అసలెందుకు కొన్నారు?"
"కొత్త మోడల్ అని కొన్నాను. తర్వాత నచ్చలేదు. నర్సయ్యా ఈ జత బయట పారేయ్యమన్నాను గుర్తులేదా? లేకపోతే ఇవి తీసుకెళ్ళి నీ కూతురు కిచ్చెయ్."
"ఇంత ఖరీదైన చెప్పులు నా కూతురేసుకుంటే జనం రాళ్ళతో కొడతారమ్మా!" అంటూ నర్సయ్య ఆ చెప్పులు ఎత్తుకెళ్ళి గేటు దగ్గర పెట్టి వచ్చాడు.
నిర్ఘాంతపోయి చూశాడు శ్రీహర్ష.
"ఎంత ఉంటుంది వాటి ఖరీదు?" అన్నాడు.
"ఏమో! డెబ్బయ్యో, ఎనభయ్యో ఉండొచ్చు. " అంది లావణ్య నిర్లక్ష్యంగా.
శ్రీహర్ష నోటమాటరాలేదు.
"కూర్చోండి. " అంది లావణ్య. సోఫాలో కూర్చున్నాడు శ్రీహర్ష. మెత్తగా సౌఖ్యంగా ఉంది.
గోడకి పెద్ద మోడర్న్ పెయింటింగ్ వేలాడుతోంది. అద్దాల రాక్ నిండా చక్కగా బౌండ్ చేసిన లావుపాటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అద్దాల అలమారాలో రకరకాల బొమ్మలు అమర్చి ఉన్నాయి.
"హలో యంగ్ మాన్!" అన్నారు కుటుంబరావుగారు గదిలోకి వస్తూ.
"నమస్కారమండి!" అన్నాడు శ్రీహర్ష.
"ఏమిటి? నిన్నేదో ఇరుకున పడేసినట్లుందే మా అమ్మాయ్?" అన్నాడాయన నవుతూ. అంతలోనే విషయం గ్రహించి, "ఆ ఆకుపచ్చ చెప్పులేసుకొమ్మా" అన్నారు.