Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 12

 

    తధాస్తు దేవతలు 'తధాస్తు' అన్నాడు మరో అర్ధంలో దాని పర్యవసానం మరోలా వుంటుందని యమధర్మరాజు కు ఆ క్షణంలో తెలియదు.


    అదే సమయంలో బ్రహ్మదేవుడు యమధర్మరాజును పరామర్శించదానికి నరకలోకానికి వస్తున్నాడు.

 

                                                         * * *


    లోకల్ టివి ఛానల్ స్టూడియో అది.


    గేటు దగ్గర వాచ్ మేన్ కాపలా కాస్తున్నాడు.


    లోపల షూటింగ్ జరుగుతోంది.


    సమీర స్క్రిప్టు చూసుకుంటోంది. ఫిల్మ్ బేస్ డ్ ప్రోగ్రామ్ తాలూకు యాంకరింగ్ కాస్త విసుగ్గా కూడా వుంది సమీరకు.


    కొత్తలో ఉత్సాహంగా ఉండేది. టీవి ఛానల్ లో తను కనిపించడం, అందరూ తనను గుర్తుపట్టి "మీరు ఫలానా ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేశారు కదూ" అని అడగడం తర్వాతర్వాత విసుగ్గా అనిపిస్తోంది.


    దానిక్కారణం ఈ స్రిప్ట్. ఈ యాంకరింగ్ లే. నాలుగైదు సినిమాలు.....ఆ సినిమాల గురించి చెప్పడం, పిచ్చి పిచ్చి మాటలు నాలుగు మాట్లాడడం, తను నాలుగు పిచ్చి మాటలు మాట్లాడగానే క్లిప్పింగ్ టెలికాస్ట్ అవుతుంది. రెండు మూడు గంటలు కూడా పట్టదు షూటింగ్ కు.


    స్క్రిప్ట్ లో విశేషం ఏమి కనిపించదు. వేసిన ప్రోగ్రామ్స్ నే అటు తిప్పి ఇటు తిప్పి టైటిల్స్ మార్చి చేస్తుంటారు.


    నాన్ సెన్స్ అనుకుంది సమీర.


    "మెడమ్ రెడినా?" డైరెక్టర్ వచ్చి అడిగాడు.


    "ఆ...." అంది ఆ డైరెక్టర్ కొత్తతను.


    ఓసారి స్క్రిప్టు చూసుకుని లేచి నిలబడింది. ఆమె నడుస్తూ నాలుగు డైలాగులు చెప్పాలి. కెమెరా ఆమెను ఫాలో అవుతుంది.


    సమీరకు నవ్వు వచ్చింది. ఈ తతంగమంతా చూసి.....భగవంతుడా ఈ యాంకరింగ్ శిక్షేమిట్రా అనుకుంది ఓ క్షణం.


    
                                                              * * *


    "ఒరే సత్తిపండు......మనం అనవసరంగా పడుకున్న గాడిదని లేపి తన్నించుకుంటున్నామేమోనని అనుమానంగా ఉంది" అన్నాడు శ్రీచంద్ర.


    "అదేంటి గురూ ఒక్కసారి అంత మాటన్నావు వదిన ఫిలవదూ?"


    "ఎందుకు?"


    "అదే తనని గాడిద అన్నందుకు. పోనీ ఫీలవుతుందో, లేదో కనుక్కోనా?" ఫట్ మని నెత్తి మీద కొట్టాడు శ్రీచంద్ర.


    "గురూ! ఎవరో నా నెత్తిమీద ఫట్ మని కొట్టారు" నెత్తిమీద తడుముకుంటూ అన్నాడు సత్తిపండు.


    "నేనే కొట్టాను. నేను సామెత కోసం అన్నాను. దానికంత బిల్డప్ ఇస్తావా? అయినా ఇప్పుడు సమీరని మనం కలిసినా లాభమేంటి? పెళ్ళెప్పుడు చేసుకుంటావు? తాళేప్పుడు కట్టి పెడతావు? లేకపోతే ఎవరినైనా ఎవరినైనా చూసుకునేదా అంటుంది." అన్నాడు శ్రీచంద్ర.


    "పోనీ నేను చేసుకునేదా? జస్ట్ ఫర్ చేంజ్ గా వుంటుంది."


    ఈసారి ఫట్ మని కొట్టలేదు. పీక పిసికేలా చూసాడు.


    "సారీ గురూ.....నువ్వెలా రియాక్టవుతావోనని నిన్న టెస్ట్ చేశా......అయినా గురూ......నాకో డౌట్. వదిన ఎప్పుడూ ఎవరో ఓ గన్నాయ్ గాడిని చేసుకుంటానంటుంది. ఎవరూ కుదరకపోతే నిన్నే చేసుకుంటుంది కదా. మరి నిన్ను కూడా వదిన గన్నాయ్ గాడనుకుంటుందా? ఎందుకంటావ్?"


    "సత్తిపండు......" గట్టిగా అరిచాడు శ్రీచంద్ర.


    స్టూడియో ముందు స్టూలు మీద కూచుని కునికిపాటు పడుతున్న వాచ్ మెన్ ఉలిక్కిపడి, ఝడుసుకుని వెనక్కి విరుచుకుపడ్డాడు స్టూల్ తో సహా.


    "గురూ....నువ్వు గానీ కిందపడ్డావా?" అడిగాడు అనుమానంగా.


    "కళ్ళద్దాలు పెట్టుకు చావు గుడ్డివెధవా!" అంటూ జేబులోని కళ్ళజోడు సత్తిపండుకు తగిలించాడు.


    "అర్రె.....మనం లోకల్ టివీ స్టూడియో దగ్గిరికి వచ్చేశాం" అన్నాడు సంతోషంగా.


    ఈలోగా వాచ్ మెన్ కోపంగా లేని గుర్రుమని వాళ్ళిద్దరికేసి చూసి.....


    "అంతలా అరిచి నిద్ర చెడగొట్టటం కాక, కింద పడేలా చేస్తారా? ఎవరు మీరు? ఏం కావాలి?" కోపంగా అడిగాడు.


    "ఈ స్టూడియో ఓనర్ తెలుసా?" సత్తిపండు సీరియస్ గా అడిగాడు.


    వెంటనే వాచ్ మెన్ భయంతో తెలుసుకున్నాడు. ఓనర్ తాలూకు వాళ్ళేమోనన్న భయం అది.


    "ఆ ఓనర్ దగ్గర పనిచేసే యాంకర్ సమీర తెలుసా....."


    పిచ్చిగా చూసాడు వాచ్ మెన్.


    "మా గురువుకు ఉద్యోగం దొరికితే ఆ సమిరకు కాబోయే మొగుడు....." అంటూ శ్రీచంద్ర వైపు చూపించాడు సత్తిపండు.


    ఈసారి మళ్ళీ గట్టిగా అరవబోయి తమాయించుకుని కోపంగా చూసాడు సత్తిపండు వైపు శ్రీచంద్ర.


    "తప్పుగా మాట్లాడానా గురూ.....ఎందుకంటావ్?" అడిగాడు అమాయకంగా సత్తిపండు.


    సరిగ్గా అప్పుడే సమీర బయటకు వస్తు శ్రీచంద్రని, సత్తిపండును చూసింది.


    "ఒరే చందూ.....ఇక్కడికోచ్చావెంట్రా....." ఉత్సాహంగా అంటూ శ్రీచంద్ర దగ్గరికి వచ్చింది.


    వాచ్ మెన్ సమీర వంక, శ్రీచంద్ర వంక చూసాడు. శ్రీచంద్రకు తల తీసేసినంత పనయింది.


    "వదినా.....గురువును.....వాచ్ మెన్ ముందు నువ్వు "ఒరే చందూ....." అన్నవని ఫీలవుతున్నాడు. ఫిలవ్వోద్దని చెప్పోదినా......" అన్నాడు సత్తిపండు హుషారుగా.


    "ఒరే సత్తిపండు....అది పిలిచిన దానికన్నా నువ్వు ప్రపంచమంతా తెలిసేలా బావురుకప్పలా నోరు తెరచి.....చెబుతున్నందుకే నాకు మండుతోంది" అన్నాడు కోపంగా శ్రీచంద్ర.


    "అదేంటి గురూ......ఆ వాచ్ మెన్ వినేలా అన్నానా? లేదే....." అంటూ వాచ్ మెన్ దగ్గరికి వెళ్లి "వాచ్ మెనూ...వాచ్ మెనూ....నువ్వేమయినా మా వదిన మా గురువును "ఒరే చందూ , ఇక్కడికొచ్చావెంట్రా......" అన్నది విన్నావా?" అంటూ అడిగాడు సత్తిపండు చాలా అమాయకమైన ఎక్స్ ప్రెషన్ తో.


    వాచ్ మెన్ బుర్ర గిర్రున తిరిగిపోయింది.


    "సమ్మి.....నువ్వింకోసారి.....నడిరోడ్డు మీద ఒరే....గిరే....అంటే ఉర్కునేది లేదు. ఛ...ఛ.... ఇంట్లో తండ్రి దండకంతోనే చస్తుంటే....నీ పిలుపోకటి......" విసుక్కున్నాడు శ్రీచంద్ర.


    శ్రీచంద్ర భుజం మీద....చేయెసి "సారీరా.....చందూ....యింకోసారి నడిరోడ్డుమీద అనన్లె.....అన్నట్లు వాచ్ మెన్ బాగానే వున్నాడు కదూ....." అంది వాచ్ మెన్ వంక చూస్తూ.

 Previous Page Next Page